Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 25, 2017

వినాయక మాహాత్మ్యం

మిత్రులందఱకు
వినాయక చవితి పర్వదిన
శుభాకాంక్షలు!

image of lord vinayaka కోసం చిత్ర ఫలితం


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

వినాయక జననము:

అల గజాసురు కోరిక ♦ నాదరించి,
యతని గర్భాన వసియించు ♦ హరుని, హరియ
తెచ్చుచున్నట్టివార్తయే ♦ తెలిసి, గౌరి
యమిత సంతోషమునుఁ బొందె ♦ నాత్మలోన!


ఆ మహాదేవుఁడును వచ్చు♦నంతలోనఁ
దాను సర్వాంగ సుందర ♦ దర్శితయయి
యామతింపఁగవలెనని ♦ యాత్మఁ దలఁచి,
స్నానమునకునుఁ జనఁగ నా♦శంసఁగొనెను!


ద్వారపాలన కొఱకయి ♦ తగ నలుఁగును
నలిపి బాలరూపము నిచ్చి, ♦ పులకితయయి,
ప్రాణమునుఁ బోసి, మ్రోల ని♦ల్పంగ, మిగుల
మాతృభావన కలిగియు ♦ మాత మురిసె!


బాలునకు వినాయక సమా♦హ్వయము నిడియు,
ద్వారమున నిలిపియుఁ జనెఁ ♦ దాను స్నాన
మాచరింపఁగ లోనికి; ♦ నంతలోన
శివుఁడు కైలాసమునకు వ♦చ్చెను బిరాన!


పార్వతియ బొమ్మఁ జేసియుఁ ♦ బ్రాణ మిడిన
బాలకుం డడ్డె! క్రోధాన ♦ వానిఁ దలను
ఖండనము సేసె శివుఁడు! దా♦క్షాయణీప్సి
తమ్ము నెఱవేర్ప నేనుఁగు ♦ తల నిడెనఁట!


అతఁడె విఘ్నేశ్వరుండయి ♦ హర్షమునను
బ్రజల పూజలఁ గొనియును ♦ వరములిడుచుఁ
దల్లిదండ్రుల దీవెనల్ ♦ దగఁగొనంగ
దండ నతులిడ నుదరమ్ము ♦ ధరణినంటి
యాడుచుండఁగఁ జంద్రుఁడే ♦ యపహసించె!


చవితి దినమున నవ్వంగఁ ♦ జందమామ,
కొడుకు గణనాథు నుదరమ్ము ♦ క్రుమ్మరించె
లోని కుడుముల, నుండ్రాళ్ళ; ♦ వానిఁ జూచి,
క్రోధమున శపించెను గౌరి ♦ బాధతోడ!


"చవితి దినమున నేవారు ♦ చంద్రుని ముఖ
దర్శనము సేతురో వారు ♦ తత్క్షణమ్మె
తగని నీలాపనిందల ♦ నెగడుదు"రని
యనఁగ, దేవతల్ ప్రార్థింప ♦ వినిచె నిట్లు;


"నాదు తనయునిఁ బూజించి, ♦ నాఁడు నక్ష
తలఁ దలపయిఁ జల్లుకొన నిం♦దలు తొలఁగి, శు
భమ్ము లొనఁగూడు" ననుచు శా♦పావధి నిడ,
నంద ఱానందమందిరి, ♦ వందనమిడి!



శ్రీకృష్ణుని చంద్రదర్శనము - నీలాపనిందలు:


అల వినాయక చవితి సా♦యంత్రమందుఁ
గృష్ణుఁ డొంటిగఁ దోఁట కేఁ♦గియు నచటనె
కూర్చొనఁగ రుక్మిణీసతి ♦ కూర్మిమీఱ
దుగ్ధ పాత్ర నొసఁగఁగ నం♦దునను నతఁడు


చంద్రుఁ బొడఁగాంచినంత ♦ సాక్షాత్కరించె
నింద; సత్రాజితుని దమ్ము♦నిం దునిమి, య
తని శమంతకమణిఁ గొనె ♦ ననుచు వేగ!
దైవమైననుఁ దలవ్రాఁతఁ ♦ దాఁటఁ గలఁడె?


(అది, ప్రసేనుండు ధరియించి ♦ యడవి కేఁగ,
సింగ మొక్కం డతనిఁ జంపి, ♦ చెలఁగి కొనఁగ,
జాంబవంతుండు సింహముం ♦ జంపి, దానిఁ
దనదు కొమరిత మెడలోనఁ ♦ దనర వైచె! )


దానఁ గృష్ణుండు వనికేఁగి, ♦ తఱచి వెదుక,
నొక్కచో జాంబవంతుని♦యొక్క తనయ
జాంబవతి కంఠమందున ♦ సౌరుల నిడు
నా శమంతకమణిఁ జూచి, ♦ యతనితోడ


యుద్ధముం జేసి, యోడించి, ♦ యుక్తముగను
జాంబవతితోడి మణిఁగొని, ♦ సరగునఁ జని,
యచట సాత్రాజితిం బొంది, ♦ యందగించె
విఘ్నపతి చల్లఁగాఁ జూడ ♦ వెన్నుఁడంత!


ఇట్టి కథవిన్నఁ జదివిన ♦ నెవరికైన
విఘ్ననాథుండు నిరతమ్ముఁ ♦ బ్రేమమీఱ
నాయురారోగ్య భోగభా♦గ్యైహికముల
నొసఁగి, ముక్తిని నిడుఁగాత ♦ యున్నతముగ!


స్వస్తి


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

శుక్రవారం, ఆగస్టు 04, 2017

సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రము (తెనుఁగు అనువాదము)



"క్షమ నొసంగుము భగవతీ! కమల లక్ష్మి
శుద్ధ సత్త్వస్వరూపిణీ శోభితాంఘ్రి
కోపపరివర్జితా సృత్వరీ పరాత్ప
రీ క్షమాశీలి తాపహంత్రీ నమోఽస్తు! 1

సర్వ సాధ్వులలో సాధ్వి, సర్వ రూప
వతులలో రూపవతివి నీవమ్మ! నీవు
లేనిచో జగమంతయుఁ బ్రేత సమమ
గుచును నిష్ఫలమ్మగునమ్మ! కూర్మినిమ్మ! 2

సకల సంపత్స్వరూపవు, సర్వరూప
వీవె! రాసేశ్వరుల యధిదేవి వీవె!
సకల సతులందు నీ కళ సంక్రమించు!
లేరు నిను మించు దేవత లిజ్జగమున! 3

నీవె కైలాసమున శివానివిగఁ, బాల
కడలిలో సింధుసుతగ, స్వర్గమ్మునందు
స్వర్గ లక్ష్మిగా, భూతలోపరిని మర్త్య
లక్ష్మిగా వెలుఁగుదువమ్మ! రాఁగదమ్మ! 4

నీవె వైకుంఠమున లక్ష్మి! వీవె దేవ
దేవి, తులసి, సరస్వతీదేవి, గంగ;
వీవు సావిత్రివే గద విశ్వసృజుని
లోకమునఁ గన, నో తల్లి, నీకు నతులు! 5

నీవె కృష్ణుని ప్రాణాధిదేవతగను,
ప్రధిత గోలోకమున స్వయం రాధికగను
ధన్యత నిడియు, వెలయ బృందావనమున
బృంద; రాసాన రాసేశ్వరివయితీవె! 6

నవ్య భాండీరముననుఁ గృష్ణప్రియవయి,
చందన వనానఁ జంద్రవై, చంపకవన
మందు విరజవై, శతశృంగమందు నీవె
సుందరివయి వెల్గితివమ్మ సుకరముగను! 7

పద్మవనమున నవ పద్మవయ్యు, మాల
తీ వనమ్మున నవ మాలతివయి, కుంద
వనమునం గుందదంతివై తనరి, మిగుల
స్థిరతఁ గేతకీ వనిని సుశీలవైతి! 8

తగఁ గదంబ వనమునఁ గదంబమాల,
రాజగృహమున ఘన రాజలక్ష్మి, యటులె
ప్రతి గృహమ్మున గృహలక్ష్మి వలెను నిలిచి
పూజలను గొనుచుందువు పుడమిపయిని! 9

అంబుజాసనాతిచరాబ్ధిజామలేంది
రేశ్వరీ కమలాలయా శ్రీద విష్ణు
వల్లభా రమా మాధవీ వాహినీశ
నందినీ మారజననీ వినమ్ర నతులు!" 10

అనుచు దేవతల్, మునులును, మనుజులంత
నమ్రవదనులై భక్తితో నతులు సేసి,
శుభ్రకంఠోష్ఠతాలువుల్ శోభిలంగఁ
బ్రార్థనము సేసి తరియించ్రి రమణమీఱ! 11

ఇట్టి లక్ష్మీస్తవమ్మును నెవ్వఁ డుదయ
మునను భక్తిఁ బఠించు, నతనికి నెపుడు
ధ్రువముగాఁ బుణ్యములు శుభా లొదవునట్లు
తల్లి లక్ష్మియే కరుణించుఁ దనివితీఱ! 12

స్వస్తి