Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఫిబ్రవరి 13, 2016

అయుత కవితా యజ్ఞము (001 నుండి 100 వరకు)


గుండు మధుసూదన్ వరంగల్

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

కవిత సంఖ్య:1

శీర్షిక:- భ్రమర విలాపము!

ఉత్పలమాలిక:
నేనొక పూలమొక్క కడ ♦ నిల్చి, సుమాలనుఁ జేరు తుమ్మెదల్
తేనియ లానుటల్ గనఁగఁ, ♦ దేఁటి యదొక్కతె పల్కె "నో కవీ!
వీనుల విందొనర్చు మము ♦ వెక్కసమైన కుతూహలమ్ముతోఁ
గానఁగ నేలొకో? మది వి♦కారమగున్ మము బోంట్ల తేంట్ల దుః
ఖానుభవానురూప యుత ♦ గాథలు! నిత్యము భుక్తి కోసమై
గాన మొనర్చుచున్ వెతలఁ ♦ గాంచుచుఁ బూవుల తేనెఁ గూర్చఁగన్
మేనులు డస్సిపోయెను! ని♦మేషము కూడ విరామ మెద్ది? యీ
దీనులఁ జూచి మీ కవులు ♦ తేనెలు చిందెడి కావ్యమందు స
మ్మానిత గానకోవిదుల ♦ మంచును, వేలుగఁ బేర్లు పెట్టి, మా
మేనిని నున్న నల్లఁదన ♦ మెంతటి యంద మటంచుఁ బల్కి, మీ
మానసమందు సంతసము ♦ మంజు మనోహర మౌనటుల్ భళా
న్యూనత లేక సెప్పెదరు ♦ నొవ్వును నెవ్వరుఁ జూడ రియ్యెడన్!
మానవు లిద్ది కానకయె ♦ మా నవ రూప వికాస సౌష్ఠవ
మ్మౌనని కావ్యమందుఁ బర♦మాద్భుత రీతినిఁ గూర్తు రేల? స
న్మానము లందునట్లు బహు♦మాన్యము లిచ్చుట లేలకో కవీ?
కానము మేము! మమ్ముఁ బొడఁ♦గాంచక పొమ్మిట నుండి వేగమే!
మేనిఁ గలట్టి శోభఁ దల♦మే యిట వర్ణన సేయ మీకు! మా
మానసమందు క్షోభఁ దర♦మా యిఁక వర్ణన సేయ మీకు? మ
మ్మీ నవలోక కర్తలుగ నెప్పుడు భావన సేయకుండఁగన్
మేనిని వంచి మ్రొక్కెదము ♦ మిక్కిలిగన్ దయచేసి పొమ్ము! మే
మీ ననలున్ బ్రియుల్ ప్రియల ♦ మెప్పుడుఁ గా మయ! భోజనానికై
మానితమౌ గమమ్ముల స♦మంచిత రీతులఁ బూవుఁబోండ్ల పూఁ
దేనియ బొట్లుబొట్లుగను ♦ తీపిరుచుల్ గ్రహియింప నెట్టులో
వాని ముఖస్థ చుంబన సు♦వాసనఁ గ్రోలెదమయ్య మేమిఁకన్!
గాన, మమున్ హసింపక, సు♦ఖాలనుఁ గ్రోలుచు నుంటిమంచు మీ
రే నవకావ్యమున్ వెలయ♦నే వల దింకను మానుఁ" డంచనన్
నేనును దాని మాటలను ♦ నెమ్మదిఁ దాలిచి నింటి కేఁగితిన్
దేనెల సోనలన్ గుఱియు ♦ తేఁటి గముల్ మదిలోన నాడఁగన్!!

స్వస్తి
******************************************************

కవిత సంఖ్య:2

శీర్షిక: మారీచవధ, సీతాపహరణ వృత్తాంతములు

ఆ.వె.
సీత నపహరింప ♦ సిద్ధుఁడై దశకంఠుఁ
డపుడు తాటకేయు ♦ నంపె వనికి!
వాఁడు మాయలేడి ♦ వలె వేషముం దాల్చి
జానకి కడ కేఁగి ♦ సంచరించె!!

కం.
సురుచిరమగు జొంపమ్ముల
నురు గతితోఁ దినుచు మఱల ♦ నుఱుకుచుఁ దమితోఁ
దిరిగి వెనుఁజూచుఁ జుఱుకునఁ
జిఱు మోడుపుఁ గనులఁ బసిఁడి ♦ జింకను గాంచన్;

తే.గీ.
సీత మనమునఁ బ్రేమయుఁ ♦ జివురు లెత్త,
"నాథ!బంగారు జింకయ ♦ నాకు వలయుఁ
బెంచుకొన మనసాయెను ♦ బ్రియము తోడఁ
దెచ్చి యీయుఁడు మన ప్రేమ ♦ తిరము గాఁగ!"

ఆ.వె.
అనిన సీత పల్కు ♦ లాలించి సౌమిత్రి
"వద్దు వదిన! యీ సు♦వర్ణ హరిణ;
మిట్టి వింతఁ గంటె, ♦ యీరేడు లోకాల?
నిది ప్రమాదకరము! ♦ హితము గాదు!!"

తే.గీ.
అన్న లక్ష్మణు మాటల ♦ నాలకించి,
రాముఁ డనెఁ "దమ్ముఁడా! నన్ను ♦ రమణి సీత
కోరు తొలి కోర్కి తప్పక ♦ తీర వలయుఁ;
బోయి వైళమ దెచ్చెద ♦ మాయ లేడి!

కం.
మాయ యయినఁ దుత్తునియలు
సేయుదు; లేకున్న దాని ♦ సీతకు నిత్తున్;
వేయును మాట లిఁకేలా?
పోయియు నేఁ దెత్తు" నంచుఁ ♦ బోయె త్వర గతిన్;

ఆ.వె.
సీత సంతసించె ♦ శ్రీ రాముఁ డా జింకఁ
బట్టి తెచ్చు నంచుఁ ♦ బరవశించి;
లక్ష్మణుండు కన్ను♦ లందున సంశయ
మొలుక, ధీరుఁ డౌట ♦ నులుక కుండె!

కం.
రాముండటు జింకనపుడు
సేమముగనుఁ బట్టఁగాను ♦ స్థిరనిశ్చయుఁడై
నేమమున వెంబడింపఁగ
నా మారీచుండు మిగుల ♦ నడలుచుఁ బాఱెన్!

ఆ.వె.
అటులఁ బరుగులెత్తు ♦ నా జింకఁ బట్టంగఁ
జిక్కదాయెఁ బరుగు ♦ లెక్కువయయె!
రాముఁడపుడు నదియ ♦ రాక్షసమాయ య
టంచు శరముచేతఁ ♦ ద్రుంచె దాని!!

తే.గీ.
అంత "హా సీత!హా లక్ష్మ♦ణా!" యటంచు
నొక్క పెనుఁ గేక వినఁ బడ ♦, "నక్కట! యట
రాముఁ డాపద నుండెనో ♦ యేమొ? నీవు
సత్వరమ్ముగఁ బొమ్ము ల♦క్ష్మణ!యటకును"

కం.
అని సీత వల్క లక్ష్మణుఁ
డనెఁ "దల్లీ! రాముఁ డెట్టి ♦ యాపద కెఱగాఁ,
డనితర సాధ్యుఁడు, వీరుఁడు,
విను, కారణ జన్ముఁ డతఁడు; ♦ భీతిల్లకుమీ!"

ఆ.వె.
మఱది మాట వినిన ♦ మానిని సీత తా
నెంతొ వగచి యతని ♦ నింద సేయ;
హృదయ శల్యుఁ డయ్యు, ♦ హ్రీ మనస్కుండయి,
"గీత దాటకు" మని, ♦ గీసి వెడలె!

తే.గీ.
రావణుఁడు యోగి వేషాన ♦ రమణి సీత
కడకు నేతెంచి, భిక్షను ♦ నడిగి, రేఖ
దాట రాకున్కి, సీతయె ♦ దాటి రాఁగ,
నపహరించెను హతవిధీ, ♦ యా రమణిని!


(మారీచవధ మఱియు సీతాపహరణ ఘట్టములు సమాప్తము)

స్వస్తి.

******************************************************************

కవిత సంఖ్య: 3

శీర్శిక:-నీలాపనిందలు

పార్వతి శాపవృత్తాంతము:

చవితి దినమున నవ్వంగఁ ♦ జందమామ,
కొడుకు గణనాథు నుదరమ్ము ♦ క్రుమ్మరించె
లోని కుడుముల, నుండ్రాళ్ళ; ♦ వానిఁ జూచి,
క్రోధమున శపించెను గౌరి ♦ బాధతోడ!

"చవితి దినమున నేవారు ♦ చంద్రుని ముఖ
దర్శనము సేతురో వారు ♦ తత్క్షణమ్మె
తగని నీలాపనిందల ♦ నెగడుదురయ!"
యనఁగ, దేవతల్ ప్రార్థింప ♦ వినిచె నిట్లు;

"నాదు తనయునిఁ బూజించి, ♦ నాఁడు నక్ష
తలఁ దలపయిఁ జల్లుకొన నిం♦దలు తొలఁగి, శు
భమ్ము లొనఁగూడు" ననుచు శా♦పావధి నిడ,
నంద ఱానందమందిరి, ♦ వందనమిడి!


శ్రీకృష్ణుని చంద్రదర్శనము:

అల వినాయక చవితి సా♦యంత్రమందుఁ
గృష్ణుఁ డొంటిగఁ దోఁట కే♦గియు నచటనె
కూర్చొనఁగ రుక్మిణీసతి ♦ కూర్మిమీఱ
దుగ్ధపాత్ర నొసఁగఁగ నం♦దునను నతఁడు

చంద్రుఁ బొడఁగాంచినంత ♦ సాక్షాత్కరించె
నింద; సత్రాజితుని దమ్ము♦నిం దునిమి, య
తని శమంతకమణిఁ గొనె ♦ ననుచు వేగ!
దైవమైననుఁ దలవ్రాఁతఁ ♦ దాఁటఁ గలఁడె?

(అది, ప్రసేనుండు ధరియించి ♦ యడవి కేగ,
సింగ మొక్కం డతనిఁ జంపి, ♦ చెలఁగి కొనఁగ,
జాంబవంతుండు సింహముం ♦ జంపి, దానిఁ
దనదు కొమరిత మెడలోనఁ ♦ దనర వైచె! )

దానఁ గృష్ణుండు వనికేగి, ♦ తఱచి వెదుక,
నొక్కచో జాంబవంతుని♦యొక్క తనయ
జాంబవతి కంఠమందున ♦ సౌరభమిడు
నా శమంతకమణిఁ జూచి, ♦ యతనితోడ

యుద్ధముం జేసి, యోడించి, ♦ యుక్తముగను
జాంబవతితోడి మణిఁగొని, ♦ సరగునఁ జని,
యచట సాత్రాజితిం బొంది, ♦ యందగించె
విఘ్నపతి చల్లఁగాఁ జూడ ♦ వెన్నుఁడంత!

-:శుభం భూయాత్:-

******************************************************************

కవిత సంఖ్య: 4

శీర్షిక:- వినాయక స్తుతి

శా.
హే విఘ్నేశ! గజాస్య! లంబ జఠరా! ♦ హేరంబ! భాండోదరా!
హే విశ్వగ్దృశ! మంగళస్వర! సఖా! ♦ హే బ్రహ్మచారీ! కృతీ!
హే విష్ణు! ప్రభు! విశ్వనేత్ర! వరదా! ♦ హే జిష్ణు! సర్వాత్మకా!
హే విద్యా ధన శక్తి యుక్తి మహితా! ♦ హే సుప్రదీపా నమ:!! (1)

తే.గీ.
ఏకవింశతి పత్రాల ♦ నెలమి నునిచి,
స్వాదు ఫలములు, పుష్పాల ♦ సరము లిచ్చి,
పంచభక్ష్య, పాయసముల ♦ భక్తి నిడియు,
నర్చ సేతుము విఘ్నేశ, ♦ యాదుకొనుము! (2)

ఆ.వె.
ప్రతిదినమ్ము మేము ♦ ప్రార్థింతు మో యయ్య!
విఘ్నములనుఁ ద్రోల ♦ వినతి సేతు;
రుగ్మతలనుఁ బాపి, ♦ ప్రోవు మో విఘ్నేశ!
భక్తితోడ నీకుఁ ♦ బ్రణతు లిడుదు! (3)

కం.
నీ పాద ధ్యానముచే
మా పాపమ్ములను డుల్చు ♦ మహితాత్ముఁడవే!
హే పార్వ తీశ నందన!
యీ పర్వ దినమ్ము నందు ♦ నీకిడుదు నతుల్! (4)

చక్రవాకము:
వరగజాస్య! విఘ్నహంత్రి! ♦ భానుతేజ! సౌఖ్యదా!
ధరనిభోదరా! విచిత్ర! ♦ దంతివక్త్ర! శాంకరీ!
సురనరాది సేవితాంఘ్రి! ♦ శూర్పకర్ణ! హేరుకా!
కరిపలాద గర్వహారి! ♦ కావుమయ్య మమ్మిఁకన్!! (5)

-:శుభం భూయాత్:-

****************************************

కవిత సంఖ్య: 5

శీర్షిక:- చంద్రశేఖరాష్టకము
(ప్రాసమైత్రి పాటింపఁబడకుండ, యతిమైత్రి మాత్రమే పాటింపఁబడినది)

తన్మృకండ సుపుత్ర రక్షక! ♦ దండధారి భయంకృతా!
శిష్టపాలక! దుష్టశిక్షక! ♦ చిత్తజాంతక! శంకరా!
దక్షజా పతి! శైలకార్ముక! ♦ దక్షయజ్ఞ వినాశకా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

అంధకాంతక! తాండవప్రియ! ♦ హాటకేశ్వర! ధూర్జటీ!
విష్ణుమిత్ర! కృశానురేతస! ♦ పింగళాక్ష! వృషాం చరా!
శూలపాణి! మహేశ! భార్గవ! ♦ సూర్య! శంభు! సదాశివా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

అస్థిమాలి! గిరీశ! రుద్ర! మ♦హానట! ధ్రువ! భీషణా!
వామదేవ! పినాకపాణి! వృ♦షధ్వజ! త్రిపురాంతకా!
మృత్యుజేత! ఫణీంద్ర భూషణ! ♦ కృత్తివాస! జటాధరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

అంబరాంబర! భానుతేజ! వి♦షాంతకా! ద్రుహి! ణాక్షరా!
నీలలోహిత! పార్వతీపతి! ♦ నీలకంఠ! నిరంజనా!
వ్యోమకేశ! భవ! క్రతుక్షయ! ♦ భూతనాథ! నదీ ధరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

నాగకంకణ! సర్వతోముఖ! ♦ నందివర్ధన! పింగళా!
శర్వ! పంచముఖ! త్రిలోచన! ♦ శాశ్వత! స్మర శాసకా!
పాంశుచందన! నీలకంధర! ♦ ఫాలలోచన! భాస్కరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

అష్టమూర్తి! విశాఖ! సాంబ! స♦హస్ర బాహు! భవాంతకా!
శ్వేత పింగళ! సాంఖ్య ముఖ్య! వ♦శీకృతాంగ! సునిశ్చలా!
స్థాణు! హింస్ర! హిరణ్యబాహు! వి♦శాలనేత్ర! దిగంబరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

అంబికేశ! సుమేరు! సిద్ధిద! ♦ త్ర్యంబ! కాజిత! సంగ్రహా!
రాజశీర్షక! లింగమూర్తి! వి♦రాగి! భైరవ! త్ర్యంగటా!
హైమవత్యుపయంత! వామ! వి♦షాంతక! ప్రమథాధిపా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

మార! దానఘ! భస్మగాత్ర! కు♦మార హేరుక జన్మదా!
సర్వకామద! విశ్వనాథ! వి♦శాల మానస! పాలకా!
విశ్వసాక్షి! సమస్త కుక్షి! క♦వీశ సంస్తుత! రక్షకా!
చంద్రశేఖర! చంద్రశేఖర! ♦ చంద్రశేఖర! పాహిమామ్!

-:శుభం భూయాత్:-
***********************************

కవిత సంఖ్య: 6

శీర్షిక:- సంగీత సమ్రాట్టు-త్యాగరాజు

సీ.
ఘనతరాంచితమైన ♦ కర్ణాట సంగీత
....వాగ్గేయకార స♦త్ప్రణతుఁ డయ్యె;
చిన్నారి పొన్నారి ♦ చిఱుత కూఁకటి నాఁడు
.....రాఘవోత్తమ కృతి ♦ ప్రవరుఁ డయ్యె;
నిధికన్న రాము స♦న్నిధి చాల సుఖమంచు
.....శరభోజి ధన తిర♦స్కారుఁ డయ్యె;
వేన వేలుగఁ గృతు ♦ ల్వెలయించి దేశాన
.....సంగీత లోక ప్ర♦శస్తుఁ డయ్యె;
గీ.
ఆతఁడే 'జగదానంద' ♦ జాతకుండు;
'కనకనరుచిరా' కృతి దివ్య♦కారకుండు;
రఘు కులాన్వయు సద్భక్తి ♦ లబ్ధ యశుఁడు;
ధన్య సంగీత సమ్రాట్టు ♦ "త్యాగరాజు"!

సుగంధి:
'ఎందఱో, మహానుభావు ♦ లెందఱో' యటంచుఁ దా
విందుగన్ గృతుల్ రచించి ♦ విన్నవించి, రామునిన్
డెందమందు నిల్పు భక్తుఁ♦డే స్వరాట్టు గాను ని
ల్చెం దగ న్మహోన్నతి న్వ♦రించెఁ ద్యాగరాజిలన్!

-:శుభం భూయాత్:-
************************************

కవిత సంఖ్య: 7

శీర్షిక:- సుభాష్ చంద్రబోసు

కం.
ఓయీ నేతాజీ! విను
మోయీ, యీ భరతజాతి ♦ పొంద స్వతంత్రం
బా యురుతర సంగ్రామం
బాయుధుఁడై సేసితయ్య! ♦ వందన మయ్యా!!

తే.గీ.
"హింస హింసచేఁ దనియు న♦హింసచేతఁ
గాదు; తెల్లవారల గెల్వఁ ♦ 'గన్' 'తుపాకిఁ'
జేతఁ బట్టిన లభియించు ♦ స్వేచ్ఛ మనకు!
రండు భారత వీరులా♦ర! యని సేయ!"

ఆ.వె.
అనుచుఁ బిలిచి, తాను ♦ "నాజాదు హిందు ఫౌ"
జనెడి "సైన్య పటలి" ♦ సాయుధుఁ డయి;
చేర్చుకొనఁగ జనులఁ ♦ జిరకాల వాంఛిత
స్వేచ్ఛ కొఱకు దురము ♦ ద్విగుణ మాయె!

ఉ.
భారతమాత దాస్యమునుఁ ♦ బాపఁగ నెంచి, సుభాష చంద్రుఁడే
వీర జవానుఁడై దొరల ♦ భీతిలఁ జేయఁగ సైన్య యుక్తుఁడై
దారుణమైన యుద్ధము స్వ♦తంత్రతకై కొనసాఁగఁ జేయుచున్
బోరియు వాయు యానమున ♦ భూమిని వీడియుఁ జేరె స్వర్గమున్!

మాలినీ వృత్తము:
భరత సుభటవర్యా! ♦ భవ్య సన్మానితార్యా!
ఖరకర సమ తేజా! ♦ గమ్య దాతృత్వ బీజా!
మరణ రణ వినోదా! ♦ మాతృ దాస్యాపనోదా!
సరవి నిడుదు జేజే! ♦ జాతి నేతాజి జేజే!

-:శుభం భూయాత్:-
******************************************************************

కవిత సంఖ్య: 8

శీర్షిక:- అశ్వత్థామ వధాపదేశ ద్రోణవధా వృత్తాంతము

తే.గీ.
భీష్ము నస్త్ర సన్యాసమ్ము ♦ వెనుకె ద్రోణుఁ
డపుడు సర్వ సైన్యాధ్యక్షుఁ ♦ డగుడుఁ దీవ్ర
యుద్ధ తంత్రములను బన్ని ♦ యోధ ముఖులఁ
గూల్చు చుండఁగఁ గృష్ణుండుఁ ♦ గుతిలపడియు;

కం.
'వేఁడి గల యెత్తుగడచే
నేఁ డీతని నిలువరింప ♦ నేరక యున్నన్
జూఁడున్ సైన్యం బంతయుఁ
దూఁడరి సేఁతల యుపేక్ష ♦ దోసము గాదే?'

తే.గీ.
అనుచు యోచించి, 'ద్రోణుండు ♦ తనయు మరణ
మునకు మనఁ జాలఁ' డనుచు భీ♦మునికిఁ జెవిని
వినిచె నిట్లు "నశ్వత్థామ ♦ యను గజమును
గూల్చి, యెలుఁగెత్తి చాటుము ♦ 'కూలె' ననియు!"

మ.
అనఁగ న్వాయుసుతుండు వేగిరమె యా ♦ హస్తీంద్రముం జేరియున్
ఘనవృష్ట్యుత్కట ముష్టిఘాత హతిచేఁ ♦ గౌరవ్య సేనా తతుల్
దను వీక్షింపఁగఁ జంపి, బిగ్గఱఁగఁ దా ♦ దర్పోద్ధతిం బల్కె నా
వనజాక్షుండు వచించినట్లుగనె, య♦శ్వత్థామ సంహారమున్!

ఆ.వె.
భీముఁ డట్లు వల్క, ♦ విని నమ్మకుండఁగా,
నఱచె ధర్మతనయుఁ ♦ డంత లోన
"సత్య మిదియ సుమ్ము! ♦ చచ్చె నశ్వత్థామ!!"
యనియుఁ; జిన్నఁగాను ♦ "హస్తి" యనియు!

ఆ.వె.
ద్రోణుఁ డద్ది వినియు ♦ రోదించుచును దన
శర శరాసనములఁ ♦ జాఱ విడిచె!
ద్రుపద పుత్రుఁ డపుడు ♦ ద్రోణుని వధియించెఁ;
గృష్ణుఁ డంత శాంత ♦ హృదయుఁ డయ్యె!

(ఇది అశ్వత్థామ వధాపదేశ ద్రోణవధా వృత్తాంతము)
*************************************************************

కవిత సంఖ్య: 9

శీర్షిక: బాపూజీ

మత్తకోకిల:
హే మహాత్మ! మహోన్నతా! ఘన ♦ హేమ భూమి ఫలప్రదా!
రామభక్త! స్వరాజ్య కాముక! ♦ గ్రామ వృద్ధి కృతేప్సితా!
ధీమతా! లవణోద్యమ వ్రత! ♦ దేశభక్తి ప్రచారకా!
క్షేమ దాయక! నీచ హేయక!! ♦ శిష్ట కీర్తిత నాయకా!! (1)

తేటగీతి:
శ్వేతముఖులను ద్రోలంగఁ ♦ జేసితయ్య
యెన్నియో యుద్యమమ్ముల ♦ నిచట నీవు!
పేదలకు లేని వస్త్రాలు ♦ వీడి నీవు
ముతుక దోవతి కండువల్ ♦ ముఱిసినావు!! (2)

ఆటవెలది:
కరమునందుఁ గఱ్ఱ; ♦ కాళ్ళకుఁ జెప్పులు;
పుట్ట గోచి; యొల్లె ♦ భుజము పైని;
రొండిని గడియార♦ముండ శోభిల్లుచు,
దేశభక్తి నిడిన ♦ దేశికుఁడవు! (3)

చంపకమాల(పంచపాది):
“కుల మత వర్గ జాతి మన♦కున్న తిరోగమనంపు గోడలే;
యిల నివి యున్న, యున్నతియె ♦ యెందును నుండక, భ్రష్టమౌదు; మే
విలువలు లేక, యొండొరు ల♦భీప్సితముల్ దెగటార్చి, శత్రులై
నిలుతురు; కొట్టుకొందు; రివి ♦ నీచములయ్య; త్యజింప మేలొగిన్
గలుగు” నటంచు బోధనలఁ ♦ గాచితివే మన భారతీయులన్! (4)

కందము:
దండమయా గాంధీజీ!
దండమయా బాపు! నీకు ♦ దండము నేతా!
దండము మోహనదాసా!
దండమయా కర్మచంద్ర! ♦ దండములయ్యా!! (5)

-:శుభం భూయాత్:-
**************************************************************

కవిత సంఖ్య:- 10

శీర్షిక:- శివకుటుంబ స్తుతి

సీ.
నీలకంఠా! నిన్ను ♦ నిత్యమ్ము స్మరియింతు;
…..నిత్య సమ్ముద మిమ్ము, ♦ నిష్ఠ నిమ్ము;
శైలాత్మజా! నిన్ను ♦ ససిగఁ బూజింతును;
…..శక్తి యుక్తుల నిమ్ము, ♦ శౌర్య మిమ్ము;
వక్రతుండా! నిన్నుఁ ♦ బత్త్రితో నర్చింతు;
…..సిద్ధి బుద్ధుల నిమ్ము, ♦ స్థిరత నిమ్ము;
కార్తికేయా! నిన్నుఁ ♦ గైమోడ్చి కొలుతును;
…..సద్గుణమ్ముల నిమ్ము, ♦ శాంతి నిమ్ము;
గీ.
నిరతమును నిన్ను మనమున ♦ నిల్పి, పరిచ
రింతుఁ! జల్లంగఁ జూచియు, ♦ శ్రేష్ఠత నిడి,
కావఁగా రమ్ము! స్కంధ వి♦ఘ్నహర సహిత
సాంబ! శివ! గిరిజేశ! గ♦జరిపు! శర్వ!

-:శుభం భూయాత్:-
********************************************************

కవిత సంఖ్య:- 11

శీర్షిక:- నైమిశారణ్య కథ

కం.
గౌరముఖాశ్రమ పరిసర
ఘోరాటవిఁ జొచ్చి వేఁట♦కున్ దుర్జయుఁడన్
రారాజు డస్సి, తన పరి
వార సహితుఁడయ్యు, మునికిఁ ♦ బ్రాగార్ణకుఁడై; (1)

తే.గీ.
పోవఁగను గౌరముఖుఁడు సం♦పూర్ణ మతిని
సంతసమ్మంది, యాతిథ్య ♦ సత్క్రియలను
జేయ, విష్ణుని వేడఁగ, ♦ శ్రీహరి యొక
మణిని నిచ్చె, నా మణి మహి♦మాతిశయత; (2)

తే.గీ.
ఒక్క నగరము నిర్మించి, ♦ మిక్కుటముగ
షోడశోపచారమ్ములు ♦ శుద్ధమతిని
జేయఁ దుష్టుఁడై యా రాజు ♦ చిత్తమందు
మణిని సంగ్రహింపఁగ నెంచి, ♦ మునినిఁ గోరె! (3)

ఆ.వె.
ముని నిరాకరించ; ♦ మునితోడ యుద్ధమ్ముఁ
జేసియైన, మణియ ♦ చిక్కు కొఱకు
మదినిఁ గోర్కి గాఢ♦మై యంపె సైన్యమున్
మునినిఁజంపి, పిదప ♦ మణినిఁ దేఁగ! (4)

కం.
వర సైన్యమ్మునుఁ బంపిన
తఱి నా ముని గంగఁ జేరి, ♦ తరణికి నర్ఘ్యో
త్కర్షమిడుచుండె; భటు లిట
తరవారులఁ జేఁతఁ బూని, ♦ దందడి సేయన్; (5)

కం.
మణినుండి శూరతతి సం
జనియించియు సైన్యతతినిఁ ♦ జండించుచు వే
రణమునుఁ జేయుచు నుండఁగ
ముని యటకును నేఁగుదెంచి, ♦ మురరిపుఁ బిలిచెన్! (6)

ఆ.వె.
విష్ణుమూర్తి యపుడు ♦ వేగమ్ముగా వచ్చి,
మునికి భయముఁ దీర్పఁ ♦ బూని యపుడు
నిమిషమందు సేన ♦ నిర్మూలనము సేసి,
మాయమాయెఁ దాను ♦ మరు నిముసమె! (7)

తే.గీ.
ఎచట నిమిషమునందున ♦ నెదిరిఁ జంపె;
నట్టి యారణ్యమునకును ♦ నైమిశాఖ్య
కల్గి, "నైమిశారణ్యము" ♦ ఘనతనుఁ గని,
సకల మునులకునదియ సు♦స్థానమయ్యె! (8)

(సమాప్తము)

-:శుభం భూయాత్:-

******************************************************************

కవిత సంఖ్య:- 12

శీర్షిక:- శ్రీ అనంత పద్మనాభ స్వామి మహత్త్వ చరితము!


కం.
ఇలఁ దిరువనంత పురమున
తుళు వంశ బ్రాహ్మణుండు ♦ తులలేని తప
మ్మెలమిని జేయఁగ రెండేఁ
డుల బాలుండయ్యువిష్ణుఁ ♦ డుల్ల మెలర్పన్;

కం.
కనఁ బడఁగ, దివాకరముని
మనమెంతయుఁ బ్రేమ నిండ ♦ మన్నన తోడన్
దన యింట నుండు మనఁగా,
"విను! ప్రేమను ననుఁ గను; కన♦వేనిన్ బోదున్"

ఆ.వె.
అనిన సమ్మతించి ♦ యా బాలు నెంతయుఁ
బ్రేమతోడఁ దానుఁ ♦ బెంచు చుండ;
నొక దినమున మునియు ♦ నకలంకుఁడై పూజ
సలుపు చుండె మిగులఁ ♦ దలను వంచి;

తే.గీ.
బాలుఁ డంత సాలగ్రామ ♦ మేలొకొ కొని
చనుచు నుండఁగ ముని చూచి, ♦ సాగ్రహుఁ డయె;
వెంటనే బాలుఁ డప్పుడు ♦ "విను మునీంద్ర!
మున్ను నా యాంక్షఁ దప్పితి; ♦ నిన్ను విడుతు!"

ఆ.వె.
అనుచు మాయ మయ్యె; ♦ మునియునుఁ గుములుచు
'హరియె బాలకునిగ ♦ నవతరించి,
ననుఁ గృతార్థుఁ జేయ ♦ నా గృహమ్మున నుండ;
గుర్తు పట్ట నైతి; ♦ గ్రుడ్డి నైతి!'

తే.గీ.
అనియు వగచుచు ముని యంత ♦ నడవి కేఁగ;
నెదుర నొక పెద్ద వృక్షమ్ము ♦ నేల వంగి,
క్రోశ విస్తార విలసిత ♦ గోచరమయి,
శేష శయనుని రూపెత్తెఁ ♦ జిత్రముగను!

ఆ.వె.
కన నశక్యమైన ♦ ఘను, శేష శయనుని
సన్నుతించఁగాఁ బ్ర♦సన్నుఁ డయ్యి,
వచ్చి, యా యనంత ♦ పద్మనాభ స్వామి
పద్మ తీర్థ మందుఁ ♦ బరిఢవిల్లె!

ఉత్సాహవృత్తము:
ముని యనంత పద్మనాభు ♦ మ్రోలఁ బొంగి పోవుచున్
వినుతరీతి దేవళమ్ము ♦ విగ్రహ ప్రతిష్ఠచేఁ
గనుల విందు సేయఁ గాను ♦ గామితమ్ముఁ దీర్చు దే
వునిగఁ బూజఁ గొనఁగ నిట్లు ♦ పూర్ణ రూపమెత్తెగా!

(శ్రీ అనంతపద్మనాభస్వామి మహత్త్వ చరితము సమాప్తము)

***శుభం భూయాత్***

*************************************************************

కవిత సంఖ్య:- 13

శీర్షిక:- అణా అసలు కథ!

కం.
ధారానగరమునందు ను
దారులు భవభూతి, కాళి♦దాసు లిరువు రా
దారి నడువంగఁ జని యటఁ
గోరియుఁ దాంబూల మపుడు ♦ కూరిమితోడన్

తే.గీ.
కనిరి తాంబూలరాగాధ♦రను వితర్ది;
నామె తారుణ్యభరయౌట, ♦ నటకు నేఁగి,
"తూర్ణమే తెమ్ము చూర్ణమ్ము ♦ పూర్ణచంద్ర
వదన!" యని భవభూతియుఁ ♦ బలుకఁగానె

ఆ.వె.
కాళిదాసు పలికె ♦ “కర్ణాంత సంకీర్ణ
చక్షు! వేగ తెమ్ము ♦ స్వర్ణవర్ణ
పర్ణములను! నీకు ♦ బహుశుభాశీస్సులు!
వేఁగఁ బోయి రమ్ము, ♦ వేచియుంటి!”

ఆ.వె.
అనఁగ లోని కేఁగి ♦ యాపడతియు నప్డు
పసిఁడిఁ దమలపాకు ♦ లెసఁగుచుండఁ
దెల్లనైన సున్న ♦ ముల్లసిల్లుచునుండఁ
దీసికొనియు వచ్చె ♦ దీక్షతోడ!

తే.గీ.
ముందు గోరిన యా భవ♦భూతి విడచి
కాళిదాసున కిచ్చెను ♦ కాంక్ష తీర!
నపుడు భవభూతియును కార♦ణ మ్మడుగఁగ,
వనిత బదులిచ్చెఁ గారణ♦మును కవికిని!

కం.
"వినుఁ డార్యా! లోకమునం
జనురీతిని నే నడచితి! ♦ సైరింపుఁడు నన్!
బెను రొక్కము లిచ్చినవా
రినె మెచ్చును లోక మెపుడు ♦ శ్రేష్ఠ! నిజమిదే!

ఆ.వె.
నీవు మూఁడణాలు, ♦ నితఁడును నైదణా
లిచ్చిరయ్య నాకు ♦ నిచ్చ గలిగి,
యెక్కుడైన ధనము ♦ నిచ్చిన యీతని
కాంక్షఁ దీర్ప ముందు♦గా నిడితిని!"

కం.
ఆమాట విన్న యిద్దఱు
నేమాటనుఁ బలుకలేక ♦ నెఱజాణ కిలన్
సేమమ్ము గల్గు ననియును
నీమముతో వెడలి రపుడు ♦ నెమ్మన మలరన్!

(అణా అసలు కథ సమాప్తము)

-:శుభం భూయాత్:-

**************************************************************

కవిత సంఖ్య: 14

శీర్షిక:- క్షీరసాగరమథన వృత్తాంతము

ఆ.వె.
దేవ దానవులును ♦ దీవ్రమౌ యుద్ధాన
మరణ మందుచుండ; ♦ మాధవునకు
విన్నవించఁగాను ♦ విష్ణుండు "క్షీర సా
గర మథనము సేయఁ♦గా వలె" ననె!(1)

తే.గీ.
పాల సంద్రాన మంథర ♦ పర్వత మిడి,
వాసుకినిఁ గవ్వమునుగ దే♦వతలు దాన
వులుఁ జిలుకఁగఁ బూన; మునిఁగి♦పోవ నదియుఁ;
గలఁతఁ జెంది, హరినిఁ జేరి, ♦ తెలుపఁ గాను;(2)

కం.
చిఱు నగవున విష్ణు వపుడు
కరుణను దాఁబేటి మేటి♦గా మాఱియు, మం
ధరమును వీపున మోయఁగఁ;
దరచిరి యా పాలకడలిఁ ♦ ద్వరితోత్సుకతన్!(3)

తే.గీ.
కలశ పాధోధిఁ ద్రచ్చఁగఁ ♦ దొలుతఁ బుట్టె
హాలహల; మది దహియింప; ♦ నందఱు హరు
శరణ మర్థించి; రప్పుడు ♦ శంకరుండు
గరళముం ద్రాగి, యంత శ్రీ♦కంఠుఁ డయ్యె!(4)

తే.గీ.(పంచపాది)
ముదముతో వారుఁ ద్రచ్చంగ ♦ మొదట కామ
ధేను వుదయించఁగ వశిష్ఠుఁ ♦ డెలమిఁ గొనియెఁ;
ద్రచ్చ నుచ్చైశ్శ్ర వైరావ♦తములు, కల్ప
వృక్ష మప్సరసల నింద్రుఁ ♦ డా క్షణమ్మె
కొనఁగ; లక్ష్మిఁ గౌస్తుభమునుఁ ♦ గొనియె హరియు!(5)

కం.
చివరకు సురాసురులు వెను
దవులఁగఁ గోరిన యమృతము ♦ ధన్వంతరియే
ధవళ రుచులుఁ బ్రసరించఁగ
నవు మోమున విష్ణు మ్రోల ♦ నప్పుడ యుంచెన్!(6)


ఆ.వె.
దేవ దానవులును ♦ దీవ్రమౌ తమితోడ
"మాకు మాక"టంచు ♦ మత్సరించి,
వాదు లాడుచుండ ♦ వైకుంఠుఁ డప్పుడు
మోహినిగను మాఱి ♦ ముందు నిలిచె!(7)

తే.గీ.
వారి కప్పుడు మోహిని ♦ పలికె నిట్లు,
"వినుఁడు! నే నీ యమృతమునుఁ ♦ బ్రేమ మీఱ
మీకు నందఱకును వంచి, ♦ మిమ్ము నమరు
లనుగఁ జేసెద! నాసీను ♦ లగుఁడు నిచట!"(8)

కం.
ఇది విన్న దేవ దానవు
"లదియే వర"మనుచు నటులె ♦ నటఁ గూర్చుండన్;
సుదతి యమృతము సురల కిడె;
నిది రాహువుఁ గేతువునుఁ గ♦నిరి సురల కిడన్! (9)

ఆ.వె.
కనియు సురల చివరఁ ♦ జని, వారు కూర్చుండ;
మోహినియును వంపె ♦ మోద మలర!
సూర్య చంద్రు లిదియు ♦ సూచించ నా చక్రి,
గొంతు దిగక మునుపె, ♦ గొంతుఁ ద్రెంచె!(10)

ఆ.వె.
కంఠమం దమృతము ♦ గల రాహు కేతుల
తలలు బ్రతికె! మొండె ♦ మిలనుఁ జచ్చె!
గ్రహణమందుచుంద్రు ♦ రాహు కేతువు లెప్డు
శశిని, రవినిఁ! గాని, ♦ వశులు కారు! (11)

తే.గీ.
ఇటుల దేవత లమరులై ♦ హితము నెంచి,
రాక్షసులతోడ యుద్ధమ్ము ♦ ప్రబలముగనుఁ
జేసి, దనుజుల నిర్జించి, ♦ జేత లైరి;
క్షీర సాగర మథనమ్ము ♦ క్షేమ మిడఁగ!! (12)

(ఇది క్షీరసాగరమథన వృత్తాంతము)

-:శుభం భూయాత్:-

*************************************************************

కవిత సంఖ్య: 15

శీర్షిక:- బాల కృష్ణునకు జోల

బాల జోల!

జోజో సాధుజనావన!
జోజో ఖగరాజ గమన! ♦ జోజో కపిలా!
జోజో దనుజ బలాంతక!
జోజో కంజాతనేత్ర! ♦ జోజో కృష్ణా! (1)

జోజో పంకజనాభా!
జోజో బ్రహ్మేంద్ర వినుత! ♦ జోజో కేశా!
జోజో ముకుంద! మాధవ!
జోజో కరుణాంతరంగ! ♦ జోజో కృష్ణా! (2)

జోజో జగదీశ! హరీ!
జోజో పూర్ణేందుముఖ! వి♦శుద్ధ హృదబ్జా!
జోజో పన్నగశయనా!
జోజో గిరిధారి! జిష్ణు! ♦ జోజో కృష్ణా! (3)

జోజో దివ్యకృపాకర!
జోజో సర్వాత్మక! జల♦జోదర! చక్రీ!
జోజో వైకుంఠేశా!
జోజో కమలేశ! విమల! ♦ జోజో కృష్ణా! (4)

జోజో కైటభ వైరీ!
జోజో మధుసూదన! కపి! ♦ జోజో శార్ఞ్గీ!
జోజో నారాయణ! విధి!
జోజో విరజా! విలాసి! ♦ జోజో కృష్ణా! (5)

-:శుభం భూయాత్:-

*************************************************************

కవిత సంఖ్య:- 16

శీర్షిక:- నైరృతుని పూర్వ జన్మ కథ


ఆ.వె.
వెలసె నిరృతుఁడు మును ♦ బింగాక్షుఁ డను బోయ
యయి యహింసఁ బూని ♦ యటవి నుండె!
నతని పిన్న తండ్రి ♦ యట బాటసారులఁ
గొల్లకొట్టి ధనము ♦ కూడఁబెట్టు!(1)

కం.
ఒకనాఁ డతండు నది పా
యక తెరువరిఁ గొల్లకొట్టె ♦ ననుచర యుతుఁడై;
"యకటా! ననుఁ గాపాడుఁడు;
నొకఁడనుఁ గాఁ జూచి వీర ♦ లొక్కట నన్నున్ (2)

తే.గీ.
దోచుకొనఁ జూచుచుండిరి; ♦ తొందరఁగను
నన్నుఁ గాపాడుఁ"డని నంత, ♦ నతని కడకుఁ
జేరి, పింగాక్షుఁ డనియె "నో ♦ చిన్నతండ్రి!
బాటసారిని విడు" మని ♦ వలుకఁ గానె;(3)

కం.
కోపమున, సఖులుఁ జూడఁగఁ
బాపమ్మని యెంచకుండ ♦ బాలునిఁ జంపెన్!
శాపమొ, యనుగ్రహమ్మో?
యా పసివాఁ డట్లు చచ్చి, ♦ యల నిరృతుఁ డయెన్!!(4)

తే.గీ.
పరుల కుపకారమునుఁ జేసి ♦ స్వర్గతుఁడయి,
పుణ్య వశమున నిరృతిగఁ ♦ బుట్టి, యష్ట
దిక్పతులలో నొకండయి, ♦ స్థిర యశుఁడయెఁ!
బరుల కుపకారమునుఁ జేయ, ♦ భాగ్య మిదియ!!(5)

-: శుభం భూయాత్ :-

***********************************************************

కవిత సంఖ్య:- 17

శీర్షిక:- శుచిష్మంతుఁడు వరుణునిగ మారిన కథ


తే.గీ.
కర్దమ ప్రజాపతికినిఁ ♦ గలఁడు పుత్రుఁ
డాతఁడే శుచిష్మంత స♦మాహ్వయుండు!
నతఁ డొక దిన మచ్ఛోదమన్ ♦ దమ్మె యిల్లు
సొచ్చి, తోడి బాలురతోడ ♦ నిచ్చకమగు;

ఆ.వె.
ఆట లాడుచుండ ♦ నందొక మొసలియు
మ్రింగి జలధి విభుని ♦ చెంగట నిడె!
నంత నొక్క నాఁడు ♦ నట శివభటులును
బాలుఁ గని, "యిదేమి ♦ వారిధిపతి?

తే.గీ.
కర్దముని పుత్రుఁ దెచ్చితి? ♦ కనఁగఁ దగునె?
తమరు నిట్టి పనిం జేయ ♦ ధర్మ మగునె?"
యనఁగ భయపడి, కైలాస♦మునకుఁ జేర్చ;
శివుఁడు బాలుని నింటికిఁ ♦ జేరఁ బంప;

కం.
జనకుని యాజ్ఞనుఁ బడసియుఁ
జని, కాశీ పట్టణమునఁ ♦ జంద్ర ధరునికై
యనితరమగు తపమునుఁ జే
సెను; శివుఁడును వచ్చి, సంత♦సించి వర మిడెన్!

ఆ.వె.
"వత్స! నీకు నిత్తు ♦ వరముఁ గోరు” మటన్న
"దేవ! ధన్యు నైతిఁ! ♦ ద్రిపురవైరి!
'వరుణ పథము' నిమ్ము; ♦ వరుణుండ నగుదును!
భూతనాథ! భర్గ! ♦ బుధ్న!తుంగ!"

ఉత్సాహము:
కరుణతోడ వరమునిడఁగఁ ♦ గాంక్ష తీరె నతనికిన్;
శరపు సిరులఁ గొనియుఁ దాను ♦ సాగరేశుఁ డయ్యుఁ దాఁ
గరము వర్ష మిడియుఁ జనులఁ ♦ గాచుచుండ నిత్యమున్,
జిర యశమ్ము వడసె! జనులు ♦ చేరి, కొలిచి రాతనిన్.

తే.గీ.(పంచపాది)
"జలపతి! వరుణ! సరిదీశ! ♦ జంబుక! కప!
కేశ! పాశ్చాత్య! వార్షుభ! ♦ పాశహస్త!
ప్రత్యగాశాపతి! విలోమ! ♦ వర్ష దేవ!
శ్యామలాపతి! సంవృత్త! ♦ సన్నుతు లిడి,
మిమ్ముఁ గొలుతుము! కాపాడు, ♦ మేఘనాథ!"

వ.
అనుచు నిట్లు కొలువ, వరుణుఁడు సంతుష్టుఁడై సకాలమున వర్షములఁ గురిపించుచు,
వారలఁ గాచుచుఁ దానును సుఖంబుండె.

(సమాప్తము)

-: శుభం భూయాత్ :-

*********************************************************************

కవిత సంఖ్య:- 18

శీర్షిక: నీల ఐరావతం శ్వేత ఐరావతంగా మారిన కథ (విశేష వృత్తములతో)

స్వాగతవృత్తము:
స్వాగతమ్ము దివి♦జాధిప! దేవా!
వేగ కావఁగదె ♦ శ్వేత సువాహా!
భోగభాగ్యములు ♦ పొంపిరి వోవన్
దేఁ గదే, మఘవ! ♦ దీన దయాళూ!

కరిబృంహితము:
వాసవుఁడ! కరి బృంహితము విని ♦ పజ్జ నునుచఁగ, నచ్చరల్
హాసమునఁ గడు భోగముల ఘన ♦ హర్షమును నిడఁ బాడ, దు
ర్వాసముని దివి పుష్ప సరమును ♦ రంజిలఁగ నిడఁ గాన్కగన్
వీసమయినను లెక్కనిడకయ ♦ వేసితివి చవుదంతికిన్!

గంధగజేంద్రము:
చేసెను గంధ గ♦జేంద్రము తానే
వాసనఁ జేరిన♦వౌ భ్రమరాలన్
వే సనకుండను ♦ విఘ్నమిడంగన్
బూ సరమందలి ♦ పూవులు నల్గన్!

మేఘవిస్ఫూర్జితము:
మునీంద్రుం డా చేష్టన్ సహనము సెడం ♦ బూర్ణ సక్రోధనుండై
"యనేకాక్షా! నీవున్ సురగణములున్ ♦ యష్టి జీవుండ్రు నయ్యున్,
వినీలమ్మౌ మాతంగ సహితముగన్ ♦ విఘ్నముల్ గల్గుఁ గాతన్"
మినుం దాకన్ గంఠధ్వని నుడివెఁ దా ♦ మేఘ విస్ఫూర్జితమ్మై!

మత్త (పంచపాది):
శాపమ్ముం దా విని ♦ చదిరమ్మున్
గాపట్యమ్మే తన ♦ కడ నంచున్
గాపాడం దూఁకెను ♦ కలశాబ్ధిన్
శాపో'న్మత్త'న్ గని ♦ శరధీశుం
డేపుం జూపెం గర♦టికిఁ బ్రీతిన్!

ఇంద్రవంశము:
ఇంద్రుండు నా శాపము♦నే వినంగ "మౌ
నీంద్రా! ననుం బ్రోచియు ♦ నీదు శాపమున్
సాంద్రానుకంపన్ మన♦సారఁ ద్రిప్పి, దే
వేంద్రాదులన్ గావుమ ♦ యింద్ర వంశమున్!"

జలదము:
నా విని మౌనియప్డు కరు♦ణాకరుఁడై
తా వరమిచ్చెఁ ద్రచ్చఁగ సు♦ధాబ్ధి కడన్
వేవురు దేవదానవులు ♦ పేత్వమునున్
ద్రావఁగఁ దీఱు నంచు జల♦దమ్ము వలెన్!

ఇంద్రవజ్ర(పంచపాది):
వారంతటన్ వేగమె ♦ పాలవెల్లిన్
జేరంగఁ బోయె న్మఱి ♦ చిల్క నంతన్
క్షీరాబ్ధిలోఁ జూచిరి ♦ శ్వేత దంతిన్
దోరమ్ముఁ బీయూషముఁ ♦ దోచె వెంటై
యీరప్డు కీర్తించిరి ♦ యింద్రవజ్రల్!

-:శుభం భూయాత్:-
*************************************************************

కవిత సంఖ్య:- 19

శీర్షిక:- విశ్వాస ఘాతుకుఁడు (ససేమిరా కథ)

విజయ పాలుఁడు యువరాజు ♦ వేఁటకుఁ జని,
యటవిలో దారి తప్పంగ ♦ నపుడు సింహ
మొకటి తఱిమె! దాపున నున్న ♦ యొక్క వృక్ష
మెక్కఁగాఁ దరుశాఖపై ♦ నొక్క యెలుఁ గ
భయము నిచ్చి కాపాడెను ♦ వానినపుడు! (1)

సింహ మచ్చటనే యుండె ♦ స్థిరముగాను!
రాత్రి యయ్యెను, నిద్రించెఁ ♦ బ్రాణి తతియు!
నెలుఁగు నాతనినిం గోరె ♦ నిదుర వోవఁ
దనదు తొడపైని నప్పుడు ♦ దయనుఁ బూని! (2)

ఎలుఁగు కోరిక తలఁదాల్చి, ♦ హితుఁ డటంచుఁ
బల్కి, నిదురించ; సింహమ్ము ♦ పడఁగఁ ద్రోయు
మంచు భల్లూకమును గోరె! ♦ మానవు పయి
ద్రోహ చింత లేని యెలుఁగు ♦ "త్రోయ" ననియె! (3)

అర్ధ రాత్రము దాఁటిన ♦ యపుడు రాకు
మారుఁడును లేచి, యెలుఁగు నీ ♦ మాఱు నిద్ర
వోవఁ గోరఁగాఁ దొడపైనిఁ ♦ బోయె నిదుర;
సింహ మప్పుడు పడఁ ద్రోయు ♦ చింతన నిడె! (4)

విశ్వసితయయ్యు నెలుఁ గట
నాశ్వాసముఁ గొని శయింప, ♦ నప్పుడు శంకన్,
విశ్వాస ఘాతుకుండై
నశ్వర మిత్రతనుఁ ద్రోయ, ♦ నది శపియించెన్! (5)

“నీదు కృతము నేఁడు ♦ నీచమై, ద్రోహమై,
మచ్చఁ దెచ్చెనోయి ♦ మానవతకు!
కాన, నెపుడు నీవు ♦ పూని యున్మాది యా
త్ర సలుపుము “ససేమి♦రా” యనుచును!” (6)

అని శపించియుఁ దన దారిఁ ♦ జనియె నెలుఁగు;
రాకుమారుండును “ససేమి♦రా” యటంచుఁ
బిచ్చివాని పగిదిఁ బ్రల♦పించుచుఁ దన
యిల్లుఁ జేరంగఁ జనెఁ బౌరుఁ ♦ డెవఁడొ చేర్ప! (7)

తన కుమారుని దుఃస్థితిఁ ♦ దలఁచి తండ్రి
కుమిలిపోవుచు దుఃఖించి, ♦ గుణయుతుఁ డగు
మంత్రిఁ గోరంగ నాతండు ♦ మానితముగ,
దివ్య దృష్టినిఁ జూచి, చిం♦తించి, పలికె! (8)

“సకల సద్భావ వర్ధిత ♦ సాధువులను
వంచనము సేయఁగను నేరు♦పగునె నీకు?
నమ్మి తొడపైని నిద్రించు♦నట్టి సఖునిఁ
జంపఁ బౌరుషమ్మగునె, నీ♦చమ్ముఁ గాక?”
యనఁగ ’సేమిరా’ యంచును ♦ ననఁగ సాఁగె! (9)

“సేతుయుత వారిధిని, జాహ్న♦వీ తురీయ
సంగమముఁ జూడఁగా బ్రహ్మ ♦ సంహృతిస్థ
పాతకము సమయును! మిత్ర♦ఘాతుక మెటు
సమసి పోవును, దద్దర్శ♦నమున నిచట?”
యనఁగను ’మిరా’ యటంచును ♦ ననఁగ సాఁగె! (10)

“మిత్రఘాతి, కృతఘ్నుండు, ♦ మేదినిఁ గల
యట్టి విశ్వాస ఘాతుకుం ♦ డను త్రయమ్ము,
తరణి శీతకరాదు లెం♦దాఁక స్థిరులొ,
యంత దాఁక నరకమున ♦ నడలుచుం” ద్ర
నంగ ’రా’ యంచు మఱి మఱి ♦ యనఁగ సాఁగె! (11)

“రాజ! నీసుతుఁ బాప వి♦రహితుఁ జేయఁ
గోర్కి కలదేని శీఘ్రమే ♦ కూర్మి మీఱ
దేవ బ్రాహ్మణోత్తమ గురు♦దేవతలకు
దానధర్మాదులనుఁ జేయఁ♦గావలె నయ!”
యనఁగ విజయ పాలుఁడు మాఱె ♦ మునుపటి వలె! (12)


-: ఇది “ససేమిరా” కథ :-

---శుభం భూయాత్---
***************************************************************

కవిత సంఖ్య:- 20

శీర్షిక: విఘ్నేశ్వర స్తుతి (విశేష వృత్తములలో)

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః !

స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన ♦ చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! ♦ శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! ♦ యోగ విశేషా!
స్వాగత ప్రమథ ♦ వర్గ! నమో ఽహమ్! (1)

ప్రమాణి వృత్తము:
గజాననా! ♦ ఘనాకృతీ!
ప్రజావళి ♦ ప్రమోద! స
ద్ద్విజ స్తుత! ♦ స్థిరా! చతు
ర్భుజా! నమో ♦ బుధా ఽనిశమ్! (2)

ప్రణవ వృత్తము:
హేరంబా! మిత ♦ హిత సంతోషా!
గౌరీ నందన! ♦ కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట ♦ శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! వి♦ముఖ! వందే ఽహమ్! (3)

శాలినీ వృత్తము:
సారాచారా! నీత ♦ సత్పుణ్య దాతా!
పారాశర్యామోద ♦ బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి ♦ సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్వి♦దేహ ప్రభాసా! (4)

వంశస్థము:
నమో నమో విఘ్న ♦ వినాశకాయ తే!
నమో విచిత్రాయ! ♦ వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత ♦ నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)

వన మయూరము:
హేరుక! భవాత్మజ! మ♦హేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! ♦ దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వి♦కూప తరణాప్తా!
చారు రుచి దంత కులి♦శ ప్రహరణాఢ్యా! (6)

స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! ♦ భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ♦ ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! ♦ కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! ♦ శాంత మూర్తీ! నమః! (7)

ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! ♦ చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ♦ ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! ♦ వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన ♦ తేజ! తే నమః! (8)

భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! ♦ త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! ♦ శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృ♦క్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జా♦కృతీశా! నమస్తే! (9)
(శుభం భూయాత్)
*****************************************************************

కవిత సంఖ్య:- 21

కవితా శీర్షిక: ఓరుగల్లు

వ|| మా యూరి నోరుఁగంటినిఁ దలఁచినకొలఁది మది పులకించును

||సీ||
కాకతీయుల యోరుఁ ♦ గల్లున గతవైభ
.....వపుఁ జిహ్నములు నిల్పు ♦ భావనలను;
నట స్వయంభూదేవు ♦ నాలయమందున
.....దీపించు శివలింగ ♦ దీధితులను;
దొడరి వేస్తంభాల ♦ గుడిలోన వెలసిన
.....పరమేశ్వరకృపా ప్ర ♦ భాతములను;
గుట్టపైఁ బద్మాక్షి ♦ గురుతరాశీఃప్రద
.....వీక్షణమ్ములొసంగు ♦ ప్రేరణలను;

||గీ||
భద్రకాళి యొసఁగు ♦ పావనాశీఃపూత
మౌ సరోవర జల ♦ మాధురులను;
పరమ పదముఁ జేర్చు ♦ వరద గోవిందుని
యభయముద్ర యిచ్చి ♦ యాదరించు!!

-:స్వస్తి:-
******************************************************************

కవిత సంఖ్య:- 22

శీర్షిక:- చిరయశులు!

ఇంద్ర సత్సభా ప్రకటిత ♦ హేతు బలిమి
గాధి నందనుఁ డే రాజు ♦ గతిని మార్చె?
నా హరిశ్చంద్రుఁ డిడుముల ♦ నైన వలచి,
సత్యవా క్పాలనమ్మును ♦ సడల నీఁడు!

ఋణమునుఁ దీర్పఁగ నిజసతి
గుణమతి యా చంద్రమతినిఁ ♦ గోరియు నమ్మన్ ;
బ్రణతు లిడి, సుత సహిత విత
రణకై బలియయ్యె సాధ్వి, ♦ రమణుని యానన్!

సుతుఁడు లోహితుండు ♦ సుగుణవంతుఁ డెదలో
హితుఁడు, జనకు నాజ్ఞ ♦ నేమరకయె,
జనని ననుసరించె, ♦ జనలోక వంద్యుండు,
భావి యౌవ రాజ్య ♦ భారకుండు!

-:స్వస్తి:-
********************************************************

కవిత సంఖ్య:- 23

శీర్షిక:- అన్నపూర్ణేశ్వరీ స్తోత్రము

(అన్నపూర్ణాష్టకము నందలి ప్రథమ శ్లోకమునకు నా అనువాదము)


శా.
మా కానందము నిచ్చ లిచ్చి, వరసం♦రక్షా సుశోభాబ్ధివై;
మా కృత్యమ్ముల ఘోర పాపము నశిం♦పం జేయు సాక్షాచ్ఛివా!
యో కాళీ! హిమశైల వంశ విమలా! ♦ యో కాశికాధీశ్వరీ!
మా కీయం గదె భిక్ష రక్ష దయలున్ ♦ మా తాన్నపూర్ణా ఽమ్బికా!!


మూలశ్లోకము:
నిత్యానన్దకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||


భావము:
నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు,
సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపముల నన్నిటినీ కడిగివేయుదానవు,
హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి,
దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుమమ్మా!

స్వస్తి

*************************************************************************

కవిత సంఖ్య:- 24

శీర్షిక:- వేణుగోపాలుని యాలయ కుడ్య శిల్ప విన్యాసము

(ఒకనాఁటి శ్రీకృష్ణజన్మాష్టమి వేకువ జామున నా హృదయ దర్పణమున నేనొక కలఁ గాంచితిని)

తే.గీ.
అదియ వేణుగోపాలుని ♦ యాలయమ్ము;
గోపురము పైన శంఖచ♦క్రోదయమయె!
గాలిగోపురమునఁ జేరఁ ♦ గళలఁ దేల్చి,
సకల దేవతలును గొల్వ ♦ స్వాగతింతు! (1)

శా.
సర్వైశ్వర్య వదాన్యుఁ డీతఁడు; సహ♦స్రాక్షాదు లీ కృష్ణునిన్
సర్వేశుండని గొల్తు రీ దినము; స♦త్సంగీత హర్షాన, దుః
ఖోర్వీభార విదూరుఁ డంచును సదా ♦ కుడ్యమ్ములన్ నిల్చియున్,
గర్వమ్మింతయు లేకఁ గీర్తనలచేఁ ♦ గంసారిఁ గీర్తింపఁగన్ (2)

కం.
నాదు మనోనేత్రమ్మున
నీ దినమీ యాలయమ్ము ♦ నిక్కువముగ, స
మ్మోద మ్మొనఁ గూర్చుచు, దా
మోదరు లీలల వెలార్చి ♦ ముగ్ధునిఁ జేసెన్! (3)

సీ.
ఒకచోట శ్రీకృష్ణుఁ ♦ బ్రకటాపగా యము
.....నను దాఁటు వసుదేవు ♦ నాప్త కృత్య;
మొక్కచోఁ బూతన ♦ మక్కువ నిడు స్తన్య
.....మునుఁ ద్రావి, ప్రాణాలఁ ♦ గొను విధమ్ము;
నొకచోన శాకటు ♦ న్నుగ్గుసేయఁగ నాక
.....సమ్మున కెగయు న♦సంపు వితము;
నొక్కెడఁ గాళియు ♦ నుక్కడఁగించియు
.....ఫణముల నర్తించు ♦ భంగిమమ్ము;
గీ.
ఒక దెసను వెన్న మీఁగడ ♦ లోలిఁ ద్రాగు;
నొక యెడను గోపికల నృత్య ♦ వికసనమ్ము;
నొకటఁ జాణూర ముష్టికు♦ల కపజయము;
నొక్క దిక్కునఁ గంసుని ♦ నుఱుము సేఁత! (4)

ఆ.వె.
ఎంత సుదిన మిద్ది! ♦ వింతలఁ జూపించి,
నన్నుఁ బ్రోచునట్టి ♦ వెన్నదొంగ!
మాయఁ బన్ని నన్ను ♦ మన్నింప, ధన్యుండ!
పరమపురుష, మోక్ష ♦ వరము నిడుము!! (5)

(అనుచుఁ బ్రార్థించుచుండ, పక్షుల కిలకిలారావాలచే మెలకువ రాఁగ, నది కలయని
తెలిసి, యా దేవదేవునకు మనస్సున మ్రొక్కి,లేచితిని.)

-:శుభం భూయాత్:-
***********************************************************************

కవిత సంఖ్య:- 25

శీర్షిక: జోలపాట (శ్రీరామ స్తుతి)

శార్దూలవిక్రీడితము:
జోజో సూర్య కుల ప్రదీప విభవా! ♦ జోజో ఘనాభాజిరా!
జోజో కౌశిక యజ్ఞ రక్షణ పరా! ♦ జోజో హరేష్వాసభిత్!
జోజో రావణ కుంభకర్ణ హననా! ♦ జోజో నిలింపావనా!
జోజో రామమహీశ! చంద్రవదనా! ♦ జోజో మహీజాపతీ!

(భావం: సూర్యవంశమునకు దీప్తిని, వైభవమునుఁ గలిగించినవాఁడా; మేఘమునుబోలు
శరీకాంతిగలవాఁడా; కౌశికుని యజ్ఞమును గాఁచినవాఁడా; [హర+ఇష్వాస-భిత్]
శివధనువును ద్రుంచినవాఁడా; రావణకుంభకర్ణాదులను హతమార్చినవాఁడా; దేవతలను
గరుణించినవాఁడా; చంద్రునివంటి ముఖముగలవాఁడా; భూపుత్రి సీతకుఁ
బతియైనవాఁడా; ఓ రామభూపాలా! నీకు నా జోలలు!)

-:శుభం భూయాత్:-

*********************************************************

కవిత సంఖ్య:- 26

శీర్షిక:- కంసుని దౌష్ట్యము

(దేవకీగర్భగతాష్టమశిశువు చేఁత మరణమున్నదని కంసున కాకాశవాణి తెలుపుట)

తే.గీ.
కూర్మి వసుదేవకుం డంత ♦ కోరి రమణి
దేవకిని బెండ్లియాడి యే♦తెంచు సమయ
మునను "రథము నే నడుపుదు" ♦ ననుచుఁ గంసుఁ
డుత్సుకతతోడ నడుపంగ ♦ నొక్కసారి;(1)

కం.
ఫెళఫెళమను ఘోషముతోఁ
బలికెను నాకాశవాణి ♦ "భళిరా కంసా!
చెలియలి గర్భస్థాష్టముఁ
డొలియించును నీదు ప్రాణ ♦ మోయీ వినుమా!"(2)

ఆ.వె.
అనఁగఁ గుపితుఁ డయ్యె ♦ నా కంసుఁ డంతటఁ
గత్తి దూసి చంపఁ♦గాను బోవ,
"బావ! యాగు" మనుచు ♦ వసుదేవుఁ డాపియు,
నష్ట బాలకులను ♦ నతని కిడుదు;(3)

తే.గీ.
అనఁగఁ గంసుండు శాంతించి, ♦ "యట్టులె" యని
మాట పుచ్చియు విడిచెను ♦ మఱదిఁ, జెల్లిఁ!
బ్రాణ సమమైన చెల్లెలు, ♦ బావ యనియుఁ
జూడ రయ్యయో దుష్టులు ♦ సుంతయైన!!(4)

-:శుభం భూయాత్:-
***************
బుధజన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

కవిత సంఖ్య: 27
శీర్షిక:- తిక్కన భారతావిష్కరణము

సీ.
కాకతీయుల యోరుఁ♦గల్లున గణపతి
.....దేవుని సన్నిధిఁ ♦ దిక్కయజ్వ
తన రచనను భార♦తమ్మును బఠియించి,
.....మెప్పులు వడసియు, ♦ మేలి వరము
నందియుఁ దన స్వామి ♦ నల మన్మసిద్ధిని,
.....ఘనుఁ, బునా రాజ్యార్హుఁ ♦ గానుఁ జేసి,
స్వామి కార్యమ్మును, ♦ స్వక కావ్య వికసన
.....మ్ములను మంత్రాంగానఁ ♦ బొంది, మఱియుఁ
గీ.
దెలుఁగు వారల నాల్కలఁ ♦ దిరముగాను
నిలిచి వెలిఁగియుఁ జిర యశ♦మ్ములును బొందె
ఘనత నందె "కవిబ్రహ్మ" ♦ యనియు మఱియు
"నుభయ కవిమిత్రుఁ"డనియుఁ ♦ దా నుర్వి వఱలె!

-:శుభం భూయత్:-

గుండు మధుసూదన్
వరంగల్


*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

కవిత సంఖ్య:- 28
శీర్షిక:- శ్రీకృష్ణ స్తుతి

యదు కులాంభోధి చంద్ర! ♦ ఘనాభ దేహ!
రాసకేళీ విలోల! సు ♦వ్రజ కిశోర!
కృష్ణ! గిరిధర! నరసఖ! ♦ కేశవ! హరి!
కంస ఘస్మర! దీనులఁ ♦ గావుమయ్య!


పార్థసారథి! మురహంత! ♦ వాసుదేవ!
శ్యామ సుందర! శకటారి! ♦ చక్రి! వృష్ణి!
వేణుధర! శౌరి! బకవైరి! ♦ విశ్వరూప!
కంస ఘస్మర! దీనులఁ ♦ గావుమయ్య!

నరక హంతక! వృషనాశ! ♦ నంద తనయ!
ద్రౌపదీ మాన రక్షక! ♦ తాత తాత!
మానినీ వస్త్ర చోర! ♦ పద్మాక్ష! దేవ!
కంస ఘస్మర! దీనులఁ ♦ గావుమయ్య!

-:శుభం భూయాత్:-

గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 09-01-2016
కవిత సంఖ్య: 29
*************************
శీర్షిక:- శకుంతల విరహము!
*************************

(గర్భవతియైన శకుంతల దుష్యంతుని రాకకై యెదురుచూచి, రాకపోవుటచే విరహవేదనతో
నొక లేఖ వ్రాయఁబూనుట)

మ.
“అనివార్యమ్మయి యా శకుంతలను దు♦ష్యంతుండు కళ్యాణమై
చనఁగన్ బోవుచు ముద్రికం దొడిగి, యా ♦ సత్యాత్మకుం డెంతకున్
దన దారం బిలువంగ రాఁ డిటకు! లే♦దా యేమి రాగమ్ము నా
తనికిన్? బూనెనొ కిన్క యెట్టి కతనో? ♦ ధర్మమ్ము కాదిద్దియున్!” (1)

తే.గీ.(పంచపాది):
వనిని యనసూయయుం బ్రియం♦వదయు నిట్లు
పలుకుచుండఁగ వినియు నా ♦ వన్య రమణి
యగు శకుంతల కినుకతో ♦ ననియె "నేమె!
నా విభుఁడు మాట తప్పక ♦ నన్ను వేగ
పురికి రప్పించు నిజముగాఁ! ♦ బొండు పొండు! (2)

కం.
అని తరిమి యా శకుంతల
తన నాథునిఁ దలఁచి, సుంత ♦ తాప మధికమై;
మనమునఁ గల దు:ఖమ్మును
గనిపింపఁగ నీయకుండఁ ♦ గణ్వుని కుటిలోన్. (3)

ఆ.వె.
చని యట మఱి యుండఁ ♦ జాలక బయటకు
వచ్చి యేడ్చుచుండఁ ♦ బరుగు తోడఁ
జెలియు వచ్చి, యడుగఁ ♦ జింతను దిగమ్రింగి,
"లేఖ వ్రాతు నిపుడు, ♦ ఱిచ్చ యేల? (4)

కం.
కమ్మను దె"మ్మని యమ్ముది
తమ్మెయి నమ్మంగఁ బలుకఁ, ♦ దాఁ దెచ్చి యిడన్;
గమ్మ పయి వ్రాసె నెద్దియొ
యమ్ముని పట్టి యటఁ దన్మ♦యాంచిత హృదియై! (5)

-:స్వస్తి:-
********************************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్

తేది: 10-01-2016
కవిత సంఖ్య: 30

శీర్షిక:- అకుంఠిత దేశభక్తుఁడు...భగత్‍సింగ్

(నేఁటి యుదయము నేను నిదురలేచినంతనే భగత్‍సింగ్ ఛాయాచిత్రమునుం జూచితిని.
ఆ యకుంఠిత దేశభక్తునిఁ జూచినంతనే నా మనస్సున మెదలిన భక్తిభావపరంపర నీ
విధముగఁ గవితారూపమున వెలయించితిని)

శా.
వంశమ్మేది, మతమ్మునేది, ఘనసం♦పద్యోగ్యవిద్యాది మా
నాంశమ్మును విడనాడి, వీరయువకుం, ♦ డంతర్విచారుండు, ద్వా
వింశత్యబ్దసుశోభితుండు నెటులీ ♦ శ్వేతాభిపాలుండ్రఁ బూ
ర్ణాంశార్తిం బడఁజేసి, తాను వెసఁ బా♦ఱంద్రోలఁగాఁ బూనెనో?

ఆ.వె.
పూవు పుట్టఁగానె ♦ పొందును పరిమళం
బనెడి మాట నిజము! ♦ భగత సింహుఁ
డింటఁ జిన్ననాఁట ♦ నెంతలేసి పనులు
చేసినాఁడొ ప్రజల ♦ స్వేచ్ఛ కొఱకు!

తే.గీ.
తాత గధరు విప్లవసంస్థ♦కై తమిఁ గొన,
మేనమామయుఁ జేరంగఁ, ♦ దానుఁ జేరి,
తెల్లదొరలును వణకుచుఁ ♦ దల్లడిల్ల,
నుల్లసిల్లెను నుల్లమ్ము ♦ పల్లవింప!

కం.
కంపితులై శ్వేతముఖులు
తెంపరియౌ మాతులు నురి ♦ దీయంగను, రో
దింపక, యుగ్రుండయి కనుఁ
గెంపులు నిప్పుకలు రాల్పఁ ♦ గెరలె యముండై!

సీ.
అగ్గింప నెగసిన ♦ యగ్నికీలను బోలి
.....శుక్లాననులఁ జేసె ♦ విక్లబులుగ;
సితవక్త్రులు వణంక ♦ సింహనాదముఁ జేసె
.....భూనభోంతరములు ♦ బొబ్బరిలఁగ;
ధరియించి శస్త్రముల్ ♦ ధవళాస్యులకు గర్వ
.....భంగమ్ముఁ జేసె వి♦భ్రాంతి సెలఁగ;
పాండురవదనులఁ ♦ బాఱిపోవఁగఁ జేసె
.....వీరత్వమును జూపె ♦ భీతిలంగ;
గీ.
సంగరమ్మున విలసిల్లి ♦ రంగు మీఱి
భగతసింహుని శౌర్యమ్ము ♦ వఱలుచుండఁ,
గినుకఁ బూని యాంగ్లేయులు ♦ గనలుచుండి
రగ్గిపై వేయ నెగసెడి ♦ గుగ్గిలమయి!

ఆ.వె.
భారతీయులపయి ♦ ఘోరకృత్యము సల్పి
పగను దీర్చుకొనిరి ♦ పాలకు లటు;
లంత భగత సింహుఁ ♦ డాగ్రహోదగ్రుఁడై
బాంబు విసరి తుదకుఁ ♦ బట్టుబడెను!

కం.
ఉరిశిక్ష వేసినంతనె,
స్థిరమగు నానంద మెలమి ♦ ధీరత నిడఁగన్,
వరయుతుఁ డగు నా వీరుఁడు
"భరతాంబకు జే" యటంచుఁ ♦ బాసె నసువులన్!

తే.గీ.
అమరుఁడైనట్టి యా వీరు ♦ నాత్మలోన
నిత్యమును మీరు స్మరియించి, ♦ నిశ్చలమగు
దేశభక్తియె మనమున ♦ దీప్తు లెసఁగ,
నతనిఁ గొనియాఁడుఁడీ భార♦తాంబ మ్రోల!

జై హింద్!
***************
గుండు మధుసూదన్
వరంగల్

************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 10-01-2016
కవిత సంఖ్య: 31

శీర్షిక:- బడిబాట కాదిది పనిబాట!


కం.
చదువఁగ వలసిన వయసున
బ్రదుకఁగఁ బని సేయఁగాను ♦ వలసెను, కట్టా!
యిది యేమి కాలమయ్యా?
మది రోసెడి ప్రభుత తీరు ♦ మాఱఁగ వలయున్!

ఆ.వె.
కనుక, ప్రభుత ధనము ♦ ఖర్చు చేసితి మంచుఁ
బ్రగతి లేక; మిగుల ♦ సుగతిఁ గనక;
బాలకార్మికులను ♦ బడిఁ జేర్పఁగా లేక;
ధనము ఖర్చు సేయ, ♦ ధర్మ మగునె?

కం.
ప్రతి యింటికి వలసిన పని
సతతము నిడి బ్రతుకు బాటఁ ♦ జక్కఁగ వేయన్;
గతి చక్కఁ బడును; పిల్లలు
మితి లేకయ చదువుకొండ్రు ♦ మీఱిన తమితోన్!

-:శుభం భూయాత్:-
****************************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 10-01-2016
కవిత సంఖ్య: 32

శీర్షిక:- పిసినారి స్వగతము (ధన మహత్త్వము)

ఆ.వె.
"పైస లోన నుండుఁ ♦ బరమాత్ముఁ డిల లోన;
ధనమె మూల మయ్యె ♦ ధరణి లోన;
డబ్బు లేని వాఁడు ♦ డుబ్బుకుఁ గొఱ గాఁడు!
కాన, గూడఁబెట్టఁ ♦ గలుగు సుఖము!!

ఆ.వె.
కులము గొప్పదైన; ♦ గోత్రోత్తముండైన;
విద్య యున్న; సద్వి♦వేకమున్న;
ధనము గల్గు వాని ♦ దాసునిగా మాఱి,
సతము సేవఁ జేయు ♦ నతఁడు, నిజము!

కం.
రూపాయియె పరమార్థము;
పాపములనుఁ జేసి యైనఁ ♦ బైసనుఁ బెంచన్
దాపత్రయపడుచుందురు;
రూపాయీ, నీకు నతులు! ♦ ప్రోవుము జనులన్!"

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 10-01-2016
కవిత సంఖ్య: 33

శీర్షిక:- మల్లికా కుసు మాభ దేహ...మాత సరస్వతి!!


తే.గీ. (పంచపాది)
శారదాభ్రేందు కుందమం♦దార ఫేన
కాశ ఘనసార హిమనగా♦కార ధవళ
వర్ణ మాత "సరస్వతి" ♦ పరఁగ నిపుడు
మల్లికా కుసుమముఁ జూడ ♦ మదిని మెదలె!
నిదియ నాభాగ్య గరిమయే యేమొ కనఁగ!!

[శరత్కాల మేఘము, చంద్రుఁడు, శ్వేతమందారము, ఫేనము (నురుఁగు), కాశ
(ఱెల్లు), ఘనసారము (కర్పూరము), హిమనగము...ఇవి యన్నియు ధవళవర్ణ (తెలుపు
రంగు) శోభితములే! ఇట్టి ధవళ వర్ణ శోభితయైన మాత "సరస్వతి" యిప్పుడు
మల్లెపూవునుం జూచినతోడనే నా మనోమందిరమునఁ బ్రత్యక్షమైనది!
ఇటుల నా తల్లి నా మదిలోఁ గనిపించుట, నా యదృష్టపు గొప్పతనము కాఁబోలును!!]

-:శుభం భూయాత్:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 10-01-2016
కవిత సంఖ్య: 34

శీర్షిక:- బహుముఖ ప్రజ్ఞాశాలి...విశ్వకవి...రవీంద్రుఁడు!

సీ.
"జన గణ మన" యంచు ♦ జాతీయగీతమ్ముఁ
....బ్రజల కిచ్చియు, మెప్పు ♦ వడసె నెవఁడు?
గీతాలలో భక్తి ♦ గీతాంజలి రచించి,
....నోబెలు బహుమతి ♦ నొందె నెవఁడు?
విశ్వకవీశుఁడన్ ♦ బిరుదుతో లోకాన
....ఖ్యాతి వహించిన ♦ ఘనుఁ డెవండు?
శాంతినికేతన ♦ స్థాపనమ్మునుఁ జేసి,
....లలితకళలఁ బెంచి, ♦ వెలిఁగె నెవఁడు?

గీ.
తానె ఠాగూరువంశ స♦త్కవివరుండు;
విశ్వభారతీ హృదయ సం♦వేద్యయోగి;
భరతమాతాఖ్య సత్పుత్ర♦వర విశిష్టుఁ,
డల రవీంద్రనాథుండు, ని♦ర్మలయశుండు!

-:స్వస్తి:-
***************************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 11-01-2016
కవిత సంఖ్య: 35

శీర్షిక:- శాంతమూర్తి గాంధీజీ!

సీ.
తెల్లవారల మత్తు ♦ దించంగ సమకట్టి
.....సత్యాగ్రహముఁ జేయు ♦ శాంతమూర్తి!
వర్ణభేదము లింక ♦ వలదంచు దళితుల
....."హరిజను" లని పిల్చు ♦ హవనమూర్తి!
"పేదలకే వస్త్ర ♦ మేది? నా కే" లంచు
.....నంగీల విడిచిన ♦ త్యాగమూర్తి!
దేశమంతయు మెచ్చు ♦ దేశనాయకుఁ డయ్యుఁ
.....బదవిఁ గోరనియట్టి ♦ భవ్యమూర్తి!
గీ.
జాతిపితయై చెలంగిన ♦ సాధుమూర్తి!
బాలలకు గాంధితాతయౌ ♦ భద్రమూర్తి!
స్వార్థ మించుకయును లేని ♦ యనఘమూర్తి!
యంజలింతు మహాత్మ! యో ♦ యమరమూర్తి!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 11-01-2016
కవిత సంఖ్య: 36

శీర్షిక:- పేద బాలలు!


సీ.
బాలికల్ చదివిన ♦ భవితకే వెలుఁగన
....ధనహీన బాలిక ♦ తట్ట మోసె!
తల్లిదండ్రుల చాటు ♦ పిల్ల యనంగను
....తలిదండ్రులకె యండ ♦ తాన యయ్యె!
చిదిమిన పాల్గాఱు ♦ చిఱుత వయస్సున
....బాలకార్మిక వృత్తిఁ ♦ బడయ వలసె!
బడిబాట పట్టెడి ♦ బాల్యమ్ము నందునఁ
....బరువిడి పనిబాట ♦ పట్ట నెంచె!
గీ.
సంపదలు గల్గు వారికే ♦ చదువు లాయె!
కటిక నిరుపేద కలలన్ని ♦ కల్ల లాయె!
బాలహక్కుల చట్టాలు ♦ వట్టి పోయె!
పసిఁడి బాలల బ్రతుకులు ♦ బండలాయె!!

-:స్వస్తి:-
**************************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 10-01-2016
కవిత సంఖ్య: 37

శీర్షిక:- భిక్షుకుని పశ్చాత్తాపము!

(నేఁడు నేను దారిలో నొక భిక్షుకునిఁ జూచిన తదుపరి నాలోఁ గలిగిన
భావపరంపరను భిక్షుక వేదన రూపమున వెలువరించితిని)

చం.
బ్రతికితి మున్ను డబ్బు గల♦వానిగ; గర్వముతో దరిద్రులన్,
మెతుకు విదుల్పకుండ, మఱి ♦ మిక్కిలి పాఱఁగఁ ద్రోలి, నవ్వితిన్!
హితము గనంగలేక, మద ♦ మెక్కియు, నెన్నఁడు దానధర్మముల్
మతిఁ దలఁపన్ సహింపకయె, ♦ మాన్యత వీడితి పుణ్యదూరునై!

తే.గీ.
బిచ్చగాండ్రను రాకుండ ♦ వెడలఁగొట్టి
పిసినితనమున ధనమును ♦ విరివిగాను
కూడఁబెట్టితి; నేనునుఁ ♦ గుడువకుండ!
దానహీనుఁడ నయ్యును, ♦ ధనికుఁ డైతి!

ఆ.వె.
ఇటుల రాత్రి పగలు ♦ హెచ్చగు మోహాన
తిండి తినక, ధనము ♦ దీక్షతోడఁ
గాయుచుంటి మిగులఁ ♦ గాపలదారుగా;
నొక్కనాఁ డలసితి ♦ మిక్కుటముగ!

కం.
నిదురింప, నొక్క చోరుం
డది గమనించియును నచటి ♦ నా ధనమంతన్
వెదకి వెదకి మొత్తము తన
మది మెచ్చఁగ దోచుకొనెను; ♦ మట్టియె మిగిలెన్!

తే.గీ.
నాఁటి నుండియు నేఁ బేద♦నైతి వినుఁడు!
ధనము, గర్వము తొలఁగించె ♦ దైవ మపుడు!
దానధర్మాలు సేయక ♦ ధనము నెపుడు
కూడఁబెట్టి, కావలదు భి♦క్షుకులుగాను!!

-:స్వస్తి:-
****************************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 11-01-2016
కవిత సంఖ్య: 38

శీర్షిక:- ఆఁడపిల్ల!

కం.
సిరి కలుగు నింతి పుట్టిన,
సిరి రూపము తానె, గిరిజ ♦ రూపము తానే,
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు ♦ మహిళయె కాదా !

తే.గీ.
“ఆఁడపిల్ల యేనాఁడును ♦ నాడ పిల్లె,
యీడ పిల్లయె కా” దంచు ♦ నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ ♦ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన ♦ వీను లలర !

తే.గీ.
కట్న మీయంగ లేమని, ♦ కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ ♦ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్ప ♦ ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ♦భ్రూణ హత్య !

-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-01-2016
కవిత సంఖ్య: 39

శీర్షిక:- స్వామి వివేకానందునకు నివాళి!

(నేఁడు వివేకానంద జయంతి సందర్భముగ నా మహాత్మునకు నివాళిగ నేను వ్రాసిన ఖండిక)

"ఱాలఁ బూజించు టేల? వి♦గ్రహములందు
దేవుఁ డుండునా?" యనుచు వా♦దించునట్టి
మూర్ఖుఁ డాళ్వారు నృపునకు ♦ మోహ మూడ్చి,
జ్ఞాన మందించినట్టి వి♦జ్ఞాని యతఁడు!

భరత సంస్కృతిఁ బరదేశ ♦ వాసులకును
జాటి చెప్పి, మెప్పించిన ♦ సాధు వతఁడు;
రామకృష్ణుని ప్రథమ వా♦రసుఁ డతండు;
శిష్యుఁ డిట్లుండునని చాటు ♦ శ్రేష్ఠుఁ డతఁడు!

భరత యువకుల దివ్యమౌ ♦ భవిత కొఱకు
బోధనలు సల్పి, వెలుఁగొందు ♦ బుద్ధుఁ డతఁడు;
హితము వివరించినట్టి న♦రేంద్రుఁ డతఁడు;
నతులు! తద్వివేకానందు♦నకు వినతులు!!

-:శుభం భూయాత్:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-01-2016
కవిత సంఖ్య: 40

శీర్షిక:-పరమపద సోపాన పటము


కం.
నిముసమునఁ బాము దిను, మఱు
నిముసము నిచ్చెనల నెక్కు ♦ నిక్కపుఁ గ్రీడన్,
శ్రమపడి యాడుచు నుండఁ, బ
రమపద సోపాన పటము ♦ రాగిలుచుండున్! (1)

కం.
సుమతులకు నాట యందున
సమమగు నిశ్శ్రేణితతులు, ♦ సర్ప కబళముల్!
కుమతులనుఁ బాము మ్రింగును;
గమనింపఁగ నిచ్చెనలు 'న'♦కారమ్మె యగున్! (2)

తే.గీ.
హితుల 'వైకుంఠ పాళి' స♦హిష్ణుతఁ గని,
యాడ, వైకుంఠుఁ డెప్పుడు ♦ నైక్య మంద
నీయఁ, డెంతయును ఘన ప♦రీక్ష సేసి,
పిదప నెగ్గించి, తన దరిన్ ♦ వేగఁ జేర్చు! (3)

ఆ.వె.
పిల్ల లాడు నాట, ♦ పెద్ద లాడెడి యాట,
నిచ్చెనలును పాము ♦ లిచ్చి పుచ్చు!
వారి వారి కర్మ ♦ పరిపాకమునుఁ బట్టి
ముందు వెనుకలుగను ♦ మోక్ష మొదవు!! (4)

-:శుభం భూయాత్:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-01-2016
కవిత సంఖ్య: 41

శీర్షిక:- భాను నిరీక్షిత పద్మిని!

ఆ.వె.
భానుఁ డుదయ మందె! ♦ భామినీ శ్వేత ప
ద్మమ్ము వికసనమునఁ ♦ దగ హసించె!
రమ్యమైన యట్టి ♦ రంగస్థలమ్మదె;
భాను భామినులకుఁ ♦ బ్రణయ కేళి!(1)

తే.గీ.
పత్ర రచిత వలయ శుభ ♦ ప్రాంగణమున
సూత్రధారుండు సూర్యుండు ♦ సుప్రభాత
గీతములు పాడ నేతెంచె ♦ కేళి కొఱకు!
రమణి ముఖపద్మము విరిసె ♦ రమణుఁ జూచి!!(2)

కం.
రమణి యఁట పుండరీకము;
సుమనోహర సూత్రధారి ♦ సూర్యుం డటకున్
రమణీయముగా ప్రణిధా
నము సేయఁగ బిడియమందె ♦ నళినమ్మపుడున్!(3)


తే.గీ.
రమణుఁ డంతట నునుముద్దు ♦ రమణి కిడఁగ,
ముఖము విప్పారె; సొబగులు ♦ మురిపెము లిడె!
ప్రకృతి కాంతాస్య మోహన♦రాగ యతికిఁ
జూపఱ సరసిక హృదయ ♦ సుమము విరిసె!!(4)

కం.
రమణీయ దృశ్యకావ్యము
కమనీయముగానుఁ దోచుఁ ♦ గవిమిత్రులకున్!
సమయమ్మిదె వర్ణనమున
సుమనోహర ధవళవర్ణ ♦ సుమ సరసి కడన్!!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

*************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-01-2016
కవిత సంఖ్య: 42

శీర్షిక:- దశావతారస్తుతి!

సీ.
వేదమ్ములనుఁ గాఁచి; ♦ మేదినీధర మోసి;
.....కాశ్యపిన్ ధరియించి; ♦ కశిపుఁ జీల్చి;
బలిని ముప్పాదానఁ ♦ బాతాళమున కంపి;
.....రాజన్యులనుఁ జంపి; ♦ రావణుఁ దన
యాశుగమ్మునఁ గూల్చి; ♦ యమునను వణికించి;
.....కారుణ్యమును నేర్పి; మ్లేచ్ఛుఁ ద్రుంచి;
దుష్టులఁ దునుమాడి; ♦ శిష్టులఁ జేకొని;
.....పాపులఁ బరిమార్చి; ♦ వసుధ నోమి;
గీ.
జన్మ నిచ్చియుఁ, బ్రతికించి, ♦ సమయఁ జేయు
మత్స్య, కూర్మ, కిటి, నరసిం♦హ, వటు, పరశు
రామ, రఘురామ,బలరామ, ♦ శ్రాంత బుద్ధ,
కల్కి రూపుండునౌ హరిన్ ♦ ఘనునిఁ గొలుతు!

-:శుభం భూయాత్:-
**************
గుండు మధుసూదన్
వరంగల్

*******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 13-01-2016
కవిత సంఖ్య: 43

శీర్షిక:- అంపశయ్య

(ఉత్తరాయణ పుణ్యకాలమందు భీష్ముని స్మరియించుట శుభావహమని యెంచి వ్రాసిన పద్యము)

భారతయుద్ధమందుఁ గురు♦వర్యుఁడు భీష్ముఁడు నేలఁగూల, దు
ర్వారనిషంగుఁ డర్జునుఁడు ♦ వచ్చి, పితామహుఁ డంపశయ్యనుం
గోరఁగ, నేర్పరించి, తన ♦ కోరిన గంగ జలమ్ము నిచ్చెఁ, గం
సారియు, ధర్మజుండు, నని♦లాత్మజుఁడున్, గవలెల్ల మెచ్చఁగన్!

-:స్వస్తి:-
**************
గుండు మధుసూదన్
వరంగల్

*******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 13-01-2016
కవిత సంఖ్య: 44

శీర్షిక:- గురుతరార్చక వృత్తి!

కం.
సూక్ష్మమున మోక్ష మిచ్చెడు
లక్ష్మీగణపతుల పూజ ♦ లక్షణముగ నా
నా క్ష్మాదేవులు సేతురు
పక్ష్మలితము లేక దృష్టిఁ ♦ బఱపుచు భక్తిన్!
(పక్ష్మలితము = ఱెప్పపాటు)

తే.గీ.
ధూపదీపనైవేద్యహా♦రోపచార
భూషణాభిషేకారాధ్య♦పూర్ణకుంభ
పూజనాదులు మఱియు దే♦వోత్సవములు
రథవిహారమ్ము లర్చక ♦ ప్రవరు లిడుచు!

ఆ.వె.
నిత్యజీవితమును ♦ నిర్మలామోదులై
గడపుచుందు రెలమిఁ ♦ గ్రమముగాను!
దైవభక్తితోడఁ ♦ దరతరమ్ములనుండి
యర్చ సేయుచుండి ♦ రర్చకు లిటు!!

-:శుభం భూయాత్:-
***************
గుండు మధుసూదన్
వరంగల్

*******************************************************************

అయుత కవితా యజ్ఞయు
స.క.-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 13-01-2016
కవిత సంఖ్య: 45

శీర్షిక: దాశరథి...కవితాశరథి!

నా తెలగాణ కోటి రతనమ్ముల వీణ యటంచుఁ బల్కి తా
నేతగనుండి పోరి చెఱనిల్చి "నిజాము పిశాచమా మహా
భూతమ"యంచుఁ బిల్చి మన పూర్వపుఁ దెల్గుల విల్వఁబెంచు ధీ
దాతయు శక్తియుక్తుఁడగు దాశరథిన్ స్మరియింతు నిప్పుడున్!

స్వస్తి

గుండు మధుసూదన్
వరంగల్

*******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 13-01-2016
కవిత సంఖ్య: 46

శీర్షిక:- విష్ణుస్తుతి

(శివ-హర-భవ-రుద్ర...పదములను అన్యార్థమున నుపయోగించుచు నేను చేసిన విష్ణుస్తుతి)

తే.గీ.
హరి! రథాంగపాశి! వనమా ♦లి! రవినేత్ర!
శార్ఙ్గధర! వరాహ! రమేశ! ♦ శంఖపాణి!
పద్మనాభ! వరాంగ! సు ♦వర్ణవర్ణ!
స్వభు! గరుద్రథరథ! చక్రి! ♦ పాహి పాహి!!

(గరుద్రథరథ=గరుద్రథుని[=గరుత్మంతుని] రథముగా [=వాహనముగా] గలవాఁడవైన ఓ విష్ణుమూర్తీ...అని యర్థము)


-:శుభం భూయాత్:-
***************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 13-01-2016
కవిత సంఖ్య: 47

శీర్షిక:- ఖాండవవన దహనము

(లంగా-లుంగీ-చీర-దోవతీ...పదములను అన్యార్థమున నుపయోగించుచు భారతార్థమున నేను వ్రాసిన పద్యము)

మత్తేభవిక్రీడితము(పంచపాది):
తరులం గాలిచి ఖాండవానఁ దగ నిం♦ద్రప్రస్థమన్ రాజధా
ని రచింపన్ మయు సాయమంది, బలులుం ♦ గీర్త్యాత్ములున్ రాజ్యపా
లురునై చీరఁగఁ, బాండునందనుల నా♦ల్గుం దిక్కులం గెల్వఁగన్
బురికొల్పంగను, నశ్వమేధమునకున్ ♦ బ్రోత్సాహియై దోవతీ
సి, రణోన్ముఖ్యవిజేతృ భాగ్యమొసఁగెన్ ♦ శ్రీకృష్ణుఁడే మాన్యుఁడై!!


-:శుభం భూయాత్:-
***************
గుండు మధుసూదన్
వరంగల్

*******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 13-01-2016
కవిత సంఖ్య: 48

శీర్షిక:- గాంధీజీ ఉద్బోధ

(సమంత-తమన్న-త్రిష-అనుష్క...పదములను అన్యార్థమున నుపయోగించుచు భారత స్వాతంత్ర్యోద్యమమునుం గూర్చి నేను వ్రాసిన పద్యము)

భారత ప్రజల నుద్దేశించి గాంధీజీ పలికిన మాటలు:

తేటగీతి:
"దుష్ట సితముఖుల్ సేసిన ♦ దోసమంతఁ
గదలఁ ద్రోలి, భరతమాతఁ ♦ గాఁతమన్న;
భారత స్వతంత్ర త్రిష♦వణముఁ జేయ
వలయు ధానుష్క దీక్షిత ♦ స్వరువు వోలె!"

(తెల్లదొరలను పాఱఁద్రోలుటకు "భారతస్వాతంత్ర్యోద్యమ యజ్ఞము"ను [ధనుర్వేదమును దీక్షతో సాధనఁ జేయు ధానుష్కులవలె] చేయవలెనని గాంధీజీ భారతీయులనుం గోరినాఁడని భావము)

-:శుభం భూయాత్:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 13-01-2016
కవిత సంఖ్య: 49

శీర్షిక:- పాండవులు శ్రీకృష్ణుని వేడుట!

(క్రికెట్టు-కబాడి-టెన్నిసు-హాకీ...పదములను ఉపయోగించి భారతార్థమున నేను వ్రాసిన పద్యము)


భారతయుద్ధానంతరము పాండవులు తమకుం గలిగిన కీడు నుపశమింపఁజేయుమని శ్రీకృష్ణు నుద్దేశించి ప్రార్థించిన సందర్భము:

తేటగీతి(పంచపాది):
చక్రి కెట్టులో మదిమెచ్చు ♦ సరసమైన
భక్తి గీతిక బాడిరి ♦ పాండు సుతులు
"సూనృతమ్మైన మాటెన్ని ♦ సుగతుల నిడె
నో సహస్రబాహా! కీడు ♦ నుపశమింపు!"
మనుచు కైమోడ్పులం గూర్చి ♦ వినమితులయి!

-:శుభం భూయాత్:-
***************
గుండు మధుసూదన్
వరంగల్

*******************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-01-2016
కవిత సంఖ్య: 50

శీర్షిక:- విష్ణుస్తుతి!♦

శిఖరిణీ వృత్తము:
పరేశా! పర్జన్యా! ♦ ప్రణవ!ఫణితల్పా ! ♦ ప్రభు! హరీ!
ధరాధుర్యా! శ్రీశా! ♦ ధర! నృహరి! దై ♦త్యారి! కపిలా!
మురారీ! ప్రాగ్వంశా! ♦ పురుషవర! సం♦పూజ్య! దివిజా!
వరాహా! శ్రీవత్సా! ♦ పరమపురుషా! ♦ ప్రాణద నమః!!

...శ్రీ మహావిష్ణు కృపా కటాక్ష ప్రాప్తిరస్తు...

-:శుభం భూయాత్:-
********************
గుండు మధుసూదన్
వరంగల్


******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-01-2016
కవిత సంఖ్య: 51

శీర్షిక:- పారిజాతాపహరణ ఘట్టము!

స్తగ్ధరా వృత్తము:
దేవోద్యానిన్ భటాలుల్, ♦ దివి తరులు కనన్, ♦ దివ్యవృక్షమ్ముఁ గొంచు
న్వేవేగన్ దాఁ జనంగన్; ♦ విదిత తరు లతల్ ♦ విష్ణుఁ బ్రార్థించి, "రీవున్
బోవ"ద్దంచున్, బతిన్ వే ♦ ముదితలు పిలువన్, ♦ బోవు ప్రాణేశు వోలెన్
భావింపంగన్ గుజమ్మున్ ♦ బలువిధములుగన్ ♦ బారిజాతమ్మునాపెన్!

-:శుభం భూయాత్:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-01-2016
కవిత సంఖ్య: 52

శీర్షిక:- లక్ష్మీస్తుతి!

మేఘవిస్ఫూర్జిత వృత్తము:
రమా! లక్ష్మీ! క్షీరాబ్ధ్యధిపతిసుతా! ♦ రమ్య! సంస్తుత్య వంద్యా!
నమో దేవీ! సంపత్ప్రద! సుచరితా! ♦ నన్ గటాక్షించు మాతా!
సమీక్షింతున్ పద్మాసన! సువదనా! ♦ సత్యమౌ నాదు భక్తిన్!
క్రమమ్మీవున్ సంపత్కరివియవుటన్ ♦ గాంక్షితమ్మీవె తల్లీ!!

-:శుభం భూయాత్:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-01-2016
కవిత సంఖ్య: 53

శీర్షిక:- శ్రీకృష్ణదేవరాయలు!

సీ.
అష్ట దిగ్గజ కవు ♦ లాహ్లాదమును గూర్చ
......భువన విజయ మేలు ♦ భూపుఁ డెవఁడు?
ఆముక్త మాల్యద ♦ నలవోకగా రచి
......యించి, యాంధ్ర కవుల ♦ మించె నెవఁడు?
జాంబవ త్యుద్వాహ ♦ సత్యావధూ ప్రీణ
......నముల సంస్కృతమున ♦ నడపె నెవఁడు?
దేశ భాషల యందుఁ ♦ దెలుఁగు లెస్స యటంచు
......నెలుఁ గెత్తి చాటిన ♦ నేత యెవఁడు?
గీ.
అతఁడె "మూఱు రాయర గండ", ♦ "ఆంధ్ర భోజ",
"సాహితీ సమరాంగణ ♦ సార్వభౌమ"
బిరుదు లందియు, వెలిఁగిన ♦ వీర వరుఁడు;
నతఁడె శ్రీకృష్ణదేవరా♦యలు ఘనుండు!

కం.
ఇరు ప్రక్కల దేవేరులు
మురిపెముఁ దీర్పంగ నడుమ ♦ మోదము తోడన్
వర విగ్రహ రూపెత్తెను
దిరుమల వేంకట నగేశు ♦ దేవళ మందున్!

తే.గీ.
తెలుఁగు భాషను సత్కావ్య♦ములును వెలయఁ
గవులఁ బోషించి, మించి, స♦త్కార మెలమిఁ
జేసి, సభలోనఁ బ్రజల రం♦జింపఁ జేసి,
కృష్ణ రాయఁడు స్వర్ణ యు♦గేంద్రుఁ డయ్యె!

-:శుభం భూయాత్:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-01-2016
కవిత సంఖ్య: 54

శీర్షిక:- యమ సావిత్రుల సంవాదము!

(సత్యవంతుని ప్రాణములఁ గొనిపోవుచుండఁగాఁ దన్ను వెంబడించిన సావిత్రితో యముఁడు పలికిన మాటలు)

ఉత్పలమాలిక:
"ఎందుల కిన్ని బాధల స♦హింతువు? మద్రసుతా! యముండ నే!
నిందునిభాస్య! నీ మగని ♦ నిట్టుల నేఁ గొనిపోవ, నీ విటుల్
సందడిఁ జేయుచున్ వెత వ♦సమ్మున వెంటఁ బడంగ రాదు! కొ,
మ్మింద, వరమ్ము నిత్తు, నిఁక, ♦ నీశుని ప్రాణముఁ దక్కఁ గోరి, యే
కొందలపాటు లేక యిఁకఁ ♦ గూర్చుమ నాకుఁ బ్రమోద మి" ప్డనన్,
ముందుగఁ గోరె స్వశ్వశురు ♦ పూర్వపు వైర్యపహార్య రాజ్యమున్,
సందియ మింక లేక వరు♦సన్ గనె మామను లబ్ధచక్షుగన్!
గుందుచు వెన్కఁ బోవ, హరి ♦ గొబ్బున నింకొక కోర్కెఁ దీర్పఁ, దం
డ్రిం దగఁ బుత్ర సచ్ఛతుని♦నింగ నొనర్పఁగ, నట్లె రాఁగఁ దాఁ
జిందులు ద్రొక్కుచున్ "ముదిత! ♦ శ్రేష్ఠతమాంచిత సద్వరమ్మునున్
బొందియు వత్తువేల? యిఁకఁ ♦ బోఁగదె!" యంచు ననంగ, నామెయున్
"ముందుగ రెండు కోర్కెలిడి ♦ ముద్దునుఁ గూర్చితి విప్డు! నీ విఁకన్
వందన మంది, మూఁడవది ♦ వద్దనకుండ మహాత్మ, యీయు!" మం
చుం దన కోర్కి నీయుమన, ♦ సూర్యజుఁ డప్పుడు "సాధ్వి! నేఁడు నా
డెందము సంతసించె! నిదె ♦ డిగ్గన నిచ్చెద! నాథు ప్రాణముల్
వొందఁగఁ గోరఁబోక మఱి ♦ వొందుమ వేఱొక కోర్కి" నన్న నా
ముందఱ భర్తఁ గాంచియు, య♦మున్ దగఁ గోరెను "దండపాణి! నా
కుం దగు తోడుఁ గొంటి! మది ♦ కుందె! సుపుత్రుని నా కొసంగియున్
విందునుఁ గూర్చుమయ్య!" యన, ♦ వెంటనె దండి "తథాఽ"స్తనంగ, నా
నందముతోడ, "సౌరి! యెటు ♦ నందెద సంతతి? మానవాంగనల్
వొందెద రెట్లు సంతతిని ♦ వోఢను వీడియు లోకమం?"దనన్,
దొందరపాటుఁ గన్గొనియు ♦ దున్నవయాళికుఁ డంత "సాధ్వి! నీ
సుందర సూక్ష్మ వాక్ప్రతతిఁ ♦ జూడ మహాద్భుతమయ్యె! సంతసం
బందితిఁ! బుత్రపౌత్రయుత♦వై సుఖియింపుము భర్తతోడ! నే
నుం దగఁ బోయి నా విధుల♦నుం దగఁ దీర్తు! శుభమ్ము నీ విలన్
బొందు!"మటంచు దీవెనలు ♦ పొందుగ నిచ్చి యగోచరుండయెన్!
జెందొవ చూపు లందముగఁ ♦ జిత్రపు నాట్యములాడఁ దాను స్వా
మిం దమితోడఁ జూచుచు గ♦మించిన తత్కథనంత భర్తకున్
సుందరమైన రీతి విన♦సొంపగునట్లు వచించె! నిర్వురున్
మందగమమ్ములేక కర ♦ మందిరి భోగము పూర్వ రీతిగన్!!

-:శుభం భూయాత్:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 55

శీర్షిక:- సంగ్రహ రామాయణము! (రకారము లేకుండ)

(1)
తపసి వాల్మీకి లిఖిత స♦త్కావ్యనేత,
సీతతో, లక్ష్మణునితో వ♦సింప నడవి,
దశముఖుఁడు సీతఁ గొంపోవ, ♦ స్పశముఁ జేసి,
వాని వధియించి, చెలిఁగొని, ♦ పావనుఁడయె!

(2)
పుట్టపుట్టువు కన్నట్టి ♦ పొత్తపుఁ బతి
జన్నమునుఁ గాచి, విల్తున్మి, ♦ జానకి మను
వాడి, వనికేగి, యిల్లాలి ♦ బందెవట్టు
వాని నొంచి, గేహినిఁ గొని, ♦ పావనుఁడయె!

-:శుభం భూయాత్:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 56

శీర్షిక:- పద్మవ్యూహమం దభిమన్యుని శౌర్య ప్రదర్శనము!

(ప-ఫ-బ-భ-మ...అక్షరములు, వాని గుణితాక్షరములు లేకుండ)

[కౌరవులు పద్మవ్య్హూహమం దభిమన్యుని కుటిల తంత్రముతో సంహరించిన ఘటనకు విస్మయము చెందిన పాండవసేన మనోవేదనఁ జెంది తమలోఁ దాము మాట్లాడుకొనిన సందర్భము]

శార్దూలవిక్రీడితము:
"చక్రవ్యూహ సువేశితుం దతధను♦ర్జ్యాసక్త నారాచ ధా
రాక్రాంతాంచిత శత్రు నిర్జిత యత♦ద్ద్రాఘిష్ఠ సన్నద్ధ యు
ద్ధ క్రీడావిహరద్ఘనవ్రతయుతుం ♦ దచ్ఛౌరి స్వస్రీయుఁడౌ
నా క్రీడిద్రుహుఁ గౌరవుల్ గుటిల తం♦త్రానన్విఘాతింతురా?"

-:శుభం భూయాత్:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 57

శీర్షిక:- కాకాసుర వృత్తాంతము!
(క-ఖ-గ-ఘ-ఙ...అక్షరములు, వాని గుణితాక్షరములు లేకుండ)

తేటగీతి (మాలిక):
దుష్ట వాయస రూప దై♦త్యుండు మైథి
లిని వ్యధితఁ జేయ, రాముండు ♦ వ్రీతి దర్భఁ
జేత నంది బ్రహ్మాస్త్రముం ♦ బూత మంత్ర
సహితనున్ విడువ, నదియు ♦ సాల్వుఁ జంప
వెంటఁబడఁ బరువెత్తుచు ♦ భీతిఁ ద్రిభువ
నమ్ములను సంచరించుచు ♦ "నన్నుఁ బ్రోవు"
మంచుఁ బిలువ, నెవ్వండు నో♦మను, దరిఁ జనఁ
దెంపు సేయనుఁ బుయిలోడఁ, ♦ దెలిసి వాఁడు
మఱలి శ్రీరాము "శరణ మి"♦మ్మనుచు వేడ,
"దానిని మఱలింపను నసా♦ధ్య"మ్మటంచు,
నతని దేహాంశ మిచ్చిన ♦ నదియు శాంతిఁ
బొందునన, నేత్రమును నిచ్చి, ♦ పోయినాఁడు,
తనదు తప్పును మన్నింపు ♦ మనుచు వేడి!!

(ఇది కాకాసురవృత్తాంతము)

-:శుభం భూయాత్:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 58

శీర్షిక:- రామరావణ యుద్ధ ఫలితము! ("ర"కారము వాడకుండ)

కం.
సీతాపతిహస్తతృణత
శాతపృషత్కోద్విఘాత♦సంహతిశక్తిన్
దైతేయపతియె హతుఁడయె
సీతాస్తేయాత్యయకృత♦శిక్షితుఁడగుచున్!!

దీనికిం బ్రతిపదార్థము:
సీతాపతి=సీతాదేవి పతియగు శ్రీరామునియొక్క
హస్త=చేతియందలి
తృణత=కోదండమునుండి విముక్తములైన
శాత=వాడియైన
పృషత్క=బాణములయొక్క
ఉత్+విఘాత=బలమైన తాఁకిడులయొక్క
సంహతి=సమూహములయొక్క
శక్తిన్=శక్తిచేత
దైతేయపతియె=రాక్షస రాజైన రావణుఁడే
సీతా=సీతాదేవిని
స్తేయ=అపహరించుట యనెడి
అత్యయ=దోషముతోఁగూడిన
కృత=కార్యమునకు
శిక్షితుఁడు+అగుచున్=శిక్షింపఁబడినవాఁడగుచు
హతుఁడు+అయెన్=చంపఁబడినవాఁడాయెను
భావము: శ్రీరామచంద్రుని చేతియందలి కోదండమునుండి వెడలిన నిశిత బాణపరంపరల శక్తి్చేత, సీతాపహరణ మను దోషకృత్యమునకు శిక్షింపఁబడినవాఁడై, దైత్యేంద్రుఁడైన రావణుఁడే హతుఁడైనాఁడు!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 59

శీర్షిక:- సతీ సావిత్రి పాతివ్రత్యము! (శ-ష-స-హ...లను వాడకుండ)

ప్రథమ పద్యము:
||సీ||
మద్రభూపతిపుత్రి ♦ మగని ప్రాణమ్ములఁ
.....దిరిగి కొంటకు వెంట ♦ నరుగఁగాను,
యమధర్మరా జప్పు ♦ డామె నాపఁగ నామె
.....తల్లిదండ్రులకుఁ బు♦త్రవరమిడెను;
మఱల వెన్నాడంగ ♦ మఱియొక్క వరముతో
.....మామకు దృ గ్రాజ్య ♦ మందఁగ నిడె;
పిమ్మట వెన్నాడఁ ♦ బెనిమిటి ప్రాణమ్ముఁ
.....దక్క నడుగుమనఁ ♦ దనకుఁ బుత్రు

||గీ||
నిడు మటంచునుఁ గోర య♦ముఁ డటులె యిడఁ
"బతియు లేకుండఁ బడతులుఁ ♦ బడతు రెట్లు
నందనులఁ? గాన, దయతోడ ♦ నాదు మగని
ప్రాణ మిడుఁ"డని మెప్పించి ♦ పతినిఁ గొనెను!!

ద్వితీయ పద్యము:
||కం||
యము వెన్నాడి, పిత కప
త్యము; మామకు నయన రాజ్య ♦ ధనముల్; తనకున్
దమిని నిడఁ బుత్రుఁ; "బతిని ని
డమి నెట్లగు" నని, పతిఁ గొని ♦ ధన్యగ వెలిఁగెన్!!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 60

శీర్షిక:- సత్య హరిశ్చంద్రుని వ్యక్తిత్వము! (ద్విత్వ సంయుక్తాక్షరములను వాడకుండ)

||సీ||
ఇరుమూఁడు పుడమి కా ♦ పరులందు మొదటి వాఁ
.....డయి, నిజమరియైన ♦ ధవళితయశుఁ;
డాడిన మాటకై ♦ యడలక యడరెడు
.....నాడిక విడనాడు ♦ నయవిదుండు;
తనను వెంటాడెడు ♦ ధరణీసురుని ఘన
.....ఋణముఁ దీరుపఁ జను ♦ ఋజుగమనుఁడు;
తన సతీసుతుల నా ♦ దరమునఁ గొనఁగాను
.....విపణివీథిని వేడు ♦ వినయధనుఁడు;
తన వెలనిడఁగాను ♦ తానె చండాలు సే
.....వకుఁడైన కాటికా ♦ పరి యతండు;

||గీ||
ఉరగ దంశనమునఁ దన ♦ యుండుఁ జావఁ
గాటి సుంకముం గోరిన ♦ కారయితుఁడు;
సతిని నేరాభియోగానఁ ♦ జంపుమనెడి
రాజునానతిఁ దలనిడు ♦ రతన మతఁడు!!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 61

శీర్షిక:- భరతమాత!
(1.మొదటి పాదమున "క"వర్గాక్షరములు;
2.రెండవ పాదమున "చ"వర్గాక్షరములు;
3.మూఁడవ పాదమున "త"వర్గాక్షరములు;
4.నాలుగవ పాదమున "ప"వర్గాక్షరములు
...వాడకుండ)


తేటగీతి:
1)శిరము హిమధామ సుందర ♦ వర మహాద్రి!
2)పాదముల్ మహాలవణాబ్ధి! ♦ భవదుపమిత
3)రూపవైశాల్య మరసి, ♦ కారుణ్యశీలి!
4)వైరులుం గొనఁ, ద్రోలిరి ♦ వీర సుతులు!

సీ.
1)అమ్మ భారతమాత! ♦ హారతులందింతు
....నంది యానందమ్ము ♦ నందఁజేయ,
2)మమ్ము దోషములేని ♦ మార్గాన నడిపియు
....నుత్తమోత్తమ సుతు ♦ లుత్తములని
3)మెచ్చుచుఁ బరరాజ్య ♦ మేలువారలు వేగ
...మిటకడుగిడి చూచి ♦ మేర మఱచి
4)యానంద వశులయి ♦ యాహా యటంచును
....నిన్నుఁ గీర్తించఁగా ♦ నిఖిల జగతి

గీ.
1)లోనఁ బేరెన్నఁబడ నెప్డు ♦ భానుమండ
2)లోన్నత ప్రభా సహిత వి♦లోకనములఁ
3)గరుణఁ జూచుచు మమ్ముఁ బ్ర♦కట విశాల
4)జీవులనుఁ జేయ వినతి సు♦స్నిగ్ధవదన!!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 62

శీర్షిక:- టంగుటూరి ప్రకాశము పంతులు!
(ట-ఠ-డ-ఢ-ణ అక్షరములను వాడకుండ)

పేదరికాన జన్మ, గురు♦వే ఘనదైవము, తల్లి వేదనే
ఖేదము, విద్యలే విజయ♦కేతనముల్, తన దేశభక్తియే
మోదము, దేశసాధనయె ♦ ముఖ్యము, దిక్కయె లేనివారి, కే
భేదము "లాంధ్రకేసరి"గఁ ♦ బెద్దను జేసిన వీ ప్రకాశమున్?

(ఆంధ్ర-కేసరిగ, ఆంధ్రకే-సరిగ)

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 63

శీర్షిక:- గణపతి స్తుతి!
(గుర్వక్షరములను వాడకుండ)

ఆటవెలఁది:
ప్రమథగణ యుత! గణ♦పతి! గజముఖ! శివ
తనయ! సుముఖ! వరద! ♦ ధవళ వపుష!
ఖనక రథిక! పరశు♦కర! హరిహయ! ఘన!
కలుము లిడుచు జనులఁ ♦ గరుణఁ గనుమ!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-01-2016
కవిత సంఖ్య: 64

శీర్షిక:- అధికులతో స్పర్థ...అనర్థ హేతువు!
(పద్యకథ)

కం.
అనఁగనఁగ నొక సరస్సునఁ
గన నగుఁ బలు హంస లెపుడు ♦ కలకల నగుచున్
వనరుహ కాండములఁ దినుచు
దినమంతయుఁ గడపుచుండు ♦ దివ్యగతులతోన్!(1)

ఆ.వె.
ఆ సరస్సు ప్రాంత♦మందలి కుజముల
పై వసించుచుండెఁ ♦ బలు ద్వికములు!
దినదినమ్ము నవియు ♦ దివి విహారులునైన
హంస గమనములను ♦ నఱయుచుండు!(2)

తే.గీ.
వాని తెల్లందనమ్ములు ♦ వాని పలుకు
లెంత హృదయంగమములంచు ♦ వింతఁ గనునొ,
దమ కురూపముల్ కూఁత లం♦తగను రోఁతఁ
బుట్టఁ జేయునని విసుగు ♦ పుట్టఁ దెగడు!(3)

కం.
హంసల గర్వము నణచఁగ
హింసనుఁ బూనియును నైన ♦ హేయమొనర్పన్
గంసారి నలుపు గల యా
హంసారులుఁ దలఁచుచుండె ♦ నవగుణ కుమతుల్!(4)

తే.గీ.
ఒక్క దినమున నొక యంచ ♦ తెక్కరముగ
నడచి వచ్చుట నా పిశు♦నములు గాంచి,
“యేమి మీగొప్ప? మావలె ♦ నెగురఁ గలరె?
పందెమునుఁ గాచి, గెలుపొంద ♦ వలయు”ననియె!(5)

తే.గీ.
“నాకు నీతోడఁ బందెమా?” ♦ నగుచు నంచ
యనఁగ, “భయపడుచుంటివా?” ♦ యంచుఁ గాకి
వంకరగ, టింకరగఁ దాను ♦ పల్టికొట్టి,
“నన్ను గెలుతువే?”యన హంస ♦ నగి యొడఁబడె!(6)

తే.గీ.
కాకి ముందుగా నాకాశ ♦ గమన యయ్యు
వెనుక వచ్చెడి యంచను ♦ వెక్కిరించె!
హంస మేఘమండలమును ♦ నందుకొనఁగఁ
జనుచు నుండఁగఁ గాకియుఁ ♦ జనెను పైకి!(7)

ఆ.వె.
హంసవేగమపుడు ♦ నందుకొనంగను
వాయసమ్ము విఫల♦మాయె, నటులె
కనులు బైర్లు గ్రమ్మెఁ, ♦ గనుమూసి తెఱచిన
యంతలోనఁ గ్రింద ♦ నబ్ధిఁ గూలె!(8)

కం.
సాగరమందునఁ గూలియు
“వాగితి నే బుద్ధిలేక ♦ వక్రపుఁ గూఁతల్,
నా గర్వము ఖర్వమయెన్
వేగముగా శరధినుండి ♦ విడిపింపు”మనన్;(9)

తే.గీ.
జాలిపడి హంస కాకిని ♦ సంద్రము వెడ
లింపఁ జేసి, వీపున మోసి, ♦ కొంపఁ జేర్చె!
కాకి “గొప్పవారలతోడఁ ♦ గయ్యము వల
దంచుఁ దెలిసెను! నన్నుమ♦న్నించు”మనియె!!(10)

(హంస మన్నించి కాకినిఁ దన స్నేహితునిగఁ జేసికొనెను. ఇరువును సుఖముగ నుండిరి)


-:శుభం భూయాత్:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 17-01-2016
కవిత సంఖ్య: 65

శీర్షిక:- సానీ! నీ సాటి కలరె సాధ్వుల లోనన్!
(సమస్యాపూరణము)

కం.
జ్ఞాన ప్రదాత్రి! మాతా!
గానము సాహిత్యము నిడి, ♦ కాచెడి తల్లీ!
యో నుడువుల చదువుల దొర
సానీ! నీ సాటి కలరె ♦ సాధ్వుల లోనన్?

-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 17-01-2016
కవిత సంఖ్య: 66

శీర్షిక:- శ్రీహరి మకరినిఁ గాచెనా?
(సమస్య:-మకరినిఁ గాచె శ్రీహరియె, ♦ మానస మందున సంతసించుచున్!)

“అకట! మదీయ హృత్స్థిత మ♦హార్తి విదారక! కావు మయ్య!!”నాన్;
బ్రకటిత భక్తి మెచ్చుచును ♦ వచ్చియుఁ, జక్రముచేత నక్రమున్
వికలముఁ జేసి, భక్తునకు ♦ వేదన డుల్చియు, నా “గజేంద్ర నా
మ” కరినిఁ గాచె శ్రీహరియె, ♦ మానస మందున సంతసించుచున్!

-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 17-01-2016
కవిత సంఖ్య: 67

శీర్షిక:- అత్తాకోడండ్రు!
(సమస్య:- కోడలా! నాదు పతి నీకుఁ ♦ గొడుకు గాదె!)

(సాగరునకు భార్యయైన గంగకుఁ జంద్రుఁడు, శివుఁడు నిద్దఱునుం గొడుకు వరుస యౌదురు. విష్ణు పాదోద్భవయైన గంగ పార్వతికిం గోడలు వరుస కావలెను. ఈ వరుసల ననుసరించి పార్వతి గంగతోఁ జమత్కరించు సందర్భము)

తే.గీ.
"సాగరున కీవు వలచిన ♦ సతివి; మఱియుఁ
జంద్రుఁడే నాకు మఱఁది; యా ♦ శంకరునకు
నతఁడు తమ్ముఁడు; విష్ణువౌ ♦ నన్న నాకుఁ;
గోడలా! నాదు పతి నీకుఁ ♦ గొడుకు గాదె!!"

-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 17-01-2016
కవిత సంఖ్య: 68

శీర్షిక:- శివుని నిర్వాహకము!
(సమస్య:- శ్రీ రమణీ లలామ నెదఁ ♦ జేర్చినవాఁడు శివుండె! శంభుఁడే!!)

మొదటి పూరణము:
మార రిపుండు గోవుగను ♦ మారియు, దుగ్ధము నీయకున్నఁ, దా
దారగ చోళభూపతి సు♦తన్ దగ నెట్టుల పొందునో? కనన్
శౌరికి శ్రీనివాసునకు ♦ సాధు జనార్చన వందనాలికై
శ్రీ రమణీ లలామ నెదఁ ♦ జేర్చినవాఁడు శివుండె! శంభుఁడే!!
(శ్రీనివాసుని యెదకు లక్ష్మీదేవినిం జేర్చుటకుం గారకుఁడు శివుఁడేయని భావము)

*** *** *** ***

మఱొక పూరణము:

కూరిమి నా గజాసురుఁడు ♦ కోరియు దేవతలన్ మహాపదన్
గూరఁగఁ జేయ, వారు హరు ♦ గొబ్బునఁ జేరియు, రక్ష వేడ, నా
గౌరు శిరమ్ముఁ ద్రుంచియుఁ, ద్వ♦గంబరముం గొని, వేగ నిర్వృతి
శ్రీ రమణీ లలామ నెదఁ ♦ జేర్చినవాఁడు శివుండె! శంభుఁడే!
(శివుఁడు గజాసురునకు మోక్షలక్ష్మి నెదఁ జేర్చినాఁడని భావము)


-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 17-01-2016
కవిత సంఖ్య: 69

శీర్షిక:- మందోదరీ రావణుల ప్రేమ!
(సమస్య:-రంభా రావణుల ప్రేమ ♦ రమ్యము జగతిన్!)

కం.
శుంభన్ముఖి మందోదరి
రంభోరు మహేప్సితార్థ ♦ రంజిత మదనో
జ్జృంభద్ధృద్రాగోత్ప్రా
రంభా రావణుల ప్రేమ ♦ రమ్యము జగతిన్!

దీనికిం బ్రతిపదార్థములు:
*శుంభత్+ముఖి=ప్రకాశించెడునట్టి ముఖము కలిగినదియు;
*రంభోరు=అరఁటి బోదెల్ వంటి ఊరువులు కలిగినదియు;
*మదన+ఉత్+జృంభత్+రాగ+ఉత్+ప్రారంభ=మదనుఁడు విజృంభించుటచే (రావణునిపై) నారంభమైన ప్రేమ కలదియు;
*మహా+ఈప్సిత+అర్థ=(రావణుం డడిగిన)గొప్ప కోరిక (పెండ్లాడు మనెడి కోరిక) నిచ్చుటచే;
*రంజిత=(అతనిని) సంతోషపెట్టినదియు నగు;
*మందోదరి=మండోదరి యొక్కయు;
*రావణుల=రావణుని యొక్కయు;
*ప్రేమ=అనురాగము;
*జగతిన్=ఈ ప్రపంచములోననే;
*రమ్యము=మనోహరమైనది కదా!
********************
-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 17-01-2016
కవిత సంఖ్య: 70

శీర్షిక:- పంచముఖాంజనేయ స్తుతి!
(సమస్య:- వక్త్రంబుల్ పది గలిగిన♦వానికి జేజే!)

(వక్త్రమనఁగా నోరు, మొగము అని రెండర్థా లుండుటచే పంచముఖాంజనేయుఁడు...[ఐదు మొగములు, ఐదు నోళ్ళు] మొత్తము పది వక్త్రములున్నవాఁడని చెప్పుట)

కం.
వక్త్రాననములు గలసియు
దిక్త్రారాతి శిర సమము! ♦ తిరమె హనుమకున్!
వాక్త్రాసం బెది లే; దా
వక్త్రంబుల్ పది గలిగిన ♦ 'వానికి' జేజే!

భావము:- నోళ్ళు, మొగములుం గలసి (పది యగుటచే) యా వక్త్రములు రావణుని వదనములతో సమానము. ఈ వక్త్ర సంఖ్య హనుమంతునకు స్థిరమే కదా! ఈ విషయమును గట్టిగఁ జేప్పుటకు భయమేమియును లేదు! అందులకే, యా పది వక్త్రములు కలిగినవాఁడైన పంచముఖాంజనేయునకు జోతలు!!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-01-2016
కవిత సంఖ్య: 71

శీర్షిక:- మత్స్యావతార కథ!

ప్రథమ కథ (భాగవత పురాణాంతర్గతము):

తే.గీ.
సోమకాసురుఁ డనెడి య♦సురుఁ డొకండు
నాల్గు వేదమ్ములను దాచె ♦ నబ్ధి లోన!
హరియ మత్స్యావతారుఁడై ♦ యసురుఁ జంపి,
కాచె వేదమ్ములను; నిల్పె ♦ ఘనత భువిని!

*******************************

ద్వితీయ కథ (మత్స్య పురాణాంతర్గతము):

కం.
వైవస్వత మనువొక దిన
మా విశ్వేశ్వరున కపుడు ♦ నర్ఘ్యం బిడఁగన్;
ఠీవిగను మత్స్య మొక్కటి
"కావుమ న"న్నంచుదుమికె ♦ కమికిలి లోనన్!(1)

తే.
కరుణతో రాజు దానిని ♦ కలశమందు
విడిచె; మఱునాఁడు చేపయుఁ ♦ బెరిఁగిపోయి,
"నన్ను రక్షింపు"మని కోర ♦ నపుడు నొక్క
నూఁతిలోఁ జేర్చె రాజు సం♦తోషముగను!(2)

ఆ.వె.
మఱు దినాన మీన ♦ మా నూఁతి లోపలఁ
దిరుగ రాక యున్నఁ ♦ దిరిగి ప్రభుని
వేడె "మఱల నన్ను ♦ వేఱొక్క చోటున
విడువ వలయు"నంచుఁ ♦ బ్రేమ తోడ!(3)

కం.
రాజటులె దానిఁ జెఱువున
రాజిలఁగా విడువ,మఱలఁ ♦ గ్రక్కునఁ బెరిఁగెన్!
సాజముగ రాజపు డా
యోజన విస్తీర్ణ మత్స్య ♦ ముదధిని జేర్చెన్!(4)

ఆ.వె.
చేర్చి యిటులఁ బలికె, ♦ "శ్రేష్ఠమౌ మీనమా!
నీవు రాక్షసుఁడవొ, ♦ యీశ్వరుఁడవొ
యెఱుఁగఁ జాలఁ జెపుమ, ♦ యెవఁడ వీ"వనవుడుఁ
దా జనార్దనుఁడ న♦టంచుఁ బలికి;(5)

తే.గీ.
"రాజ! నూఱేండ్ల పిదపఁ బ్ర♦ళయము వచ్చు;
నట్టిచో సర్వ సత్త్వమ్ము ♦ లటులె నాల్గు
వేదములనొక్క నావలోఁ ♦ బ్రోది సేసి,
నాదు శృంగానఁ గట్టు మో ♦ యనఘ చరిత!"(6)

కం.
అనుచు నదృశ్య మ్మాయెను;
మనువును దానటులె సక్ర♦మమ్ముగఁ జేయన్
ఘనముగను జీవతతి పుడ
మిని వర్ధిలెను; మనువునకు ♦ మేనుప్పొంగెన్!(7)

- :శుభం భూయాత్ :-
*************************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-01-2016
కవిత సంఖ్య: 72

శీర్షిక:- వరాహావతార స్తుతి!

అల దేవాసుర యుద్ధమందున హిర♦ణ్యాక్షుండు సంక్షుబ్ధ కృ
ద్విలయమ్మున్ సృజియింప నెంచి, యల పృ♦థ్విన్ జుట్టఁగాఁ జుట్టియున్
జలధిన్ ముంచ; వరాహరూపుఁడయి, యా ♦ సర్వంసహ న్గాచి , త
త్కలధౌతాక్షు వధించినట్టి హరికిం ♦ గైమోడ్పు లందించెదన్!
\
- :శుభం భూయాత్ :-
*************************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-01-2016
కవిత సంఖ్య: 73

శీర్షిక:- నృసింహావతార స్తుతి!

జననీ గర్భిత విష్ణుభక్తిపరుఁడై; ♦ సద్వంద్యుఁడై; తండ్రికిన్
దన హృత్స్థేశ్వరుఁడౌ హరిం దెలుపఁగన్, ♦ దైత్యేంద్రుఁ డుగ్రుండునై
చని, గర్వమ్మున విష్ణుఁ జూపు మనుచున్, ♦ స్తంభమ్మునున్ మోదఁగన్,
వనజాక్షుండు నృసింహ రూపుఁ డయి త♦త్ప్రహ్లాదుఁ గావంగ, త
ద్దనుజేంద్రున్ జఠరమ్ముఁ జీల్చె ఘనుఁడౌ ♦ తచ్ఛౌరిఁ గొల్తున్ సదా!

- :శుభం భూయాత్ :-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-01-2016
కవిత సంఖ్య: 74

శీర్షిక:- వామనావతార స్తుతి!

సురలోకాధిపు నింద్రు గెల్చి, యతనిన్ ♦ శూన్య స్వరాట్పీఠునిన్
బరువెత్తించిన రాక్షసేంద్రుని బలిన్ ♦ బ్రహ్లాద పౌత్రున్ వెసన్
హరి కోరెన్ దగ వామనాఖ్య వటుఁడై ♦ త్ర్యంఘ్రి స్థలమ్మీయఁగన్;
వర మీయంగఁ ద్రివిక్రముండయి బలిన్ ♦ బాదమ్మునం ద్రొక్కియున్
గరుణించెన్ సుతలాధిపాలునిగఁ; ద♦త్కంజాక్షు నేఁ గొల్చెదన్!

- :శుభం భూయాత్ :-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-01-2016
కవిత సంఖ్య: 75

శీర్షిక:- విష్ణు స్తుతి!

శ్రీశా మన్మథతాత శార్ఙ్గి మధుజి ♦ చ్ఛ్రీకౌస్తుభాంకా హరీ
దాశార్హా జయ హేమశంఖ మురజి ♦ ద్బ్రహ్మేంద్ర సంపూజితా
కేశాఽనంత హిరణ్యగర్భ ధరభృ ♦ త్కృష్ణా భవోన్మూలకా
ధీశాలీ గరుడధ్వజా వరద హే ♦ దేవాధిదేవా నమః!

- :శుభం భూయాత్ :-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-01-2016
కవిత సంఖ్య: 76

శీర్షిక:- బలరామ స్తుతి!

సీ.
భూమి భారముఁ దీర్ప ♦ భువిలోన జన్మించి,
.....రౌహిణేయునిగాను ♦ రహిని వెలిఁగె;
దేవకీ గర్భస్థుఁ♦డే మాత రోహిణీ
.....గర్భానఁ బుట్టి సం♦కర్షణుఁ డయె;
నల ప్రలంబునిఁ జంపి, ♦ యధివహించె నతండు
.....వర బిరుదము ప్రలం♦బఘ్నుఁ డనఁగ;
నీలాంబరము నెప్డు ♦ నెఱి ధరియించి వె
.....లసియుఁ దా నిలను ♦ నీలాంబరుఁ డయె;

గీ.
నతఁడె శ్రీకృష్ణు నగ్రజుం; ♦ డతఁడె సీర
పాణి; తాళాంక; బలభద్ర ♦ వర బిరుదుఁడు;
నట్టి రేవతీ రమణుఁడు ♦ నతని నెపుడు
సంస్తుతింతును నిత్యమ్ము ♦ స్వాంతమందు!

- :శుభం భూయాత్ :-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-01-2016
కవిత సంఖ్య: 77

శీర్షిక:- కల్క్యవతార ఘట్టము!

సీ.
కలియుగాంతమ్మునఁ ♦ గల రాజు లందఱుఁ
.....జోర సములు గాను; ♦ క్రూరులుగను
వర్తించుచుండఁగాఁ ♦ బ్రబల యశస్కుఁడు
.....విష్ణుయశుండను ♦ విప్రు నింటఁ
గల్కి నామమ్మున ♦ ఘను విష్ణు నంశాన
.....జనన మందియుఁ దాను ♦ జగమునందు
దుష్ట శిక్షణమును; ♦ శిష్ట రక్షణమును
.....జేసియు మనకిడుఁ ♦ జిర యశమ్మ

గీ.
టంచును బురాణములు వచి♦యించుచుండె!
నేఁడు నెటఁ జూడఁ బాపులై ♦ నెగడువారె!
చెడుగు పనులెన్నొ పూనియుఁ ♦ జేయువారె!
వెంటనే రాఁ గదే కల్కి ♦ వేగిరముగ!

- :శుభం భూయాత్ :-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-01-2016
కవిత సంఖ్య: 78

శీర్షిక:- నవగ్రహములు!

కం.
భాముఁడు, సోముఁడు, భౌముఁడు,
సోమజుఁడున్, దేవ గురుఁడు, ♦ శుక్రుఁడు, శనియున్,
సోమ గ్రాహియుఁ, గేతువు
గాములు తొమ్మిది; జనులకు ♦ గరిమను జూపున్!

(ఇదే అర్థముతో మఱొక కంద మందున)
కం.
రవి, రాట్, కుజ, బుధ, గురు, కవి,
రవిజ, తమ, శ్శిఖి నవ ఖ చ♦రమ్ములు నెపుడున్
భువి చుట్టుఁ దిరుగు చున్, మఱి,
భువి జనులను బాధ పఱుపఁ ♦ బొదలింపఁ గనున్!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-01-2016
కవిత సంఖ్య: 79

శీర్షిక:- యమస్తుతి!

తే.గీ.(మాలిక):
యమ! కృతాంత! శమన! సౌరి! ♦ సుమన! పాశి!
శ్రాద్ధదేవ! లులాయధ్వ♦జ! సమవర్తి!
దృంభు! భీమశాసన! కాల! ♦ దినకరసుత!
దండధర! యమునాభ్రాత! ♦ ధర్మరాజ!
జీవితేశ! కీనాశ! ద♦క్షిణదిగీశ!
హరి! పరేతరాట్!పితృపతి! ♦ యమన! విజయ!
కంక! మృత్యు! స్త్రిధామ! హే ♦ కాలపాశ!
సంగమన! శీర్ణపాద! హే ♦ సౌర! యాతు!
దండి! పార్పర! వైవస్వ♦తా! నమోஉస్తు!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-01-2016
కవిత సంఖ్య: 80

శీర్షిక:- తన్మయత్వము!

సీ.
"కంజాక్షునకు నిడు ♦ కాయమే కాయమ్ము;
.....పవన గుంఫిత చర్మ ♦ భస్త్రి గాదు!
వైకుంఠుఁ బొగడెడు ♦ వక్త్రమే వక్త్రమ్ము;
.....డమడమ ధ్వని తోడి ♦ ఢక్క గాదు!
హరి పూజనము సేయు ♦ హస్తమే హస్తమ్ము;
.....తరుశాఖ నిర్మిత ♦ దర్వి గాదు!
కమలేశుఁ జూచెడి ♦ కన్నులే కన్నులు;
.....తనుకుడ్య జాల రం♦ధ్రములు గావు?

ఆ.వె.
చక్రి చింతయున్న ♦ జన్మమే జన్మమ్ము;
తరళ సలిల బుద్బు♦దమ్ము గాదు!
విష్ణు భక్తియున్న ♦ విబుధుఁడే విబుధుండు;
పాద యుగము తోడి ♦ పశువు గాదు!"

తే.గీ.
అనుచు మనమున హరినిల్పి ♦ యనిశము, హరి
కథల భజియించి, యర్చించి, ♦ కమలనాభు
సంస్మరణము సేసియు, విష్ణు ♦ చరణ కమల
ములను స్తుతియించి, ప్రహ్లాదుఁ ♦ డిలను మిగులఁ
దన్మయత్వానఁ బాడుచుఁ ♦ దనను మఱచు!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-01-2016
కవిత సంఖ్య: 81

శీర్షిక:- పార్వతి తపస్సు!
(సమస్య: కపిని వలచి గిరిజ తపము సేసె!)

[ఏకాదశరుద్రరూపుఁడైన శివుని, పార్వతి నవవిధ భక్తి మార్గాలలోఁ గొలుచుట]
సీ.
హరుని నర్చించియు ♦ నత్యనురాగాన,
.....బహురూపు నెడఁదలో ♦ భక్తిఁ దలఁచె;
త్ర్యంబకుఁ గొలువంగ ♦ దాసియుఁ దానయ్యు,
.....నపరాజితు సఖిగ ♦ నతివ నిలిచె;
నాత్మనివేదన ♦ మ్మది శర్వునకు నిడి
.....యును, గపర్దికిని వం♦దనము నిడియె;
శంభుని గుణగణ ♦ శ్రవణ యయ్యును దాను,
.....రైవతుఁ గీర్తించె ♦ రమ్యముగను;

గీ.
పాద సేవనముఁ గ♦పాలికిఁ జేయంగ,
దిన దినమ్ము ప్రేమ ♦ దీప్తమయ్యె!
కడఁకఁ బూని, తా, మృ♦గవ్యాధునిన్, వృషా
కపిని వలచి గిరిజ ♦ తపము సేసె!!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-01-2016
కవిత సంఖ్య: 82

శీర్షిక:- తండ్రు లైదుగురు!
(సమస్య: తండ్రు లేవురు గల రండ్రు ♦ ధరను బుధులు!)

మొదటి పూరణము:
అయుత కవితా సుయజ్ఞ ప♦ద్యమ్ముఁ గనఁగఁ
కన్నవాఁ, డుపనేత, శి♦క్షకుఁడు, నన్న
దాతయుం, భయత్రాతయుఁ ♦ దఱచి చూడఁ
దండ్రు లేవురు గల రండ్రు ♦ ధరను బుధులు!


[పై పూరణమునందు నాకు ఆధారమైన శ్లోకమిది:

జనితా చోపనేతా చ, యశ్చ విద్యాం ప్రయచ్ఛతి, |
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితరః స్మృతాః ||]

*** *** *** ***

రెండవ పూరణము:
కన్నవాఁడును, నిల్లాలి ♦ కన్నతండ్రి,
వడుగుచేసినవాఁడు, గు♦రుఁడును, నన్న
యంచు గణనసేయఁగఁ గొని♦యాడఁబడెడి
తండ్రు లేవురు గల రండ్రు ♦ ధరను బుధులు!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-01-2016
కవిత సంఖ్య: 83

శీర్షిక:- పార్వతీ కళ్యాణము!
(సమస్య: కాలుఁడు హిమశైలసుతకుఁ ♦ గాంతుండయ్యెన్!)

కం.
శైలమునఁ దపమొనర్చెడు
ఫాలాక్షుని సేవలోన ♦ వలపుఁ గొనిన త
ల్లోలాక్షి మహిమఁ గంఠే
కాలుఁడు హిమశైలసుతకుఁ ♦ గాంతుండయ్యెన్!

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-01-2016
కవిత సంఖ్య: 84

శీర్షిక:- బ్రహ్మాస్త్ర బంధితుఁడు!
(సమస్య: దయ్యమ్మునుఁ గనిన హనుమ, ♦ దారిని విడిచెన్!)

అయ్యాంజనేయు బంధితుఁ
జెయ్యఁగ నా యింద్రజిత్తు ♦ చివ్వన యపుడున్
వెయ్యఁగ బ్రహ్మాస్త్రముఁ; బె
ద్దయ్య మ్మునుఁ గనిన హనుమ, ♦ దారిని విడిచెన్!

(పెద్దయ్యన్=బ్రహ్మను; మునున్=ముందఱ)

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 85

శీర్షిక:- లికుచ రసము (నిమ్మ రసము)!
(సమస్య: కుచముఁ గోసె మగఁడు కూర కొఱకు!)

[ఆటవెలఁది పాదముగ నున్న సమస్యను కందమున నిమిడ్చితిని]

స్వక రుచ్యము రసమౌటన్,
సకలముఁ దా సిద్ధ పఱచి, ♦ సంతోషమునన్
లికుచముఁ గోసె మగఁడు, కూ
ర కొఱకుఁ గాకయు, స్వకేష్ట ♦ రసముం జేయన్!

(లికుచము=గౙనిమ్మ)

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 86

శీర్షిక:- ఉత్తరుని ప్రగల్భములు!

(కోపము-పాపము-తాపము-చాపము...అను పదముల నుపయోగించి యుత్తరుని ప్రగల్భముల ప్రస్తావనము)

[నర్తనశాలలో బృహన్నల యెదుట, నంతఃపురకాంతల యెదుట నుత్తరకుమారుఁడు ప్రగల్భమ్ములు పలుకు సందర్భము]

ఉ.
"కోపము నాకుఁ గల్గెడిని ♦ గోగ్రహణోద్ధతమూర్ఖకౌరవుల్
పాపముఁ జేసి, సంగరము ♦ భావ్యమటంచును నెంచి, నీచులై
తాపములేక నిక్కఁగను, ♦ ధైర్యము శౌర్యముఁ బూని నేను నా
చాపముఁ జేతఁ బట్టితిని! ♦ సారథిలేఁ డిఁక నేమి సేయుదున్?" (1)


వ.
కౌరవు లుత్తర గోగ్రహణముం జేసిన విషయము వినిన యుత్తరకుమారకుండు...

కం.
ఈషత్కోప ముఖాంచ
ద్రోషిత హృచ్చాపముక్త ♦ రూక్షాంబక వా
క్ఛోషిత తాప ముఖర శ
బ్దోషఃకాల క్షపాప♦ముద్రితఘోషన్! (2)

వ.
అంతఃపురకాంతలయెదుట బృహన్నల చూచుచుండఁగా నిట్లు ప్రగల్భములు పలికెను...

కం.
"కోపము నాకును వచ్చిన
చాపముతోఁ గౌరవులనుఁ ♦ జావఁగఁజేతున్!
తాపముతోడుత వారలు
పాపము! శోకార్తులునయి ♦ పరువెత్తవలెన్!" (3)

(రెండవ పద్యమున దీర్ఘసమాసమును, మూఁడవ పద్యమున నుత్తరుండు మాటలాడునపు డలఁతి యలఁతి మాటలను హాస్యమునకై వాడితినని గమనించ మనవి)

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 87

శీర్షిక:- తమ్ములు...!

(తమ్ములు...అను పదమును నాలుగు పాదములలో నుపయోగించి భారతార్థమున వ్రాసిన పద్యము)

[సంధికై దూతగఁ బంపుచు ధర్మరాజు కృష్ణునితోఁ బలికిన మాటలు-]

"తమ్ములు కౌరవులను, జే
తమ్ములు సంధిని వరించు ♦ దారి నడిపి, పం
తమ్ములు వీడెడు, సంగా
తమ్ములు పెనుపొందు నుడులఁ ♦ దనుపుము కృష్ణా!"

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 88

శీర్షిక:- దుర్యోధనుని ఘోషయాత్ర!

(రామ-భరత-లక్ష్మణ-శత్రుఘ్న...అను పదముల నుపయోగించి భారతార్థమున వ్రాసిన పద్యములు)

[దుర్యోధనుని ఘోషయాత్రా సందర్భము]

కందపద్యము:
ఆరామగతులుఁ బాండుకు
మారులునౌ భరతకులుల ♦ మానము డుల్పన్
జేరెను లక్ష్మణ యుతుఁడై
రారాట్ శత్రుఘ్నునంచు ♦ రంజిలుచు వెసన్!


తేటగీతి:
ఏ విరామ మెఱుంగని ♦ హీన యోచ
నాస్థ లోభరతుఁడు కౌర♦వాగ్రజుండు
లక్ష్మణునిఁ గన్నతండ్రి దు♦ర్లక్షణుండు
విఘ్నమిడఁగా వనిఁ జనె శ♦త్రుఘ్నులకును!

(శత్రుఘ్నులు=శత్రునాశకులైన పాండవులు)

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 89

శీర్షిక:- త్యాగరాజు!
(ప్రతి పాదమున మొదటి యక్షరములుగ వరుసగ త్యా-గ-రా-ౙు అని వచ్చునటుల వ్రాసిన పద్యము)

ఆ.వె.
త్యాగరాౙు సెప్పె ♦ నానాఁడు "శాంతమ్ముఁ
గనక సౌఖ్య మెౘటఁ ♦ గన"రటంౘు;
రామునకును నిదె ని ♦ రంతర వినతి యౌఁ
ౙుమ్ము కనఁగ లోక ♦ సూత్ర మగుౘు!

-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 90

శీర్షిక:- బెజవాడ!

(ప్రతి పాదమున మొదటి యక్షరములుగ వరుసగ బె-జ-వా-డ అని వచ్చునటుల వ్రాసిన పద్యము)

మొదటి పద్యము:

తే.గీ.
"బె"బ్బులిని బండిగాఁ గొని ♦ వెలుఁగులిడు, వి
"జ"యము లందించి, కాచెడు, ♦ జనుల వెత ని
"వా"రణమిడు కనకదుర్గ ♦ వదనమునఁ బొ
"డ"మిన మెఱపుచే విజయవా♦డయె వెలుంగు!!

*** *** *** *** ***

రెండవ పద్యము:

తే.గీ.
"బె"డఁగు నడ, విన"యాం"చిత ♦ వీక్ష, "రా"గ
""న వితరణ, మాం"ధ్రు"ల మాన♦సాంబు"" చిర
"వా"సిత కరుణా""య దర♦హాస "ధా"ర,
""గ్గఱించెడి "కు"తుక, మ♦టన క"ని"కరి!!

పై పద్యమున నొక చమత్కారము గలదు.

నాల్గు పాదములలోని...
మొదటి గణపు మొదటి యక్షరములఁ గలిపిన "బెజవాడ" యని,
మూఁడవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "యాంధ్రులకు"నని,
యైదవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "రాజధాని"యని
చమత్కరించుట జరిగినది.

వర్ణితాంశము విజయవాడ సుగుణమే!

ఇందు దొసఁగు లుండవచ్చును. పాండిత్యప్రకర్ష కొఱకుఁ గాక, చమత్కార సాధనకై మాత్రమే నేను దీనిని వ్రాసితిని. కవిమిత్రులు మన్నించి యాదరింపఁగను, దొసఁగులున్న సవరణములు సూచింపఁగను మనవి.

-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 91

శీర్షిక:- సిబాలుని ప్రణయము!

(సమస్య:- పసిబాలుఁడు పెండ్లియాడి ♦ పడసెఁ గుమారున్!)


["సిబాల్" అను ఇంటిపేరు గల యువకుఁడు తాను మెచ్చిన యువతిని వివాహమాడి, కుమారునిం బడసిన వృత్తాంతము]

కం.
హసిత వదనుఁడు; వినయుఁడు; వి
కసిత హృదబ్జుఁడును, ప్రణయ ♦ కాంక్షా ధృత మా
నసి! వలచిన యువతియె తను
ప, "సిబాలుఁడు" పెండ్లియాడి, ♦ పడసెఁ గుమారున్!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 92

శీర్షిక:- శిశుపాల నామక రాసభము!

(సమస్య:- శ్రవణానందమ్ముఁ గూర్చె ♦ రాసభము సభన్!)

కం.
అవధినిడె నూరు తప్పుల
కవలం బరిమార్ప వృష్ణి! ♦ యా శిశుపాలుం
డవహేళన సేసె! హరికి
శ్రవణానందమ్ముఁ గూర్చె ♦ రాసభము సభన్!!

(రాసభము = గాడిద [శిశుపాలుఁ డనెడు గాడిద])

-:స్వస్తి:-
**********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 93

శీర్షిక:- అంజనా కేసరుల వివాహము!

(సమస్య:- కోతినిఁ బెండ్లియాడె నొక ♦ కోమలి స్నేహితురాండ్రు మెచ్చఁగా!)

[అంజనా దేవి కేసరిని వివాహమాడిన ఘట్టమునిట ననుసంధానించుకొనునది]

మొదటి పూరణము:

ఉత్పలమాలిక:
జాతికి "నొక్క యప్సర"యె, ♦ శాపవశమ్మున "నంజనాఖ్య"యై,
కూఁతురుగా జనించెఁ "గపి ♦ కుంజర" నామక సౌమనస్వికిన్!
భాతిగఁ బ్రత్యహమ్ము గుణ♦వర్ధని యౌచును నుండ, నొక్కెడన్
గౌతుకమొప్పఁగా సఖులు ♦ కూర్మిని వెన్కొనఁ, గాన కేఁగి, తా
భీతిలె హస్తిఁ జూచి! కని ♦ వేగమె "కేసరి", దానిఁ జంపఁ, దా
నాతని శౌర్యధైర్యముల ♦ నంజన మెచ్చి, బిరానఁ గోరి, యా
కోతినిఁ బెండ్లియాడె "నొక ♦ కోమలి" స్నేహితురాండ్రు మెచ్చఁగా!!

(ఒక కోమలి=ఒక్క యప్సర=అంజన)

*** *** *** ***

రెండవ పూరణము:

[పరిశీలనా జ్ఞానము చక్కఁగా లేని యొక కోమలి చేష్ట]

ఉ.
"దాతనుఁ బెండ్లి చేసుకొనె" దంచునుఁ బోవుచు దారిఁ దోఁటలోఁ
గాఁతయుఁ గాఁచి, గొప్ప వడగాలికి రాలిన మావికాయలన్,
జూత సుగంధపున్ సొగసు స్రుక్కఁగఁ గాంచియొ, దానిఁ గానలే
కో, తిని, పెండ్లియాడె నొక కోమలి, స్నేహితురాండ్రు మెచ్చఁగా!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 94

శీర్షిక:- అర్జునుని మత్స్యయంత్ర భేదనము!

(చెక్కు-సైను-మనీ-డ్రా...యను పదముల నుపయోగించి భారతార్థమున నేను వ్రాసిన పద్యము)

[బ్రాహ్మణ వేషమున నున్న యర్జునుడు మత్స్యయంత్రమును భేదించగా, ద్రుపదమహారాజు మెచ్చుకొని పలికిన సందర్భము]

తే.గీ.
"నేనె విలుకాఁడఁ జూడుఁ"డం♦చెక్కుపెట్టి,
సొగసై, నునుపైన వి♦శుద్ధ మత్స్య
యంత్రమునుఁ గొట్ట, "నెంత ని♦యమమ నీకు,
బ్రాహ్మణా!"యనె ద్రుపదరా, ♦ డ్రామ నిడుచు!!

(ద్రుపదరాట్+రామను+ ఇడుచు)

-:స్వస్తి:-
********************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 95

శీర్షిక:- శ్రీకృష్ణ స్తుతి!

(చంద్ర-గంగ-నాగ-భస్మ...యను పదముల నుపయోగించి భాగవతార్థమున నేను వ్రాసిన పద్యము)

యదు కులాబ్ధి చంద్ర! ♦ యవనారి! గోపాల!
పాద జనిత గంగ! ♦ వాసుదేవ!
నగధర! వ్రజ మోహ♦నా! గరుడ గమన!
శౌరి! పద్మనాభ! ♦ స్మర జనయిత!

-:స్వస్తి:-
*******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 96

శీర్షిక:- వికర్ణుని హితబోధ!

(అన్నము-కూర-పప్పు-చారు...అను పదముల నుపయోగించి భారతార్థమున నేను వ్రాసిన పద్యము)

[దుర్యోధనునకుఁ దమ్ముఁడైన వికర్ణుఁడు హితము బోధించు సందర్భము]

కం.
"అన్న! ముకుందుని మాటలు
విన్నన్ సమకూరఁజేయుఁ ♦ బేరును సిరులున్!
బన్నపు తలఁ పప్పు డెపుడొ
యున్నను, విడి, చారుమతికి ♦ నున్నతి నిడుమా!!"

(చారుమతి=సుందరమైన బుద్ధికలవాఁడు=శ్రీకృష్ణుఁడు)

-:స్వస్తి:-
****************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 97

శీర్షిక:- మాతా! త్రిదేవీ! నమోఽస్తు తే!!

శా.
చేతన్ వీణ ధరించి, విద్యలొసఁగన్ ♦ శ్రీ వాణివై నిల్చి, స
చ్చేతోమోద విశేష సంపద లిడన్ ♦ శ్రీ లక్ష్మివై నిల్చి, యా
చేతోఽoశుల్ మొఱ వెట్ట; శక్తి నిడఁగన్ ♦ శ్రీ గౌరివై నిల్చి, స
చ్చైతన్య మ్మిడి, యో త్రిదేవి! యిట వి♦శ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!

కం.
వాణీ! వీణా పాణీ!
పాణి స్థిత సకల విభవ ♦ భాస్వ ల్లక్ష్మీ!
ప్రాణేశార్ధాజిర శ
ర్వాణీ! ధీ బల ధనాఢ్య! ♦ వరదాయి! భజే!!

-:స్వస్తి:-
******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 98

శీర్షిక:- విద్యా ధనము!

[ఈ క్రింది శ్లోకమునకు నా పద్యానువాదము:]

“నచోరహార్యం న చ రాజహార్యం
న భ్రాతృభాజ్యం న చ భారకారీ|
వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం
విద్యాధనం సర్వధనప్రధానమ్||”

నా పద్యము:

ఆ.వె.
దోచుకొనఁగఁ బడదు; ♦ దొరలపాలునుఁ గాదు;
భ్రాతృజనమునకునుఁ ♦ బంచఁబడదు;
బరువు కాదు; పెరుఁగు ♦ వ్యయపఱచినఁ గాని;
సిరుల కన్న విద్దె ♦ సిరియె మిన్న!!


-:స్వస్తి:-
******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 99

శీర్షిక:- బావి నీరు...చెఱువు నీరు!

(సమస్య: వారి వారి వారి వేరు వేరు)

[చెఱువు నీరు, బావి నీరు వేర్వేఱని పలుకు సందర్భము]

ఆ,వె.
చెఱువు నీరు మేము ♦ చింతలేకుండయే
త్రాగుచుందుమయ్య ♦ తఱచుగాను!
వారి నీరు బావి ♦ నీరు! కన, సరసి
వారి; వారి వారి ♦ వేరు వేరు!!
[వారి వారి=వారి యొక్క నీరు]

-:స్వస్తి:-
******************
గుండు మధుసూదన్
వరంగల్

******************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-01-2016
కవిత సంఖ్య: 100

శీర్షిక:- శివయ్యా! గంగను విడుమయ్యా!

[ఈ క్రింది శ్రీనాథుని చాటువునకు నా తేటగీతి పద్యరూపము]

“సిరిగలవానికిఁ జెల్లును
దరుణులఁ బదియారువేలఁ దగఁ బెండ్లాడన్,
దిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్!!

నా పద్యము:

తే.గీ.
"ఆండ్రఁ బదునాఱువేలఁ బెం♦డ్లాడఁ జెల్లె
సిరులు గల్గిన వాఁడైన ♦ శ్రీపతికిని!
తిరిపమెత్తెడి నీకేల ♦ నిరువురుసతు?
లీశ గంగను విడువు! మ♦ద్రిజయె చాలు!!"

-:స్వస్తి:-
*****************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి