"క్షమ నొసంగుము భగవతీ! కమల లక్ష్మిశుద్ధ సత్త్వస్వరూపిణీ శోభితాంఘ్రికోపపరివర్జితా సృత్వరీ పరాత్పరీ క్షమాశీలి తాపహంత్రీ నమోఽస్తు! 1సర్వ సాధ్వులలో సాధ్వి, సర్వ రూపవతులలో రూపవతివి నీవమ్మ! నీవులేనిచో జగమంతయుఁ బ్రేత సమమగుచును నిష్ఫలమ్మగునమ్మ! కూర్మినిమ్మ! 2సకల సంపత్స్వరూపవు, సర్వరూపవీవె! రాసేశ్వరుల యధిదేవి వీవె!సకల సతులందు నీ కళ సంక్రమించు!లేరు నిను మించు దేవత లిజ్జగమున! 3నీవె కైలాసమున శివానివిగఁ, బాలకడలిలో సింధుసుతగ, స్వర్గమ్మునందుస్వర్గ లక్ష్మిగా, భూతలోపరిని మర్త్యలక్ష్మిగా వెలుఁగుదువమ్మ! రాఁగదమ్మ! 4నీవె వైకుంఠమున లక్ష్మి! వీవె దేవదేవి, తులసి, సరస్వతీదేవి, గంగ;వీవు సావిత్రివే గద విశ్వసృజునిలోకమునఁ గన, నో తల్లి, నీకు నతులు! 5నీవె కృష్ణుని ప్రాణాధిదేవతగను,ప్రధిత గోలోకమున స్వయం రాధికగనుధన్యత నిడియు, వెలయ బృందావనమునబృంద; రాసాన రాసేశ్వరివయితీవె! 6నవ్య భాండీరముననుఁ గృష్ణప్రియవయి,చందన వనానఁ జంద్రవై, చంపకవనమందు విరజవై, శతశృంగమందు నీవెసుందరివయి వెల్గితివమ్మ సుకరముగను! 7పద్మవనమున నవ పద్మవయ్యు, మాలతీ వనమ్మున నవ మాలతివయి, కుందవనమునం గుందదంతివై తనరి, మిగులస్థిరతఁ గేతకీ వనిని సుశీలవైతి! 8తగఁ గదంబ వనమునఁ గదంబమాల,రాజగృహమున ఘన రాజలక్ష్మి, యటులెప్రతి గృహమ్మున గృహలక్ష్మి వలెను నిలిచిపూజలను గొనుచుందువు పుడమిపయిని! 9అంబుజాసనాతిచరాబ్ధిజామలేందిరేశ్వరీ కమలాలయా శ్రీద విష్ణువల్లభా రమా మాధవీ వాహినీశనందినీ మారజననీ వినమ్ర నతులు!" 10అనుచు దేవతల్, మునులును, మనుజులంతనమ్రవదనులై భక్తితో నతులు సేసి,శుభ్రకంఠోష్ఠతాలువుల్ శోభిలంగఁబ్రార్థనము సేసి తరియించ్రి రమణమీఱ! 11ఇట్టి లక్ష్మీస్తవమ్మును నెవ్వఁ డుదయమునను భక్తిఁ బఠించు, నతనికి నెపుడుధ్రువముగాఁ బుణ్యములు శుభా లొదవునట్లుతల్లి లక్ష్మియే కరుణించుఁ దనివితీఱ! 12స్వస్తి
శుక్రవారం, ఆగస్టు 04, 2017
సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రము (తెనుఁగు అనువాదము)
లేబుళ్లు:
సంస్తుతులు
ఆదివారం, జూన్ 18, 2017
నాన్నా...
నాన్నకు నివాళులు...
సీ.
పిల్లలన్నను వేగఁ బెనుమక్కువనుఁ జూపి ప్రేమఁ బంచితివయ్య వేడ్క నీవు;
వరుసగా నేడ్వురు పసిబిడ్డలునుఁ దక్క కుండఁ బోవ మిగులఁ గుమిలి తీవు;
చరమదశను నేను వరసుతాష్టమునిగాఁ బుట్టంగ సంతస మొంది తీవు;
కలుగక కలుగఁగా గారాబమునుఁ జేసి బ్రేమఁ బంచుచు నన్నుఁ బెంచితీవు;
గీ.
నీదు గుణగణమ్ముల నాకు నిచ్చినావు;
నీదు పద్యాభిమానమ్ము నిచ్చినావు;
పంచశతకమ్ములను నాకు పంచవర్ష
ములను నొక్కొక్కటిగ నేర్పి మురిసి నావు!
కం.
దినదిన వృద్ధినిఁ బొందఁగ
ననవరతము విద్య నేర్పి, యభ్యాసముచే
ఘనతను నేనుం బొందఁగఁ
దనిసితివయ తండ్రిగాను ధన్యతఁ గొనుచున్!
ఆ.వె.
పద్యకవిగ నేను పదిమందిలో గొప్ప
పేరు తెచ్చుకొనుటఁ బేర్మిఁ గనక
మునుపె, స్వర్గగమనమును నెంచుకొని నీవు
వెడలినావు నన్ను వీడి, తండ్రి!
శా.
కష్టా లెన్నియొ పొందినావు; సుతు, నన్, గష్టమ్ము లొందింప కే
నిష్ట మ్మెద్దియొ చెప్పఁబోవు మునుపే యిష్టమ్ము లందించి సం
తుష్టుం జేసితి వీవు తండ్రి! ఘన సంతోషమ్ము నీ మున్నె, త్రై
విష్ట్యౌన్నత్య పదమ్ము నందితివి; హృద్వీథిన్ వ్యథన్ బెంచియున్!
ఆ.వె.
నన్నుఁ గరుణఁ జూచి, నన్ వృద్ధి పొందించి,
మంచి జీవితమున మనిచి, నాకు
సుఖము లందఁ జేసి, సూక్తుల్ దగం జెప్పి
నావు తండ్రి! నే ఋణపడితినయ!
లేబుళ్లు:
సంస్మృతులు
సోమవారం, డిసెంబర్ 05, 2016
వరంగల్ అష్టావధాన విశేషాలు
కాకతీయ పద్య కవితా వేదిక మరియు రైజింగ్ సన్ హైస్కూలు యాజమాన్యం వారి సంయుక్త ఆధ్వర్యంలో ది. 4-12-2016 (ఆదివారం) నాడు వరంగల్లులోని రైజింగ్ సన్ హైస్కూలులో కుమారి 'పుల్లాభట్ల నాగశాంతి స్వరూప' గారు అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ శ్రీ తమ్మెర లక్ష్మీనరసింహ రావు గారు అధ్యక్షత వహించగా, ప్రముఖ అష్టావధాని డా॥ శ్రీ ఇందారపు కిషన్ రావు గారు సమన్వయకర్తగా వ్యవహరించారు. అతిథులుగా శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, డా॥ శ్రీ టి. శ్రీరంగస్వామి గారు పాల్గొన్నారు.
అష్టావధానంలోని అన్ని అంశాలను అవధాని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలను అందుకున్నారు.
.
౧) నిషిద్ధాక్షరి - గుండు మధుసూదన్
.
ఓరుగల్లులో పోతన భాగవతావిష్కరణం...
ఓరుగల్లులో పోతన భాగవతావిష్కరణం...
.
అవధాని పూరణ - (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకులు గుండు మధుసూదన్ నిషేధించిన అక్షరాలు. x అని ఉన్నచోట పృచ్ఛకులు నిషేధం విధించకుండా అవధాని చిత్తానికి వదిలివేశారని గమనించగలరు.).....
.
(x)శ్రీ(x)క(ర)ళ(య)తో(ప)ని(త)ండి(య)న(య)నీ
పాక(x)ము(x)మే(న)లై(x)స(క)త(త)ంబు భ(స)ళి(ర)యై (x)యె(స)ప్డున్
.
(రెండు పాదాలకు మాత్రమే నిషేధం విధించబడింది)
.
శ్రీకళతో నిండిన నీ
పాకము మేలై సతంబు భళియై యెప్డున్
లోకానికి మేలు కలుగ
శ్రీకారమె భాగవతము చిన్మయ కవిరాట్!
.
౨) సమస్య - జీడికంటి శ్రీనివాస మూర్తి
.
"అవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ"
.
అవధాని పూరణ....
.
వ్యవధానం బిసుమంత లేక యిలలో వర్ధిల్లు సత్క్రీడయై
కవిలోకానికిఁ గాంతు లీను శశియై గంభీర వాగ్బంధమై
యవురా చిత్ర విచిత్ర దీపితములై హ్లాదంబుఁ జేకూర్చు నీ
యవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ!
.
౩) దత్తపది - కంది శంకరయ్య
.
"సీత-కైక-సుమిత్ర-తార" పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం చెప్పాలి.
.
అవధాని పూరణ....
.
రాజ్యమునకై కలవరించి రహిని వెలుఁగ
ధరణి వసుమిత్రమై వెల్గు తపనఁ గూడి
కౌరవులె యిసీ తండ్రినిఁ గలఁతఁ బెట్టి
పశుతను వనితా రత్నముఁ బరిభవించె!
.
౪) వర్ణన - పాతూరి రఘురామయ్య
.
భద్రకాళి అమ్మవారి వర్ణన.....
.
అవధాని పూరణ....
.
అల్లాడించితివే సురారుల ననిన్ హాయంచు విశ్వేశ్వరీ
యిల్లాలా శివ వామభాగ నిలయా హేరంభ సంతోషిణీ
ముల్లోకాలకు మూలమైన జననీ మోక్షప్రదా ధీప్రదా
యుల్లంబందున భద్రకాళి యమవై యుత్సాహ మందింపవే!
.
౫) వ్యస్తాక్షరి - బోయినిపల్లి రాధ
.
ధరణి ననేక శిష్యులను దక్షులఁ జేసెడు ప్రాజ్ఞు లిమ్మహిన్.
.
౬) ఆశువు - చేపూరి శ్రీరామ్
.
1. మహాసహస్రావధానులు మీ అవధానాన్ని చూసి మనస్సులలో ఏమనుకొని వుంటారో ఊహించిచెప్పండి.
.
అవధాని పూరణ....
.
దిగ్గజములు నెదుట దిట్టలై యుండఁగా
పద్య పాదములవి పరుగుఁ దీయు
నింత వారి నెల్ల నెంతెంతగాఁ జూపు
వారి దృక్కు నాకు వాక్కు నిడెగ!
.
2. పెద్దనోట్ల రద్దుతో...ప్రజల సహనం...భావి బాగుంటుందని చెప్పండి.
.
అవధాని పూరణ...
.
మంచి ముందుఁ గలదు మదినుంచి మసలుఁడీ
పొంచియున్న చెడునుఁ బోవఁ జేయు
నాశ గలుగువాఁడె యానంద మయుఁడురా
సహన భావ మున్న సాధు సాధు!
.
3. ఈ అవధాన సభా వర్ణన చేయండి.
.
అవధాని పూరణ...
.
ఆఱు నైదుఁ గూడి యానంద మందింప
యత్నములను సలిపె నూత్నముగను
నోరుఁగల్లులోన నుయ్యాల లూపెగా
తెల్గు భాషలోన వెల్గులంద!
.
౭) ఘంటావధానం - యం. వెంకటలక్ష్మి
.
(పృచ్ఛకురాలు చేసిన శబ్దాలను విని అవధాని చెప్పినవి...)
.
1. రాగ మీవె భక్తి రాగ మీవె
2. రాలు పూలు పూసె రంజితముగ
3. బమ్మెర పోతన
.
౮) అప్రస్తుత ప్రశంస - పల్లేరు వీరస్వామి గారు సమర్థవంతంగా నిర్వహించారు.
.
అవధాన సమన్వయ కర్తగా వ్యవహరించిన డా॥ ఇందారపు కిషన్ రావు గారి ఆశీఃపద్యములు:
.
ప్రతిభా నాన్యతో దృష్టః
వ్యుత్పత్తిశ్చ గరీయసి|
శాంతిస్వరూప వాగ్దేవ్యాః
అభ్యాసశ్చాద్భుతః క్రమః||
.
సకల కష్టాంశములు తీర్చె సరసరీతి!
చాలు ప్రశ్నలా యవి, సునామీలు గావ?
అన్నిఁటినిఁ బట్టి పూరించె నద్భుతముగ
నబలయా కాదు నిజముగ సబల యనుము!
.
అవధానానంతరం శ్రీలేఖ సాహితి, వరంగల్ వారు ప్రచురించిన డా॥ పిట్టా సత్యనారాయణ గారి 'బ్రతుకు బాట (పద్య కథాకావ్యము), 'ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము' అన్న పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
.
స్వస్తి
.
అవధాని పూరణ - (కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకులు గుండు మధుసూదన్ నిషేధించిన అక్షరాలు. x అని ఉన్నచోట పృచ్ఛకులు నిషేధం విధించకుండా అవధాని చిత్తానికి వదిలివేశారని గమనించగలరు.).....
.
(x)శ్రీ(x)క(ర)ళ(య)తో(ప)ని(త)ండి(య)న(య)నీ
పాక(x)ము(x)మే(న)లై(x)స(క)త(త)ంబు భ(స)ళి(ర)యై (x)యె(స)ప్డున్
.
(రెండు పాదాలకు మాత్రమే నిషేధం విధించబడింది)
.
శ్రీకళతో నిండిన నీ
పాకము మేలై సతంబు భళియై యెప్డున్
లోకానికి మేలు కలుగ
శ్రీకారమె భాగవతము చిన్మయ కవిరాట్!
.
౨) సమస్య - జీడికంటి శ్రీనివాస మూర్తి
.
"అవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ"
.
అవధాని పూరణ....
.
వ్యవధానం బిసుమంత లేక యిలలో వర్ధిల్లు సత్క్రీడయై
కవిలోకానికిఁ గాంతు లీను శశియై గంభీర వాగ్బంధమై
యవురా చిత్ర విచిత్ర దీపితములై హ్లాదంబుఁ జేకూర్చు నీ
యవధాన మ్మొక ప్రజ్ఞయౌ ననఁగ నా కాశ్చర్యమౌ సోదరీ!
.
౩) దత్తపది - కంది శంకరయ్య
.
"సీత-కైక-సుమిత్ర-తార" పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం చెప్పాలి.
.
అవధాని పూరణ....
.
రాజ్యమునకై కలవరించి రహిని వెలుఁగ
ధరణి వసుమిత్రమై వెల్గు తపనఁ గూడి
కౌరవులె యిసీ తండ్రినిఁ గలఁతఁ బెట్టి
పశుతను వనితా రత్నముఁ బరిభవించె!
.
౪) వర్ణన - పాతూరి రఘురామయ్య
.
భద్రకాళి అమ్మవారి వర్ణన.....
.
అవధాని పూరణ....
.
అల్లాడించితివే సురారుల ననిన్ హాయంచు విశ్వేశ్వరీ
యిల్లాలా శివ వామభాగ నిలయా హేరంభ సంతోషిణీ
ముల్లోకాలకు మూలమైన జననీ మోక్షప్రదా ధీప్రదా
యుల్లంబందున భద్రకాళి యమవై యుత్సాహ మందింపవే!
.
౫) వ్యస్తాక్షరి - బోయినిపల్లి రాధ
.
ధరణి ననేక శిష్యులను దక్షులఁ జేసెడు ప్రాజ్ఞు లిమ్మహిన్.
.
౬) ఆశువు - చేపూరి శ్రీరామ్
.
1. మహాసహస్రావధానులు మీ అవధానాన్ని చూసి మనస్సులలో ఏమనుకొని వుంటారో ఊహించిచెప్పండి.
.
అవధాని పూరణ....
.
దిగ్గజములు నెదుట దిట్టలై యుండఁగా
పద్య పాదములవి పరుగుఁ దీయు
నింత వారి నెల్ల నెంతెంతగాఁ జూపు
వారి దృక్కు నాకు వాక్కు నిడెగ!
.
2. పెద్దనోట్ల రద్దుతో...ప్రజల సహనం...భావి బాగుంటుందని చెప్పండి.
.
అవధాని పూరణ...
.
మంచి ముందుఁ గలదు మదినుంచి మసలుఁడీ
పొంచియున్న చెడునుఁ బోవఁ జేయు
నాశ గలుగువాఁడె యానంద మయుఁడురా
సహన భావ మున్న సాధు సాధు!
.
3. ఈ అవధాన సభా వర్ణన చేయండి.
.
అవధాని పూరణ...
.
ఆఱు నైదుఁ గూడి యానంద మందింప
యత్నములను సలిపె నూత్నముగను
నోరుఁగల్లులోన నుయ్యాల లూపెగా
తెల్గు భాషలోన వెల్గులంద!
.
౭) ఘంటావధానం - యం. వెంకటలక్ష్మి
.
(పృచ్ఛకురాలు చేసిన శబ్దాలను విని అవధాని చెప్పినవి...)
.
1. రాగ మీవె భక్తి రాగ మీవె
2. రాలు పూలు పూసె రంజితముగ
3. బమ్మెర పోతన
.
౮) అప్రస్తుత ప్రశంస - పల్లేరు వీరస్వామి గారు సమర్థవంతంగా నిర్వహించారు.
.
అవధాన సమన్వయ కర్తగా వ్యవహరించిన డా॥ ఇందారపు కిషన్ రావు గారి ఆశీఃపద్యములు:
.
ప్రతిభా నాన్యతో దృష్టః
వ్యుత్పత్తిశ్చ గరీయసి|
శాంతిస్వరూప వాగ్దేవ్యాః
అభ్యాసశ్చాద్భుతః క్రమః||
.
సకల కష్టాంశములు తీర్చె సరసరీతి!
చాలు ప్రశ్నలా యవి, సునామీలు గావ?
అన్నిఁటినిఁ బట్టి పూరించె నద్భుతముగ
నబలయా కాదు నిజముగ సబల యనుము!
.
అవధానానంతరం శ్రీలేఖ సాహితి, వరంగల్ వారు ప్రచురించిన డా॥ పిట్టా సత్యనారాయణ గారి 'బ్రతుకు బాట (పద్య కథాకావ్యము), 'ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము' అన్న పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
.
స్వస్తి
.
లేబుళ్లు:
ఇతరములు
సోమవారం, నవంబర్ 28, 2016
ఆహ్వానము
కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్
అవధాన రాజహంసిని, శతావధాన విశారద
కుమారి పుల్లాభట్ల నాగశాంతి స్వరూప గారిచే
(తెలుగు అధ్యాపకురాలు, ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, రాజమహేంద్రవరము)
అష్టావధానము
వేదిక : రైజింగ్ సన్ హైస్కూల్, వాసవి కాలనీ రోడ్, కొత్తవాడ, వరంగల్
తేదీ : 04-12-2016 (ఆదివారం); సమయం : ఉదయం 10-00 గం.లకు.
అధ్యక్షులు : Ln. తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు, MJF., T 20 F.,
సమన్వయ కర్త : డా॥ ఇందారపు కిషన్ రావు గారు, (ప్రముఖ అష్టావధాని)
ముఖ్య అతిథి : శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, (ప్రముఖ పద్యకవి)
విశిష్ట అతిథి : డా॥ టి. శ్రీరంగస్వామి గారు, (శ్రీలేఖ సాహితి, వరంగల్)
పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి : శ్రీ గుండు మధుసూదన్ గారు
సమస్య : శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
దత్తపది : శ్రీ కంది శంకరయ్య గారు
వ్యస్తాక్షరి : శ్రీమతి బోయినిపల్లి రాధ గారు
వర్ణన : డా॥ పాతూరి రఘురామయ్య గారు
ఆశువు : శ్రీ చేపూరి శ్రీరామ్ గారు
ఘంటావధానము : చి॥ యం. వెంకటలక్ష్మి
అప్రస్తుత ప్రసంగము : డా॥ పల్లేరు వీరస్వామి గారు
అందరూ ఆహ్వానితులే!
ప్రాయోజకులు :
శ్రీ రామడుగు షణ్ముఖాచారి గారు,
ప్రిన్సిపాల్, రైజింగ్ సన్ హైస్కూల్, వరంగల్.
మంగళవారం, జూన్ 07, 2016
స్వరాష్ట్ర సాధకుఁడు...ఉద్యమ నేత...కేసీఆర్!
రవీంద్ర భారతిలో మొన్న ఆదివారం నాడు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మఱియు తెలంగాణ పద్య కవితా సదస్సు ఆధ్వర్యంలో జరిగిన పద్య తెలంగానంలో నేను పఠించిన పద్యాలు...
సీసము:
అఱువది యేఁడుల యాంధ్రాధిపత్యమ్ము
నంతమ్ముఁ జేయంగఁ బంతమూని,
తెలఁగాణు లందఱ నిల నొక్క త్రాఁటి పైఁ
కినిఁ దెచ్చి బలమిచ్చి ఘనత నూని,
నీరముల్ భూములు నిధులును గొలువులు
వనరులం దోచిన పగిదిఁ దెలిపి,
తీవ్రమౌ పలుకులఁ "దెలఁగాణ వచ్చుడో
కేసియార్ చచ్చుడో" కృత ప్రతిజ్ఞుఁ
డైన "కేసియార్ వ్రతదీక్ష", యాంధ్ర పాల
కులకుఁ బ్రక్కలో బల్లెమై, కునుకు నిడక,
చోద్యముగఁ దెలంగాణ రాష్ట్రోద్యమమును
ఢిల్లి కనిపి, సాధించె రాష్ట్రేప్సితమును! (1)
ఉత్పలమాల:
ఈ తెలఁగాణ మాట యిఁక నెప్పుడు వల్కక యుండ నాజ్ఞ నా
నేతయు చంద్రబాబె యిడ; నిత్యము నీ తెలఁగాణ నామమే
చేతము పొంగఁగా వినిచె, శీఘ్ర మసెంబ్లియె మ్రోగఁ గేసియార్!
నేత యతండు రా! ఘన వినీతుఁడు, ధీరుఁడు, పుణ్య మూర్తిరా!! (2)
ఉత్సాహము:
"సకల జనుల సమ్మె" చేసి, శాశ్వతముగఁ బ్రజల హృ
త్ప్రకర మందు నిలిచి వెలిఁగి, రాష్ట్ర సాధనమునకై
రకరకమ్ములైన వ్యూహ రచనములనుఁ జేసియున్
బ్రకటిత మ్మొనర్చెఁ బ్రజల రాష్ట్ర కాంక్ష ఢిల్లికిన్! (3)
సీసము:
ఒక వంక నమరె సదుద్యమ స్ఫూర్తికై
తెలఁగాణ జనభేరి దివ్య కృతము;
నొక చెంత నలరెఁ జెల్వొప్పఁగాఁ దెలఁగాణ
సాగరహార సంజనిత వ్రతము;
నొక చోట మించె సముత్సుక తెలఁగాణ
జనుల ధూంధాము చేతన గళములు;
నొకట నుజ్జృంభించె నుత్సాహ యుక్తమౌ
సభ విరాజిల్లు ప్రసంగ ఫణితి;
యంత సమ్మెలు హర్తాళు లమర వీర
కలిత బలిదానములు సముత్కంఠ నిడఁగ,
నీ తెలంగాణ మంతయు నెద రగులఁగఁ,
జెలఁగె నిరశన వ్రతి చంద్రశేఖరుండు! (4)
శార్దూలము:
ఢిల్లీకిం జని కేసియారె యచటన్ దిక్కుల్ ప్రకంపింప ఱం
పిల్లం జేసె స్వరాష్ట్ర కాంక్ష నినదం; బెల్లన్ సముత్కీర్ణ హృ
త్ఫుల్లాంభోజ సభాంతరాళ మలరన్ బోరాడి, సాధించె సం
సల్లీలన్ దెలఁగాణ రాష్ట్రమును నుత్సాహమ్ము దీపింపఁగన్! ( 5)
స్వస్తి
మధురకవి, సహస్ర కవి భూషణ
గుండు మధుసూదన్
వరంగల్
లేబుళ్లు:
పద్య తెలంగానం...
శనివారం, జూన్ 04, 2016
పద్య తెలంగానం...
మిత్రులందఱకు నమస్సులు!
తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావదినోత్సవాలలో భాగంగా
రేపు (5-6-2016 నాడు)
తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ‘తెలంగాణ పద్యకవితా సదస్సు’ అధ్వర్యంలో
‘పద్య తెలంగానం’ పేరుతో వివిధ జిల్లాలనుండి ఎన్నుకున్న 116 మంది పద్యకవుల సమ్మేళనం, సన్మానం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగనున్నది.
ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కవుల కవితాగానం. తదుపరి ఆ కవులకు సత్కారం.
ఆ సమ్మేళనంలో ఒక పద్యకవిగా పాల్గొనడానికి నాకు అవకాశం లభించిందని తెల్పడానికి సంతోషిస్తున్నాను. నాతో పాటుగా వరంగల్ లోని మా "కాకతీయ పద్య కవితా వేదిక" బృందం లోని మరి కొందరు కవులకు కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. వారి వివరాలు....
వరంగల్లు కవుల బృందానికి సమన్వయ కర్త: శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు
పద్య కవులు:
01. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు
02. ఆరుట్ల భాష్యాచార్యులు
03. కంది శంకరయ్య
04. గుండు మధుసూదన్
05. పిట్టా సత్యనారాయణ
06. జీడికంటి శ్రీనివాస మూర్తి
07. బీటుకూరు శేషుకుమార్
08. పాతూరి రఘురామయ్య
09. ఎన్.వీ.ఎన్.చారి
10. పల్లేరు వీరస్వామి
11. అక్కెర సదానందా చారి
12. చేపూరు శ్రీరామారావు
తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావదినోత్సవాలలో భాగంగా
రేపు (5-6-2016 నాడు)
తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ‘తెలంగాణ పద్యకవితా సదస్సు’ అధ్వర్యంలో
‘పద్య తెలంగానం’ పేరుతో వివిధ జిల్లాలనుండి ఎన్నుకున్న 116 మంది పద్యకవుల సమ్మేళనం, సన్మానం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగనున్నది.
ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కవుల కవితాగానం. తదుపరి ఆ కవులకు సత్కారం.
ఆ సమ్మేళనంలో ఒక పద్యకవిగా పాల్గొనడానికి నాకు అవకాశం లభించిందని తెల్పడానికి సంతోషిస్తున్నాను. నాతో పాటుగా వరంగల్ లోని మా "కాకతీయ పద్య కవితా వేదిక" బృందం లోని మరి కొందరు కవులకు కూడా ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం లభించింది. వారి వివరాలు....
వరంగల్లు కవుల బృందానికి సమన్వయ కర్త: శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు
పద్య కవులు:
01. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు
02. ఆరుట్ల భాష్యాచార్యులు
03. కంది శంకరయ్య
04. గుండు మధుసూదన్
05. పిట్టా సత్యనారాయణ
06. జీడికంటి శ్రీనివాస మూర్తి
07. బీటుకూరు శేషుకుమార్
08. పాతూరి రఘురామయ్య
09. ఎన్.వీ.ఎన్.చారి
10. పల్లేరు వీరస్వామి
11. అక్కెర సదానందా చారి
12. చేపూరు శ్రీరామారావు
ఇట్లు
భవదీయుఁడు
మధురకవి
గుండు మధుసూదన్
వరంగల్
లేబుళ్లు:
ఇతరములు
ఆదివారం, మే 08, 2016
మాతృ వందన ఫలం

మిత్రులందఱకు "మాతృదినోత్సవ శుభాకాంక్షలు"
భూప్రదక్షిణ షట్కానఁ బొందు ఫలము;
కాశి యాత్రాచరణ మిడు ఘనఫలమ్ము;
సింధువునఁ జేయు స్నాన సంస్థిత ఫలమ్ము;
మాతృ వందన మాచరింపఁగనె కలుగు!
స్వస్తి
లేబుళ్లు:
అయుత కవితా యజ్ఞము,
పద్యరచన,
మధురకవనం
గురువారం, మే 05, 2016
భళిర...గిజిగాఁడ...నీ నేర్పు బాగు..బాగు...!!!

-_Male_W_IMG_0727.jpg)


-_Male_W_IMG_0732.jpg)
చం.
తగఁ జని తుమ్మకొమ్మలకొ తాళ కుజాలకొ యీఁత చెట్లకో
తగులఁగఁ జేసి గూండ్లు ఘనతం బ్రకటింపఁగ నేర్పు మీఱఁగన్
బగఁ గొని పాములో యితర వైరులొ దాడినిఁ జేయకుంటకై
గగనముఁ దాఁకునట్లు గిజిగాఁడు రచించుటఁ జూడఁ జిత్రమౌ!! 1
తే.గీ.
అద్భుతమ్ముగఁ గూఁడుఁ దా నాస్థఁ గట్టు
నేర్పుఁ జూడంగఁ జిత్రమౌ నిర్మిత! మది
తరుల శాఖల వ్రేలెడి తాజమహలొ?
గగనసీమను విహరించు గౌరగృహమొ?? 2
ఆ.వె.
సాక్ష్య మిచ్చు నెట్టి సాంకేతిక జ్ఞాన
మో యదంచు జనులు మోహమంద!
నందమైన యట్టి యానంద నిలయమ్ము
కాదె చూడ నదియు కాంక్ష మీఱ? 3
తే.గీ.
అదియ గూఁటి నల్లెడి తీరు; లందముగనుఁ
బిల్లలకుఁ దిండి నోఁటనుఁ బెట్టు విధము;
శత్రుతతుల నెదుర్కొను సరణి; దాని
యాటపాటల వైఖరి యచ్చెరు విడు! 4
తగఁ జని తుమ్మకొమ్మలకొ తాళ కుజాలకొ యీఁత చెట్లకో
తగులఁగఁ జేసి గూండ్లు ఘనతం బ్రకటింపఁగ నేర్పు మీఱఁగన్
బగఁ గొని పాములో యితర వైరులొ దాడినిఁ జేయకుంటకై
గగనముఁ దాఁకునట్లు గిజిగాఁడు రచించుటఁ జూడఁ జిత్రమౌ!! 1
తే.గీ.
అద్భుతమ్ముగఁ గూఁడుఁ దా నాస్థఁ గట్టు
నేర్పుఁ జూడంగఁ జిత్రమౌ నిర్మిత! మది
తరుల శాఖల వ్రేలెడి తాజమహలొ?
గగనసీమను విహరించు గౌరగృహమొ?? 2
ఆ.వె.
సాక్ష్య మిచ్చు నెట్టి సాంకేతిక జ్ఞాన
మో యదంచు జనులు మోహమంద!
నందమైన యట్టి యానంద నిలయమ్ము
కాదె చూడ నదియు కాంక్ష మీఱ? 3
తే.గీ.
అదియ గూఁటి నల్లెడి తీరు; లందముగనుఁ
బిల్లలకుఁ దిండి నోఁటనుఁ బెట్టు విధము;
శత్రుతతుల నెదుర్కొను సరణి; దాని
యాటపాటల వైఖరి యచ్చెరు విడు! 4
తే.గీ.
గూండ్లఁ జిన్ని పిట్టలు తమ గోల లెగయ;
భూనభోఽంతరాందోళికా భోగ సహిత
సూక్ష్మ గేహాంతర స్థిత శోభ వెలయ
నూఁగులాడుచుండును తూఁగుటూయలట్లు! 5
శా.
ఏదేనొక్క పృదాకు వేఁగఁ గని తా మెంతెంతయో నార్చుచున్
బో దాఁకన్ ఘనమైన రీతిగను శబ్దోచ్చారణమ్ముల్ దగన్
నాదౌద్ధత్యముఁ జూపి తత్తఱలఁ బెంచంగానె యా సర్పమున్
నాదారెద్దియటంచుఁ బర్వులిడు నా నైపుణ్యముం గాచితే? 6
ఆ.వె.
శిరసు పైన స్వర్ణ శీర్షకమ్మున్నట్లు
పసుపు వన్నె మిగుల బంగరువయి,
చిబుక చూచుకములు చిక్కనౌ నలుపయి,
నీలి గోధుమ బరి నెఱక లొలయు! 7
తే.గీ.
బిడ్డలకుఁ దిండిఁ బెట్టెడి పెద్దఱికమె
యింతులకు బాధ్యతగఁ దగ నిడియు; గూఁడు
నేర్పుగాఁ గట్టు బాధ్యత నెలమి మగఁడు
కొనియు మెలఁగు చుండును భార్య మనము నెఱిఁగి! 8
ఆ.వె.
వరియు గడ్డి యాకు వంటి పీచునుఁ గొని
నేసి కొంత, యదియె నెచ్చెలువకుఁ
జూపి, ముదము గొనఁగనే, పూర్తిగాఁ దాను
నేయు; లేదొ, పర కులాయ మల్లు! 9
కం.
గేహముఁ బూర్తిగ నేసియు
గేహినిఁ బిలువంగ మివులఁ గేరింతలతో
స్నేహము నెఱపుచుఁ దిరుగుచు
మోహపరవశ యయి చేరు మురిపెమునఁ జెలున్! 10
ఉ.
నేలకు నింగికిన్ సరిగ నేస్తము లల్లిన గూఁటి వన్నియల్;
మాలిమి తోడ వర్తిలెడి మంజుమనోహర నాట్యరీతి; రా
గాలసమైన పాట; కవులాదరమున్ వెలిఁబుచ్చుచుండఁ దాఁ
గాలముఁ బుచ్చుచుండు గిజిగాఁ డట హాయినిఁ జిల్కరించుచున్! 11
-:శుభం భూయాత్:-
లేబుళ్లు:
అయుత కవితా యజ్ఞము,
పద్యరచన,
మధురకవనం
మంగళవారం, మే 03, 2016
సమస్య: వారు వేఱు వీరి వారు వేఱు

(మంచినీటికై వెడలిన ఒక మహిళ అక్కడకు వచ్చిన తక్కిన మహిళలతో వారి భర్తలనుఁ దన భర్తనుం బోల్చుచుఁ బలికిన సందర్భము)
ప్రేమఁ జూపి మిగులఁ బ్రియమారఁ బిలుచుచు
గారవించి ప్రణయ కళలఁ దేల్చి
సుఖము లిడుటఁ బోల్చి చూచువారలకు మా
వారు వేఱు; వీరి వారు వేఱు!
-:స్వస్తి:-
గురువారం, ఏప్రిల్ 28, 2016
వారి వారి ’వారి’ వేఱు వేఱు?
సమస్య:-
వారి వారి వారి వేఱు వేఱు


వారి వారి వారి వేఱు వేఱు
(చెఱువు నీరు, బావి నీరు వేర్వేఱని పలుకు సందర్భము)
చెఱువు నీరు మేము ♦ చింత లేకుండయే
త్రాగుచుందు మయ్య ♦ తఱచు గాను!
వారి నీరు బావి ♦ నీరు! కన, సరసి
వారి; వారి వారి ♦ వేఱు వేఱు!!
[వారి వారి=వారి నీరు]
మంగళవారం, ఏప్రిల్ 26, 2016
సమస్య:- యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్
శుభోదయం మిత్రులారా!
25-04-2016 నాఁడు "శంకరాభరణం" లో ఈయబడిన...
సమస్య:-
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్
దీనికి నా పూరణములు....
నా మొదటి పూరణము:
చెమటలు గ్రక్కుచు వేఁడిమి
నమితముగా నుక్కపోయ ♦ నడలి జలము కో
సము గగనమున జలద నిచ
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 1
నా రెండవ పూరణము:
సముచిత పాత్రా సుపరిచ
యము సేయఁగఁ దొడఁగినట్టి ♦ దౌ నటి వేదిన్
బ్రముదిత యయి యిడు నంకా
స్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 2
స్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 2
ఈ పూరణమే చిన్న సవరణలతో...
సముచిత పాత్రాదుల నిల
యము సేయఁగఁ దొడఁగినట్టి ♦ యా నటియు నటున్
బ్రముఖాంకాస్యాఖ్య పరిచ
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా మూఁడవ పూరణము:
రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య ♦ సత్కథను ప్రకా
శమిడు సుగుణైక యుత కా
వ్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 3
వ్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 3
ఈ పూరణమే చిన్న సవరణలతో...
రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య ♦ సత్కథను ప్రకా
శమిడెడి సన్మధుర కవీ
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా నాలుఁగవ పూరణము:
అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభ♦మౌ పదయుతమై
సుమశోభిత దీపిత ప
ద్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 4
ద్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 4
ఈ పూరణమే చిన్న సవరణలతో...
అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభ♦మౌ పదవాక్యో
ద్యమ శోభిత కావ్య శ్రే
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా యైదవ పూరణము:
భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును ♦ భ్రమ డుల్పను శ
క్యమగు తిరుమలేశుని గ
ద్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 5
ద్యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 5
ఈ పూరణమే చిన్న సవరణలతో...
భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును ♦ భ్రమ డుల్పను శ
క్యము తిరుమల విభు పద తో
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్!
నా యాఱవ పూరణము:
గమకిత మనోజ్ఞ సంగీ
తముచే నలరారఁ జేయు ♦ తత్రత్యుల వే
దము గోపాలుని దౌ గే
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 6
యముఁ గని జనులెల్ల మోద ♦ మందెదరు భువిన్! 6
-శుభం భూయాత్-
లేబుళ్లు:
మధురకవనం,
సమస్యాపూరణం
సోమవారం, ఏప్రిల్ 25, 2016
సమస్య: ముదుసలిం గొట్టువారలే పోటుమగలు

కురు వృద్ధుఁడు భీష్ముఁడు
సమస్య:-
ముదుసలిం గొట్టువారలే పోటుమగలు!!
తే.గీ.
కౌరవుల సేన కధిపతి ♦ గౌరవయుతుఁ
డాపగా సుతుఁ డతిబలుం ♦ డతని తోడఁ
బోరు వారేరి? భీష్మాఖ్య ♦ వీరుఁడునగు
ముదుసలిం గొట్టువారలే ♦ పోటుమగలు!!
-:శుభం భూయాత్:-
ఆదివారం, ఏప్రిల్ 24, 2016
ప్రణవ స్వరూపుఁడు!

తే.గీ.
ఒరయె యోంకార మీ విశ్వ ♦ మొక కృపాణి!
కత్తి యొరవంటిదైన యోం♦కార మెపుడు
విశ్వమను ఖడ్గమునుఁ గప్పి♦వేయును! కనఁ
బ్రణవమందునఁ బరమాత్మ ♦ వఱలుచుండె!!
-:శుభం భూయాత్:-
శనివారం, ఏప్రిల్ 23, 2016
స్వీయ మృత్యు ముహూర్తము!
సమస్య:-
రామచంద్రుని రక్షించె రావణుండు!
తే.గీ.
తనదు ఘనశాపమునకునుఁ ♦ దగిన త్వరిత
మైన యవధికై యట యుద్ధ♦మను నెపమునఁ
దననుఁ గూల్చుటకునుఁ దానె ♦ ధారిక నిడి
రామచంద్రుని రక్షించె ♦ రావణుండు!
(ధారిక=ముహూర్తము)
-:శుభం భూయాత్:-
శుక్రవారం, ఏప్రిల్ 22, 2016
సంగీత సమ్రాట్టు-త్యాగరాజు
సీ.
ఘనతరాంచితమైన ♦ కర్ణాట సంగీత
....వాగ్గేయకార స♦త్ప్రణతుఁ డయ్యె;
చిన్నారి పొన్నారి ♦ చిఱుత కూఁకటి నాఁడు
.....రాఘవోత్తమ కృతి ♦ ప్రవరుఁ డయ్యె;
నిధికన్న రాము స♦న్నిధి చాల సుఖమంచు
.....శరభోజి ధన తిర♦స్కారుఁ డయ్యె;
వేన వేలుగఁ గృతు ♦ ల్వెలయించి దేశాన
.....సంగీత లోక ప్ర♦శస్తుఁ డయ్యె;
గీ.
ఆతఁడే 'జగదానంద' ♦ జాతకుండు;
'కనకనరుచిరా' కృతి దివ్య♦కారకుండు;
రఘు కులాన్వయు సద్భక్తి ♦ లబ్ధ యశుఁడు;
ధన్య సంగీత సమ్రాట్టు ♦ "త్యాగరాజు"!
సుగంధి:
'ఎందఱో, మహానుభావు ♦ లెందఱో' యటంచుఁ దా
విందుగన్ గృతుల్ రచించి ♦ విన్నవించి, రామునిన్
డెందమందు నిల్పు భక్తుఁ♦డే స్వరాట్టు గాను ని
ల్చెం దగ న్మహోన్నతి న్వ♦రించెఁ ద్యాగరాజిలన్!
-:శుభం భూయాత్:-
గురువారం, ఏప్రిల్ 21, 2016
పరమాత్మ స్వరూపము!
[శ్రీ టీ.పీ.కే.ఆచార్యులవా రడిగిన తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లియందలి"యశ్ఛందసాం ఋషభో విశ్వరూపః " అనెడి మంత్రమును నేను సీసపద్యమున ననువదించివ్రాసితిని]సీ.ఎవఁడు వేదములలో ♦ నేకమౌ సారభూ.....తమొ ప్రధానమ్మొ త♦త్సర్వరూపి;
ప్రణవామృత స్వరూ♦పమ్మైన వేదప్ర
.....కాశ శక్తుఁడగు నోం♦కార రూపి;
పరమేశుఁడే నాకుఁ ♦ బఱఁగ నాత్మజ్ఞాన
.....ధారణాంచిత ప్రజ్ఞ ♦ దక్షత లిడి;
నన్ బలపఱచుచో ♦ నతుల బ్రహ్మజ్ఞాన
.....సంపత్కరుండనై ♦ స్వయముగాను
గీ.తనువు యోగ్యమ్మునై రస♦ననుఁ గన మృదు
మధుర భాషితయై శ్రోత్ర ♦ మధికముగను
వినికి గలదియై భాసిల్లి ♦ వెలిఁగిపోవఁ
బ్రణవమా నాదు విద్యనుఁ ♦ బరిఢవిలుము!
*శుభం భూయాత్*
బుధవారం, ఏప్రిల్ 20, 2016
ముక్తక వచనములు (1-10)
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
శీర్షిక:- మనిషి...మనీషి...
01
కులం... రూపం...
మనిషికి
గొప్పతనాన్ని కలిగించవు!
గుణం కలిగితే
గొప్ప వెలుగుతుంది!
మంచి పనులే
మానవునికి
గౌరవాన్ని తెచ్చిపెడతాయి!
కులాన్ని పట్టుకు
ప్రాకులాడితే
కలహాలూ...కష్టాలే...
రూపం వుందనుకుని
మురిసిపోతే
చివరికి
కురూపమే...!
సుగుణాలూ...సుకర్మలూ...
మనిషిని
చిరస్థాయిగా
నిలుపుతాయి
పదిమందికీ
మార్గదర్శనం చేస్తాయి!!
***
శీర్షిక:- కష్ట సుఖాలు...
02
కష్టపడకుండా
అబ్బిన
కలిమివల్ల
కంటికి పొరలు కమ్ముతాయి!
కష్టపడడం వల్ల
కలిగిన కలిమి
మనిషికి
ఘనత నిస్తుంది!
కష్టపడితేనే
సుఖం విలువ
తెలుస్తుంది
ఎప్పుడూ
సుఖాల్లో
మునిగి తేలుతూ వుంటే
కష్టం విలువ
ఎలా తెలుస్తుంది?
***
శీర్షిక:- ప్రేమ...ద్వేషం...
03
కారణం లేకుండా
ద్వేషించడం
ఖలుల గుణమైతే...
కారణం లేకున్నా
స్వపర భేదం లేకుండా
ప్రేమచూపడం
ఉత్తముల గుణం!
ప్రేమ ద్వేషం
ఉత్తర దక్షిణ ధ్రువాలు!
దక్షిణం నుంచి
నడక మొదలెడితే
ఎప్పటికైనా
ఉత్తరాన్ని చేరుకుంటావు
ద్వేషం నుంచి ప్రేమవైపు
ప్రయాణిస్తే
ఎప్పుడూ
ప్రేమే నీ వెంట వుంటుంది!
***
శీర్షిక:- స్థిరత్వం
04
కాలంకాని కాలంలో
కారు మబ్బులు వచ్చినట్టే
సిరులూ వస్తాయి!
స్థిరత లేదని తెలిసీ
మూర్ఖులు
వాటివెంట పడతారు!
ఉత్తములు
స్థిరంగా వుంటారు!!
ఎండ మావులవెంట పడితే
నీళ్ళు దొరుకుతాయా?
అస్థిరాలకై ఆశపడితే
తృప్తి కలుగుతుందా?
ప్రాప్తం వున్న తీరాలకే
మేఘాలు పయనిస్తాయి
ప్రాప్తం వున్న మానవులకే
సిరులు అబ్బుతాయి!
ప్రాప్తం లేనివాటికై
పెట్టే పరుగులు
నిరాశకే దారితీస్తాయి
ఆయాసం మిగులుస్తాయి!!
***
శీర్షిక:- నిజమైన ధనవంతుడు
05
తృప్తి లేకుంటే
ఎదలో ఏదో తపన
అదేపనిగా
తరుముతుంటుంది
తృప్తి వుంటే
హృదయం
స్థిరంగా వుంటుంది
మనిషిని
మహోన్నతుణ్ణి చేస్తుంది!
తృప్తి లేని
ధనవంతుడు
ఒక రకంగా
భిక్షగాడే...
తృప్తి వున్న
భిక్షగాడే
గొప్ప ధనవంతుడు!!
***
శీర్షిక:- స్వర్గ నరకాలు
06
స్వర్గ నరకాలు
ఎక్కడో లేవు
ఇది తెలియకుండానే
ఎక్కడున్నాయోనని
మనిషి వెదుకుతూ
ఏడుస్తున్నాడు!
మన సంతోషిస్తే
స్వర్గం దగ్గరికొస్తుందనీ
మనం ఏడిస్తే
నరకం నడిచొస్తుందనీ
తెలుసుకుంటే
అవసరముండదు
ఈ అన్వేషణ!
ఉన్నా లేకున్నా
సంతోషంగా వుండడం
నేర్చుకో...
ఎప్పుడూ దేనికో ఒక దానికోసం
ఏడుస్తూవుంటే
స్వర్గం ఎలా దరిజేరుతుంది?
***
శీర్షిక:- కోపం...శాంతం...
07
చీటికీ మాటికీ
కోపం తెచ్చుకోవడం
కుసంస్కారి నైజం
శాంతంగా వుండడం
వినయవంతుని నైజం
కోపం మనిషిని
పశువును చేస్తే..
శాంతం మనిషిని
మనీషిని చేస్తుంది!
కోపానికీ
శాంతానికీ
దూరం ఒక చిన్న ఆలోచన!
ఆలోచిస్తే
కోపానికి ఆస్కారం వుండదు
ఆలోచన చేయకుంటే
రెండుకాళ్ళ పశువే
అవుతాడు మనిషి!
***
శీర్షిక:- హింస - అహింస
08
శరీరానికీ
మనస్సుకీ
నొప్పి కలిగించడం
హింస!
శరీరానికీ
మనస్సుకీ
ఆహ్లాదాన్ని కలిగించడం
అహింస!
చితి
శరీరాన్ని కాలిస్తే
చింత
మనస్సును కాలుస్తుంది!
అలాగే...
నింద
ముఖాన్ని
ముడుచుకొనేలా చేస్తే...
స్తుతి
ముఖాన్ని
విచ్చుకొనేలా చేస్తుంది!
***
శీర్షిక:- అతి సర్వత్ర...వర్జయేత్!
09
అధిక దానం
కర్ణున్ని చంపింది
అధిక మోహం
లంకకు చేటు తెచ్చింది
అధిక గర్వం
రారాజును సర్వనాశనం చేసింది
అధికం...
మనిషికి
చిక్కుల్ని తెచ్చిపెడుతుంది
అందుకే
వద్దు
మనందరికీ
ఎన్నటికీ
అధికం!!!
***
శీర్షిక:- కాలం నేర్పే పాఠం
10
గతం...
మన తప్పిదాలకూ
విజయాలకూ
ఒక పాఠమైతే...!
వర్తమానం...
సంస్కరణలకూ
సౌలభ్యాలకూ
బాటౌతుంది!
అప్పుడే
భవిష్యత్తు...
భూత వర్తమానాల
గుణపాఠాలు నేర్పిన
అనుభవాల వేదికపై
వెలుగొందుతుంది!
భూత వర్తమానాలనుండి
పాఠాలు నేర్వకుంటే
వాణ్ణి
త్రిమూర్తులు కూడా
కాపాడలేరు!
అలాగే...
పాఠాలు నేర్చుకున్నవాణ్ణి
త్రిమూర్తులు కూడా
ఏమీ చేయలేరు!!!
***
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
శుక్రవారం, ఏప్రిల్ 08, 2016
నవయుగాదీ...దుర్ముఖీ...స్వాగతం...!!!
మిత్రులందఱకు నవ్య త్రిలింగ వత్సరాది శుభాకాంక్షలు!!!
శార్దూలము (పంచపాది):
స్వస్తిశ్రీ నవ దుర్ముఖీ! శుభద! స♦త్సంపత్కరీ! వత్సరీ!
అస్తోకోజ్జ్వల దివ్య నవ్య భవితా♦హార్య ప్రభావోదరీ!
ప్రస్తుత్యాధిక ముఖ్య కావ్య లహరీ! ♦ వాణీ శివానీ రమో
పాస్తిత్యంకిత ధాత శంభు బలివి♦ధ్వం సీద్ధ భద్రంకరీ!
ప్రస్తావింతును నేఁడు మా కొసఁగు మీ ♦ పర్వాన సర్వోన్నతుల్!! 1
తే.గీ.
ఈ యుగాది దినాన నే♦నేమి వ్రాఁతు?
పర్వమన మది మెదలు నిం♦బామ్రతరులు;
శుకపికమ్ముల రవము; కిం♦శుక సుమాలు;
కొదమ తేఁటుల నృత్యాలు, ♦ పదములన్ని!! 2
తే.గీ.
జనము పెరిఁగియు, వనము ♦ భోజనము సేసి,
ప్రకృతి శోభలఁ గసితీఱ ♦ వికృతపఱచి,
నగరములఁ బెంచి, నవయుగ ♦ నాగరకులయి,
యెదిగి పోయితి మందు రి♦దేమి మాయొ? 3
తే.గీ.
కుహుకుహూ రావముల తోడఁ ♦ గోకిలమ్మ
చిగురుటాకుల ముక్కునఁ ♦ జేర్చుకొనుచు,
"రార, వాసంతుఁడా, రార, ♦ రమ్ము రమ్మ"
టంచు ముదముతోఁ బిలిచెనే ♦ యంగలార్చి? 4
తే.గీ.
కిలకిలా రావముల తోడఁ ♦ గీరములును
దోర పండ్లను దినుచునుఁ ♦ దోరముగనుఁ
జెట్ల పుట్టల గుట్టలఁ ♦ జేరఁ బిలిచి
మాటలాడెనే సంతస ♦ మంది నేఁడు? 5
తే.గీ.
దూరముగ నున్న కొండపైఁ ♦ దోచి, నిత్య
మగ్ని కీలలఁ దలఁపించు ♦ నట్టి వైన
మోదుగుల పూఁత లీనాఁడు ♦ మోము దాచి,
పాఱిపోసాఁగె వేగాన ♦ వనము విడచి!! 6
తే.గీ.
పూవుఁ దోటలఁ దిరుగాడి, ♦ పుప్పొడులను
మేనికినిఁ బూసికొనుచును ♦ మేలమాడి,
యాడి పాడెడి తుమ్మెద ♦ లేడఁ బోయె?
నవియె పూఁ దేనె లేకయే ♦ యలిగెనేమొ!! 7
తే.గీ.
పూర్వ మున్నట్టి ప్రకృతి య♦బ్బురముగాను
మాయమాయెను; మనిషియు ♦ మాఱిపోయె;
మాయమాయెను సంస్కృతి; ♦ మాయమాయెఁ
బండుగల తీరు తెన్నులు ♦ భారతమున! 8
తే.గీ.
మార్పు రావలె నేఁడైన ♦ మనిషిలోన;
సంస్కృతుల్ సంప్రదాయాల ♦ సంస్కరించి,
ప్రకృతిఁ బూజించి, మనమునఁ ♦ బరవశించు
దినము దుర్ముఖీ యీయవే ♦ ఘనముగాను! 9
ఉత్పలమాల:
జీవులకెల్ల సౌఖ్యములు, ♦ క్షేమము శాంతి శుభాది వైభవాల్,
జీవన మిచ్చి, ప్రోచి, విర♦చించిన ధాన్య ధనాది సంపదల్
దీవన తోడుతన్ మనిచి, ♦ తృప్తియు, తోషణ సమ్ముదమ్ము, ప
ర్యావరణమ్ముఁ గూడ కడు ♦ రమ్యత నీయవె మాకు దుర్ముఖీ! 10
-:శుభం భూయాత్:-
సోమవారం, మార్చి 28, 2016
హరి శతకము
నేను అయుత కవితా యజ్ఞమునఁ బ్రకటించిన
హరి శతకము
ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీకైవల్య పదముఁ గొన
నీకయి విరచించి నాదు ♦ నేరుపు మీఱన్
శ్రీకర శుభకర గురు కరు
ణాకర వర కంద శతము ♦ నర్పింతు హరీ! (01)
నీకయి విరచించి నాదు ♦ నేరుపు మీఱన్
శ్రీకర శుభకర గురు కరు
ణాకర వర కంద శతము ♦ నర్పింతు హరీ! (01)
శ్రీలక్ష్మీశా! వినుమయ!
నీ లీలలు కనఁగ వినఁగ ♦ నెద పొంగునయా!
నాలోని మోహ మార్చియు;
నీలో ననుఁ గలుపుకొనియు ♦ నెమ్మి నిడు హరీ! (02)
నిరతము నీధ్యానమ్మే;
సరగున ననుఁ బ్రోచి, నేను ♦ సంబరపడఁగన్,
విరివిగ జ్ఞానము నీయుము!
హరియించుము మనములోని ♦ యజ్ఞతను హరీ! (03)
నిను ధ్యానించెడు పట్టునఁ
బెను యోచన లెపుడు ముసర, ♦ వెఱచు మనమునున్
గనియునుఁ, జిత్త స్థైర్య
మ్మునుఁ బెంచుము, దేవదేవ! ♦ ముదమునను హరీ! (04)
పూజలు సేయఁగ, పలువిధ
పూజాద్రవ్యమ్ములేవి ♦ పొనరించియు నే
నీఁ జాలనయ్య! మనమను
పూజాకుసుమమ్ముఁ గొనుము! ♦ పురుషవర! హరీ! (05)
దేవాధిదేవ! నిన్నును
నా వాఁడ వటంచు నమ్మి, ♦ నా మనమున నిన్
భావించి కొలుతునయ్యా!
దీవన లీయంగ రమ్ము! ♦ ద్విజశకట! హరీ! (06)
స్తోత్ర మ్మిడ మంత్రము లే
మాత్ర మ్మే నెఱుఁగనయ్య ♦ మాధవ! కరుణన్
బాత్రత నెఱిఁగియు, నన్నున్
బుత్రునిగా నెంచి, వేగఁ ♦ బ్రోవుమయ హరీ! (07)
సన్మాన్యము లే మిడుదునొ,
చిన్మూర్తీ! యెఱుఁగు దీవు ♦ సేవింపఁగ నిన్!
మన్మనమున నిలుపుకొనుటె
సన్మాన్యము కాదె! యీశ! ♦ చక్రధర! హరీ! (08)
చేతను గవ్వయు లేదయ!
చూత మనఁ, బవిత్ర ధనము ♦ చోద్యమ్మె, భువిన్
జూతుమె? పవిత్రమగు నా
చేతమ్మునుఁ గొనుము వేగ ♦ శ్రీనాథ హరీ! (09)
కుల గోత్ర వంశ ఘనతనుఁ
దెలుపఁగ నున్నతుఁడఁ గాను! ♦ దీనుఁడ నయ్యా!
విలువలఁ జూడఁగ నెందునఁ
గలవో నీ వెఱుఁగ లేవె? ♦ కమలాక్ష హరీ! (10)
చదువుల సారము నెఱుఁగను
గదయా! వేదమున నిన్నుఁ ♦ గను మంత్రములన్
జదువఁగ లేనయ! సార
మ్మిదె కొనుమయ నా పలుకుల ♦ నెంచుచును హరీ! (11)
నీ లీల లద్భుతమ్ములు!
బాలుఁడ నీ ముందు నేను! ♦ వరదుఁడ వీవే!
లీలా మానుష విగ్రహ!
నాలోఁ గల వెతల డుల్చి ♦ ననుఁ గావు హరీ! (12)
కరి మొఱ విని కాచితివఁట,
"పరమేశా! కావు" మంచుఁ ♦ బ్రార్థింపంగన్;
పరిపరి విధముల నుతు లిడఁ,
గరివరదా! వేగ నన్నుఁ ♦ గావు మయ హరీ! (13)
ఓపిక నే పుణ్యములను
గోపిక లటఁ జేసినారొ? ♦ గొబ్బున వారిన్
దాపముఁ దీరిచి యెదలో
దీపించుచు నర్తనములఁ ♦ దేల్చితివి హరీ! (14)
మాయలఁ దెలియని బేలయు
నా యమ్మ యశోద కట్టె ♦ నా ఱోట నినున్!
మాయలఁ దెలియని నా మది
నో యయ బంధితుఁడ వగుమ! ♦ యురగశయ! హరీ! (15)
యుక్తియె లేదయ; నినుఁ గన
శక్తియు లేదయ్య; చేరఁ ♦ జాలను రక్తిన్;
భక్తసులభ నినుఁ గొలిచెద
భక్తిని! ముక్తి నిడు మయ్య ♦ పరమేశ! హరీ! (16)
దైత్యాంతక! నిను నే సా
హిత్యాత్మక పద్యము లిడి ♦ హితమతిఁ గొలువన్;
సత్యాత్మ నిడియుఁ బ్రోచుచు
నిత్యము మద్దురిత కృతుల ♦ నిర్జించు హరీ! (17)
లోకమ్మునఁ బాపమ్ములు
చేకొని యొనరించుచుండ్రి ♦ శిక్షాభయమున్
లేకయె! వారల మనమున
నే కపటము దొరలకుండ ♦ నియమించు హరీ! (18)
కడలినిఁ గడఁచి, సురస మద
మడఁచియు, లంకిణినిఁ గూల్చి, ♦ మైథిలిఁ గనియున్
దొడ విడి, లంకనుఁ గాలిచి
యడరిన హనుమయ్య భక్తి ♦ నందించు హరీ! (19)
బాలునిఁ గని దయ లేకయె
కాలుండయె కనక కశిప ♦ కల్మాషుఁడు తాన్!
బాలునిఁ గాఁచెడి నృహరివె!
యేలయ ననుఁ గావ రావు ♦ హిత మిడియు హరీ! (20)
కమలేక్షణ! హృదయేశ్వరి
కమలను హృత్కమలమందు ♦ కాంక్ష నిడియు నీ
విమలాత్మనుఁ బ్రకటించితి!
రమేశ! నా హృదయమందు ♦ రంజిలుము హరీ! (21)
నినుఁ దలఁచిన శ్రమ తొలఁగును;
నినుఁ దలఁచిన పనులు జరుగు; ♦ నిధులును గలుగున్;
నినుఁ దలఁప ముదము; కావున,
నినుఁ దలఁచెడు మనము నిమ్ము ♦ నిత్యమును హరీ! (22)
రవి చంద్రులు నేత్రములై
యవిరళముగ వెలుఁగఁ జేయు♦నయ లోకములన్!
కవిలోక వంద్య! నా మది
నవిరళముగ వెలుఁగఁ జేయు♦మయ వరద! హరీ! (23)
గురు పదముల ధ్యానించినఁ
దొలఁగును నజ్ఞాన తిమిర ♦ దోషమ్ము వెసన్!
గురువులకే గురుఁడవయా!
సరగున జ్ఞానమ్ము నిమ్ము ♦ సత్కృపను హరీ! (24)
సురలనుఁ గాఁచి, యసురులనుఁ
బరిమార్చియు, వేగ లోక ♦ పరితోష మిడన్
బరికీర్తితుండ వీవే!
సురేశ వాణీశ వంద్య! ♦ శుభకారి హరీ! (25)
బల ముడిగి నృపులుఁ గన, హరు
విలు విఱిచియు, జనక సుతనుఁ ♦ బెండ్లాడ, వెసన్
బలవంతుఁడవని లోకము
పలుమఱుఁ బొగడెఁ గద! నాకు ♦ బలమీవె హరీ! (26)
వశ ముడిగి నిన్నుఁ దెగడిన
శిశుపాలుని దోష శతము ♦ సీమను దాఁటన్
భృశమే ఖండించితివయ
శిశుపాలుని శిరము! చక్రి! ♦ చిద్రూప! హరీ! (27)
పాపి దశాస్యుఁడు సీతను
పాపముఁ దలఁపక హరించి ♦ బంధించఁగ నా
పాపినిఁ ద్రుంచితి! లోకులఁ
బాపాత్ముల వశము నుండి ♦ పాలింపు హరీ! (28)
ధనమున్నవారలందఱు
ధనగర్వముచేత రేఁగి, ♦ ధనహీనులనున్
"దీనులు, హీను" లనుచు నవ
మాన మిడఁగ, వేగ వారి ♦ మద ముడుపు హరీ! (29)
నీ పాద ధూళి చేతనె
శాపావధిఁ గనె నహల్య! ♦ సరి యా పదముల్
కాపాడఁ గడిగె గుహుఁ! డా
నీ పదముఁ గడిగెద నేత్ర ♦ నీరమిడి హరీ! (30)
వచ్చితి వ్రేపల్లెకు; నటఁ
జొచ్చితి గోపకుల యింటఁ ♦ జుఱ్ఱఁగఁ బాలన్;
గ్రుచ్చితి దనుజుల నెల్లను;
మెచ్చితి పదునారు వేల ♦ మెలఁతుకల హరీ! (31)
శ్రుతులం గాఁచితి; గిరి మో
సితి; కనకాక్షుని కనక క♦శిపు నొంచి; బలిన్
క్షితి నడఁచి; నృపుల వంచి; ప
దితలల దొరఁ ద్రుంచి; గీతఁ ♦ దెల్పితివి హరీ! (32)
శూలి ధను ర్భేదక! వన
పాల దనుజ నాశక! నయ♦బాహ్య దశాస్యో
న్మూలక! సవిధ స్థిత భూ
పాలక! కృత రామరాజ్య! ♦ పద్మాక్ష! హరీ! (33)
పుట్టితివి దేవకికి; మఱి,
మెట్టితివి యశోద యింట ♦ మేలుం గూర్పన్;
గొట్టితివి రక్కసుల నిల;
మొట్టితివయ ఖలునిఁ గంసు ♦ మోదమున హరీ!(34)
తాపసులనుఁ దాపసివయి;
భూపతులను నృపుఁడవయి; ఋ♦భువుల ఋభుఁడవై;
గోపాలక! భూగోవును
నేపారఁగఁ గాఁచి తీవు! ♦ హేమాంగ! హరీ! (35)
దేవముని నారదుం డొక
దేవ విరిని నిడఁగ, నీవు ♦ దేవేరి కిడన్,
దేవా! సత్యయె యలుఁగన్,
దేవేంద్రు గెలిచి, కుజమునె ♦ తెచ్చితివి హరీ! (36)
సుర లసురు లమృతమునకయి
ధరాధరము పాలకడలిఁ ♦ ద్రచ్చఁగ మునుఁగన్
ద్వర కూర్మమవై నీవటఁ
గరుణను మంధరము మోసి, ♦ గతి నిడితి హరీ! (37)
భువి నసురుం డడవికిఁ జని,
భవునిఁ గూర్చి తపము సేసి, ♦ భస్మాసురుఁడై,
శివునే పరీక్ష సేయఁగ,
నువు మోహినివయ్యు వాని ♦ నొంచితివి హరీ! (38)
అమృతము సురాసురులు గొని,
తముఁ దామే పోరుచుండఁ, ♦ దగ మోహినివై
యమృతముఁ బంచితి సురలకు!
విమతుల మృతి కెఱఁగఁ జేయ ♦ వినయాన హరీ! (39)
నిరతము నిన్నును నందఱు
"సరసిజనయనా! ముకుంద! ♦ సర్వేశ! యతీ!
స్మరగురు! మధుసూదన! జిన!
మురహర!" యనుచును స్మరింత్రు ♦ మోక్ష మిడ హరీ! (40)
"వినఁ డితఁ" డని మాత యపుడు
నినుఁ ఱోటికిఁ గట్టివేయ, ♦ నీడ్చుచు, మద్దుల్
గని, నడుమన నునిచి, తిగువ
ను, ననిమిషులు శాపము విడ, ♦ నుతు లిడిరి హరీ! (41)
ఎంగిలి పండ్లను నీకిడి
వంగిన మనమునను నిన్ను ♦ భక్తి నుతింపన్
బొంగియుఁ గాఁచితి శబరిని
హంగుగ మోక్షమ్ము నిడియు ♦ యజ్ఞేశ హరీ! (42)
పిడికెడు నటుకుల రుచిఁ గొని,
యిడియును నైశ్వర్యములను; ♦ హితునిఁ గుచేలున్
విడిపోని బంధమునఁ బ్రే
ముడిచే సేవల నొనర్చి ♦ మురిసితివి హరీ! (43)
భువనేశ! దైత్యనాశా!
భవ నాశక! పద్మనాభ! వరద! పరేశా!
స్తవనీయ! హృషీకేశా!
త్రివిక్రమా! శ్రీశ! నాకు ♦ దిక్కీవె హరీ! (44)
అరమరిక లేలనయ్యా
కరుణాకర! నన్నుఁ గావ? ♦ కైమోడ్చితి; నా
పరదైవ మీవె యంటిని;
పరమాత్మా! వేగ రమ్ము ♦ వరమిడఁగ హరీ! (45)
త్రికరణ శుద్ధిగ నీ గుణ
నికర పదచ్ఛాయలోన ♦ నివసించినచో
నకళంక జీవనస్థితి
సుకరమ్మై చేరు సకల ♦ శుభములును హరీ! (46)
ఒకఁడుండు లేమిఁ గుములుచు;
నొకఁడుండును కలిమియందు ♦ నొందుచు సుఖముల్;
సుకరముగఁ దెలియ నీ స్థితి
ప్రకటితమగుఁ బూర్వజన్మ ♦ వాసనల హరీ! (47)
నీ లీలఁ దెలియలేకయె
కూలి వెతల; జతనములనుఁ ♦ గొనమయ నిచ్చల్;
గాలిని దీపము నిడెదము;
మేలు నిడెడి నిన్నుఁ దలఁప ♦ మిఁక నోమ హరీ! (48)
నినుఁ గొల్వ గుడినిఁ గట్టఁగ
ధనమునుఁ గూర్చుకొనియు, సర♦దారుని సుంక
మ్మునుఁ గొని, వెఱవక, భద్రా
ద్రిని గోపన్నయె సృజించెఁ ♦ దిరముగను హరీ! (49)
త్యాగయ్య హృదయమందున
రాగమ్మునఁ గీర్తనమున ♦ రాముని వయ్యున్
దాగి గెలిపించితయ్యా
త్యాగమునకు నిలయునిగను ♦ ధరలోన హరీ! (50)
ధరఁ బ్రహ్లాదునిఁ గావఁగ
వర కరుణా వీక్షణములఁ ♦ బ్రసరింపంగన్
గరము విలంబముఁ జేసియు;
నరసింహుఁడవయ్యుఁ గాచి♦నాఁడవయ హరీ! (51)
లక్షించి కౌరవులు ఘన
శిక్షను నిడఁ బాండవులనుఁ ♦ జేరంగనుఁ గో
పాక్షుని దుర్వాసుఁ బనుప
నక్షయపాత్ర మెతుకుఁ దిని ♦ యరసితివి హరీ! (52)
త్రిపురాసుర సంహార
మ్మపుడా శివునకును నీవు ♦ నస్త్రమ్ముగనై
త్రిపురములఁ గాల్చినాఁడవు
విపుల యుద్ధమందు నిలిచి ♦ వెలుఁగొంది హరీ! (53)
ముని కృతమున సిరి కోప
మ్మునుఁ గొని వెడలఁగను నీవు ♦ పుట్టం జొరఁగన్
గని, హర చతురానను లట
వనమున గో వత్సము లయి ♦ పాలిడిరి హరీ! (54)
నిను మనమున నిలుపుకొనియు
వినుతింతునుఁ బద్దెములను ♦ విశ్వేశ్వర నన్
గనుమయ కటాక్షముల వే
గను ననుఁ బ్రోవుమ రమేశ! ♦ కరుణాత్మ! హరీ! (55)
దండమయా జగదీశ్వర!
దండమయా నీరజాక్ష! ♦ దండము శౌరీ!
దండమయా దనుజాంతక!
దండమయా వేదవేద్య! ♦ దండ మిదె హరీ! (56)
నా కష్టములనుఁ బాపుచు
లోకేశా! శాంతి నిడుము! ♦ లోకము నందున్
నా కిష్టమైన దైవమ!
నా కిలఁ బరమార్థ మిమ్ము ♦ ననుఁ గనుచు హరీ! (57)
లోకమ్మును సృజియించుచు;
లోకముఁ బాలింప జనుల♦లో వెలుఁగుచు; నీ
లోకమును లయ మొనర్చుచు;
లోక మ్మీ వగుదు గాదె ♦ లోకేశ! హరీ! (58)
ఆ రంతిదేవుఁ డెప్పుడు
కోరిన యాచకుల కెపుడు ♦ కూరిమి నిడుచున్
ధీరుండై మోక్షముఁ గొనె!
నారాయణ! ధర్మబుద్ధి ♦ నా కిడుము హరీ! (59)
జనకుని యానతిఁ దాల్చియు
జననిం బరిమార్చి తండ్రి ♦ సంతోషపడన్
జననిం బ్రతికించితి వయ
ఘనకుఠార! పరశురామ! ♦ కావుమయ హరీ! (60)
నీ మహిమలఁ గనుఁగొనఁగను
బ్రేముడి మన మంత నిండు ♦ శ్రీలక్ష్మీశా!
నేమమున నిన్నుఁ గొల్చితి
నా మనమున నిలువు మయ్య ♦ ననుఁ గావ హరీ! (61)
భవ సాగరమున మునిఁగియు
నవయుచు మే ముంటి మయ్య ♦ నరక మ్మిదియే!
నవనీత హృదయ! నన్నిఁక
భువినిం దప్పించి దివికిఁ ♦ బో విడుము హరీ! (62)
చేసెడిది తామె యనుచును
జేసెడి కర్మముల గొప్పఁ ♦ జేఁజేతఁ బ్రజల్
వాసిగఁ జెప్పుచు నుందురు!
చేసెద వీ వంచుఁ దెలివిఁ ♦ జేకొనరు హరీ! (63)
శివునాజ్ఞ లేక చీమయె
భువిఁ గుట్ట దటంచు నెఱిఁగి ♦ ముఱియుదుము! కనన్
భువి నీ యానతి నన్ని, య
భవ! నడువఁగఁ, బాపపుణ్య♦పరు లెవరు హరీ? (64)
పుట్టించితి మనుజునిగను
మెట్టించితి మనుజులందు ♦ మిన్నగ నన్నున్
గిట్టించఁగానుఁ దృప్తిగఁ
గట్టెదుటనుఁ గానుపించి ♦ కావుమయ హరీ! (65)
జీవాంతర్హృదయమ్మునఁ
దావక ప్రేమామృత మిడఁ ♦ దరితీపేలా?
జీవాత్మనుఁ బరమాత్మయె
కావఁగ వలెఁ గాదె, చూపి ♦ కనికరము, హరీ! (66)
నా దైవమ! నా ప్రాణమ!
వేదాదుల యందు నీవె ♦ విదితుఁడ వనఁగన్;
వేదాంత వేద్య! నేనే
వేద మ్మెది యెఱుఁగ నయ్య ♦ ప్రియ వరద హరీ! (67)
నే నింతవాఁడ నంచును
దానయి చెప్పుకొనుచుండుఁ ♦ దఱచియు నరుఁడున్!
తానెట్లు గొప్పవాఁడో
తానెఱుఁగునె, నీ మహిమలఁ ♦ దలఁపకయె, హరీ? (68)
పలు మతములఁ; బలు కులములఁ;
బలు భాషల, దేశములనుఁ; ♦ బలు వ్యవహృతులన్;
బలు మనముల దీపించుచు
నిలిచియు దైవ మ్మొకండె ♦ నివసించు హరీ! (69)
గోవింద! నీదు నామము
భావింప మనమ్మునందు ♦ భాసిలుచు వెసన్
బావన మొనరించును రా
జీవము పరిమళముఁ జిమ్ము ♦ చెన్నుగను హరీ! (70)
పిలిచినఁ బలుకఁగ లేదని
కలవర మందుచును జనులు ♦ గడఁగియు నెంతే
నలిఁగియు దైవమె లేఁడని
పలు విధములఁ బలుకకుండ ♦ పలుకుమయ హరీ! (71)
నాలోని పద్య విద్యకు
నాలంబన మీవె దేవ! ♦ నా మనమున నీ
జాలము లలిత గతుల పద
జాలము నర్తింపఁ జేసె! ♦ సత్య మిది హరీ! (72)
సర్వముఁ గాంతువు నీవే;
సర్వలోక వినుత! నిన్ను ♦ శరణంటినయా!
సర్వాంతర్యామీ! నా
గర్వమ్మునుఁ బరిహరింపఁ ♦ గనుమయ్య హరీ! (73)
మోసముఁ జేసెడు వారల
దోసములను బయటపెట్టి ♦ దుర్జన కృతమున్
వేసమ్ము తోడఁ దెలిపియు
దాసోఽహమ్మనెడు నటులఁ ♦ దరువిడుము హరీ! (74)
పొత్తముల వెలుఁగు విద్యయుఁ
జిత్తమునను వెలుఁగు జ్ఞాన ♦ శేషము త్వద్వా
గ్దత్తము కాదే! యిఁక నే
నిత్తును నా హృదయ కుసుమ ♦ మిదె కొనుము హరీ! (75)
మనుజులలో మనుజుఁడవై;
దనుజుల నిల రూపుమాపి, ♦ దశరథ రాముం
డను పేరఁ బరఁగి, కపికుల
ఘనుఁ గాఁచితి వాలిఁ జంపి ♦ కరుణాఢ్య హరీ! (76)
ఖగపతిని వాహనముగ; భు
జగపతి నొక తల్పముగను ♦ సరగునఁ గొనియున్
జగముల నేలెడి పతివై
యుగయుగముల వెలుఁగుచుంటి♦వోయయ్య హరీ! (77)
దుష్టులఁ దునుమాడి ధరను
శిష్టుల రక్షించి శమము ♦ స్థిరపఱచి వెసన్
గష్టమ్ములఁ దొలఁగించియు
నిష్టమ్ములఁ గూర్తువయ్య ♦ నేమమున హరీ! (78)
ఉత్కృష్ట చరిత! నిన్నిఁక
సత్కృతులం దొనరఁజేయు ♦ సన్నుతి, గుణ సం
పత్కర వర కరుణాది ర
సోత్కరమై వెలుఁగఁ జేయు ♦ సుగుణుఁడవు హరీ! (79)
నారదునకు సంసారపుఁ
గోరిక నిడఁ దానె తెలిసి♦కొనియునుఁ దా సం
సారము వ్యర్థమ్మను వ్యా
హారమ్మును మాను మహిమ ♦ యది నీదె హరీ! (80)
పదునాఱువేల గోపిక
లొదవిరి శృంగార భక్తి♦లోన మునిఁగియున్
సదయన్ నీ సహచరులుగ
మెదలుట నీ మహిమ కాదె ♦ మితముగను హరీ! (81)
నీరేజ పత్రములపై
నీరపుఁ గణ మెవ్విధమున ♦ నిలువదొ, ఘన సం
సారపు సాగరమున న
న్నారీతిని నంటకుండ ♦ నడిపించు హరీ! (82)
బాల్యమున మహిమఁ జూపియు
మాల్యమ్మునుఁ గొంటివయ్య ♦ మాన్య హితుల సౌ
శీల్యపు టటుకులఁ గొని కై
వల్య మిడితి నన్ను నటులె ♦ పాలింపు హరీ! (83)
అజ్ఞానము కనుఁ గప్పఁగ
విజ్ఞతతో నిన్నుఁ జూచు ♦ వెరవుఁ గనక నా
ప్రజ్ఞయె యడుగంటెను నీ
యాజ్ఞ నిడియుఁ బ్రోవుమయ్య ♦ హర్షమున హరీ! (84)
ఈ మనుజుల యాచింపఁగ
నీమము విడి చులకనఁ గని ♦ నిరసింతురనన్;
వామన! యా బలి నడిగితి
వేమయ్యా చులకనైతి♦వే యచట హరీ? (85)
హరి నామ స్మరణముచే
హరియింతువు దురితములను ♦ నర్థిఁ దలంపన్
సిరులనుఁ గోరను; మోక్షపు
సిరుల నిడియుఁ బ్రోవుమయ్య ♦ శీఘ్రముగ హరీ! (86)
అండజ వాహన! పాపపుఁ
గొండల గూల్చియును మాకుఁ ♦ గూరిమితో నా
ఖండల వైభవ మిడఁగను
దండ మిడెద నయ్య నీకు ♦ దయఁ గనఁగ హరీ! (87)
మత్స్యావతారము:
సోమకుఁడు వేదములఁ గొని
తామసియై సంద్రమందు ♦ దాచఁగ ఝషమై
సోమకునిఁ ద్రుంచి వేదము
లోమియు నబ్జజున కిడిన ♦ ప్రోడవయ హరీ! (88)
కూర్మావతారము:
అమృతముఁ గొనఁగను రాక్షసు
లమరులుఁ ద్రచ్చంగ మంధ♦రము మునుఁగఁగఁ గూ
ర్మమవై గిరిని ధరించియు
నమృతము నిడితివయ నీవు ♦ నమరులకు హరీ! (89)
వరాహావతారము:
భూమినిఁ గనకాక్షుండే
తామసమునఁ జాపఁ జుట్టి ♦ దభ్రమున నిడన్
నేమమున ఘృష్టివై యా
హేమాక్షుం జంపి కాఁచి ♦ తీ భువిని హరీ! (90)
నృసింహావతారము:
బాల ప్రహ్లాదుం డటఁ
గ్రాలుచు నిను భక్తిఁ జూపఁ♦గాను కశిపుఁడే
తాళక కంబముఁ గొట్టఁగ
లీల నృహరివయ్యుఁ గశిపుఁ ♦ ద్రెంచితివి హరీ! (91)
వామనావతారము:
పదములు రెంటిని భువి దివిఁ
బదరి కొనియు బలిని మఱొక ♦ పాదమ్ము నెటన్
గదియింతన; బలి యిడఁ దల;
సదయ నిడితి నిమ్నలోక ♦ స్వామ్యమును హరీ! (92)
పరశురామావతారము:
ధర నిరువదియొక మాఱును
బఱఁగ నృప తతిఁ బరిమార్చి ♦ వసుధ ననృపగాన్
వర పితృతర్పణ మిడితివి
పరశుధరా పరశురామ ♦ పరమేశ హరీ! (93)
శ్రీరామావతారము:
యతిఁ గావఁగఁ దాటకఁ జం
పితి; ఱాతిని నాతిఁ జేసి, ♦ వే హరువిలుఁ ద్రుం
చితి; కీశుఁ బ్రోచి, రావణు
హతమార్చియు సీతఁ గొంటి♦వయ రామ! హరీ! (94)
శ్రీకృష్ణావతారము:
చెఱసాలఁ బుట్టి, గోకుల
మురుగతిఁ జని, రక్కసులనుఁ ♦ బొరిగొని, గిరినిన్
ధరియించి, కంసుఁ జంపియు,
దరుణులఁ బదునాఱువేలఁ ♦ దగఁ గొంటి హరీ! (95)
(పౌరాణిక) బుద్ధావతారము:
బుద్ధుఁడవయి త్రిపురాసుర
శుద్ధ సతుల గురుఁడవయ్యుఁ ♦ జూడఁగ మాయా
బద్ధ రతికేళిఁ దేల్చిన
తద్ధర్మోజ్ఝితులఁ గాల్చు ♦ దహనాస్త్ర హరీ! (96)
(లౌకిక) బుద్ధావతారము:
క్షితి సుఖములు నరుల కశా
శ్వతము లటం చెఱిఁగి లోక ♦ పరమార్థద శా
శ్వత వర సత్య జ్ఞానో
ర్జిత బుద్ధుఁడవై సుబోధ ♦ లిడితివయ హరీ! (97)
కల్క్యవతారము:
నరజాతి సంకరమ్మును
బరిమార్పఁగ గుఱ్ఱ మెక్కి ♦ పాపము డుల్పన్
ద్వర దుష్టుల శిక్షించుచుఁ
బఱఁగను శిష్టులనుఁ బ్రోతు♦వయ కల్కి! హరీ! (98)
తొడఁగియు వారధిఁ గట్టఁగ
సడిచేఁ గపివరులుఁ గొండ♦చఱియలు వేయన్
వడి భక్తి నుడుత సాయ
మ్మిడి రామాంగుళిఁ ద్రిరేఖ ♦ నిలఁ గొనెను హరీ! (99)
లక్ష్మీశ! కరుణచే నిట
సూక్ష్మమ్మగు మోక్ష మెంచి ♦ చూడుము మము నీ
లక్ష్మకృత వీక్షచేతను
నీ క్ష్మాతలి కన్న మిన్న ♦ నిడఁగాను హరీ! (100)
దగ్గఱి చుట్టమె శబరియు
నిగ్గగు నెంగిలి ఫలముల ♦ నిడె భుజియింపన్?
దగ్గఱి బంధువె గుహుఁడును
డగ్గఱి నీ పాదములనుఁ ♦ దగఁ గడిగె హరీ? (101)
ఓం నమో భగవతే వాసుదేవాయ
స్వస్తి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)