Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 24, 2016

అయుత కవితా యజ్ఞము (325-333)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 325

శీర్షిక:- పాండవ దూత!

దత్తపది:
ఈఁగ-దోమ-పేను-నల్లి....పదముల నుపయోగించి...భారతార్థమున నేను వ్రాసిన పద్యము

[దూతగ వెడలిన శ్రీకృష్ణుఁడు దుర్యోధనునకు రాఁగల యపాయమునుం గూర్చి
యుపదేశించు సందర్భము నిట ననుసంధానించుకొనునది]

ఉత్పలమాల:
ఈఁగల యైదు నూళ్ళనిడి ♦ యిప్పుడు సఖ్యతఁ జూపకున్నచోఁ
గాఁగల కార్య మెట్టులునుఁ ♦ గాఁకయు మాన దెదో! మహాత్మతన్
దూఁగరు మీరు! కిన్క తగ♦దోయి! యనిన్ గెలు పేను కూర్చి, స
ద్యోగము నల్లి, పాండవుల ♦ యోగ్య మహీశులఁ జేతు నత్తఱిన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016

శీర్షిక:- చనుఁబాలు ద్రావు బిడ్డఁడే!...ఐనను....!!!

కవిత సంఖ్య: 326

కం.
చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
తన కటినిం గట్టు ఱోటి ♦ త్రాటిం దిగువన్
బెను మ్రాఁకులుఁ గూల నపుడు
ఘన విస్మితులయి నిలిచిరి ♦ గంధర్వులటన్!
********************

కవిత సంఖ్య: 327

కం.
"చనుఁబాలు ద్రావు బిడ్డఁడె?
ఘన దైవమ్మగును కాని, ♦ కాఁడయ శిశువే"
యని వల్లవు లత్తఱిఁ దమ
మనవినిఁ దెల్పంగఁ జనిరి ♦ మాతఁ బిలువఁగన్!!
*********************

కవిత సంఖ్య: 328

కం.
చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
ఘనులౌ వేల్పులకు ముక్తిఁ ♦ గల్పింపంగన్
మనమునఁ బొంగి యశోదయె
తన యెదకును హత్తుకొనియె ♦ దబ్బున శిశువున్!!
**********************

కవిత సంఖ్య: 329

కం.
"చనుఁబాలు ద్రావు బిడ్డఁడె
కనఁగను విష్ణుండు నృహరి ♦ ఘనుఁడౌ మధుసూ
దనుఁ" డని రట గంధర్వులు
చనఁ బురికిని గృష్ణు నెదుటఁ ♦ జాఁగిలఁబడుచున్!!
***********************

కవిత సంఖ్య: 330

కం.
చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
జన మనముల దోచి వెల్గె ♦ శాశ్వతుఁ డనఁగన్
విన వేడుకయ్యెఁ దల్లికిఁ
దనువే పులకించి జన్మ ♦ తరియించె వెసన్!!
********************

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 331

శీర్షిక:- త్రైలోక్య గర్భుఁడు!

సమస్య:-
ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!


కం.
నటనల సూత్రముఁ దాల్చితి
వఁట యో త్రైలోక్య జఠర! ♦ పదపడి చూడన్
దిటవుగ నీ జఠర మ్మను
ఘటమున నేనుఁగుల గుంపు ♦ గలదు ముకుందా!!


-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 332

శీర్షిక:- ప్రహ్లాద ఉవాచ!

(హరినామస్మరణమ్ము మానుమని బోధించు తండ్రితోఁ బ్రహ్లాదుఁడు పలికిన సందర్భము)

తే.గీ.
"ఇనుము సూదంటురాయికై ♦ యెగయు నట్లు;
చంచరీకమ్ము తేనెకై ♦ సమకొను విధి;
ముక్తసంగుఁడు ముక్తికై ♦ పూను పగిది;
నాదు మదికోరెఁ దండ్రి శ్రీ♦నాథుఁ జేర!"


-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-02-2016
కవిత సంఖ్య: 333

శీర్షిక:- చుక్కల లెక్కలు!

సమస్య:-
తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్

(ఆవాల మూటతో సభకు వచ్చి, చుక్కల లెక్క నెఱుంగఁ గోరిన యక్బరుతో బీర్బల్
పలికిన సందర్భము)

"కోరిక తోడుతఁ జుక్కల
నీ రీతిగ గణన సేయ ♦ నెప్పటికైనన్
దీరదు! సర్షపములతోఁ
దారల గణనమ్ము సులభ♦తరమౌఁ జూడన్!!"

(సర్షపములు = ఆవాలు)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి