Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఫిబ్రవరి 19, 2016

322 - శివస్తుతి (గర్భకవిత్వము)



అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 19-02-2016
కవిత సంఖ్య: 322

శీర్షిక:- శివస్తుతి! (గర్భకవిత్వము)

కంద, మధ్యాక్కఱ, తేటగీతి, ద్రుతవిలంబిత వృత్త గర్భిత చంపకమాలా వృత్తము:

హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్
స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్రజా
వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వపాలకా!
వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత జే!


ఈ చంకపమాల యందు ఇమిడి యున్న పద్యములు:


గర్భిత కందము:

శివ! శంకరా! త్రిపుర హం
త! విధిస్తుత! లింగ! ధీర!తత్ స్మరహర! సం
భవ నాశకా! విపది భం
గ! వివేకద!  విశ్వపాలకా! వరద! మృడా!


గర్భిత మధ్యాక్కర:

హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ!
స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ!
వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వ!
వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి!


గర్భిత తేటగీతి:

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీర!
విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్ర!
విపది భంగ! వివేకద! విశ్వపాల!
జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత!


గర్భిత ద్రుతవిలంబిత వృత్తము:

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీ!
విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గో
విపది భంగ! వివేకద! విశ్వపా!
జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జే!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

మిత్రులారా! పై "చంపక మాలా వృత్తము"నందు....నాలుగు పద్యములు దాగియున్నవి. అవి: కందము, మధ్యాక్కఱ, తేటగీతి మఱియు ద్రుతవిలంబిత వృత్తము. ఈ నాలుగింటిని చంపకమాల యందు నిమిడ్చి చేయు పద్య రచనమును "గర్భకవిత్వ"మందురు. ఇది చతుర్విధ కవిత్వములలో నొకటి. నేఁడిది స్వల్ప ప్రచారమున నున్నది. దీనిని సంపూర్ణముగ చదివి మీ యభిప్రాయమునుం దప్పక తెలుపఁగలరు.     -గుండు మధుసూదన్

6 కామెంట్‌లు:

  1. అద్వితీయమైన గర్భకవత్వం... ప్రయాణంలో ఉండి నిశిత పరిశీలన చేయలేకున్నాను. మీకు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు శంకరయ్యగారూ! తప్పక నిశిత పరిశీలన చేసి మీ యమూల్యాభిప్రాయమును తెలపండి!

    రిప్లయితొలగించండి
  3. కంద గీత గర్భ చంపక మాల.
    ప్రియ మధుసూదనా! కవన వేద్య దురంధర.జ్ఞాన తేజ! త
    న్మయుఁడవహో! భువిన్ సుగమ మైనది గర్భ విశుద్ధ శోభ.వి
    స్మయ మృదు మార్గమున్ కవిత సత్ సుధ లొల్కఁగఁ గాంచితీవు,సు
    శ్రియ పథగామివై వరలు శ్రీహరి మెచ్చగ బంధనాళితోన్.
    గర్భిత కందము:
    మధుసూదనా! కవన వే
    ద్య దురంధర.జ్ఞాన తేజ! తన్మయుఁడవహో!
    మృదు మార్గమున్ కవిత సత్
    సుధ లొల్కఁగఁ గాంచితీవు,సుశ్రియ పథగా!
    గర్భిత తేటగీతి:
    కవన వేద్య దురంధర.జ్ఞాన తేజ!
    సుగమ మైనది గర్భ విశుద్ధ శోభ.
    కవిత సత్ సుధ లొల్కఁగఁ గాంచితీవు,
    వరలు శ్రీహరి మెచ్చగ బంధనాళి
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. సుకవి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులకు ధన్యవాదములు! మీ గర్భకవిత్వ పాండిత్య మమోఘమైనది. మీచే మెప్పులందినందులకు నే నెంతయు ధన్యుఁడను! మీరిటులనే యిందలి కవితల నప్పుడప్పుడు పఠించుచు నమూల్యాభిప్రాయములం దెలుపఁగలరు.

    పాదాభివందనములతో...
    భవదీయ విధేయుఁడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  5. గర్భ కవిత్వం మీద యూట్యూబ్ లో కొన్ని వీడియో లు చేద్దామనుకుంటున్నాము . మీరు రచించిన పద్యాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు ఇచ్చినచో వాటిని కూడా వీడియో లో పొందుపరిచెదము. మీ పద్యములు మీ అనుమతితోనే మీ పేరు మీదుగానే వీడియో చేసెదము

    రిప్లయితొలగించండి