అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 20-02-2016
కవిత సంఖ్య: 323
శీర్షిక:- విష్ణుస్తుతి (గర్భకవిత్వము)
*
నవాక్షర సమవృత్త, కంద త్రయ, మణిగణనికర(శశికళా)వృత్త గర్భిత సరసిజ వృత్తము:
*
సరసిజ వృత్తము:
శ్రీవత్సాంకా! చేతును సేవల్! ♦ శివసఖ! మమతల ♦ సిరు లిడితి వయా
దేవాధీశా! దివ్య గతీవే! ♦ దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
దైవమ్మీవే! ధర్మువు తావై ♦ ధవళిత యశ మిడి ♦ దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ రావా! ♦ ప్రవిమల చరితను ♦ రయముగ నిడుమా!
[లక్షణము: మ-త-య-న-న-న-న-స...గణములుండును...
యతిమైత్రి:1-10-18 యక్షరములకు...
ప్రాసపాటింపఁబడును]
పై సరసిజ వృత్తమునందు....
ఒక నవాక్షర వృత్తము
మూఁడు కందపద్యములు
ఒక మణిగణనికర (శశికళా) వృత్తము
మొత్తము ఐదు పద్యములు ఇమిడియున్నవి....
అవి వరుసగా....
గర్భిత
నవాక్షర వృత్తము:
శ్రీవత్సాంకా! చేతును సేవల్!
దేవాధీశా! దివ్య గతీవే!
దైవమ్మీవే! ధర్మువు తావై
రావే యీశా! రక్షగ రావా!
*
గర్భిత
కందము(1)
శ్రీవత్సాంకా! చేతును
సేవల్! శివసఖ! మమతల ♦ సిరు లిడితి వయా!
దేవాధీశా! దివ్య గ
తీవే! దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
*
గర్భిత
కందము(2)
దైవమ్మీవే! ధర్మువు
తావై ధవళిత యశ మిడి ♦ దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ
రావా! ప్రవిమల చరితను ♦ రయమున నిడుమా!
*
గర్భిత
కందము(3)
శివసఖ! మమతల సిరు లిడి
తివయా! దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
ధవళిత యశ మిడి దయను సు
రవరా! ప్రవిమల చరితను ♦ రయమున నిడుమా!
*
గర్భిత
మణిగణనికర (శశికళా) వృత్తము:
శివసఖ! మమతల ♦ సిరు లిడితి వయా
దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
ధవళిత యశ మిడి ♦ దయను సురవరా!
ప్రవిమల చరితను ♦ రయమున నిడుమా!
[లక్షణము: న-న-న-న-స...గణములుండును.
యతిమైత్రి:1-9 అక్షరములకు.
ప్రాసపాటింపఁబడును]
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి