
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 21-02-2016
కవిత సంఖ్య: 324
శీర్షిక:- మాతృభాష [తెలుఁగు] వెలుఁగు (గర్భకవిత్వము)
సీసము:
చేతు జోతలు, చేర్చి ♦ శ్రేష్ఠద చిత్తమున్
…..మహి భారతీ! చనె ♦ మాతృభాష
మాత! యాంగ్లమె నేఁడు ♦ మాధ్యమ మంచు దా
,,,,,నినె నేర్చుచున్ దెలుఁ ♦ గని యనఁగను
రోఁత యంచును దెల్గు ♦ రీతుల రోయుచుం
…..డ్రిట హెచ్చుగా నదె ♦ మృతిఁ గొనెనని
చేత మందున నుల్ల♦సిల్లుట సిగ్గు సి
…..గ్గయ సోదరా యన♦కయ పలువలు
తే.గీ.
తెనుఁగు తొలగగ విడచి; రి♦దె వినసొంపు
గఁ జనెడి తెనుఁగు విడుతురె ♦ కట్ట! యింక
మారుఁడోయయ్య! మనదైన ♦ మాతృభాష
తెలుఁగు వెలుఁగులు లోకాన ♦ నిలుపుఁడయ్య!
ఈ పైన రచించిన సీసమందును…తేటగీతియందును గర్భితమైన పద్యములు ఇవి:
1. ద్విపద
2. మత్తకోకిల
3. కందము
వాటిని వరుసగఁ గ్రింద నిచ్చుచున్నాఁడను. చూడుఁడు:
1. గర్భిత ద్విపద
చేతు జోతలు చేర్చి ♦ శ్రేష్ఠద చిత్త
మాత! యాంగ్లమె నేఁడు ♦ మాధ్యమ మంచు
రోఁత యంచును దెల్గు ♦ రీతుల రోయు
చేత మందున నుల్ల♦సిల్లుట సిగ్గు
2. గర్భిత మత్తకోకిల
చేతు జోతలు చేర్చి శ్రేష్ఠద ♦ చిత్తమున్ మహి భారతీ
మాత! యాంగ్లమె నేఁడు మాధ్యమ ♦ మంచు దానినె నేర్చుచున్
రోఁత యంచును దెల్గు రీతుల ♦ రోయుచుం డ్రిట హెచ్చుగా
చేత మందున నుల్లసిల్లుట ♦ సిగ్గు సిగ్గయ సోదరా
3. గర్భిత కందము
చనె మాతృభాష తెలుఁగని
యనఁగను నదె మృతిఁ గొనె నని ♦ యనకయ పలువల్
తెనుఁగుఁ దొలగగ విడచి; రిదె
వినసొంపుగఁ జనెడి తెనుఁగు ♦ విడుతురె కట్టా!
(మిత్రులందఱకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి