అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 201
శీర్షిక:- జోతలు!
రథోద్ధత వృత్తము:
నీలకంఠ! హర! ♦ నృత్య వల్లభా!
బాలచంద్రధర! ♦ భస్మమండనా!
శైలజా వర! వి♦శాల మానసా!
ఫాలలోచన! సు♦వక్త్ర! సన్నుతుల్!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
***************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 202
శీర్షిక:- మాతృభాష!
తే.గీ.
నేఁటి తలిదండ్రు లెంతయో ♦ నిష్ఠ తోడ
నాంగ్ల మాధ్యమ విద్యల ♦ నందఁ జేయఁ
దెలుఁగు మాట్లాడుటయె యప్ర♦తిష్ఠ యనుచుఁ
దల్లి బాసను రోసిరి ♦ పిల్ల లెల్ల!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 203
శీర్షిక:- అభిమన్యుఁడు!
తే.గీ.
చూడఁగను నా సుభద్రాత్మ♦జుండు పోర
గెలువఁగాను పద్మవ్యూహ ♦ మెలమిఁ జొచ్చి,
కురుమహావీరులనుఁ జీల్చి, ♦ కూలెఁ దుదకు!
బిడ్డఁడా వాఁడు? రణరంగ ♦ భీకరుండు!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
**********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 204
శీర్షిక:- భానుని శోకము!
సమస్య:-
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ!
కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యమున...
(ಅಬ್ಧಿಯೊಳು ಮುಳುಗಿದನು ಭಾಸ್ಕರನುರಿವಬಿಸಿಲಿನೊಳ)
అను సమస్యకుఁ దెలుఁగులో నేనుఁ జేసిన పూరణము:
తే.గీ.
తనదు వరపుత్రకుండును ♦ దానగుణుఁడు
స్నేహశీలుండు, కర్ణుండు ♦ నాహవమున
నర్జునుని చేత హతమొంది♦నపుడు శోక
వార్ధిలో మున్గె భానుఁడు ♦ పగటివేళ!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 205
శీర్షిక:- రామదాసు!
కం.
కారాగారమె గోప
న్నా! రామ సుగుణ విశేష ♦ నామ జపముచే
నారామమయ్యెఁ గాదా!
ధీరా! దాశరథి శతక ♦ దివ్య కృతీశా!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 206
శీర్షిక:- చెఱలో...నెహ్రూ!
కం.
కారాగారస్థుఁడు నె
హ్రూ రచియించె నఁటఁ బెక్కు♦లుగఁ బుస్తకముల్!
కారాగార మనంగ న
పారమయిన బుద్ధికుశల ♦ వర్ధిత గృహమే!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
**************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 207
శీర్షిక:- కరివేఁపాకు...!
తే,గీ.
సకల శాకములందునఁ ♦ జాల రుచినిఁ
గలుగఁ జేయును కరివేఁప ♦ ఘనముగాను!
కాని, కూర నుండియు నేఱి, ♦ దానిని మన
మేఱి వైతుము, దుష్టుల ♦ నేఱినట్లు!!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 208
శీర్షిక:- తల్లి యుల్లము!
తే,గీ.
తల్లి యొడిలోన పసిపిల్ల ♦ తల్లడిల్ల,
తల్లి యుల్ల మదెంతయో ♦ తల్లడిల్లు!
తల్లి యొడిలోన పసిపిల్ల ♦ యుల్లసిల్ల,
తల్లి యుల్ల మదెంతయో ♦ యుల్లసిల్లు!
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 209
శీర్షిక:- వనమయూరము (ముద్రాలంకారమున)
వనమయూర వృత్తము:
ఓ కవియఁగన్, వనమ♦యూరము కలాపిన్,
గోక పురివిప్పి, జతఁ♦గోరి, మనువాడన్,
గేకిసలు గొట్టుచును ♦ కేకి నిఁటఁ గూడన్,
లోకమున వర్షములు ♦ లోలతనుఁ జూపెన్!
(ఓ = మేఘము)
వృత్త వివరణము:
వనమయూర వృత్తమున...భ-జ-స-న-గగ..గణములుండును
1-9 యక్షరములు యతిమైత్రినిం గలిగియుండును
ప్రాస పాటింపఁబడును
వృత్తమును వ్రాయుటకు
భల-భల-భల-గగ...లుండునట్లుగ వ్రాసిన
సులభతరమగును!
(ముద్రాలంకార మనఁగ ఆ పద్యమందు ఆ పద్యము పేరు వచ్చునట్లు రచించుట.)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 03-02-2016
కవిత సంఖ్య: 210
శీర్షిక:- హితైషులు!
సమస్య:-
దుర్వినయంబునన్ మనసు దోచెడివారు హితైషులే కదా!
ఉత్పలమాల:
శర్వుని గొల్చుచున్, సతత ♦ సత్య మహింస మనమ్ముఁ బూనియున్,
గర్వ మొకింత లేక, మమ♦కారముఁ జూపుచుఁ, గీర్త్యనిష్టులై,
సర్వ విశిష్ట మూర్తి యుత ♦ సత్పరివర్తన ’నేరు’ పూనియుం
దు ర్వినయంబునన్, మనసు ♦ దోచెడి ’వారు’, "హితైషులే" కదా!
(పూని యుందుర్ – వినయంబునన్…)
-:శుభం భూయాత్:-
******************
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
శీర్షిక:- పొగత్రాగినచో….
కవిత సంఖ్య: 211
కం.
"పొగత్రాగినఁ జెడిపోదు" వ
నఁగ నింకయుఁ ద్రాగి త్రాగి ♦ నరకమునఁ బడన్
నెగడుచు నటులే మఱిమఱి
పొగత్రాగెడువాఁడు దున్న♦పోతై పుట్టున్!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 212
శీర్షిక:- నీటి యెద్దడి పోవలెనన్న...!
ఉత్పలమాల (సప్తపాది):
త్రాగుదమన్న నీరమెది? ♦ దాహము తీరదు! నీటికోసమై
ప్రోగుపడంగ సర్వులకుఁ ♦ బోవునె దుఃఖము? నీరు తోడఁగా
వేగిర మంద నీరమును ♦ బిందెయు నింపదు! మంటిలోపలన్
బాగుగ నీర మెద్ది? ఘన♦వర్షము లొక్కట రాక ముందఱన్
వాగులు వంకలన్ మిగుల ♦ బాగొనరించియు వేగ పూడికల్
త్యాగయుతాత్ములై త్వరగఁ ♦ ద్రవ్వియుఁ దీసియు సాగుచేయఁగా,
వేగమె నీర మంత నిడుఁ ♦ బ్రీతిగ వాపి తటాకముల్ సదా!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 213
శీర్షిక:- అమ్మా...అమ్మా...అమ్మా...!
[ఇరాక్ లోని ఒక అనాథాశ్రమంలో అమ్మా నాన్నలు లేని ఒక అమ్మాయి తన అమ్మ బొమ్మను గీసుకొని తన అమ్మ ఒడిలో నిద్రిస్తున్నట్టుగా భావిస్తూ పడుకుంది. అమ్మ ప్రేమకు దూరమైన ఈ చిన్నారి బాధను వర్ణించ తరమా..?]
తే.గీ.
"అమ్మ నాకేది? కల దమ్మ ♦ అందఱికిని!
అమ్మ యెక్కడ నుంటివో, ♦ ఆదుకొమ్మ!
ఆకలిని దీర్చి,యెదకును ♦ హత్తుకొనఁగ,
అమ్మ, రావేల? ఒడిఁజేర♦నిమ్మ! రమ్మ!"
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 214
శీర్షిక:- ముదితల వస్త్ర ధారణము!
చంపకమాల:
చలిత విశాల నేత్ర యుత ♦ శర్వరు లొక్కెడ వస్త్ర కోటులన్
సులలిత రీతిఁ దాల్చి, మన ♦ సోదర రాష్ట్ర విశేష భంగిమల్
పలువుఱ మెప్పు లందఁగను, ♦ భారత సంస్కృతి గొప్పఁ జాటుచున్
వలపులఁ జూపుచుండిరిట, ♦ భారతమాత మనమ్ము గెల్వఁగన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 215
శీర్షిక:- భార్యాభర్తలు!
తే.గీ.
సరవిఁ దప్పక సంసార ♦ చక్రమందుఁ
దిరుగలికి వలె దంపతుల్ ♦ దీక్షనుంద్రు!
తిరుగుచును భర్త జీవికఁ ♦ దెచ్చుచుండు;
తిరముగా భార్య యింటినిఁ ♦ దీర్చి దిద్దు!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 216
శీర్షిక:- లోభి సంపద...!
ఆ.వె.
తాను దినక, పరుల♦కైననుఁ బెట్టక,
కూడఁబెట్టి; నిదురఁ ♦ గూడఁ బోక,
రే వగళ్ళుఁ గాచి, ♦ ప్రియమారఁ గాంచెడు
లోభి ధనము, మూఁడు ♦ లాభములకె!
[మూఁడు లాభములు=దొంగలపాలు, రాజులపాలు, భూమిపాలు]
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 217
శీర్షిక:- కర్ణుని చావునకు కారణములు...!
తేటగీతి(షట్పాది):
భార్గవ ద్విజ పృథ్వి శా♦పాల కతన;
సహజ కవచ కుండలములు ♦ శక్రుఁడుఁ గొన;
శల్య సారథ్య మతని యు♦త్సాహ ముడుపఁ
గర్ణుఁ జావుక వెన్నియో ♦ కారణములు!
కాని, పార్థుఁడే సంపెను ♦ కర్ణు నంచు
నప్రతిష్ఠను మోసె నా ♦ యర్జునుండు!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 218
శీర్షిక:- నవ్వుల ఱేఁడు...రేలంగి!
కం.
రేలంగి హాస్య నటునిగఁ
బాలించెను జలనచిత్ర ♦ వనిలోనను! దా
నేలిన పాత్రలు పద్మ
శ్రీ లభియింపంగఁ జేసెఁ ♦ జిత్రములందున్!(1)
సీ.
బాల్యమ్ములోఁ దండ్రి ♦ పలికించె 'హరికథల్'
.....'సంగీత' మింపారె ♦ సరస భంగి!
మొదట 'నాటక రంగ'♦మునను 'బృహన్నల'
.....లోన స్త్రీ పాత్రలోఁ ♦ దా నటించె!
'కృష్ణ తులాభార' ♦ కీర్తితుఁడై తాను
.....'జలన చిత్రాల'లో ♦ నెల కొనియెను!
'గుణ సుందరి కథ'లో ♦ గుణము హెచ్చఁగఁ బ్రజల్
.....'హాస్య నటుని'గా ♦ సమాదరింప;
గీ.
స్థిరత నందియు రేలంగి ♦ తీరు మాఱె!
నాయకుని సరసనుఁ దా స♦హాయ నటుని
పాత్ర లెన్నియొ పోషించి, ♦ ప్రజల మెప్పు
వడసి, తానెంతొ వెలిఁగిపో♦వఁగ మొదలిడె!(2)
సీ.
విప్ర నారాయణ, వెలుఁగు ♦ నీడలు, దొంగ
.....రాముఁడు, మిస్సమ్మ, ♦ లవకుశలను;
సత్య హరిశ్చంద్ర, ♦ జగదేక వీరుఁడు,
.....మాయా బజారులన్ ♦ మంచి హాస్య
నటనను బోషించి♦నట్టి రేలంగి తా
.....నెంతయో యెదిగెను ♦ వింతగాను!
ప్రేక్షకాళిని హాస్య♦రీతుల మెప్పించి,
.....చిత్ర పరిశ్రమన్ ♦ జిర యశుఁడయి,
గీ.
నిలిచి, వెలిఁగెను నాతండు! ♦ నేఁటి కింక
నతని చిత్రాలు చూచెద ♦ ననెడి వార
లెందఱో కలరన వింత ♦ యేమి కాదు!
తర తరమ్ము లప్రతిముఁడై ♦ తనరె నతఁడు!!(3)
ఆ.వె.
ప్రియ తముండునైన ♦ 'రేలంగి' మాటాడ
నవ్వు పువ్వు ఱువ్వు, ♦ ఱివ్వుమనఁగ!
విరియు నెడఁద మనకు ♦ 'వేంకట రామయ్య'
పలుకు వినఁగ! నతఁడు ♦ వర యుతుండు!!(4)
కం.
నవ్వుల ఱేఁ డతఁ డెప్పుడు
ఱువ్వు ఛలోక్తులును హాస్య ♦ రుచు లందించున్!
దివ్వియ వలె వెలుఁగు నతం
డివ్విధి జన హృదయ వీథిఁ ♦ దిరమై భువిలోన్!!(5)
-:శుభం భూయాత్:-
****************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 05-02-2016
కవిత సంఖ్య: 219
శీర్షిక:- పరనింద!
కం.
పరనింద సేయఁ గడఁగిన
నరునకుఁ బర శాపజనిత ♦ నాశము గల్గున్!
ధరణి నిది జరుగుఁ దథ్యము;
పరులగు దీనులకు సేవ ♦ పాపము లడఁచున్!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 02-02-2016
కవిత సంఖ్య: 220
శీర్షిక:- శివగంగ!
సీ.
వామ నోన్నత పాద ♦ బ్రహ్మ ప్రక్షాళితో
....ద్భవ వియచ్చారిణీ ♦ భవ్య గంగ;
ఘన భగీరథ తపో♦గత వర్తనానుసా
....రీద్ధ చారిత్ర సం♦బద్ధ గంగ;
శంత నావిష్కృత ♦ సత్ప్రేమ సంభావ్య
....సంసార బద్ధ సం♦స్కర్త్రి గంగ;
భూజన పాప ని♦ర్మూల నోత్కంఠ ప్ర
....వాహ సముత్తుంగ ♦ భావ గంగ;
గీ.
శివ జటాజూట నిర్ముక్త ♦ జీవ గంగ;
వార్ధి సంలగ్న హృదయ స♦త్వరిత గంగ;
తుంగ రంగ దభంగ త♦రంగ గంగ;
కలుషిత ధ్వస్త సంస్తుత్య ♦ గగన గంగ!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 06-02-2016
కవిత సంఖ్య: 221
శీర్షిక:- వేఁప పుల్ల!
తేటగీతి(మాలిక):
నోట నిడఁగనే చేదాయె♦నో యటండ్రు;
నమలఁగాఁ దీపి, యమృత మం♦చండ్రు జనులు!
లోకమం దిదె మందయ్య, ♦ శోకమేల?
పేస్టు వేస్టయ్య; మేలిడు ♦ వేఁప పుల్ల!!
యెండుచోఁ బొయ్యి నంటించ ♦ నిదె సమిధయ;
బ్రష్షుకన్నను పదిరెట్లు ♦ భద్ర మిదియ;
(కుంచె కన్నను మేలిడు ♦ నంచితముగ)
రెండుగాఁ జీల్ప నిదె టంగు ♦ క్లీన రయ్య;
(రెండుగాఁ జీల్ప "రసనమా♦లిన్యదూర"!)
కాన,నే నెల్ల వేళల ♦ ఖర్చుఁ బెంచు
వేని నొల్లను! కోరెద ♦ వేఁప పుల్ల!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 06-02-2016
కవిత సంఖ్య: 222
శీర్షిక:- "ఎడ్డె"మన..."తెడ్డె"మను సతి!
సమస్య:-
సంచిత పాపకర్మములు సౌఖ్యము లిచ్చును జన్మజన్మలన్!
ఉత్పలమాల:
అంచిత శీలసంపదల ♦ హర్షమొసంగెడువాని భార్యయౌ
కాంచన, "యెడ్డె"మన్న, వెను♦కాడక "తెడ్డె"మనంగఁ బూనుఁ; దా
"సంచిత పుణ్యకర్మములు ♦ సౌఖ్యము లిచ్చు"ననంగ, వెంటనే
"సంచిత పాపకర్మములు ♦ సౌఖ్యము లిచ్చును జన్మజన్మ" లన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 06-02-2016
కవిత సంఖ్య: 223
శీర్షిక:- దుష్ట శిక్షణము!
సమస్య:-
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్!
కం.
మితిమీఱిన కృతములఁ గని
సతత దురితు మహిషు దుష్టు ♦ సాహంకారున్
గ్రతువిధ్వంసకు దానవ
పతి తల ఖండించెనంట ♦ పార్వతి కినుకన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 06-02-2016
కవిత సంఖ్య: 224
శీర్షిక:- దుష్ట శిక్షణము!
సమస్య:-
పచ్చికనుఁ దిన నొల్లదు! పాడియావు!!
తే.గీ.
మాకు గోవొక్కటి కలదు; ♦ మానిత గుణ
శీల! యదియ యెప్పుడును మా ♦ చేనిలోని
పచ్చిగడ్డియె మేయును! ♦ పరుల చేలఁ
బచ్చికనుఁ దిన నొల్లదు! ♦ పాడియావు!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 06-02-2016
కవిత సంఖ్య: 225
శీర్షిక:- భ్రమ!
సమస్య:-
వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్!
ఉ.
కాలము దాపురించ, దశ♦కంఠుఁడు రామునితోడఁ బోరఁగన్
గాలుఁడ నంచు వచ్చి, చిర♦కాలము నోపిక లేక పాఱె నా
భీల రణమ్మునుండి; కన ♦ వింతయె; చచ్చిన రాక్షసేశ్వరా
శ్వాలిని సంహరించినది ♦ వాయుసుతుండని నమ్మిరందఱున్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 226
శీర్షిక:- పచ్చకామెరల వారికి తెలుపు గూడ పచ్చయే...!!
సమస్య:-
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్!
అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థధుర్య ♦ దుశ్చేష్టోద్య
త్సుహ్రీచ్యుత నేతల కిల
నెహ్రూ తగఁ డంట రాజ♦నీతిజ్ఞుఁ డనన్!(1)
కొద్ది మార్పులతో...మఱి రెండు...
అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థధుర్య ♦ దుశ్చేష్టోద్య
ద్విహ్రేపణోత్కుల కిల
నెహ్రూ తగఁ డంట రాజ♦నీతిజ్ఞుఁ డనన్! (2)
అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థధుర్య ♦ దుశ్చేష్టోద్య
త్సహ్రీకపదోత్కటులకు
నెహ్రూ తగఁ డంట రాజ♦నీతిజ్ఞుఁ డనన్! (3)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 227
శీర్షిక:- పద్యకవి!
సమస్య:-
పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!
కం.
హృద్యాంచితభావగత సు
వేద్యతరోల్లక్షణయుత ♦ వినుతోక్త నిస
ర్గోద్యద్రసపాకరహిత
పద్యమ్ముల వ్రాయునట్టి♦వాఁ డల్పుఁ డగున్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 228
శీర్షిక:- నిధి చాల సుఖమ...?
కం.
మధురముగఁ బాడెఁ ద్యాగయ
"నిధి చాల సుఖమ? రఘుకులు♦ని పదమ్ముల స
న్నిధి చాల సుఖమ?" యనుచును
సుధలు గురియు తెలుఁగు వెలుఁగు ♦ సూక్తులు మెఱయన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 229
శీర్షిక:- జీతములేని కొలువు...!
సమస్య:-
జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్!
కం.
చేతమునందున నిల్పియు,
సీతాయుత రామచంద్రు ♦ స్థిరమగు భక్తిన్
గీతములఁ బాడి కొలిచెడి
జీతము లేనట్టి కొలువె ♦ శ్రేష్ఠము జగతిన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 230
శీర్షిక:- ముద్దబంతి పూవులు...!!!
కం.
దైవారాధన కొఱకై
సేవకులుగ హారరూప ♦ జీవిత మెసఁగన్
గేవల నిమిత్తమాత్రపుఁ
బూవులయెన్ ముద్దబంతి♦పూవులు ధాత్రిన్!
ఆ.వె.
పసుపు పచ్చ వన్నె ♦ పదహారణాల ప
సిండి పూఁత సొగసు ♦ సిరులు గురియు!
మహిళ కంద మిడియు ♦ మహిలోన వెలుఁగొందు
ముద్దబంతిపూలు ♦ ముద్దులొలుకు!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 231
శీర్షిక:- కుంతి వరపరీక్ష...!!!
సమస్య:-
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్జ్వలమూర్తిఁ గర్ణునిన్!
ఉత్పలమాల:
గంధగజేంద్రయాన తన ♦ కమ్ముని యిచ్చిన మంత్ర వైభవో
ద్బంధమునుం గనుంగొనఁగ ♦ భానునిఁ బిల్చెను; పిల్వఁగన్ జగ
ద్బాంధవుఁడున్ వరమ్మిడెను; ♦ తద్రవిఁ బూషుని సప్తశుక్ల స
త్సైంధవుఁ గూడి కుంతి గనె ♦ శౌర్యరసోజ్జ్వలమూర్తిఁ గర్ణునిన్!
[సప్తశుక్లసత్సైంధవుఁడు=ఏడు తెల్లని మేలి గుఱ్ఱములు గలవాఁడు=సప్తాశ్వరథుఁడు=సూర్యుఁడు]
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 232
శీర్షిక:- జగడము...!!!
తేటగీతి:
జగడ మాడంగ హెచ్చును ♦ శత్రుభావ;
మెడఁద శాంతమ్ముఁ గోల్పోవు; ♦ హితముఁ దొలఁగు;
ధనము వ్యయమగు; సౌఖ్యమ్ముఁ ♦ దలఁగిపోవు!
జగడ మెంతేని వలదయ్య ♦ జనుల కెపుడు!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 233
శీర్షిక:- గవాక్షము...ద్వారము...!!!
గురువుగారి ప్రశ్నకు, శిష్యుని సమాధానము...
ఉ.
"కుత్సిత యోచనుండుఁ గనుఁ ♦ గోరి గవాక్షమునుండి! యెప్పుడున్
సత్సుఖ మీయ నెంచు గుణ♦సాంద్రుఁడు ద్వారమునుండి కాంచు! నో
వత్స! విశేష మిందుఁ గన♦వచ్చెడి దేమి? వినంగఁ జెప్పుమా!"
"కుత్సితు దృష్టి మార్గ మిఱు♦కుం, గుణు దృష్టి చనె న్విశాలమై!"
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 234
శీర్షిక:- బూడిదలోఁ బోసిన పన్నీరు...!!!
తే.గీ.(మాలిక):
ఒక్క దినమున నేఁ బోయి, ♦ యూరి బయటి
చెఱువు గట్టున నున్నట్టి ♦ చెట్టు పైని
పండ్లు తొంబది తొమ్మిది ♦ వఱకుఁ ద్రెంపి,
"యొకటి యైన నూ"ఱగు నంచు ♦ నుత్సహించి,
చివరి కొమ్మపై కెక్కంగ, ♦ శీఘ్రమె యది
విఱిగి పోవఁ, గాయల తోడఁ ♦ జెఱువు నందుఁ
బడితిఁ; దొంబది తొమ్మిది ♦ పండ్లుఁ బోయె!
బూదిఁ బడినట్టి పన్నీటి ♦ పోలిక యయె!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 235
శీర్షిక:- దసరానాఁటి దీపావళులు...!!!
సమస్య:-
దసరా పండుగ దివ్యకాంతులను సంధానించె దీపావళిన్!
మత్తేభవిక్రీడితము:
అసమానోజ్జ్వల దివ్య శక్తి యుతయై, ♦ హర్యక్ష సంయానయై,
యసురానీక వినాశకాయుధకర ♦ ప్రాంచన్మహోద్వేగయై,
యసురుం ద్రుంచ భవాని; భూజనులు "నా♦హా" యంచు వెల్గింప నా
"దసరా పండుగ" దివ్యకాంతులను సం♦ధానించె దీపావళిన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 236
శీర్షిక:- సరస్వతీ స్తుతి!
కం.
విద్యాధినేత్రి! మాతా!
సద్యః స్ఫురణ ప్రదాత్రి! ♦ శారద! వాణీ!
మద్యోగ్య పద్య ధాత్రీ!
మాద్య న్మంగళ సుగాత్రి! ♦ మాన్య!నమస్తే!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 237
శీర్షిక:- శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ!
ఆ.వె.
సకల దేవతాళి ♦ సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియునుఁ, ♦ జిఱునగవుల
శివుఁడు తనదు భస్మ♦సింహాసనమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ ♦ గోరెనిట్లు! (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల ♦ సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ ♦ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, ♦ వ్రతవిధానమ్మునుఁ
జెప్పుమయ్య నాకుఁ ♦ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, ♦ “హే పార్వతి! నీ
వతి వినయముననుఁ గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము ♦ కోరిక తీఱన్! (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన ♦ మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమ♦తి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త స♦ద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య ♦ కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, ♦ సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ ♦ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, ♦ శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్ర♦వారమందు!
సకల సౌభాగ్య సంతాన ♦ సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో ♦ గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయ♦మాయె నా మాతయ;
చారుమతియు లేచి, ♦ సంతసించి,
“వరము లొసఁగు తల్లి! ♦ వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! ♦ నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! ♦ సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ ♦ నెసఁగఁగఁ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల ♦ వినుతి సేసి,
పతికి, నత్తమామలకును ♦ నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు ♦ సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని ♦ పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ ♦ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ♦ ఘనమగు వేడ్కన్! (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైక♦వంద్య! లక్ష్మి!
దేవి! నారాయణ ప్రియా♦బ్ధిజ నమామి!”
యనుచు వారలు చారుమ♦తినిఁ గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజనుఁ ♦ జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నంది♦యలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణ♦ములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ♦ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యం♦దఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి ♦ పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య స♦త్సంతతులను,
నాయురారోగ్య భోగ్య స♦న్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలి♦తమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ ♦ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత ♦ మనవరతమ్మున్!" (14)
(ఇది వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
శీర్షిక:- భజే శారదాంబా!
[శంకరాచార్యులవారి శారదా భుజంగోత్ప్రేరిత శారదా స్తుతి]
భుజంగప్రయాత వృత్తములు:
కవిత సంఖ్య: 238
మనీషా! ప్రవీణా! మహేంద్రాది పూజ్యా!
పునీతాంతరంగా! పురంధ్రీ లలామా!
మనోజ్ఞ ప్రమోదా! మనోఽభీష్ట దాయీ!
వనేజాంబకాంబా! భజే శారదాంబా!!
కవిత సంఖ్య: 239
మనః క్లేశ దూరీ! మనోల్లాస కారీ!
మనః కావ్య కల్పా! మనోత్తేజ వాక్యా!
మనః పద్య రూపా! మనోజాత భాషా!
వనేజాంబకాంబా! భజే శారదాంబా!!
కవిత సంఖ్య: 240
వినోద ప్రదాత్రీ! విశిష్టాధి నేత్రీ!
కనద్భవ్య తంత్రా! ఘనోద్బీజ మంత్రా!
సునీతాప్త వాక్యా! సుధాపూర్ణ వాణీ!
వనేజాంబకాంబా! భజే శారదాంబా!!
కవిత సంఖ్య: 241
ఘనశ్లోక వంద్యా! కరే పుస్తకాఢ్యా!
మనుప్రోక్త సూత్రా! మనః కల్పవృక్షా!
ధనౌన్నత్య విద్యా! ధరవ్యాప్త శాస్త్రా!
వనేజాంబకాంబా! భజే శారదాంబా!!
[ఈ వృత్తమునకు సంస్కృతమున నేడవ యక్షరమునకు యతి నియమముండును. తెలుఁగున నెనిమిదవ యక్షరమునకు యతిమైత్రి పాటింపఁబడును. కాని వీనిని నేను సంస్కృత మర్యాదననుసరించి యేడవ యక్షరమునకే యతిమైత్రినిం బాటించితిని. తెలుఁగు మర్యాదననుసరించి నాలుఁగు వృత్తములకును (నేక) ప్రాసఁ బాటించితిని. మిత్రులు గమనింపఁగలరు]
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
శీర్షిక:- కంచి గరుడ సేవ!
కవిత సంఖ్య: 242
ఆ.వె.
చదువు రాని వాని ♦ సంచిత గ్రంథాస్థ;
దసలు పంచెఁ గోరు ♦ ముసలి భ్రాంతి;
ముక్కర నటఁ గోరు ♦ ముక్కిడి యందమ్ముఁ,
గంచి గరుడ సేవ ♦ ఘనత లేల?
కవిత సంఖ్య: 243
ఆ.వె.
అంధుఁ జేత నున్న ♦ యద్దమ్ము పగిదిని;
మూక చేతనున్న ♦ మైకు వలెను;
చెవిటి వాని చెవిని ♦ స్పీకరున్నట్టులు,
కంచి గరుడ సేవ ♦ ఘనత లేల?
(అన్యదేశ్యాలు హాస్యమునకు గ్రహింపఁబడినవిగా నెఱుంగునది)
కవిత సంఖ్య: 244
ఆ.వె.
బోడిగుండు వాని ♦ పొంత దువ్వెన వలె;
నేతి బీర లోని ♦ నేయి రీతిఁ;
గామితమ్ము లిడని ♦ క్ష్మాభృత్తు కైవడిఁ,
గంచి గరుడ సేవ ♦ ఘనత లేల?
కవిత సంఖ్య: 245
ఆ.వె.
సార మింత లేని ♦ సంసారము వలె; నా
మోద మింత లేని ♦ మోదుగు వలె;
సలిల మింత లేని ♦ సరసి పోలికఁ జూడఁ
గంచి గరుడ సేవ ♦ ఘనత లేల?
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 07-02-2016
కవిత సంఖ్య: 246
శీర్షిక:- ముంచినట్టివాఁడు...!!!
ఆ.వె.
భాగవతము వ్రాసె ♦ భక్తిచేఁ బోతన్న!
దాశరథిని రామ♦దాసు పాడె!
భక్తిఁ దేలి జనుల ♦ భక్తి రసమ్మున
ముంచినట్టివాఁడె ♦ పూజ్యుఁ డయ్య!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
శీర్షిక:- వావి వరుసలు...!!
సమస్య:-
వావి వరుసలఁ జూడనివా రనఘులు!!
కవిత సంఖ్య: 247
కష్టకాలాన "రక్షింతు ♦ నిష్టుల" నని;
"వీరు నా వారలు; పరాయి ♦ వారు వార"
లంచు గణియింప నొల్లక; ♦ మంచిఁ గోరి,
వావి వరుసలఁ జూడని♦వా రనఘులు!
కవిత సంఖ్య: 248
నరహరియె తన జనకుని ♦ మరణమునకుఁ
గారకుం డని యెఱిఁగియుఁ ♦ గరుణఁ బ్రోవ
భక్త ప్రహ్లాదుఁ డా హరిఁ ♦ బ్రస్తుతించె!
వావి వరుసలఁ జూడని♦వా రనఘులు!!
కవిత సంఖ్య: 249
భ్రాతృ దుష్కృత్య దుస్సహ ♦ ప్రాశ్నికుఁడు, వి
భీషణుఁడు, రాము శరణమ్ము ♦ వేడి, యగ్ర
జాపమృత్యు కారక పుణ్య ♦ చరితుఁ డాయె!
వావి వరుసలఁ జూడని♦వా రనఘులు!!
కవిత సంఖ్య: 250
అన్నదమ్ములు ద్రౌపది, ♦ నావభృథను
నిండు సభలోని కీడ్చి, దు♦ర్నీతి తోడ
భంగపెట్ట, వికర్ణుండు ♦ ప్రతిఘటించె!
వావి వరుసలఁ జూడని♦వా రనఘులు!!
కవిత సంఖ్య: 251
పల్లవేశుఁడు మాధవ♦వర్మ, తనదు
సుతుఁడు రథచోదనముచే శి♦శువును జంప;
పొరిగొనిన సుతునకు నిడె ♦ మరణశిక్ష!
వావి వరుసలఁ జూడని♦వా రనఘులు!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
కవిత సంఖ్య: 252
శీర్షిక:- ధర్మ పక్షము...!
సమస్య:-
పాండవులు దుష్ట చిత్తులై భంగ పడిరి
శిష్ట మానసులై నెగ్గి, ♦ సిరులు పొంది,
మివుల నానందమునఁ దేలి, ♦ మిన్నలైరి
పాండవులు! దుష్ట చిత్తులై ♦ భంగ పడిరి
కౌరవులు! ధర్మమే గెల్చె ♦ ధారుణి పయి!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
కవిత సంఖ్య: 253
శీర్షిక:- పెండ్లి విందు!
సమస్య:-
అరిసెల వేఁచఁగా వలయు నాముదమందునఁ బెండ్లి విందుకై!
[వియ్యాలవారి పెండ్లి విందుకై పాకశాలలో చమత్కారముగ మాటలాడుకొను సందర్భము]
చం.
విరసత వీడి సేయవలె ♦ వియ్యపువారలు విందుభోజనాల్!
సరసుల వంటకమ్ము లివి! ♦ "చాలవు, తెమ్మిఁకఁ గొన్ని" యంచుఁ బల్
సరసతఁ బూని కోరఁగనుఁ ♦ జక్కని బూరెలు, చిల్లి గారె లీ
యరిసెల వేఁచఁగా వలయు ♦ నా ముదమందునఁ బెండ్లి విందుకై!
(ఆముదమందున=ఆముదములో, ఆ వియ్యాలవారు వచ్చినప్పటి సంబరములో)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
శీర్షిక:- ధవుని గర్భము!
సమస్య:-
ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్!
కవిత సంఖ్య: 254
[కళాపూర్ణోదయ గత సుగాత్రీశాలీనుల (సుముఖాసత్తి, మణిస్తంభుల) కథనిట ననుసంధానించుకొనవలసినది. శారదాదేవి కృపచే పతి పత్నిగాను, పత్ని పతిగాను మాఱిరి. ప్రస్తుత మీ సమస్యాపూరణమునకు మూలమిదియే...]
చివరకుఁ దన పతి కోర్కిని,
ధవు రూపును సతియుఁ గోరె; ♦ ధవళాంగి కృపన్
భువి నట సతి పతిగ వఱల,
ధవున కపుడు గర్భమయ్యెఁ ♦ దనయుఁడు పుట్టెన్!
(ధవళాంగి=శారదాదేవి;
వఱలు=ప్రకాశించు,ప్రవర్తిల్లు,వ్యాపించు;
ధవుఁడు= సుముఖాసత్తి(సుగాత్రి)గా మాఱిన మణిస్తంభుఁడు;
తనయుఁడు=కళాపూర్ణుఁడు)
**************
కవిత సంఖ్య: 255
[ఎంత కాలమైనను సంతానవతి కాని యొక యువతి, శివునర్చించి, ముడుపుఁ గట్టినచో సంతానము కలుగు ననఁగా, నటులే సేసి, సంతానవతియైన సందర్భము...]
శివు నర్చసేసి సంతా
నవతిగఁ గాఁగోరి యువతి ♦ నమ్మియు నెదలోన్
దివిరి ముడుపుఁ గట్టె నుమా
ధవున కపుడు, గర్భమయ్యెఁ ♦ దనయుఁడు పుట్టెన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
కవిత సంఖ్య: 256
శీర్షిక:- సతికి నమస్సులు...!
సమస్య:-
సతికి నమస్కరించి విలసద్గతిఁ గాంచిరి పెద్దలెందఱో!
[పతి సేవ నొనర్చి, మాన్యయై(నక్షత్రమై)న యరుంధతీసతిని పెండ్లిండ్లలో వధూవరులకుఁ జూపించుట మన యాచారము కదా!]
చంపకమాల:
నుత గుణ మాన్యయై, పతికి ♦ నొప్పిదమైన విశిష్ట సేవలన్
సతతముఁ జేసి, మించి, విల♦సన్మతి భక్తిని నిల్పి, భర్త కా
మితమును దీర్చి, ఋక్షమయె! ♦ మెప్పుగఁ బెండ్లిని నా యరుంధతీ
సతికి నమస్కరించి, విల♦సద్గతిఁ గాంచిరి పెద్దలెందఱో!
(ఋక్షము=నక్షత్రము)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
కవిత సంఖ్య: 257
శీర్షిక:- వెన్నుని మరది!
సమస్య:-
మరదిని వరియించె కృష్ణ మత్స్యము గూలన్
(ఇది శ్రీ ఎం.అంజయ్య [Sk-501] గారిచ్చిన సమస్య)
కం.
పరుగునఁ జని ద్రుపదుని సభ
నరుదగు నా స్వయంవరము♦నను మత్స్యమ్మున్
నరుఁడుఁ దునుమ నా వెన్నుని
మరదిని వరియించెఁ గృష్ణ ♦ మత్స్యము కూలన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
కవిత సంఖ్య: 258
శీర్షిక:- సంపాదన లేని మగఁడు!
సమస్య:-
సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్!
ఇంపయిన జీవితములో
నింపాదిగఁ బుణ్యములను ♦ నింపుకొనుచుఁ, దా,
ముంపు నిడునట్టి "పాపపు
సంపాదన" లేని మగని, ♦ సాధ్వి నుతించెన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
కవిత సంఖ్య: 259
శీర్షిక:- మగలకు బావ!
ఎం. అంజయ్యగౌడ్ గారిచ్చిన
సమస్య:-
బావా రమ్మని బిలిచెను పాంచాలి హరిన్
కం.
కావరమున నానతిఁ గొని
ద్రోవది వసనమ్ములూడ్చ ♦ దుశ్శాసనుఁడున్;
"గావఁగ నను, నా మగలకు
బావా! ర"మ్మని పిలిచెను ♦ పాంచాలి హరిన్!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 08-02-2016
కవిత సంఖ్య: 260
శీర్షిక:- మగలకు బావ!
ఎం. అంజయ్యగౌడ్ గారిచ్చిన
సమస్య:-
ధవుని గని చెల్లెనని బల్కె దంతియాన
తే.గీ.
పెండ్లి కూఁతురౌ మఱదలి ♦ పేర్మి మగఁడు
తనదు వరుసనుం దెలియంగఁ ♦ దలఁచి యడుగ;
వినఁగ నిట్టులఁ దనదు మ♦గని చెలియలి
ధవుని గని "చెల్లె"నని వల్కె ♦ దంతియాన!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 261
శీర్షిక:- పిలుపు!
సమస్య:-
దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ బ్రేమ పొంగారఁగన్!
శార్దూలవిక్రీడితము:
"రారా సుందర! మద్విశాల హృది సా♦మ్రాజ్య క్షితీశుండవై,
నోరారంగను నన్ను బిల్చి, యిదె నీ ♦ నూత్నానురాగమ్ముతో
దారం జేరుకొనంగ రమ్ము! మదనా! ♦ తప్తాంతరంగ ప్రమో
దా! రా ర"మ్మని పిల్చె నొక్క సతి భ♦ర్తన్ బ్రేమ పొంగారఁగన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 262
శీర్షిక:- అభినవ భీష్ముఁడు!
సమస్య:-
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె!
తే.గీ.
అతఁడు గాంగేయ సన్నిభుఁ, ♦ డతని నంబ
వలచి, పెండిలి యాడంగఁ ♦ దలఁచి, చేరి,
జాయ కాఁ గోర్కిఁ జెప్పంగ, ♦ నా యభినవ
భీష్ముఁ డంబను బెండ్లాడి, ♦ బిడ్డలఁ గనె!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 263
శీర్షిక:- కలుగని దురదృష్టము!
సమస్య:-
దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్!
కం.
దురదృష్టము రాకుంటకు
వరమందిరి పురజనములు ♦ వరలక్ష్మి కడన్!
వరము కతన, కలుగని యా
దురదృష్టము వలన, సిరులు ♦ దొరకు జనులకున్!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 264
శీర్షిక:- పురూరవుఁడు!
సమస్య:-
రాముఁ డానంద మందె నూర్వశిని బొంది!
తే.గీ.
ఆ పురూరవుఁ, డతి మనో♦హరుఁడు, ఘనుఁడుఁ,
జంద్ర వంశజుఁ, డైలుండు, ♦ సాధుగుణుఁడు,
బుధ సుతుండుఁ, బ్రతిష్ఠాన ♦ పుర మనోఽభి
రాముఁ డానంద మందె నూ♦ర్వశిని బొంది!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 265
శీర్షిక:- గార్దభ గాన మాధురి!
సమస్య:-
గాడిదలెల్లఁ జేసినవి గానముఁ గర్ణ రసాయనమ్ముగన్!
ఉ.
నాఁడు సుయోధనుండు జన♦నమ్మయె! నప్పుడు భూనభోంతరాల్
గోడును వెళ్ళఁ గ్రక్కినవి! ♦ ఘోరతరమ్ముగఁ గూసె ఘూకముల్!
వాడలనుండు కుక్కలును ♦ బావురు మన్నవి! సంతసమ్మునన్
గాడిదలెల్లఁ జేసినవి ♦ గానముఁ గర్ణ రసాయనమ్ముగన్!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
శీర్షిక:- నరక సుఖము!
సమస్య:-
నరకమున సుఖమ్ము దొరకు నయ్య!
(ఆటవెలఁది సమస్యా పాదమునుఁ గొని, ఛందో వైవిధ్యముతో నేఁ జేసిన పూరణములు)
కవిత సంఖ్య: 266
కం.
ధరలన్ని పెరిగె నేఁ, డీ
ధరలో సుఖజీవనమ్ము ♦ దక్కక, పేదల్
నిరసించుచు నిటులందురు
"నరకమున సుఖమ్ము దొరకు ♦ నయ్య!" యటంచున్!
***************
కవిత సంఖ్య: 267
తే.గీ.
వ్యాధి ముదిరియు దుఃఖించు ♦ వాఁడొకండుఁ
జావుఁ గోరుచు దైవమున్ ♦ బ్రోవుమంచు
వేడుచుండెను పరిపరి ♦ విధములుగను
"నరకమున సుఖమ్ము దొరకు ♦ నయ్య!" యనుచు!
***************
కవిత సంఖ్య: 268
[యముని వలచిన ధూమోర్ణ తండ్రితోఁ బలికిన మాటలు]
ద్విపద:
"యముని వలచి తేను ♦ సుమశరు మహిమ;
మముఁ గూర్చఁగఁ బరిణ♦యము సేయు మయ్య!
తరతరమ్ములుగ సుం♦దరతరమ్మైన
నరకమున సుఖమ్ము ♦ దొరకునయ్య మఱి!!"
**************
కవిత సంఖ్య: 269
[దేవదానవ సంగ్రామమునఁ జావఁ గోరు నొక దానవుని స్వగతము]
ఆ.వె.
"యుద్ధ రంగమందు ♦ యోధుండుఁ జచ్చిన,
స్వర్గమునకు నేఁగి ♦ వఱలు నండ్రు!
స్వర్గమందుఁ జేర ♦ వాసవుఁ డిడు బాధ!
నరకమున సుఖమ్ము ♦ దొరకు నయ్య!!"
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 270
శీర్షిక:- ముక్తి కాంతాలోలుఁడు!
సమస్య:-
కాంతా లోలుండె మోక్షగామి యనఁ దగున్!
కం.
సుంతయు బంధ మ్మందక,
యంతయు బ్రహ్మమ్మటంచు, ♦ నందె మనమ్మున్
జింతింప నిలుపు, నిర్వృతి
కాంతా లోలుండె మోక్ష♦గామి యనఁ దగున్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 271
శీర్షిక:- ఓపిక చచ్చినవాఁడు!
సమస్య:-
చచ్చినవాఁ డాగ్రహించి, శత్రువుఁ గూల్చెన్.
కం.
హెచ్చిన సహనము తోడుత
వచ్చియు భీముఁ డని సేయ, ♦ బార్హద్రథుఁ డా
రచ్చను దిట్టఁగ, నోపిక
చచ్చినవాఁ డాగ్రహించి, ♦ శత్రువుఁ గూల్చెన్!
(బార్హద్రథుఁడు=బృహద్రథుని కుమారుఁడు>జరాసంధుఁడు)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 272
శీర్షిక:- శరము!
సమస్య:-
శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్
కం.
నరులను గని పరువెత్తుచుఁ
దరువుల డొంకలను దాఁటి ♦ దప్పికఁ గొనియున్
దరినున్న కొలను లోపల
శరమున్ గని జింకపిల్ల ♦ సంతసమందెన్!
(శరము=నీరు; [బాణమని మఱియొక యర్థము])
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
కవిత సంఖ్య: 273
శీర్షిక:- రావణ సంహారము!
సమస్య:-
భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్!
చం.
ధరణిసుతాపహర్తను, న♦ధర్మపరాయణు, రాక్షసేశ్వరున్,
వరబల గర్వితున్, గిరిశ♦భక్తుని, దిక్పతివైరినిన్, మునీ
శ్వరగణ బాధకున్, త్రిదశ♦శాసను, దుర్మదు, రావణాఖ్యు, దం
భ రతునిఁ జంపె రాఘవుఁడు ♦ భామినికై సురకోటి మెచ్చఁగన్!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 09-02-2016
శీర్షిక:- జ్ఞాని!
సమస్య:-
బాట వీడి నడచువాఁడె జ్ఞాని!
కవిత సంఖ్య: 274
ఆ.వె.
పరుల కెపుడు మిగులఁ ♦ బరమార్థ మందించు
బోధ సేసి, యెట్టి ♦ బాధ నిడక,
ధర్మ మాచరించి, ♦ తా నెప్పుడునుఁ దప్పు
బాట వీడి నడచు♦వాఁడె "జ్ఞాని"!
*************************
కవిత సంఖ్య: 275
ఆ.వె.
సకల శాస్త్రములనుఁ ♦ జక్కఁగాఁ బఠియించి,
మోక్ష మార్గ మెపుడు ♦ బోధ సేసి,
భోగములను విడచి, ♦ భువిఁ గల్ల గురువుల
బాట వీడి, నడచు♦వాఁడె "జ్ఞాని"!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 276
శీర్షిక:- శత్రుఘ్నుఁడు!
సమస్య:-
శివుఁడు దశరథునకుఁ జిన్న కొడుకు!
ఆ.వె.
సద్గుణాంచితుండు ♦ శత్రుఘ్నుఁ, డెన్నఁగ
మహిత యశుఁడు, సుజన ♦ మాన్యుఁ డతఁడు,
హరికి ముద్దుఁ దమ్ముఁ, ♦ డతఁడెపో కరుణను
శివుఁడు, దశరథునకుఁ ♦ జిన్న కొడుకు!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 277
శీర్షిక:- ఆకుఁదేలు!
సమస్య:-
కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్.
కం.
విందారగించఁ జని, తన
ముందునఁ గనిపించినట్టి ♦ ముద్దాయియునై,
మంద గమనయౌ నా యా
కుందేలును కోడిపిల్ల ♦ గుటుకున మ్రింగెన్!
(ముత్+దాయి=సంతోషమును గలిగించునది.
ఆకుందేలు=ఆకుఁదేలు>ఆకుతేలు)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 278
శీర్షిక:- సమస్యాపూరణము!
సమస్య:-
అవధానమ్మునఁ జేయఁ గూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్.
మత్తేభవిక్రీడితము:
సవన మ్మీ యవధాన, మిందుఁ గనఁగన్ ♦ సద్యః స్ఫురద్భావముల్
సెవులన్ విందుల నోలలాడ నిడుఁ, గిం♦చిత్తైన నాలస్య మీ
యవధానమ్మునఁ జేయఁ గూడదు; సమ♦స్యాపూరణ మ్మెప్పుడున్
మివులన్ మెప్పులఁ దెచ్చుఁ బండితులకున్ ♦ మేల్మేలనంగన్ భళా!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 279
శీర్షిక:- కువలయము!
సమస్య:-
కుండఁ లోనఁ బెట్టెఁ గువలయమును!
పూరణము:-
[కువలయమనఁగ భూమి యనియుఁ గలువపూ వనియు నర్థములు కలవు. ఒకఁడు కలువపూవునుం గుండలోనఁ బెట్టెనని నా పూరణము]
ఆ.వె.
కలువ యొకటి విరిసెఁ ♦ గాసారమందున!
వన్నెఁ గాంచి మనసు ♦ పడియు నొకఁడు
తనివిఁ గోసి, తెచ్చి, ♦ దాని ఱేకులు వాడ
కుండఁ, లోనఁ బెట్టెఁ ♦ గువలయమును!!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
శీర్షిక:- కల...?!
సమస్య:-
కలఁ గాంచితి మోద మలరఁ గనుమూయకయే!
పూరణములు:-
కవిత సంఖ్య: 280
కం.
పలుకోర్కెలు కొనసాఁగఁగ,
నిలు వీడియుఁ, దోటలోన ♦ నిష్ఠను బాద
మ్ములు మోపియు, నెదురం జిలు
కలఁ గాంచితి మోద మలరఁ ♦ గనుమూయకయే!
*****************
కవిత సంఖ్య: 281
కం.
ఇల వీడి ఖతలమునఁ జనఁ,
దుల లేనటువంటి సద్వ్రతుల్ ♦ గంధర్వుల్
పులకించి, నాకు నిడ, నెఱ
కలఁ గాంచితి మోదమలరఁ ♦ గనుమూయకయే!
(ఎఱకలు=రెక్కలు)
*****************
కవిత సంఖ్య: 282
కం.
కలి మహిమఁ బేద నయ్యును
నిలలో ధనవంతునైన ♦ నెటు లుందునొ చే
తలఁ గాకుండిననుఁ బగటి
కలఁ గాంచితి మోద మలరఁ ♦ గనుమూయకయే!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 283
శీర్షిక:- తాటియాకులు!
సమస్య:-
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!
పూరణములు:-
కం.
ఇమ్ముగ గుడిసెను వేయుచు,
రమ్మని నా మిత్రుఁడనఁగ, ♦ రంజిలుచును నే
నమ్మహిఁ జన, గోడ నిడిన
కమ్మలు మోకాళ్ళు దాఁకి ♦ ఘలు ఘలుమనియెన్!
(కమ్మలు=తాటియాకులు)
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 284
శీర్షిక:- హరి ప్రత్యర్థి కుచేలుఁడా?
సమస్య:-
ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును!
యాదవునిఁ జేరి సంపన్నుఁ ♦ డాయె నెవఁడు?
ఆ గజేంద్రుఁడు నెవనికి ♦ నార్తిఁ దెలిపె?
రామునకు రావణుం డిల ♦ నేమి యగును?
ఆ కుచేలుఁడు; హరికిఁ; బ్ర♦త్యర్థి యగును!
-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
శీర్షిక:- కుల వాసన...!
సమస్య:-
కుల వాసన నెంచి చూడ గుమగుమ లాడెన్!
పూరణములు:
కవిత సంఖ్య: 285
కం.
చలికాలపు టుదయమునన్
జెలి యల్పాహారమునకు ♦ సందడితోఁ బో
పుల యటుకులు సేయఁగ, నటు
కుల వాసన నెంచి చూడ ♦ గుమగుమ లాడెన్!
*****************
కవిత సంఖ్య: 286
కం.
తులలేని విధముగా నటఁ
జెలి చేసెను "బూఁతఱేకు" ♦ చిఱువంటకముల్
దలఁపుల మెదిలెడి యా ఱే
కుల వాసన నెంచి చూడ ♦ గుమగుమ లాడెన్!
*****************
కవిత సంఖ్య: 287
కం.
తొలి "బర్తుడే"కు మనుమని
కల "కేకులు" రెండు తెచ్చి, ♦ "కట్" చేయంగన్
గలిగిన "ఖుసి" కన్నను. కే
కుల వాసన నెంచి చూడ ♦ గుమగుమ లాడెన్!
(అన్యదేశ్య పదములు వినోదార్థము వాడితిని)
-:స్వస్తి:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 288
శీర్షిక:- నీచునిఁ బొగడిన ద్రౌపది!
సమస్య:-
దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ!
పూరణము:
తే.గీ.
ఱొమ్ముఁ జీల్చియుఁ ద్రాగ ర♦క్తమ్ము; మఱియుఁ
దనదు కేశ సంస్కరణమ్ముఁ ♦ గొనలు సాఁగఁ;
గదన రంగాన భీమున ♦ కదను నిడిన
దుస్ససేనునిఁ గీర్తించె ♦ ద్రుపదతనయ!
-:స్వస్తి:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
కవిత సంఖ్య: 289
శీర్షిక:- భస్మాసుర కృతము!
సమస్య:-
నమ్మిన వారి నెల్లరను ♦ నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్.
పూరణము:
[భస్మాసుర వర వృత్తాంతము]
ఉ.
ఇమ్ముగఁ జేసియుం దపము; ♦ నీశుని నిమ్మనె బుగ్గిసేసి, మో
దమ్మును గూర్చెడిన్ వరము; ♦ దానికి నీశుఁడు నట్లె యీయఁగా;
నమ్మక, దాని నా ప్రమథ ♦ నాథుని పైనఁ బరీక్షఁ గోరెఁ బో!
నమ్మిన వారి నెల్లరను ♦ నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్!!
-:స్వస్తి:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
శీర్షిక:- శివుని మోదము!
సమస్య:-
సీతమ్మనుఁ బెండ్లియాడె ♦ శివుఁడు ముదమునన్.
పూరణములు:
కవిత సంఖ్య: 290
కం.
ప్రీతుండై శ్రీరాముఁడు
సీతమ్మను బెండ్లియాడె; ♦ శివుఁడు ముదమునన్
మాతంగి యుతుఁడునై చని,
సీతారాములకు "స్వస్తి" ♦ చెప్పియుఁ దరలెన్!
*****************
కవిత సంఖ్య: 291
[క్రమాలంకారమునఁ బూరణము]
కం.
ప్రీతిన్ రాముం డేమయె?
శీతాద్రిజ పతి యెవండు? ♦ చిరకాలమ్మున్
జేత మ్మెటులుండవలెన్?
సీతమ్మను బెండ్లియాడె; ♦ శివుఁడు; ముదమునన్!
*****************
కవిత సంఖ్య: 292
కం.
సీతకుఁ బొరు గిలు శివునకుఁ
జేతమ్మునఁ బ్రేమ యెసఁగె! ♦ స్థిర జీవికకై
మాతాపిత సమ్మతితో
సీతమ్మనుఁ బెండ్లియాడె ♦ శివుఁడు ముదమునన్!!
-:స్వస్తి:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
శీర్షిక:- పతివ్రత!
సమస్య:-
తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే?
పూరణములు:
కవిత సంఖ్య: 293
[సత్యభామనుం గూర్చిన పూరణము]
కం.
ఒప్పించి మగనితోఁ జని,
తప్పులు సేసిన దనుజు న♦ధర్మున్ దుష్టున్
దెప్పుచు ననిలో నరకుని
దిప్పలఁ బెట్టెడు సతియె ప♦తివ్రత గాదే?
*****************
కవిత సంఖ్య: 294
[ద్రౌపదిం గూర్చిన పూరణము]
కం.
చెప్పియుఁ దన కష్టమ్మును,
గొప్పగఁ బతి భీము జయముఁ ♦ గోరుచు, నుల్లం
బొప్పఁగఁ దుర్మదుఁ గీచకుఁ
దిప్పలఁ బెట్టెడు సతియె ప♦తివ్రత గాదే?
*****************
కవిత సంఖ్య: 295
[మందోదరిం గూర్చిన పూరణము]
కం.
ముప్పొదవును మునుముందని,
యొప్పుల కుప్పయగు సీత ♦ నొప్పుగ నిడుమం
చెప్పుడు మగఁడగు రావణుఁ
దిప్పలఁ బెట్టెడు సతియె ప♦తివ్రత గాదే?
-:స్వస్తి:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
శీర్షిక:- పాండుసుతులు!
సమస్య:-
పానకములోని పుడుకలు పాండుసుతులు!
పూరణములు:
కవిత సంఖ్య: 296
[దుర్యోధనుని స్వగతము]
తే.గీ.
"మామ, తమ్ముఁడు, మిత్రుఁడు ♦ మామకాజ్ఞఁ
బాలనము సేసి, నను సార్వ♦భౌముఁ జేయ,
జ్ఞాతులనుఁ గూల్చి, నిష్కంట♦కము నొనర్త్రు!
పానకములోని పుడుకలు ♦ పాండుసుతులు!!"
*****************
కవిత సంఖ్య: 297
తే.గీ.
భారతమ్మునఁ గనఁగానుఁ ♦ గౌరవ తతి
పానకములోని పుడుకలు! ♦ పాండుసుతులు
కృష్ణుఁ డీక్షించుచుండంగ ♦ క్షేమముగను
జనులఁ బాలించునట్టి స♦జ్జనులు, ఘనులు!!
-:స్వస్తి:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 11-02-2016
శీర్షిక:- దనుజాంగన వలపు!
సమస్య:-
మునిఁ గని దనుజాంగన వలపుల వల విసిరెన్!
పూరణములు:
కవిత సంఖ్య: 298
[శూర్పణఖనుం గూర్చిన పూరణము]
కం.
దనుజాంతకు, సుగుణు, దయా
త్ముని, మునిజన హృద్విరాము, ♦ మోక్షప్రదునిన్,
జనకాత్మజేశు, శ్రీ రా
మునిఁ గని దనుజాంగన వల♦పుల వల విసిరెన్.
*****************
కవిత సంఖ్య: 299
[హిడింబనుం గూర్చిన పూరణము]
కం.
ఘన పర్వత సన్నిభ గా
త్రుని శుభ రూపుని వృకోద♦రుని రణవీరున్
గనియె హిడింబయె! యా భీ
మునిఁ గని దనుజాంగన వల♦పుల వల విసిరెన్!
-:స్వస్తి:-
********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్
తేది: 12-02-2016
కవిత సంఖ్య: 300
శీర్షిక:- అయోధ్యా రాముఁడు!
సమస్య:-
హనుమత్పుత్రిని భార్యగాఁ గొనె నయోధ్యారాముఁ డాహ్లాదియై.
పూరణము:
[శివధనుర్భంగముం గావించిన శ్రీరామునితోఁ దన పుత్రిక సీత వివాహము జరిపించిన విధమును జనకుఁడు సభలోఁ దెలుపు సందర్భము]
మత్తేభవిక్రీడితము:
"మునితోడన్ జనుదెంచి రాజసభలో ♦ మోదంబుతో రాజులన్
దనువుల్ డస్సి పరాక్రమం బుడుగు సం♦తప్తాత్ములం జూచి, తా
ధనువున్ ద్రుంచి, విశేష వీర్యయుతుఁడై ♦ తాదాత్మ్య రోమాంచ దే
హను, మత్పుత్రిని భార్యగాఁ గొనె నయో♦ధ్యారాముఁ డాహ్లాదియై!"
-:స్వస్తి:-
*********************
మిత్రులారా! నమశ్శతములు! దీనితోఁ ద్రిశత (300) కవితలనుం బూర్తి గావించితిని! సహృదయతతో నాదరించిన మీ యందఱకునుం గృతజ్ఞతాపూర్వక వందనములు తెలుపుకొను....
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్