Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మార్చి 02, 2016

అయుత కవితా యజ్ఞము (401 నుండి 431 వరకు)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 401

శీర్షిక:- మయసభలో దుర్యోధనుఁడు...!!!

[మయసభలోఁ బరాభవమునుం బొందిన దుర్యోధనుని యాత్మగతము]

చంపకమాలిక:
"విసమును మ్రింగినట్లు కడు ♦ వేదన నాకునుఁ గల్గెఁ! బాండవుల్
పొసఁగఁగ రాజసూయమునుఁ ♦ బొందికఁ జేయఁగ నేల? రాజులన్
గసిమసఁగంగ గెల్చి, ధన♦గర్వము నందఁగ నేల? యిట్టి మా
య సభ మయాభిదత్త మయ♦మై సననేల? మహౌత్సుకుండనై
వెస సభ కేఁగ నేల? సని, ♦ వేగమె కల్ల సరస్సునందు సా
రసమునుఁ గాలితో భ్రమను ♦ రాయఁగ నేల? పడంగ నేల? మా
నస మది వ్రక్కలై చనెడు ♦ నట్టుల ద్రౌపది నవ్వనేల? నే
విసమును మ్రింగి జీవితము ♦ వీడెద నిప్డు! సహింపలే నిఁకన్!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 402

శీర్షిక:- మోక్ష సాధనము!

సమస్య:-
ధనమే మోక్షము గడింౘు దారినిఁ ౙూపున్

కం.
తన వారలు తన యాస్తులు
తన సంసారమ్ము తనదు ♦ ధనమను తలఁపుల్
మనమును విడిచెడి ఘన బం
ధనమే, మోక్షము గడింౘు ♦ దారినిఁ ౙూపున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 403

శీర్షిక:- త్రాగుఁబోతు!

సమస్య:-
లింగని ఈడ్చి ఈడ్చి వెడలించె గృహంబు కఠోర చిత్తుడై
(మిత్రులు అంజన్న గారిచ్చిన సమస్య)

[ఏ పనియుం జేయక, భార్య సంపాదనపై యాధారపడి, యామె తెచ్చిన కూలీ డబ్బునుం గుంజుకొని, ప్రతిదినమును మద్యముం ద్రావు మగని యకృత్యమును సహింపక యొక దినమున ధనము నీయ ననఁగ, నాతఁ డొనర్చిన దౌర్జన్యమునుం జూడుఁడు!]

ఉత్పలమాల:
అంగన తెచ్చు కూలిఁ గొని ♦ యంతట మద్యముఁ ద్రావు నీచుఁనిన్
గ్రుంగుచు వాని మాన్ప నొక ♦ రూకయు నీయ నటంచుఁ బల్కఁగన్
జెంగున దూఁకి, కోపమున ♦ సిగ్గును వీడియు జాలి వీడి, యా
లిం గని, యీడ్చి యీడ్చి, వెడ♦లించె గృహంబుఁ గఠోర చిత్తుఁడై!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 404

శీర్షిక:- ప్రవరుఁడు కనిన హిమనగము!

కం.
అటఁజని కాంచెను ప్రవరుఁడు
నిటలేక్షణ సద్మ బహుళ ♦ నిర్మలతుహినో
త్కట సలిల పతితనిర్ఝ
ర్యుటంకి తస్ఫుట నటిత మ♦యూర హిమాద్రిన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 405

శీర్షిక:- భీముని యలుక!

సమస్య:-
శివునిఁ జంపె భీమసేనుఁ డలిగి

(జరాసంధుని పరాక్రమమును నిరోధింప నుంకించు భీముని నాపి యర్జునుఁడు శివుని జయమునీయుమని వేడుచుండఁగనే, యలిగిన భీముఁ డా జరాసంధునిం జంపినాఁడనుట)

ఆ.వె.
మగధరా ట్పరాక్ర♦మ నిరుద్ధుఁ డా జరా
సంధుఁ జంపఁ బోయె! ♦ సవ్యసాచి
యాపి, "జయము నీయు" ♦ మని నెమ్మదిగ వేడె
శివునిఁ! జంపె భీమ♦సేనుఁ డలిగి!!

(మగధరా ట్పరాక్రమ నిరుద్ధుఁడు=భీముఁడు)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 406

శీర్షిక:- తార చేసిన యకృత్యము!

సమస్య:-
సీతా రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై


[తార చేసిన యకృత్యముం గని దేవతలు నిందించుచుఁ బలికిన సందర్భము]

శార్దూలవిక్రీడితము:
శీతాంశుం దగఁ జేరి కాముకతతోఁ ♦ జిత్రాంగివై, ధూర్తవై
చేతోమోదముఁ గల్గఁ గూడితివి సౌ♦శీల్యమ్ముఁ బోఁద్రోలి, దు
ష్ఖ్యాతిం బొంది, పతిన్ బృహస్పతిని దుః♦ఖాంభోధినిన్ ముంచి, యో
సీ! తారా! ముని గుండెఁ జీల్చితివి! రా♦శీభూతపాపాగ్నివై!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016

శీర్షిక:- ఆజానుబాహువు!

సమస్య:-
పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు!

కవిత సంఖ్య: 407

తే.గీ.
కమల పత్రాక్షుఁడు, శుభ ల♦క్షణుఁడు, ధర్మ
రక్షకుఁడు, నీల వర్ణుండు, ♦ రఘు కులుండు,
పతిత పావనుం, డసురారి, ♦ బలునిగఁ గను
పట్టు నాజాను బాహువే ♦ ప్రభువు నాకు!
*****************
కవిత సంఖ్య: 408
కం.
అబలఁ జెఱ నిడిన దశకం
ఠుఁ బిండి సేయుటకుఁ , దా ధ♦నుర్బాణములన్
సబలుఁడయి పట్టు, నాజా
ను బాహువే ప్రభువు నాకు! ♦ నుతియింతు వెసన్!!

[తేటగీతి పాదమునుం గందమున నిమిడ్చి వ్రాసితిని]
*****************
కవిత సంఖ్య: 409
తే.గీ.
మాయ సన్యాసియై భిక్ష ♦ వేయు మనియు,
మోసమున సీతఁ జెఱపట్టు ♦ మూర్ఖుఁ డైన
రావణుని వధించఁగ ధను♦ర్బాణములను
పట్టు నాజాను బాహువే ♦ ప్రభువు నాకు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 410

శీర్షిక:- స్వయంవరము!

సమస్య:-
వదిననుఁ బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

[అర్జునుఁడు కుంతీదేవితోఁ బలికిన సందర్భము]

కం.
"యదుకులుఁడు ప్రోత్సహింపఁగ
ముదమున నే మత్స్యయంత్ర♦మును భేదింపన్
మదిఁ బొంగుచు వేగమె ద్రో
వది ననుఁ బెండ్లాడెను బుధ♦వర్యులు మెచ్చన్!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 411

శీర్షిక:-  అనుమానము!

సమస్య:-
మానము పోవలె నటంచు మానిని తలఁచెన్

కం.
"ఏనాఁడునుఁ గలహింపని
యీ నా మగఁ డీ విధిఁ గల♦హించెను ననుమా
నాననె! కావున, నీ యను
మానము పోవలె" నటంచు ♦ మానిని తలఁచెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 412

శీర్షిక:-  స్వీయోద్ధరణము...!!!

తే.గీ.
“ఎవ్వఁడో వచ్చి ని న్నుద్ధ♦రింౘు ననుౘు
నెదురు తెన్నులు ౘూడక ♦ నీవె నిన్ను
వృద్ధి నొందింౘు కొనవలెఁ ♦ కృషినిఁ ౙలిపి!
లేనిౘో నీదు పతనమ్మె ♦ యౌను సుమ్ము!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 413

శీర్షిక:-  వాణీ స్తుతి!

కం.
వరవీణా మృదుపాణీ!
సురుచిర మధురోక్త వాణి! ♦ సుందర వేణీ!
ధర వేదాగ్రణి! తరుణీ
వర రమణీ! గుణి! కవీశ ♦ వరనిశ్శ్రేణీ!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 414

శీర్షిక:-  నిర్దయుఁడు!

సమస్య:-
ముద్దు మగని ప్రాణముల హరించె!

[వాల్మీకి చూచుచుండఁగఁ గ్రౌంచమిథునైకమును బోయవాఁడు చంపిన ఘట్టము]

ఆ.వె.
క్రౌంచ మిథునముఁ గని ♦ క్రౌర్యాన బోయఁడు
తనదు తిండి కొఱకుఁ ♦ దలఁచి మదిని
జంట పక్షిఁ బాప ♦ సరసత వీడియు
ముద్దు మగని ప్రాణ♦ముల హరించె!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 416

శీర్షిక:- ప్రకృతి ధర్మము!

సమస్య:-
చల్లఁగనయ్యె నీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే

ఉత్పలమాల:
ఉల్లమెలర్ప మేఘములు ♦ హోరున వర్షము నిచ్చినంతనే
జిల్లనెఁ గాలమేఘ పరి♦శీలిత చేతము, శైశిరమ్మునన్
జల్లఁగనయ్యె నీ ప్రకృతి ♦ సర్వము; గ్రీష్మము వచ్చినంతనే
చిల్లులువడ్డరీతి మెయిఁ ♦ జెమ్మట లుప్పతిలెన్ ఘనమ్ముగన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016

శీర్షిక:- కుపతి...!!!

సమస్య:-
కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

కవిత సంఖ్య: 417

కం.
తపనను శచియటఁ జనియున్
విపక్షు వృత్రుని వధించి ♦ విజయుండై రాన్
ద్యుపతిని, జంభారి, నులూ
కు, పతిని గని మెచ్చె సాధ్వి ♦ కోర్కులు మించన్!
*********************************
కవిత సంఖ్య: 418

కం.
చపలాక్షి యిందుమతియే
రిపుల గెలిచి తిరిగి రాఁగఁ ♦ బ్రేమ పెనుపునన్
నృపతి కెదురేగి యిక్ష్వా
కు పతిని గని మెచ్చె సాధ్వి ♦ కోర్కులు మించన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 419

శీర్షిక:- గంగానది!

సమస్య:-
పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె

తే.గీ.
ఘను భగీరథు యత్నాన ♦ గంగ భువికి
నేగి, గర్వాన జహ్నుని ♦ యాగభూమి
ముంచ, జహ్నువు గంగఁ గో♦పించి మ్రింగె!
పాపములఁ ద్రోయు గంగ పా♦పమ్ముఁ జేసె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 420

శీర్షిక:- గొడ్రాలి ప్రసవము!

సమస్య:-
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్

శార్దూలవిక్రీడితము:
ఓ డ్రామా నట వేయ నందు నటులై ♦ యున్నట్టి పాత్రల్ భళా
షాడ్రుచ్యంబులు తిన్నయట్లు నటియిం♦చంగన్ సమర్థంబుగన్
గొడ్రా లొక్కతె దేవకీసతి యయెన్; ♦ గూడెన్ మహాశ్చర్యముల్
గొడ్రాలిన్ బ్రభవించె బాలుఁ డయి తా ♦ గోపాల కృష్ణుం డిలన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016

శీర్షిక:- లోక వృత్తము!

సమస్య:-
తుని లోపల లోకమెల్లఁ దూఁగుచునుండున్

కవిత సంఖ్య: 421
కం.
ధనమున్న లేకయున్నను,
మనమునఁ గరుణాంతరంగ ♦ మండనుఁ డతఁడై,
యనయము దానమ్మిడు దాం
తుని లోపల లోకమెల్లఁ ♦ దూఁగుచునుండున్!
****************************
కవిత సంఖ్య: 422
కం.
మనమునను నిగ్రహమ్మును,
ధనమందున నాశ లేమి, ♦ దౌష్ట్య రహితుఁడై,
కను దైవమెదను, నిల శాం
తుని లోపల లోకమెల్లఁ ♦ దూఁగుచునుండున్!
***************************
కవిత సంఖ్య: 423
కం.
ధనమందె దైవముండును,
ధనముండిన సకల వస్తు ♦ తతియుం గలుగున్,
గనఁగా నిలలో ధనవం
తుని లోపల లోకమెల్లఁ ♦ దూఁగుచునుండున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 424

శీర్షిక:- రిక్కల మగఁడా...చందమామా!

సమస్య:-
పండుగనాఁ డేల నాకుఁ బాఁత మగఁ డనెన్

[పేదఱికములో మ్రగ్గి మ్రగ్గి, చివరకు ధనవంతుఁడైనను, నగలు చేయించని భర్తతో భార్య...]

కం.
"మెండుగ సంపద లబ్బెను;
దండిగ నగ లెన్నియైన ♦ ధరియింపఁ దగున్!
దండుగసొ మ్మనఁగఁ దగదు;
పండుగనాఁ డేల నాకుఁ ♦ బాఁత మగఁ?" డనెన్

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 425

శీర్షిక:- రాగబంధము!

సమస్య:-
కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్

ఉత్పలమాల:
కూఁతురు పుట్టె నా జనకుఁ ♦ గూర్మి యెసంగఁగ, నా కొమారితన్
మాతగ నెంచి యాతఁడు స♦మంచిత రీతినిఁ బెంచెఁ; గూఁతు రా
తాతనుఁ బుత్రుఁగాఁ దలఁచెఁ; ♦ దండ్రియుఁ జచ్చి సుతుండుఁ గాఁగ, నా
కూఁతురె తల్లియై జనకుఁ ♦గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్!

[తాత=తండ్రి]


-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 426

శీర్షిక:- వృద్ధ నారి...!!!

సమస్య:-
వృద్ధనారిని యువకుఁడు పెండ్లి యాడె

తే.గీ.
అభవుఁ డాతఁడు, సంతత ♦ యౌవనుండు,
సకల భువన శివంకర ♦ శంకరుండు,
వినతి సేయ సురలు, దక్ష ♦ తనయలందు
వృద్ధనారిని, యువకుఁడు ♦ పెండ్లి యాడె!

(వృద్ధ [ప్ర] - పెద్ద [వి];
దక్ష తనయలందు వృద్ధనారి=దక్షుని జ్యేష్ఠపుత్రిక[పెద్ద కొమరిత]=సతీదేవి)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016

శీర్షిక:- పాడు మనుజుఁడు!

సమస్య:-
పాడు మనుజుఁ జూడ వేడుక గద

కవిత సంఖ్య: 427
ఆ.వె.
కలిమి లేము లందు ♦ ఘన మనః స్థిరతతోఁ
దా నుదారుఁ డయ్యుఁ ♦ దనరుచుండి,
లోక మందు జనుల శోకమ్ముఁ దీర్చి, కా
పాడు మనుజుఁ జూడ ♦ వేడుక గద!
*****************************

కవిత సంఖ్య: 428
ఆ.వె.
గాన మదియె పన్న♦గమ్ముల నాడించు;
గానము విని నరుఁడు ♦ మేను మఱచు!
గాయకాళిలోనఁ ♦ గర్ణ పేయముగనుఁ
బాడు మనుజుఁ జూడ ♦ వేడుక గద!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016

శీర్షిక:- కారు నలుపు!

సమస్య:-
కారునలుపుపైనఁ గలిగెఁ బ్రేమ

కవిత సంఖ్య: 429

ఆ.వె.
"రూప గుణము లందు ♦ రూప మే మైనను
గుణముఁ గలిగి యున్న ♦ గొప్పవారె"
యనుచు నొకఁడు గుణి న♦నాకారిఁ గోరఁగఁ
గారునలుపుపైనఁ ♦ గలిగెఁ బ్రేమ!
****************************

కవిత సంఖ్య: 430

ఆ.వె.
"కారు మబ్బు వన్నె ♦ కలవాఁడు మనసును
దోచినట్టి వెన్న♦దొంగ వాఁడు
వ్రజకిశోరుఁ"డంచు ♦ వల్లవాంగనలకుఁ
గారునలుపుపైనఁ ♦ గలిగెఁ బ్రేమ!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 431

శీర్షిక:- కరి యానలు!

కం.
కరియానలు కరివరదునిఁ
గర మనురాగమ్ముతోడఁ ♦ గనుచున్ బ్రణుతిం
పరె నాట్య విలసనమ్ముల
దరహాస విభాసమాన ♦ తరళేక్షణలై!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి