Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఏప్రిల్ 20, 2016

ముక్తక వచనములు (1-10)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

శీర్షిక:- మనిషి...మనీషి...
01
కులం... రూపం...
మనిషికి
గొప్పతనాన్ని కలిగించవు!
గుణం కలిగితే
గొప్ప వెలుగుతుంది!
మంచి పనులే
మానవునికి
గౌరవాన్ని తెచ్చిపెడతాయి!
కులాన్ని పట్టుకు
ప్రాకులాడితే
కలహాలూ...కష్టాలే...
రూపం వుందనుకుని
మురిసిపోతే
చివరికి 
కురూపమే...!
సుగుణాలూ...సుకర్మలూ...
మనిషిని
చిరస్థాయిగా
నిలుపుతాయి
పదిమందికీ
మార్గదర్శనం చేస్తాయి!!

***

శీర్షిక:- కష్ట సుఖాలు...
02
కష్టపడకుండా
అబ్బిన
కలిమివల్ల
కంటికి పొరలు కమ్ముతాయి!
కష్టపడడం వల్ల
కలిగిన కలిమి
మనిషికి
ఘనత నిస్తుంది!
కష్టపడితేనే
సుఖం విలువ
తెలుస్తుంది
ఎప్పుడూ
సుఖాల్లో
మునిగి తేలుతూ వుంటే
కష్టం విలువ
ఎలా తెలుస్తుంది?

***

శీర్షిక:- ప్రేమ...ద్వేషం...
03
కారణం లేకుండా
ద్వేషించడం
ఖలుల గుణమైతే...
కారణం లేకున్నా
స్వపర భేదం లేకుండా
ప్రేమచూపడం
ఉత్తముల గుణం!
ప్రేమ ద్వేషం
ఉత్తర దక్షిణ ధ్రువాలు!
దక్షిణం నుంచి 
నడక మొదలెడితే
ఎప్పటికైనా
ఉత్తరాన్ని చేరుకుంటావు
ద్వేషం నుంచి ప్రేమవైపు
ప్రయాణిస్తే
ఎప్పుడూ
ప్రేమే నీ వెంట వుంటుంది!

***

శీర్షిక:- స్థిరత్వం
04
కాలంకాని కాలంలో
కారు మబ్బులు వచ్చినట్టే
సిరులూ వస్తాయి!
స్థిరత లేదని తెలిసీ
మూర్ఖులు
వాటివెంట పడతారు!
ఉత్తములు
స్థిరంగా వుంటారు!!
ఎండ మావులవెంట పడితే
నీళ్ళు దొరుకుతాయా?
అస్థిరాలకై ఆశపడితే
తృప్తి కలుగుతుందా?
ప్రాప్తం వున్న తీరాలకే
మేఘాలు పయనిస్తాయి
ప్రాప్తం వున్న మానవులకే
సిరులు అబ్బుతాయి!
ప్రాప్తం లేనివాటికై
పెట్టే పరుగులు
నిరాశకే దారితీస్తాయి
ఆయాసం మిగులుస్తాయి!!

***

శీర్షిక:- నిజమైన ధనవంతుడు
05
తృప్తి లేకుంటే
ఎదలో ఏదో తపన
అదేపనిగా 
తరుముతుంటుంది
తృప్తి వుంటే
హృదయం
స్థిరంగా వుంటుంది
మనిషిని
మహోన్నతుణ్ణి చేస్తుంది!
తృప్తి లేని
ధనవంతుడు
ఒక రకంగా
భిక్షగాడే...
తృప్తి వున్న
భిక్షగాడే
గొప్ప ధనవంతుడు!!

***

శీర్షిక:- స్వర్గ నరకాలు
06
స్వర్గ నరకాలు
ఎక్కడో లేవు
ఇది తెలియకుండానే
ఎక్కడున్నాయోనని
మనిషి వెదుకుతూ
ఏడుస్తున్నాడు!
మన సంతోషిస్తే
స్వర్గం దగ్గరికొస్తుందనీ
మనం ఏడిస్తే
నరకం నడిచొస్తుందనీ
తెలుసుకుంటే 
అవసరముండదు
ఈ అన్వేషణ!
ఉన్నా లేకున్నా
సంతోషంగా వుండడం
నేర్చుకో...
ఎప్పుడూ దేనికో ఒక దానికోసం
ఏడుస్తూవుంటే
స్వర్గం ఎలా దరిజేరుతుంది?

***

శీర్షిక:- కోపం...శాంతం...
07
చీటికీ మాటికీ
కోపం తెచ్చుకోవడం
కుసంస్కారి నైజం
శాంతంగా వుండడం
వినయవంతుని నైజం
కోపం మనిషిని
పశువును చేస్తే..
శాంతం మనిషిని
మనీషిని చేస్తుంది!
కోపానికీ
శాంతానికీ
దూరం ఒక చిన్న ఆలోచన!
ఆలోచిస్తే
కోపానికి ఆస్కారం వుండదు
ఆలోచన చేయకుంటే
రెండుకాళ్ళ పశువే 
అవుతాడు మనిషి!

***

శీర్షిక:- హింస - అహింస
08
శరీరానికీ
మనస్సుకీ
నొప్పి కలిగించడం
హింస!
శరీరానికీ
మనస్సుకీ
ఆహ్లాదాన్ని కలిగించడం
అహింస!
చితి
శరీరాన్ని కాలిస్తే
చింత
మనస్సును కాలుస్తుంది!
అలాగే...
నింద 
ముఖాన్ని
ముడుచుకొనేలా చేస్తే...
స్తుతి
ముఖాన్ని
విచ్చుకొనేలా చేస్తుంది!

***

శీర్షిక:- అతి సర్వత్ర...వర్జయేత్!
09
అధిక దానం
కర్ణున్ని చంపింది
అధిక మోహం
లంకకు చేటు తెచ్చింది
అధిక గర్వం
రారాజును సర్వనాశనం చేసింది
అధికం...
మనిషికి
చిక్కుల్ని తెచ్చిపెడుతుంది
అందుకే
వద్దు
మనందరికీ
ఎన్నటికీ
అధికం!!!

***

శీర్షిక:- కాలం నేర్పే పాఠం
10
గతం...
మన తప్పిదాలకూ
విజయాలకూ
ఒక పాఠమైతే...!
వర్తమానం...
సంస్కరణలకూ
సౌలభ్యాలకూ
బాటౌతుంది!
అప్పుడే
భవిష్యత్తు...
భూత వర్తమానాల
గుణపాఠాలు నేర్పిన
అనుభవాల వేదికపై
వెలుగొందుతుంది!
భూత వర్తమానాలనుండి
పాఠాలు నేర్వకుంటే
వాణ్ణి
త్రిమూర్తులు కూడా
కాపాడలేరు!
అలాగే...
పాఠాలు నేర్చుకున్నవాణ్ణి
త్రిమూర్తులు కూడా
ఏమీ చేయలేరు!!!

***

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి