Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 17, 2016

అయుత కవితా యజ్ఞము (301 నుండి 321 వరకు)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-02-2016
కవిత సంఖ్య: 301

శీర్షిక:-  సరస్వతీ మాత కృప!

తే.గీ.
సత్కవీంద్ర హృత్పద్మ సం♦పత్కర తరు
ణార్క రోచిర్జనిత శుభ్ర ♦ నందితారు
ణ స్వరూపిణి మాత స♦రస్వతికిని
మ్రొక్కు సత్కవి తతి పల్కు ♦ వాక్కులడరు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-02-2016

శీర్షిక:-  నవగ్రహానుగ్రహము!

కవిత సంఖ్య: 302
కం.
భాముఁడు, సోముఁడు, భౌముఁడు,
సోమజుఁడుం, దేవ గురుఁడు, ♦ శుక్రుఁడు, శనియున్,
సోమ గ్రాహియుఁ, గేతువు
గాములు తొమ్మిది; జనులకు ♦ గరిమను జూపున్!
***************
(ఇదియే భావము మఱొక కంద మందున)
కవిత సంఖ్య: 303
కం.
రవి, రాట్, కుజ, బుధ, గురు, కవి,
రవిజ, తమ, శ్శిఖి నవ ఖచ♦రమ్ములు నెపుడున్
భువి చుట్టుఁ దిరుగు చున్, మఱి,
భువి జనులను బాధ పఱుపఁ ♦ బొదలింపఁ గనున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-02-2016

శీర్షిక:-  శక్తిస్వరూపిణి..దుర్గ!

కవిత సంఖ్య: 304

[దుర్గాదేవి నబల యను తృణీకార భావనచే నని సేయ నుంకించిన మహిషుని నా మాత పాఱఁద్రోలిన ఘట్టము]

కం.
జంకువిడి, దుర్గ, మహిషుని
సంకటమునఁ ద్రోయ; వాఁడు ♦ శక్తి నశింపన్,
గొంకుఁ గొని పాఱెఁ! జిత్రము!
జింకను గని బెదరి పాఱెఁ ♦ జిఱుతపులి వడిన్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 12-02-2016

శీర్షిక:-  ఆదిశక్తి!

కవిత సంఖ్య: 305

సీ.
ఓంకార రూపిణీ! ♦ యోగీశ తోషిణీ!
....దివిజ సంస్తుత గాత్రి! ♦ త్రిపుర హంత్రి!
ఐంకార రూపిణీ! ♦ ఆనంద పోషణీ!
....షడ్భుజాయుధ ధాత్రి! ♦ శైల పుత్రి!
హ్రీంకార రూపిణీ! ♦ త్రిపథ సంచారిణీ!
....సర్వార్థ దాత్రి! ప్ర♦శస్త గాత్రి!
శ్రీంకార రూపిణీ! ♦ శ్రితజన కళ్యాణి!
....దనుజ నాశన కర్త్రి! ♦ తరళ నేత్రి!
గీ.
సర్వ మంత్రాత్మికా! కృపా ♦ శరధి! మాత!
సర్వ యంత్రాత్మికా! సర్వ ♦ శక్తిదాత!
సర్వ తంత్రాత్మికా! మహై♦శ్వర్య మహిత!
సర్వ లోకేశ్వరీ! తల్లి! ♦ సన్నుతు లివె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-02-2016
కవిత సంఖ్య: 306

శీర్షిక:- భాగవతోత్తముఁడు...నారదుఁడు!

కం.
నారాయణ నామామృత
పారాయణ సక్త చిత్త! ♦ భక్త శ్రేష్ఠా!
దూరస్థిత భవబంధా!
నారద! సంగీత లోల! ♦ నాభిజ తనయా!

తే.గీ.
భక్తి రస సుధాస్వాద! స♦స్వర సుగాత్ర!
పరమ భాగవత శ్రేష్ఠ! ♦ సుర మునీంద్ర!
లోక కళ్యాణ కామి! ♦ త్రిలోక గామి!
కలహ భోజనా! నా నమ♦స్కారము లివె!!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-02-2016
కవిత సంఖ్య: 307

శీర్షిక:- వైద్య నికాయము!

సమస్య:-
యముఁ గని రోగార్తుఁ డొక్కఁ డానందించెన్!

కం.
సమయించి వ్యాధి; రోగుల
యము దరికిం జేరకుండ ♦ నాపెడువారౌ
ప్రముఖోద్య ద్వైద్య నికా
యముఁ గని, రోగార్తుఁ డొక్కఁ ♦ డానందించెన్!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-02-2016
కవిత సంఖ్య: 308

శీర్షిక:- కన్న ప్రేమ!


తేటగీతి (మాలిక):

కుంతి సేసిన సేవల ♦ కుబ్బి మునియు
మంత్ర ముపదేశ మిచ్చె! త♦న్మంత్ర మహిమ
గొంతి కుదయించఁ గర్ణుండు, ♦ "కొడుక! నిన్నుఁ
గన్నెఁగాఁ గంటి; నపవాదుఁ ♦ గందు నేమొ?
కష్ట మగునని విడచు పా♦పిష్టురాల!
నిట్టి నీ తల్లి గంగలో ♦ నిన్ను విడువఁ
గినుకఁ బూనకు మో తండ్రి, ♦ కెంపుఁ గనుల!
విడువలేనయ్య దయమాలి; ♦ విధి బలీయ
మగుడు నిన్నిట్లు విడుతును! ♦ మమత తోడ
నిన్ను నే తల్లి యేనియుఁ ♦ గన్నులారఁ
గాంచి, తప్పక సాకునుఁ ♦ గడు ముదమున;
కవచ కుండలముల చిన్ని♦కన్న! నన్ను
మన్ననము సేయు మో యన్న, ♦ కన్నతండ్రి!"
యనుచు నేడ్చుచుఁ బేటిక ♦ నునిచి పృథయ
గంగలోఁ బో విడెను శోక ♦ కంజ నేత్ర!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-02-2016
కవిత సంఖ్య: 309

శీర్షిక:- దుర్బోధ!

సమస్య:-
బోధ సేయు గురుఁడు మూర్ఖుఁడు కద!

ఆ.వె.
తల్లి తండ్రి భార్య ♦ తనయులు సోదరుల్
బంధు మిత్రు లనెడి ♦ భ్రమను విడక;
యిదియ నిత్య మంచు ♦ నిహలోకమందు దు
ర్బోధ సేయు గురుఁడు ♦ మూర్ఖుఁడు కద!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-02-2016
కవిత సంఖ్య: 310

శీర్షిక:- కర్ణోవాచ!

సమస్య:-
సూత సుతుఁ డర్జునునిఁ జంపి ఖ్యాతిఁ గనెను

పూరణము:

(తనను పాండవ పక్షమున చేరుమన్నకుంతీదేవితో కర్ణుడు పలికిన సందర్భము)

తే.గీ.
"తల్లి! నేనొ? యర్జునుఁడొ? యు♦ద్ధమ్మునందు
మిగుల; నేవురు మునుపట్లు ♦ మిగులుదు రిఁక!
సూత సుతుఁ డర్జునునిఁ జంపి ♦ ఖ్యాతిఁ గనెన
నియొ, నతఁడె కర్ణుఁ జంపె ♦ ననియొ? వినుండు!"

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-02-2016
కవిత సంఖ్య: 311

శీర్షిక:- లవకుశులు!

కం.
అవనీతనూజ సీతకు
లవకుశు లుదయించి, వీరు♦లై, గాయకులై;
కవి వాల్మీకియు నేర్పఁగ;
శ్రవణ సుభగ రామగాథఁ ♦ బ్రవచించిరిగా!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 15-02-2016
కవిత సంఖ్య: 312

శీర్షిక:- సాయం సంధ్యా వర్ణనము!

తే.గీ.
చెలఁగె యుద్ధమ్ము లా కురు ♦ క్షేత్ర మందుఁ
బాండవులు కౌరవుల్ పర♦స్పరము రోష
భీష ణాస్త్ర శస్త్ర తతులఁ ♦ బెనఁగి, చంప,
రుధిర ధార లట్లుండె నా ♦ రుధిర సంధ్య!

-:శుభం భూయాత్:-
******************

సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-02-2016
కవిత సంఖ్య: 313

శీర్షిక:- మఠ ప్రవేశము!

సమస్య:-
కమఠమునం జొచ్చి మేలుఁ గనెఁ బథికుఁ డటన్!

కం.
విమలాత్ముఁడౌ జినున్ గౌ
తమ బుద్ధుని యాశ్రయించి, ♦ ధర్మ పథమునన్
శ్రమణక వృత్తిఁ గొనెడి వే
డ్క, మఠమునం జొచ్చి, మేలుఁ ♦ గనెఁ బథికుఁ డటన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-02-2016
కవిత సంఖ్య: 314

శీర్షిక:- వేవిళ్ళు!

సమస్య:-
వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె

తే.గీ.
'ముని మనుమఁడో, మనుమరాలొ?', ♦ మనుమరాలు
కనినఁ జాలుఁ, గనులఁ జూచి, ♦ చనెడు నాశ
వృద్ధురాలికి! నేఁడు వే♦విళ్ళు గలిగె
మనుమరాలికి! తాతమ్మ ♦ మనసు మురిసె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-02-2016
కవిత సంఖ్య: 315

శీర్షిక:- మురళీ సుస్వరాలు...!


సమస్య:-
రాలు కరఁగించు నెదను వరాల నిచ్చు

తే.గీ.
గోపికా లోలుఁడు, యశోద ♦ కూర్మి సుతుఁడు
సేయు శిష్ట రక్షణ, దుష్ట ♦ శిక్షణ; విని
పించు నట్టి మృదు మధుర ♦ వేణు సుస్వ
రాలు, కరఁగించు నెదను; వ♦రాల నిచ్చు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-02-2016
కవిత సంఖ్య: 316

శీర్షిక:- విష్ణుస్తుతి!

శార్దూలవిక్రీడితము(సంస్కృతమున):
వందే విష్ణు మనంత మబ్ధిశయనం ♦ వందే ముకుందం హరిం
వందే పంకజనాభ మచ్యుత మజం ♦ వందే೭క్షరం మాధవమ్|
వందే೭హం మధుసూదనం సువదనం ♦ వందే ఖగేంద్రధ్వజం
వందే శ్రీదయితం ద్విజేంద్రగమనం ♦ వందే జగన్మోహనమ్||

ఇదే భావము....

శార్దూలవిక్రీడితము(తెనుఁగున):
కొల్తున్ విష్ణు ననంతు నబ్ధిశయనున్ ♦ గొల్తున్ ముకుందున్ హరిన్
గొల్తున్ బంకజనాభు నచ్యుతు నజున్ ♦ గొ ల్తక్షరు న్మాధవున్
గొల్తున్ నే మధుసూదనున్ సువదనున్ ♦ గొల్తున్ ఖగేంద్రధ్వజున్
గొల్తున్ శ్రీదయితున్ ద్విజేంద్రగమనున్ ♦ గొల్తున్ జగన్మోహనున్!

స్రగ్ధరావృత్తము:
కొల్తు న్విష్ణు న్ముకుందుం ♦ గొలుతు మురహరుం ♦ గొల్తు దైత్యారి నీశున్
గొల్తుం జక్రిం ద్రిపాత్తుం ♦ గొలుతును ధ్రువునిం ♦ గొల్తు నేఁ గైటభారిన్
గొల్తున్ హేమాంగునిన్ నేఁ ♦ గొలుతు నమృతదుం ♦ గొల్తుఁ బక్షీంద్రధుర్యున్
గొల్తున్ లక్ష్మీవిభున్ నేఁ ♦ గొలుతు హరి నజున్ ♦ గొల్తుఁ బంకేరుహాక్షున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-02-2016
కవిత సంఖ్య: 317

శీర్షిక:- కపట ముని!

సమస్య:-
మునిని సంహరించె ననిల సుతుఁడు!

ఆ.వె.
రావణుండుఁ బనుప ♦ రాక్షస మాయచేఁ
గాలనేమి మాఱెఁ ♦ గపట మునిగ;
ధాన్యమాలి వలన ♦ ధౌర్త్యమ్ము గ్రహియించి,
మునిని సంహరించె ♦ ననిల సుతుఁడు!

-:శుభం భూయాత్:-
******************
కవిజన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-02-2016

శీర్షిక:- కారణము!

సమస్య:-
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్!

కవిత సంఖ్య: 318

చంపకమాల:
ప్రణతు లొనర్చి విఘ్నపతిఁ ♦ బ్రార్థన సేయఁగ విద్య లిచ్చి, ష
డ్గుణముల డుల్చి, సన్మతినిఁ ♦ గూర్చి, ముదమ్ములఁ బేర్చి, స
త్ఫణితి నొనర్చి, వేగ ననుఁ ♦ బాలన సేసెడి నాదు జన్మతా
రణమది శాంతిసౌఖ్యముల ♦ రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్!
*************************

కవిత సంఖ్య: 319

చంపకమాల:
గణపతి, విఘ్నహారియు, న♦గాత్మజకున్ తొలి పుత్రకుండు, స
ద్గుణములఁ బెంచు వేలుపునుఁ, ♦ గుంజరశీర్షుఁడు, వక్రతుండుఁ డీ
ప్రణతుల స్వీకరించఁగను ♦ బ్రార్థన సేయఁగ నన్ను దేర్చు కా
రణమది శాంతిసౌఖ్యముల ♦ రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్!

-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 16-02-2016
కవిత సంఖ్య: 320

శీర్షిక:- వానరులే కారకులు...!

సమస్య:-
నరులే కారణము లంక నాశనమునకున్!

కం.
వరకామి రావణుఁడు వా
నరముఖు నందీశు హేళ♦నముఁ జేయ నతం
డురుశాప మిడెఁ గనుక వా
నరులే కారణము లంక ♦ నాశనమునకున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 17-02-2016
కవిత సంఖ్య: 321

శీర్షిక:- విష్ణుస్తుతి!


కందగర్భిత తేటగీతి:

శ్రీశ! దనుజారి! పింగళ! ♦ కేశవ! మధు
సూదన! విధి! కేశట! కపి! ♦ నా[ద మురళి!]
కేశ! నుత! జిన! యతి! హృషీ♦కేశ! కపిల!
శౌరి! వరద! గిరిధర! వం♦దే [రమేశ!]గర్భిత కందము:

శ్రీశ! ధనుజారి! పింగళ!
కేశవ! మధుసూదన! విధి! ♦ కేశట! కపి! నా
కేశ నుత! జిన! యతి! హృషీ
కేశ! కపిల! శౌరి! వరద! ♦ గిరిధర! వందే!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి