Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 24, 2016

అయుత కవితా యజ్ఞము (351-363)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 351

శీర్షిక:- శ్రీరామ ప్రణతా...శివా!

సమస్య:-
శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్!

కం.
"మారజిత! భర్గ! ధూర్జటి!
మేరుగుణి! కృశానురేత! ♦ మృత్యుంజయ! గౌ
రీ రమణా! సుప్రణత
శ్రీరామా!" యని పిలిచిన, ♦ "శివుఁ" డేతెంచెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 352

శీర్షిక:- నిజమైన పితృ శ్రాద్ధము...!

ఆ.వె.
బ్రతికియున్ననాఁడు ♦ పలు బాధలం బెట్టి
మరణ మంది నంత ♦ మదినిఁ దలఁచి
విందు సేయ నగునె? ♦ పితలు మనియు నుండ
శ్రద్ధ నిడెడి ప్రేమ ♦ శ్రాద్ధమగును!

ఆ.వె.
బ్రదుకు నిడిన పితలు ♦ బ్రతికి యున్నప్పుడే
శ్రద్ధతోడ వారిఁ ♦ జక్కఁగాను
పితృ సపర్య చేసి ♦ ప్రేమల నందించి
వలయు భోగము లిడు♦ట లగు శ్రద్ధ!

ఆ.వె.
మనిననాఁ డిడకయ ♦ మరణించి నంతన
శ్రాద్ధకర్మ పేర ♦ సర్వులకునుఁ
బెట్టి ఘనతఁ జాటఁ ♦ బితృసేవ యది కాదు!
స్వీయతృప్తియె! యది ♦ విలువ కలదె?

(కావున మన పితరులకు వారు బ్రతికియున్నపుడే వలయు కోరికలను దీర్చి వారి
నానందింపఁ జేయుటయే నిజమైన శ్రాద్ధమని యెఱుంగునది. మరణించిన పిదప నెన్ని
యొనర్చినను వ్యర్థములు గదా!)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 353

శీర్షిక:- సజ్జన గమ్యము...!!!

సమస్య:-
సజ్జనులు చేరుదురు యమసదనమునకు

తే.గీ.
సత్య చింతన ధర్మ ప్ర♦చారము మఱి
పుణ్యవర్తన కారణ♦మునను దివిని
సజ్జనులు చేరుదురు యమ♦సదనమునకుఁ
బిల్చు యమభటులను వీడి ♦ వేగిరముగ!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 354

శీర్షిక:- కవి కలము!

మధ్యాక్కర (మాలిక):
కవి కలమునకున్న మహిమ ♦ ఖరకరుఁ డీయంగ వెఱచు
చెవికిడు నందమ్ము "కవిత" ♦ చెవిపోఁగు చెవికీయ డించు
నవ నవోన్మేష శాలియగు ♦ నదియ నవ్యార్థ మందించు
సవన భాతిగఁ దత్కృతి నిల ♦ శాశ్వతమ్ముగ నిల్వ నుంచు
శివ సత్య సుందరము లిడు ♦ శ్రీ శివేతర హృతిఁ బెంచు
వ్యవహార విదితంపు టెఱుక ♦ భవ్య కావ్యమ్మె యందించు
కవికిఁ బరార్థ మందించి ♦ ఘనకీర్తి భువిలోనఁ బెంచు
భవమందకుండంగ భువినిఁ ♦ బరము నందించి రహించు
సువిదిత హిత సతి వలెను ♦ సూక్తులఁ బ్రేమ బోధించు
కవికినిఁ బ్రియసుత యయ్యుఁ ♦ "గవిత" యీ జగముం జయించు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 355

శీర్షిక:- ఊర్వశి స్వగతము!

దత్తపది:-
కారు-లారి-జీపు-వ్యాను...పదముల నుపయోగించి...భారతార్థమున నేను వ్రాసిన పద్యము.

(దేవసభలో నర్జునునిం గనిన యూర్వశి కామపరవశయై మనమున వితర్కించు ఘట్టము నిట
ననుసంధానించుకొనునది)

తే.గీ.
"మోహనాకారుఁ డీతఁడు! ♦ ముద్దుఁ దీర్ప
నీ బలారి సుతునిఁ గోర ♦ నేమి యనునొ?
చూడఁగ నెలరా జీ పురు♦షుండె!" యనుచుఁ
గవ్వడి పయి నవ్యానురా♦గమ్ముఁ జూపె!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 356

శీర్షిక:- శ్రీ రామ శరణార్థి!

దత్తపది:-
కారు-లారీ-జీపు-వ్యాను...పదముల నుపయోగించి....రామాయణార్థమున నేను వ్రాసిన పద్యము...

[పరనారినిం జెఱఁబెట్టుట లంకకుఁ జేటగుననిన విభీషణుని రావణుఁడు కుపితుఁడై
వెడలఁగొట్టఁగా, శ్రీరాముని శరణుఁ జొచ్చి, జరిగిన దంతయును వివరించు
సందర్భము]

తే.గీ.
"ఓయి కారుణ్యమూర్తి! మ♦హోగ్రులయ్యు
నపుడె లంకేశు లారీతి ♦ నన్నుఁ గ్రూర
దౌష్ట్యపుం జీపురులతోడఁ ♦ దఱుమ, నేను
నీదు దివ్యానురాగ సం♦స్నిగ్ధు నైతి!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 357

శీర్షిక:- పోటుమగఁడు!

(సత్యాపతి పారిజాతాపహరణ మొనరింపఁగా, మగఁటిమితో యుద్ధమొనర్చి, గెల్చి, యా
వృక్షము మఱలంగఁగొని, నందనోద్యానమందుఁ బునః ప్రతిష్ఠింపుమని పౌలోమి,
శచీపతినిం గోరిన సందర్భము)

మత్తేభవిక్రీడితము:
“మగఁడా! పోటుమగండ వీవె యని సం♦భావింప, నిప్పట్టునం
దగ సత్యాపతిఁ బారిజాతనగహ♦ర్తన్, జంభవైరీ! సుసం
యుగమందున్ బడఁగొట్టి, వేల్పుఁదరువున్ ♦ యోగ్యుండవై గెల్చి, యీ
నగరోద్యానమునందునిల్పు మిపుడే, ♦ నాకౌకసుల్ మెచ్చఁగన్!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 358

శీర్షిక:- వెన్నుని రూపము!

కం.
"కమలముల వంటి కన్నులు,
తిమిరమ్మయె ఱెప్పలుగనుఁ, ♦ ద్రిణత బొమల్, ఘ్రా
ణమె నువుఁబువు, బింబమె మో
వి, మోము ౘందురునిఁ బోలు ♦ వెన్నునిఁ గనరే!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 359

శీర్షిక:- మూర్ఖుని మరణము!

సమస్య:-
ముని పత్నిని బొందనెంచి మూర్ఖుడు జచ్చెన్! (అంజన్న గారిచ్చిన సమస్య)

కం.
అనయము మద్యముఁ గ్రోలుచు
వినయమ్మెది లేక తులువ ♦ విధి నడచుచు దు
ష్టుని గతిఁ బరసతి యౌ భీ
ముని పత్నిని బొందనెంచి ♦ మూర్ఖుడు జచ్చెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 360

శీర్షిక:- పతినిఁ బిలిచిన సతి!

సమస్య:-
కొడుకా ననుఁ గూడు మనుచుఁ గోమలి పిలిచెన్!
(అంజన్న గారిచ్చిన సమస్య)

కం.
ఎడబాటుఁ దాళలేకయె
తడవుచుఁ దన మగనిఁ జేరి, ♦ తడఁబడు నతనిన్
"దడవేల నాదు మామకుఁ
గొడుకా! ననుఁ గూడు" మనుచుఁ ♦ గోమలి పిలిచెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 361

శీర్షిక:- రిక్కల మగఁడా...చందమామా!

సమస్య:-
మగఁడా రమ్మని పిలువఁగ మా మేతెంచెన్

(అంజన్న గారిచ్చిన సమస్య)

కం.
మగనిని వంచించిన యా
వగకత్తియ తార మదిని ♦ వలపు తలిర్పన్
దొగఱేనిఁ జేరి "రిక్కల
మగఁడా ర" మ్మని పిలువఁగ ♦ మా మేతెంచెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 362

శీర్షిక:- ౙరా సునియే! సును!

సమస్య:-
యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్

(దేవుని పేరిట మోసముం జేయు దొంగ గురువుల బోధలను నమ్మినచోఁ జెడిపోదురనియుం
దన మాటలను విని, దైవమును నమ్మినచో సిరులనుం బొందెదరని పలికెడి యొకానొక
హిందీ తెలిసిన భక్తుని ఉవాచ...)

కం.
"కాసుల కొఱకై, దేవుని
దాసులమని పలుకుటఁ గన, ♦ తస్కర్, గోల్‍మాల్!
యే సమజుకే, ౙరా సుని
యే! సును! నమ్మినఁ, ద్రినేత్రుఁ ♦ డిచ్చును సిరులన్!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 24-02-2016
కవిత సంఖ్య: 363

శీర్షిక:- పొద్దుపొడుపు!

సీ.
"కొక్కొరో...కో" యని ♦ కోడి కూయంగనే
.....పక్షుల కిలకిలల్ ♦ బదు లిడఁగనె
ప్రాగ్దిశా ముఖ మెఱ్ఱఁ ♦ బాఱిన యంతనే
.....లోకంపుఁ బెనునిద్ర ♦ లొకపరి సన
నుఱుకు పర్వులతోడ ♦ నువిద లెల్లఱు పనుల్
.....చక్క దిద్దంగను ♦ సరభసిలఁగఁ
దల్లిఁ గానక లేచి ♦ పిల్లవాం డ్రందఱు
.....గగ్గోలు పెట్టుచు ♦ బిగ్గ నేడ్వఁ
గీ.
దెల్లవాఱిన దోయంచు ♦ ముల్లె మూఁట
నెత్తి కెత్తి యమ్మఁగ వీథి ♦ నెక్కి యఱచి
"కూరగాయల, సరుకులఁ ♦గొను గొనుఁ" డని
మొత్తుకొనుచుండ సూర్యుండు ♦ నెత్తి నెత్తె!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి