Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జనవరి 12, 2018

ఆకాశంలో ధ్రువతార - అలిశెట్టి ప్రభాకర్!

hd image of alisetti prabhakar కోసం చిత్ర ఫలితం


తే.గీ.
కరినగరిని జగిత్యాల పురవరమున
జనన మందియుఁ దన చిన్నతనమునందె
తండ్రి మరణించఁ దానె పెద్దయయి యింటి
బరువుఁ గొనె నలిశెట్టి ప్రభాకరుండు!


శార్దూలము
ఆదర్శమ్మును వెల్గఁజేయుకొఱకై యాదర్శ కళ్యాణమున్
మోదానన్ గని, భాగ్యమన్ దనదు సమ్మోదమ్మునన్ భార్యగన్,
బేదింటన్ జనియించినట్టి పడుచున్ విత్తమ్మునుం గోరకే
తా దారగ్రహణమ్మునం గొనెను నౌదార్యమ్మునన్ ధీరుఁడై!


తే.గీ.
జీవికకయి సంపాదించు భావముఁ దన
మనమునందున నిల్పి, సంపదలఁ గనక,
తాను ధనికుఁడౌ కొఱకయి తపనపడని
భాస్కరోన్నతుఁడయ్య ప్రభాకరుండు!


ఆ.వె.
తనదు కళయె ప్రజల ఘనతరాంచితమైన
జీవనమును వెల్గఁ జేయుకొఱకె
యున్నదంచుఁ దలఁచి, యున్నతిం గొనఁగాను
చిత్రకారునిగనుఁ జెలఁగి వఱలె!


తే.గీ.
చిత్రకారునిగా నుండి చిత్రములకుఁ
బ్రాణమందించి ప్రజల జీవనముఁ దనదు
కుంచెతోడుతఁ జిత్రించి, కోరి కోరి
ప్రజల హృదయాల వెలుఁగొంద శ్రమనుఁ బంచె!


తే.గీ.
కుదురుగాను ఛాయాగ్రాహకునిగ నెదిగి
ముద్దుఁగొల్పు ఛాయాచిత్రములవి యెన్నొ
జీవకళ యుట్టిపడఁగఁ దీర్చియును దిద్ది,
మెల్లమెల్లగఁ గవియయ్యె సల్లలితుఁడు!


కం.

జనమనములఁ వెలిఁగింపఁగఁ
దన హృదయమునందు వఱలు తఱచగు భావాల్
వినయాంచిత గుణ మయుఁడై
ఘనతరముగఁ గవితలందుఁ గనఁబఱచి యిడెన్!


తే.గీ.
హైదరాబాదు నగరమ్ము సాదరమున
స్వాగతము వల్కఁ దఱలియు వచ్చి, దాని
స్థిరనివాసమ్ముగాఁ గొని, జీవితమ్ముఁ
గడుప మొదలిడి, జనులందు ఘనుఁడునయ్యె!


తే.గీ.
క్రమముగాను నాంధ్రజ్యోతి గారవింప,
వారి దినపత్రికను నొక్క ప్రక్క నున్న
కాలమందు సిటీలైఫ్ వికాసమందఁ
దనదు చిన్న కైతలు వెల్గె దినదినమ్ము!


ఆ.వె.
తనదు కైత చేతఁ దనదైన ముద్రచేఁ
బాఠకుల యెదలును పల్లవింప,
సమసమాజ చేతనమును, నాలోచనా
దృక్పథమునుఁ బెంచి, స్థిరత వెల్గె!


తే.గీ.
ఇట్లొనరఁగఁజేసినయట్టి హితవరులగు
కొద్దిమందిలో నితఁడు నొక్కొండు నయ్యు
వఱలుచునె క్షయ బారినిఁ బడియుఁ దాను
దిరిగిరాని లోకాలకు నరిగెఁ దుదకు!


తే.గీ.
న్యాయవర్తన తోడ ధనార్జనమ్ము
వలయు నంచును దొరికిన వానితోనె
బ్రతుకు సాఁగించి, కైతకై పాటుపడియుఁ,
దనదు కళలనుఁ బ్రజలకై ధారపోసి,
యాకసపు ధ్రువతారయై యడరె నతఁడు!


స్వస్తి



మహామహోపాధ్యాయుఁడు - కోలాచల మల్లినాథ సూరి!


image of kolachala mallinatha suri కోసం చిత్ర ఫలితం

కం.

ఘన కాళిదాస కవి మన
సును నెఱిఁగియు వ్యాఖ్య వ్రాసి సుకవి బిరుదుచే
ఘనుఁడౌ కోలాచల మ
ల్లినాథ సూరిన్ నుతింతుఁ బ్రీతిఁ గవితలన్!


తే.గీ.
కాళిదాస భారవి మాఘ కవుల ఘనత
కుద్దియైన శ్రీహర్షునిఁ గూడ తనదు
వ్యాఖ్యచేతను దెలుఁగుల హర్షితులుగఁ
జేసి మల్లినాథుఁడు వెల్గె స్థిరముగాను!


కం.

సఖ్యతఁ దెలుంగు సంస్కృత
ప్రఖ్యాత కవీంద్ర శాస్త్ర పండితుఁడయ్యున్
వ్యాఖ్యాతృ శిరోమణిగా
విఖ్యాతిం గొని వెలింగె విశ్వమునందున్!


తే.గీ.
ఆ మహామహోపాధ్యాయ ధీమతుఁ డిలఁ
గాళిదాసాది సుకవుల గరిమఁ దెలుప
మున్ను పంచమహాకావ్యములకుఁ దాను
వ్యాఖ్యలను వ్రాసి ప్రాచుర్యపఱచె భువిని!


తే.గీ.
మెతుకు సీమను వెలసియు బ్రతుకునకును
సార్థకతఁ బెంచు సాహిత్య సంస్కృతు లిడి
పఱఁగ విద్యార్థి లోకమ్ము పఠన సేయ,
వ్యాఖ్య లందించి, చిరజీవియై నిలిచెను!


తే.గీ.
కావ్యసౌందర్యమునకు వికసనము నిడి,
రసము చిప్పిల్ల, శయ్యయు రమ్యతఁ గొన,
శ్లోక పద వాక్య సుగతార్థ లోకనుఁడయి
వ్యాఖ్య విరచించె ధీశక్తి పరిఢవిలఁగ!


కం.

మును పెందఱు వ్యాఖ్యాతలు
ఘనముగ వ్యాఖ్యానములనుఁ గావించిననున్
దన వ్యాఖ్యానముచేతను
జన మన మలరార నిల్చె సంస్కృత జగతిన్!


ఆ.వె.
ప్రాఁత పద్ధతులను వదలి, కొంగ్రొత్తవౌ
పద్ధతులను గొనియు వ్రాసె వ్యాఖ్య!
కావ్య సంస్థిత వరకవి హృదయావిష్కృ
తంపు వ్యాఖ్య నిడియు ధన్యుఁ డాయె!


ఆ.వె.
అన్వయమ్ము తోడ, ననపేక్షిత మమూల
విషయ మిడక, తనదు విద్య వెలుఁగ,
సంస్కృతజ్ఞులంత సంతృప్తి పడునట్లు
వ్యాఖ్య వ్రాసి, తాను వఱలె భువిని!


తే.గీ.
పూర్వ వ్యాఖ్యాతృ పాండితీ పూర్ణములగు
వ్యాఖ్యలను వీడి, తనదైన వ్యాఖ్యఁ గొనియు,
బాలకులు సులభమ్ముగఁ బఠన సేయఁ
గలుగు రీతిని విరచించె ఘనతరముగ!


ఆ.వె.
కాకతీయ రాజ్య ఘనవైభవోపేత
భూషితుఁడయి, రాజ పోషణమునఁ
దళుకు లీనఁగా, శతావధానియు నయ్యు,
తనదు ప్రతిభఁ జాటె ధరణిలోన!


తే.గీ.
మందబుద్ధులకును వ్యాఖ్య మహితముగను
నర్థమగు రీతి వ్రాసియు, నవని కెపుడు
శ్రేయమునుఁ గూర్పఁగాను సంజీవనిగను;
సహృదయోల్లాస మిడఁగ రచనము సేసె!


కం.

ఈ రీతిని వ్యాఖ్యానము
సారించియు బాలకులను సంస్కృతమునఁ దాఁ
గోరియుఁ జదువఁగఁ జేసియు
మీఱిన యా మల్లినాథు మెత్తు మనమునన్!




స్వస్తి

బుధవారం, జనవరి 10, 2018

తెలుఁగు భాషా ప్రథమ స్వతంత్ర కవి - పాల్కుఱికి సోమనాథ మహాకవి!

hd image of palkuriki somana కోసం చిత్ర ఫలితం


కందములు:
ఘన కాకతీయ కాల
మ్మునఁ దిరమగు నోరుఁగంటి పురిఁ బాల్కుఱికిన్
జననమ్ము నంది తా వెలిఁ
గెను సోమన సకల శాస్త్ర గీ రధికృతుఁడై!

వారని శివ భక్తియు దై
వాఱంగను శైవదీక్షఁ బఱఁగం గొనియున్
వీరమహేశ్వర వ్రతుఁడై
ధీరత వినుతించె నభవుఁ దిరముగఁ దానున్!

తెలుఁగుం గన్నడ సంస్కృత
ముల నధికారమునఁ గావ్యములను రచింపన్
బులకించె జనుల హృదులునుఁ
దులకించెను సోమనాథుఁడును లోకమునన్!

శివకవి యుగమ్ము నందునఁ
గవి పాల్కుఱికియె ముదమునఁ గావ్య రచనమున్
బ్రవిమల కాంతులఁ జిమ్మఁగ
సువిదితముగఁ జేసెఁ గవులు చోద్యము నందన్!

కమనీయ వీర శైవయు
తము బసవపురాణ పండితారాధ్యచరి 
త్రముల విరచించి జనులకు
నమల ద్విపదాఖ్య పద్యహారముల నిడెన్!

అనుభవసారము నెల్లను
ననుభవసార మను పేర నతుల సుకావ్య
మ్మును రచియించియుఁ బ్రజ కిడి
తన జన్మ వెలుంగు లీనఁ దనియించె ధరన్!

పలుకావ్యాల్ విరచించియుఁ
దెలుఁగుల కందించి జనుల తిరమగు పలుకుల్
విలువైన రీతిఁ బ్రసరణ
ముల వెలయించియు వెలింగె ముదమునఁ దానున్!

శివభక్తుల కథ లెల్ల న
భవు కృపచేఁ దాను నెఱుక పఱచి జనులకున్
శివ మహిమలఁ జూపించెను
నవనీత మనోజ్ఞ హృద్జ్ఞ నవ్యపథమునన్!

శ్రీ వీరశైవ భూసుర
కైవార ప్రకట నిగమ గమ్యవిదుండై
యా వీరశైవ ఘనుఁడే
దైవారాధననుఁ గృతులఁ దరియింప నిడెన్!

ఆ మహనీయుని కెనయగు
నే మహనీయుఁడును లేఁడు నిక్కముగ భువిన్
సామాన్యుఁడు కాఁ డాతం
డా మాన్యున కంజలింతు ననిశము నేనున్! 

స్వస్తి

బుధవారం, జనవరి 03, 2018

భారత దేశపు ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయి పూలే



తేటగీతులు:

భరతదేశమ్మునందునఁ బ్రథమ మాని
నీ యుపాధ్యాయి సావిత్రి బాయి ఫూలె
సాహసమ్మునకును సమాజావసరపు
టుద్యమమ్ము నడపినట్టి సద్యశోధి!

ఆమెనుం గూర్చి ముచ్చట లాడకుండ
స్త్రీల స్వేచ్ఛాసమానత్వ లీలఁగూర్చి
మాటలాడఁగలేరయ్య మహిళ లెపుడుఁ
దమకు స్వేచ్ఛ నొసంగిన దైవమగుట!

మును మహాత్ముఁడౌ జ్యోతిబా ఫూలె తోడఁ
దన వివాహమ్ము జరిగిన తదుపరి తన
జీవితమె మాఱిపోయె! సుశ్రేష్ఠుఁడైన
భర్త యడుగు జాడలఁ జరింపఁగఁ దలంచె!

కుల వివక్షతకు వ్యతిరేకులయి జ్యోతి
రావు ఫూలె దంపతులు విరామ మిడక,
వంచనకు గుఱియైనట్టి బాధితులనుఁ
జేరఁదీసి, వెతలఁదీర్చి, స్థిరత నిడిరి!

చదువుకొనుటకునుఁ గుటుంబ సభ్యులెంత
వ్యాతిరిక్త్యమ్ముఁ జూపించి, వంకలిడిన,
ధైర్యముగ నిలువంబడి, ధవుని యాజ్ఞఁ
బడసి, సామాజికోద్యమ పాత్రనుఁ గొనె!

భర్త నుండియుఁ బ్రశ్నించు స్పందనలను
నేర్చుకొని, యగ్ర కులపు మన్నెఱికముపయిఁ
దిరుగఁబడి, ఛీత్కృతులు, ఱాళ్ళ దెబ్బలెన్నొ
లెక్క సేయక, తాఁ బ్రజ్వలించె నపుడు!

అల్ప కుల బాలికలను సమాదరించి,
చదువు నేర్పె! కార్మికుల, కర్షకుల కొఱకు
రాత్రి పాఠశాలలను ప్రారంభపఱచి,
వెలుఁగు లిడి, తాను వెలిఁగె సావిత్రిబాయి!

అగ్ర కులములందున్నట్టి యధవలకును
మూర్ధజమ్ములఁ బట్టియు ముండనమునుఁ
జేయ నెదిరించి, మాన్పంగఁజేసి, వారి
యార్తినిం బాపి, రక్షించె నమ్మవోలె!

విధవలకు శరణము నిడు వేశ్మములను
స్థాపనము సేసి, చదువులఁ జక్కపఱచి,
వారి కాళ్ళపై వారి నిల్వంగఁజేసి,
బ్రతుకు నిచ్చి కాపాడె వరాల తల్లి!

పూణెలోఁ బ్లేగు వ్యాపింపఁ బోరి తాను
తనదు తనయుని సాయమ్ముఁ గొనియు వేగఁ
బ్రజలఁ గాపాడి, చివర కా వ్యాధిసోఁకి,
ప్రాణము ల్వీడి, తానేఁగె స్వర్గమునకు!

అట్టి యసహాయ శూరకు, నట్టి ధీర,
కట్టి సంస్కర్త్రి, కట్టి మహాత్మ, కట్టి
మాత, కట్టి సన్నుత దయామయికి నేను
వందనము సేతు నిరతమ్ము డెందమందు!


స్వస్తి