Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 07, 2016

స్వరాష్ట్ర సాధకుఁడు...ఉద్యమ నేత...కేసీఆర్!

రవీంద్ర భారతిలో మొన్న ఆదివారం నాడు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మఱియు తెలంగాణ పద్య కవితా సదస్సు ఆధ్వర్యంలో జరిగిన పద్య తెలంగానంలో నేను పఠించిన పద్యాలు...


సీసము:
అఱువది యేఁడుల యాంధ్రాధిపత్యమ్ము
        నంతమ్ముఁ జేయంగఁ బంతమూని,
తెలఁగాణు లందఱ నిల నొక్క త్రాఁటి పైఁ
        కినిఁ దెచ్చి బలమిచ్చి ఘనత నూని,
నీరముల్ భూములు నిధులును గొలువులు
        వనరులం దోచిన పగిదిఁ దెలిపి,
తీవ్రమౌ పలుకులఁ "దెలఁగాణ వచ్చుడో
        కేసియార్ చచ్చుడో" కృత ప్రతిజ్ఞుఁ

డైన "కేసియార్ వ్రతదీక్ష", యాంధ్ర పాల
కులకుఁ బ్రక్కలో బల్లెమై, కునుకు నిడక,
చోద్యముగఁ దెలంగాణ రాష్ట్రోద్యమమును
ఢిల్లి కనిపి, సాధించె రాష్ట్రేప్సితమును!
(1)

ఉత్పలమాల:
ఈ తెలఁగాణ మాట యిఁక నెప్పుడు వల్కక యుండ నాజ్ఞ నా
నేతయు చంద్రబాబె యిడ; నిత్యము నీ తెలఁగాణ నామమే
చేతము పొంగఁగా వినిచె, శీఘ్ర మసెంబ్లియె మ్రోగఁ గేసియార్!
నేత యతండు రా! ఘన వినీతుఁడు, ధీరుఁడు, పుణ్య మూర్తిరా!!
(2)

ఉత్సాహము:
"సకల జనుల సమ్మె" చేసి, శాశ్వతముగఁ బ్రజల హృ
త్ప్రకర మందు నిలిచి వెలిఁగి, రాష్ట్ర సాధనమునకై
రకరకమ్ములైన వ్యూహ రచనములనుఁ జేసియున్
బ్రకటిత మ్మొనర్చెఁ బ్రజల రాష్ట్ర కాంక్ష ఢిల్లికిన్!
(3)

సీసము:

ఒక వంక నమరె సదుద్యమ స్ఫూర్తికై
        తెలఁగాణ జనభేరి దివ్య కృతము;
నొక చెంత నలరెఁ జెల్వొప్పఁగాఁ దెలఁగాణ
        సాగరహార సంజనిత వ్రతము;
నొక చోట మించె సముత్సుక తెలఁగాణ
        జనుల ధూంధాము చేతన గళములు;
నొకట నుజ్జృంభించె నుత్సాహ యుక్తమౌ
        సభ విరాజిల్లు ప్రసంగ ఫణితి;

యంత సమ్మెలు హర్తాళు లమర వీర
కలిత బలిదానములు సముత్కంఠ నిడఁగ,
నీ తెలంగాణ మంతయు నెద రగులఁగఁ,
జెలఁగె నిరశన వ్రతి చంద్రశేఖరుండు!
(4)

శార్దూలము:
ఢిల్లీకిం జని కేసియారె యచటన్ దిక్కుల్ ప్రకంపింప ఱం
పిల్లం జేసె స్వరాష్ట్ర కాంక్ష నినదం; బెల్లన్ సముత్కీర్ణ హృ
త్ఫుల్లాంభోజ సభాంతరాళ మలరన్ బోరాడి, సాధించె సం
సల్లీలన్ దెలఁగాణ రాష్ట్రమును నుత్సాహమ్ము దీపింపఁగన్!
( 5)

స్వస్తి

మధురకవి, సహస్ర కవి భూషణ
గుండు మధుసూదన్
వరంగల్




2 కామెంట్‌లు: