Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 28, 2016

వారి వారి ’వారి’ వేఱు వేఱు?

సమస్య:-
వారి వారి వారి వేఱు వేఱు(చెఱువు నీరు, బావి నీరు వేర్వేఱని పలుకు సందర్భము)

చెఱువు నీరు మేము  చింత లేకుండయే
త్రాగుచుందు మయ్య  తఱచు గాను!
వారి నీరు బావి  నీరు! కన, సరసి
వారి; వారి వారి  వేఱు వేఱు!!
[వారి వారి=వారి నీరు]మంగళవారం, ఏప్రిల్ 26, 2016

సమస్య:- యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్

శుభోదయం మిత్రులారా!25-04-2016 నాఁడు "శంకరాభరణం" లో ఈయబడిన...

సమస్య:-
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్


దీనికి నా పూరణములు....


నా మొదటి పూరణము:

చెమటలు గ్రక్కుచు వేఁడిమి
నమితముగా నుక్కపోయ 
 నడలి జలము కో
సము గగనమున జలద నిచ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 1


నా రెండవ పూరణము:

సముచిత పాత్రా సుపరిచ
యము సేయఁగఁ దొడఁగినట్టి 
 దౌ నటి వేదిన్
బ్రముదిత యయి యిడు నంకా
స్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 2


ఈ పూరణమే చిన్న సవరణలతో...
సముచిత పాత్రాదుల నిల
యము సేయఁగఁ దొడఁగినట్టి  యా నటియు నటున్
బ్రముఖాంకాస్యాఖ్య పరిచ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా మూఁడవ పూరణము:

రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య  సత్కథను ప్రకా
శమిడు సుగుణైక యుత కా
వ్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 3

ఈ పూరణమే చిన్న సవరణలతో...

రమణీయ దృశ్య వర్ణిత
సముచిత పాత్రానుగుణ్య  సత్కథను ప్రకా
శమిడెడి సన్మధుర కవీ
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా నాలుఁగవ పూరణము:

అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభమౌ పదయుతమై
సుమశోభిత దీపిత ప
ద్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 4


ఈ పూరణమే చిన్న సవరణలతో...


అమృతమును జిందు భావన
మమృతాక్షర మౌక్తిక నిభమౌ పదవాక్యో
ద్యమ శోభిత కావ్య శ్రే
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా యైదవ పూరణము:

భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును  భ్రమ డుల్పను శ
క్యమగు తిరుమలేశుని గ
ద్యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 5


ఈ పూరణమే చిన్న సవరణలతో...
భ్రమలఁ గలిగించు సంసా
ర మను భుజగ దంష్ట్రులకును  భ్రమ డుల్పను శ
క్యము తిరుమల విభు పద తో
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్!


నా యాఱవ పూరణము:

గమకిత మనోజ్ఞ సంగీ
తముచే నలరారఁ జేయు  తత్రత్యుల వే
దము గోపాలుని దౌ గే
యముఁ గని జనులెల్ల మోద  మందెదరు భువిన్! 6-శుభం భూయాత్-


సోమవారం, ఏప్రిల్ 25, 2016

సమస్య: ముదుసలిం గొట్టువారలే పోటుమగలు


కురు వృద్ధుఁడు భీష్ముఁడు


సమస్య:-
ముదుసలిం గొట్టువారలే పోటుమగలు!!తే.గీ.
కౌరవుల సేన కధిపతి గౌరవయుతుఁ
డాపగా సుతుఁ డతిబలుం  డతని తోడఁ
బోరు వారేరి? భీష్మాఖ్య  వీరుఁడునగు
ముదుసలిం గొట్టువారలే  పోటుమగలు!!-:శుభం భూయాత్:-


ఆదివారం, ఏప్రిల్ 24, 2016

ప్రణవ స్వరూపుఁడు!
తే.గీ.
ఒరయె యోంకార మీ విశ్వ మొక కృపాణి!
కత్తి యొరవంటిదైన యోంకార మెపుడు
విశ్వమను ఖడ్గమునుఁ గప్పివేయును! కనఁ
బ్రణవమందునఁ బరమాత్మ  వఱలుచుండె!!-:శుభం భూయాత్:-శనివారం, ఏప్రిల్ 23, 2016

స్వీయ మృత్యు ముహూర్తము!


సమస్య:-
రామచంద్రుని రక్షించె రావణుండు!

తే.గీ.
తనదు ఘనశాపమునకునుఁ దగిన త్వరిత
మైన యవధికై యట యుద్ధమను నెపమునఁ
దననుఁ గూల్చుటకునుఁ దానె  ధారిక నిడి
రామచంద్రుని రక్షించె  రావణుండు!

(ధారిక=ముహూర్తము)

-:శుభం భూయాత్:-

శుక్రవారం, ఏప్రిల్ 22, 2016

సంగీత సమ్రాట్టు-త్యాగరాజు
సీ.
ఘనతరాంచితమైన ♦ కర్ణాట సంగీత
....వాగ్గేయకార స♦త్ప్రణతుఁ డయ్యె;
చిన్నారి పొన్నారి ♦ చిఱుత కూఁకటి నాఁడు
.....రాఘవోత్తమ కృతి ♦ ప్రవరుఁ డయ్యె;
నిధికన్న రాము స♦న్నిధి చాల సుఖమంచు
.....శరభోజి ధన తిర♦స్కారుఁ డయ్యె;
వేన వేలుగఁ గృతు ♦ ల్వెలయించి దేశాన
.....సంగీత లోక ప్ర♦శస్తుఁ డయ్యె;
గీ.
ఆతఁడే 'జగదానంద' ♦ జాతకుండు;
'కనకనరుచిరా' కృతి దివ్య♦కారకుండు;
రఘు కులాన్వయు సద్భక్తి ♦ లబ్ధ యశుఁడు;
ధన్య సంగీత సమ్రాట్టు ♦ "త్యాగరాజు"!

సుగంధి:
'ఎందఱో, మహానుభావు ♦ లెందఱో' యటంచుఁ దా
విందుగన్ గృతుల్ రచించి ♦ విన్నవించి, రామునిన్
డెందమందు నిల్పు భక్తుఁ♦డే స్వరాట్టు గాను ని
ల్చెం దగ న్మహోన్నతి న్వ♦రించెఁ ద్యాగరాజిలన్!-:శుభం భూయాత్:-


గురువారం, ఏప్రిల్ 21, 2016

పరమాత్మ స్వరూపము![శ్రీ టీ.పీ.కే.ఆచార్యులవా రడిగిన తైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లియందలి
"యశ్ఛందసాం ఋషభో విశ్వరూపః " అనెడి మంత్రమును నేను సీసపద్యమున ననువదించి
వ్రాసితిని]


సీ.

ఎవఁడు వేదములలో నేకమౌ సారభూ
.....తమొ ప్రధానమ్మొ తత్సర్వరూపి;
ప్రణవామృత స్వరూపమ్మైన వేదప్ర
.....కాశ శక్తుఁడగు నోంకార రూపి;
పరమేశుఁడే నాకుఁ  బఱఁగ నాత్మజ్ఞాన
.....ధారణాంచిత ప్రజ్ఞ  దక్షత లిడి;
నన్ బలపఱచుచో  నతుల బ్రహ్మజ్ఞాన
.....సంపత్కరుండనై  స్వయముగాను
గీ.
తనువు యోగ్యమ్మునై రసననుఁ గన మృదు
మధుర భాషితయై శ్రోత్ర  మధికముగను
వినికి గలదియై భాసిల్లి  వెలిఁగిపోవఁ
బ్రణవమా నాదు విద్యనుఁ  బరిఢవిలుము!


*శుభం భూయాత్*

బుధవారం, ఏప్రిల్ 20, 2016

ముక్తక వచనములు (1-10)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

శీర్షిక:- మనిషి...మనీషి...
01
కులం... రూపం...
మనిషికి
గొప్పతనాన్ని కలిగించవు!
గుణం కలిగితే
గొప్ప వెలుగుతుంది!
మంచి పనులే
మానవునికి
గౌరవాన్ని తెచ్చిపెడతాయి!
కులాన్ని పట్టుకు
ప్రాకులాడితే
కలహాలూ...కష్టాలే...
రూపం వుందనుకుని
మురిసిపోతే
చివరికి 
కురూపమే...!
సుగుణాలూ...సుకర్మలూ...
మనిషిని
చిరస్థాయిగా
నిలుపుతాయి
పదిమందికీ
మార్గదర్శనం చేస్తాయి!!

***

శీర్షిక:- కష్ట సుఖాలు...
02
కష్టపడకుండా
అబ్బిన
కలిమివల్ల
కంటికి పొరలు కమ్ముతాయి!
కష్టపడడం వల్ల
కలిగిన కలిమి
మనిషికి
ఘనత నిస్తుంది!
కష్టపడితేనే
సుఖం విలువ
తెలుస్తుంది
ఎప్పుడూ
సుఖాల్లో
మునిగి తేలుతూ వుంటే
కష్టం విలువ
ఎలా తెలుస్తుంది?

***

శీర్షిక:- ప్రేమ...ద్వేషం...
03
కారణం లేకుండా
ద్వేషించడం
ఖలుల గుణమైతే...
కారణం లేకున్నా
స్వపర భేదం లేకుండా
ప్రేమచూపడం
ఉత్తముల గుణం!
ప్రేమ ద్వేషం
ఉత్తర దక్షిణ ధ్రువాలు!
దక్షిణం నుంచి 
నడక మొదలెడితే
ఎప్పటికైనా
ఉత్తరాన్ని చేరుకుంటావు
ద్వేషం నుంచి ప్రేమవైపు
ప్రయాణిస్తే
ఎప్పుడూ
ప్రేమే నీ వెంట వుంటుంది!

***

శీర్షిక:- స్థిరత్వం
04
కాలంకాని కాలంలో
కారు మబ్బులు వచ్చినట్టే
సిరులూ వస్తాయి!
స్థిరత లేదని తెలిసీ
మూర్ఖులు
వాటివెంట పడతారు!
ఉత్తములు
స్థిరంగా వుంటారు!!
ఎండ మావులవెంట పడితే
నీళ్ళు దొరుకుతాయా?
అస్థిరాలకై ఆశపడితే
తృప్తి కలుగుతుందా?
ప్రాప్తం వున్న తీరాలకే
మేఘాలు పయనిస్తాయి
ప్రాప్తం వున్న మానవులకే
సిరులు అబ్బుతాయి!
ప్రాప్తం లేనివాటికై
పెట్టే పరుగులు
నిరాశకే దారితీస్తాయి
ఆయాసం మిగులుస్తాయి!!

***

శీర్షిక:- నిజమైన ధనవంతుడు
05
తృప్తి లేకుంటే
ఎదలో ఏదో తపన
అదేపనిగా 
తరుముతుంటుంది
తృప్తి వుంటే
హృదయం
స్థిరంగా వుంటుంది
మనిషిని
మహోన్నతుణ్ణి చేస్తుంది!
తృప్తి లేని
ధనవంతుడు
ఒక రకంగా
భిక్షగాడే...
తృప్తి వున్న
భిక్షగాడే
గొప్ప ధనవంతుడు!!

***

శీర్షిక:- స్వర్గ నరకాలు
06
స్వర్గ నరకాలు
ఎక్కడో లేవు
ఇది తెలియకుండానే
ఎక్కడున్నాయోనని
మనిషి వెదుకుతూ
ఏడుస్తున్నాడు!
మన సంతోషిస్తే
స్వర్గం దగ్గరికొస్తుందనీ
మనం ఏడిస్తే
నరకం నడిచొస్తుందనీ
తెలుసుకుంటే 
అవసరముండదు
ఈ అన్వేషణ!
ఉన్నా లేకున్నా
సంతోషంగా వుండడం
నేర్చుకో...
ఎప్పుడూ దేనికో ఒక దానికోసం
ఏడుస్తూవుంటే
స్వర్గం ఎలా దరిజేరుతుంది?

***

శీర్షిక:- కోపం...శాంతం...
07
చీటికీ మాటికీ
కోపం తెచ్చుకోవడం
కుసంస్కారి నైజం
శాంతంగా వుండడం
వినయవంతుని నైజం
కోపం మనిషిని
పశువును చేస్తే..
శాంతం మనిషిని
మనీషిని చేస్తుంది!
కోపానికీ
శాంతానికీ
దూరం ఒక చిన్న ఆలోచన!
ఆలోచిస్తే
కోపానికి ఆస్కారం వుండదు
ఆలోచన చేయకుంటే
రెండుకాళ్ళ పశువే 
అవుతాడు మనిషి!

***

శీర్షిక:- హింస - అహింస
08
శరీరానికీ
మనస్సుకీ
నొప్పి కలిగించడం
హింస!
శరీరానికీ
మనస్సుకీ
ఆహ్లాదాన్ని కలిగించడం
అహింస!
చితి
శరీరాన్ని కాలిస్తే
చింత
మనస్సును కాలుస్తుంది!
అలాగే...
నింద 
ముఖాన్ని
ముడుచుకొనేలా చేస్తే...
స్తుతి
ముఖాన్ని
విచ్చుకొనేలా చేస్తుంది!

***

శీర్షిక:- అతి సర్వత్ర...వర్జయేత్!
09
అధిక దానం
కర్ణున్ని చంపింది
అధిక మోహం
లంకకు చేటు తెచ్చింది
అధిక గర్వం
రారాజును సర్వనాశనం చేసింది
అధికం...
మనిషికి
చిక్కుల్ని తెచ్చిపెడుతుంది
అందుకే
వద్దు
మనందరికీ
ఎన్నటికీ
అధికం!!!

***

శీర్షిక:- కాలం నేర్పే పాఠం
10
గతం...
మన తప్పిదాలకూ
విజయాలకూ
ఒక పాఠమైతే...!
వర్తమానం...
సంస్కరణలకూ
సౌలభ్యాలకూ
బాటౌతుంది!
అప్పుడే
భవిష్యత్తు...
భూత వర్తమానాల
గుణపాఠాలు నేర్పిన
అనుభవాల వేదికపై
వెలుగొందుతుంది!
భూత వర్తమానాలనుండి
పాఠాలు నేర్వకుంటే
వాణ్ణి
త్రిమూర్తులు కూడా
కాపాడలేరు!
అలాగే...
పాఠాలు నేర్చుకున్నవాణ్ణి
త్రిమూర్తులు కూడా
ఏమీ చేయలేరు!!!

***

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

నవయుగాదీ...దుర్ముఖీ...స్వాగతం...!!!

మిత్రులందఱకు నవ్య త్రిలింగ వత్సరాది శుభాకాంక్షలు!!!శార్దూలము (పంచపాది):
స్వస్తిశ్రీ నవ దుర్ముఖీ! శుభద! సత్సంపత్కరీ! వత్సరీ!
అస్తోకోజ్జ్వల దివ్య నవ్య భవితాహార్య ప్రభావోదరీ!
ప్రస్తుత్యాధిక ముఖ్య కావ్య లహరీ!  వాణీ శివానీ రమో
పాస్తిత్యంకిత ధాత శంభు బలివిధ్వం సీద్ధ భద్రంకరీ!
ప్రస్తావింతును నేఁడు మా కొసఁగు మీ  పర్వాన సర్వోన్నతుల్!! 1

తే.గీ.
ఈ యుగాది దినాన నేనేమి వ్రాఁతు?
పర్వమన మది మెదలు నింబామ్రతరులు;
శుకపికమ్ముల రవము; కింశుక సుమాలు;
కొదమ తేఁటుల నృత్యాలు,  పదములన్ని!! 2తే.గీ.
జనము పెరిఁగియు, వనము  భోజనము సేసి,
ప్రకృతి శోభలఁ గసితీఱ  వికృతపఱచి,
నగరములఁ బెంచి, నవయుగ  నాగరకులయి,
యెదిగి పోయితి మందు రిదేమి మాయొ? 3తే.గీ.
కుహుకుహూ రావముల తోడఁ  గోకిలమ్మ
చిగురుటాకుల ముక్కునఁ  జేర్చుకొనుచు,
"రార, వాసంతుఁడా, రార,  రమ్ము రమ్మ"
టంచు ముదముతోఁ బిలిచెనే  యంగలార్చి? 4తే.గీ.
కిలకిలా రావముల తోడఁ  గీరములును
దోర పండ్లను దినుచునుఁ  దోరముగనుఁ
జెట్ల పుట్టల గుట్టలఁ  జేరఁ బిలిచి
మాటలాడెనే సంతస  మంది నేఁడు? 5తే.గీ.
దూరముగ నున్న కొండపైఁ  దోచి, నిత్య
మగ్ని కీలలఁ దలఁపించు  నట్టి వైన
మోదుగుల పూఁత లీనాఁడు  మోము దాచి,
పాఱిపోసాఁగె వేగాన  వనము విడచి!! 6తే.గీ.
పూవుఁ దోటలఁ దిరుగాడి,  పుప్పొడులను
మేనికినిఁ బూసికొనుచును  మేలమాడి,
యాడి పాడెడి తుమ్మెద  లేడఁ బోయె?
నవియె పూఁ దేనె లేకయే  యలిగెనేమొ!! 7తే.గీ.
పూర్వ మున్నట్టి ప్రకృతి యబ్బురముగాను
మాయమాయెను; మనిషియు  మాఱిపోయె;
మాయమాయెను సంస్కృతి;  మాయమాయెఁ
బండుగల తీరు తెన్నులు  భారతమున! 8తే.గీ.
మార్పు రావలె నేఁడైన  మనిషిలోన;
సంస్కృతుల్ సంప్రదాయాల  సంస్కరించి,
ప్రకృతిఁ బూజించి, మనమునఁ  బరవశించు
దినము దుర్ముఖీ యీయవే  ఘనముగాను! 9

ఉత్పలమాల:
జీవులకెల్ల సౌఖ్యములు, క్షేమము శాంతి శుభాది వైభవాల్,
జీవన మిచ్చి, ప్రోచి, విరచించిన ధాన్య ధనాది సంపదల్
దీవన తోడుతన్ మనిచి,  తృప్తియు, తోషణ సమ్ముదమ్ము, ప
ర్యావరణమ్ముఁ గూడ కడు  రమ్యత నీయవె మాకు దుర్ముఖీ! 10-:శుభం భూయాత్:-