Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 24, 2016

అయుత కవితా యజ్ఞము (334-350)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-02-2016

శీర్షిక:- గురు స్తుతి!

కవిత సంఖ్య: 334
కం.
గురు శబ్ద వాచ్యుఁ డెవ్వఁడు
నిరయముఁ దొలఁగించు విద్య ♦ నేర్పునెవండో
సుర సమ ఘన తేజుఁ డెవఁడు
పరమ సుకృతిఁ గనెడి యతని ♦ భక్తిఁ దలంతున్!
************************
కవిత సంఖ్య: 335
కం.
గురు శబ్ద వాచ్యుఁ డెవ్వఁడు?
గురుఁడే తలి దండ్రి యన్న ♦ గురుఁడే సర్వుం
డిరవుగ మనుజుల కెల్లన్
గురుఁడు త్రిమూర్త్యాత్మకుండు ♦ గురుఁడు త్రిగుణుఁడే!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-02-2016
కవిత సంఖ్య: 336

శీర్షిక:- ద్రోణ వృత్తాంతము...

సమస్య:-
ద్రుపదరాజ కన్య ద్రోణు వలచె

(విద్యాభ్యాసము ముగిసినంతఁ దన రాజ్యమునకు వెడలిన ద్రుపదుఁడు, ద్రోణుని
వృత్తాంతముం గూర్చి యొక వేగు నడుగఁగా... నతఁడు ద్రుపదున కిట్లు
బదులిచ్చెను...)

ఆ.వె.
"గురువు నొద్ద విద్య ♦ గుఱు తెఱింగిన యంతఁ,
గృపి యను నొక ఘన సు♦కృతి, కృపు స్వస,
ద్రోణు ఘనత నెఱిఁగి, ♦ ద్రోణుఁ బెండ్లాడంగ
ద్రుపదరాజ! కన్య ♦ ద్రోణు వలచె!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-02-2016
కవిత సంఖ్య: 337

శీర్షిక:- గురునింద... ఫలితము...!

సమస్య:-
తెలివి లేనివాఁడె, దేశికుండు

(అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలోని యిందీవరాక్షుని వృత్తాంతము నిట
ననుసంధానించుకొనునది)

ఆ.వె.
వైద్య విద్యఁ గొనఁగ ♦ బ్రహ్మమిత్రునిఁ జేరి,
యడిగి, భంగపడియు, ♦ నటమటమున
విద్యఁ గొని హసింప, ♦ విని, శపించెను ముని!
తెలివి లేనివాఁడె, ♦ దేశికుండు?

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-02-2016
కవిత సంఖ్య: 338

శీర్షిక:- శుభమస్తు...!!!

సమస్య:-
స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్

(పెండ్లియైన పిదప నూతనవధూవరులు పెండ్లిబట్టలను విడిచి క్రొత్తబట్టలు
కట్టికొని యూరేఁగింపునకై సిద్ధపడిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)

"మనువయె మీకును! శుభమ!"
స్తన, వస్త్రము విడిచి, వధువు ♦ తలఁచె నుమా మం
డను; నవ వసనము నూరేఁ
గను గట్టియును, వరు నోర♦కంటఁ గని నగెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-02-2016
కవిత సంఖ్య: 339

శీర్షిక:- మెచ్చుకోలు...!

(ప్రియుఁడు ప్రియురాలి కనులను, కనుఱెప్పలను, కనుబొమలను వర్ణించు సందర్భము)

కం.
"ఏమని వర్ణింతును నీ
మోమున నేత్రములు మీన♦ములు; నయ్యళులున్
దాము కనుఱెప్పలు; బొమలు
కమానుగను మాఱెఁ! గనఁగఁ ♦ గాంతులఁ జిమ్మెన్!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 340

శీర్షిక:- రాయబారము!

(కురు సభయందు ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుఁడు పలికిన మాటలు)

సీ.
పుడమిఁ గల జనులు ♦ పొగడఁగఁ బాండవ
.....స్వార్జితమ్మగు రాజ్య ♦ మూర్జితముగ
స్వచ్ఛ మానస బోధ ♦ సలిపినట్టుల నీవు
.....నాదరించియు నిడ, ♦ నవనతులయి,
పాండవుల్ నీ వంశ ♦ పారంపరాంచిత
.....ఖ్యాతి విశ్వవ్యాప్త ♦ గమకితముగఁ
జేతురు, కావునఁ ♦ జేతోద్భవమ్మైన
.....స్వార్థమ్ము విడనాఁడ♦వయ్య యిపుడు!
గీ.
నాదు మాటలు మదిలోన ♦ నమ్ముమయ్య!
భావి విస్ఫోటనమ్మునుం ♦ బాపుమయ్య!
సుతుల నెల్లఱఁ జల్లంగఁ ♦ జూడుమయ్య!
భరతవంశోన్నతుఁడవు నీ ♦ వగుఁ గదయ్య!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 341

శీర్షిక:- రుక్మిణీ మనోగతము!

(తననుఁ జేపట్టుటకు వచ్చు శ్రీకృష్ణునిం గని రుక్మిణి యానంద వాహినిలో
మునిఁగితేలుచుఁ దనలో ననుకొనిన సందర్భము)

సీ.
ఎంత సుదిన మిద్ది! ♦ యేమని వివరింతు!
.....నిట్టి ఘడియ మఱి ♦ యెపుడు వచ్చు!
మదిని దోచియు నేఁడు ♦ మనువాడఁ గోరియు
.....నీలమేఘ నిభుండు, ♦ శైల ధరుఁడు,
నవనీత చోరుండు, ♦ నళినదళాక్షుండు,
.....ముర మర్దనుఁడు, వ్రజ ♦ మోహనుండు
శతపత్ర నేత్రనుం ♦ జారు సుగాత్ర నన్
.....శిశుపాలు పాలనుఁ ♦ జేరకుండఁ
గీ.
గావఁ బురుష సింహుం డయ్యుఁ ♦ గన్యనైన
నన్ను నర్ధాంగిగాఁ గొని, ♦ ననుఁ దరింప
మన్మనోహరాకారుండు, ♦ మన్మనోజ్ఞుఁ
డాదరమ్మున నిటకుఁ బెం♦డ్లాడ వచ్చె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 342

శీర్షిక:- చీమ కుట్టఁగఁ జచ్చిన సింహము!(మహిషాసుర సంహారము)

సమస్య:-
చీమ కుట్టెఁ! జచ్చె సింహ మయ్యొ!!

ఆ.వె.
"చీమ వీవు! నేను ♦ సింహమ్ము!" నంచును
మహిషుఁ డపుడు పలికి, ♦ మహిత శక్తిఁ
దూలనాఁడ; శక్తి, ♦ దుర్జనుం జంపెను!
చీమ కుట్టెఁ! జచ్చె ♦ సింహ మయ్యొ!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 343

శీర్షిక:- ఇద్దఱు భార్యల వెంకన్న!

(తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశుని కిద్దఱు భార్యలున్న విషయము మనందఱకు
విదితమే గదా! ఆ యిర్వుఱు సపత్నుల వాగ్వివాదము వలననే వేంకటేశ్వరుండు
ఱాయైనాఁడేమో కదా!)

కం.
ఇద్దఱు భార్యలు గలిగిన
ముద్దుల వెంకన్న వఱలె ♦ మొఱకుం గల్లై!
దిద్దుకొనఁ గలిగెనే? కన
నిద్దఱు భార్యలును వద్ద ♦ దెవ్వరి కైనన్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 344

శీర్షిక:- కుబేరుని... గత దారిద్ర్యము!

సమస్య:-
దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా!


(కుబేరుఁడు తొలిజన్మమున యజ్ఞదత్తుఁడైన బ్రాహ్మణుని కుమారుఁడు. పేరు
గుణనిథి. ఎటువంటి గుణములకు నిధి యనుకొంటిరి? దొంగతనము, వ్యభిచారము,
క్రూరత్వము, దుర్మార్గము… ఇవియే యతని గుణములు. ఆ విధముగ నున్న నే
తండ్రియైనను నేమి చేయును? ఇంటి నుండి పొమ్మనెను. గుణనిధి వెడలిపోయెను.
కాని తినుటకుఁ దిండి కూడ కఱువైనది. దానిచే నే భక్తుఁడో శివునిం బూజించి,
ప్రసాదము నర్పింపఁగ, దొంగిలించి, దాని నాఁకలిఁ గొన్న నోట వేసుకొనెను. అది
చూసిన రాజభటు లూరకొనక వెంటపడిరి. కాని, యింతలోఁ జీఁకటయిపోవుటచే వారికిఁ
జిక్కలేదు! అయినను, జివరికి వారి చేతిలోఁ జనిపోయిన కుబేరుని
తీసుకొనిపోవుటకు యమదూతలు వచ్చిరి్... విష్ణుదూతలును వచ్చిరి. శివుని
ప్రసాదముం దినినందువలన, విష్ణుదూతలే యతనిం దమవెంటఁ గొంపోయిరి! ఆ విధముగ
కుబేరుఁడు గత జన్మలో దుర్భర దారిద్ర్యము ననుభవించినాఁడను విషయమునిట
ననుసంధానించుకొనునది)

కం.
స్వర్భోగాల్ గత జన్మను
నిర్భర ప్రేమైక ధాత్రి ♦ నిజ జనని కృపా
గర్భస్థుఁడ, కొంటివి! తుద
దుర్భర దారిద్ర్య పీడి♦తుఁడవు, కుబేరా!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 345

శీర్షిక:- సుగుణ వర్తనము!

చంపకమాల:
అనిశము సర్వ భూతముల ♦ యందుఁ గృపం గురిపింపఁగా వలెన్
మనమున శాంతితోడ మన ♦ మందఱ మిత్తఱి స్నేహమొప్పఁగా
ఘనతనుఁ జాటి హింస విడఁ♦గా వలెఁ బెంచుచు సౌమనస్యమున్
మన విధిఁ దప్పకుండఁ జను ♦ మార్గము నీతియు సత్యమే సఖా!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 346

శీర్షిక:- స్వార్థపరులు!?

సమస్య:-
కాంతఁ గోరఁగఁ దానె యేకాంతుఁ డయ్యె!

(మేనకా విశ్వామిత్రుల ప్రణయ వృత్తాంత పూర్వక శకుంతలా జనన ఘట్టము నిట
ననుసంధానించుకొనునది)

తే.గీ.
గాధిజుఁడు మేనకనుఁ గూడి ♦ గాదిలి సుత
పుట్టువునకుఁ గారణమయ్యుఁ, ♦ బోవ నెంచి,
కాంతఁ గోరఁగఁ, దానె యే♦కాంతుఁ డయ్యె!
మేనకయుఁ బుత్రికను వీడి ♦ తానుఁ బోయె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 347

శీర్షిక:- జగద్భర్తకు... నతులు!

(ఆతఁడు సాధారణ "భర్త"యా? ఆ సకల జగత్సర్వభర్త విష్ణుం డందఱకు
సుఖదుఃఖములనుం దరిఁజేర్చుచు నుండ, నతని నే నిటులఁ గొలుతును)

కం.
భర్త "భరించెడివాఁ" డఁట!
హర్తాఘో ర్వీబిభర్తి ♦ తానర్తకపా త్రో
న్నర్తిత పాద ఫణాగ్రో
ద్వర్తక మర్త్యాళి దుఃఖ ♦ తారకుఁ గొల్తున్!!
*************************

ఈ పద్యమునకుం బ్రతిపదార్థములు:

>>ఆ "భర్త"యన సాధారణ భర్తయా...పృథ్వీపతి...విష్ణువు...(నేను విష్ణుపరముగనే వ్రాసితిని)...

*భర్త = పతి (భూదేవి మగఁడు = విష్ణువు)
*భరించువాఁడు+అఁట = భూ సంబంధమైన సకల భారములను మోయునంట (అంతియ కాదు)
*అఘ హర్త = పాపములను హరించువాఁడఁట
*ఉర్వీ బిభర్తిత+ఆనర్తక పాత్ర = జగన్నాటక సూత్రధారక పాత్రధారియఁట
*ఉత్+నర్తిత పాద ఫణ+అగ్ర+ఉత్+వర్తక = కాళియ ఫణాగ్రముపై నర్తించునట్టి
యున్నత పాద ప్రవర్తకుఁడఁట
కావున...
*మర్త్య+ఆళి దుఃఖ తారకున్ =మానవ ప్రకరమును దుఃఖములనుండి తరింపఁజేయునట్టి
(యున్నతుఁడయిన) యా విష్ణువును
*కొల్తున్ = నేను (నిరంతరము) సేవింతును!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016

శీర్షిక:- వర కృతము!

సమస్య:-
బురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్

కవిత సంఖ్య: 348
కం.

విరహాతిశయముతోడుత
సురత విరతి తపన తనర ♦ సుదతి కెరలఁగన్;
గరుణించి తననుఁ జేర స్వ
పురుషుఁడు; పసుపాడి ముడిచెఁ ♦ బూమాల నొగిన్!!
************************
కవిత సంఖ్య: 349

కం.
చిర విరహిణి రూపరి దరి
నరుదెంచిన వరునిఁ జేరి ♦ యర విరిసిన పూ
సరుల సరవిఁ గోర, దొరపెఁ
బురుషుఁడు; పసుపాడి ముడిచెఁ ♦ బూమాల నొగిన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 23-02-2016
కవిత సంఖ్య: 350

శీర్షిక:- అనునయము!

(పారిజాతవృక్షముం గోరెడి సత్యభామ నూఱడించుచు శ్రీకృష్ణుండు పలికిన మాటలు)

తే.గీ.
"నమ్ము మీ మాట నిజము! మో♦సమ్ము గాదు!
స్వర్గముం జేరి యింద్రుని ♦ వలనఁ గొందు!
శక్రుఁ డీఁకున్న, హరణమో, ♦ సమరమొ, చెలి!
పారిజాతమ్ముఁ గొనుటయే ♦ వలయు మనకు!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్


అయుత కవితా యజ్ఞము (325-333)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 325

శీర్షిక:- పాండవ దూత!

దత్తపది:
ఈఁగ-దోమ-పేను-నల్లి....పదముల నుపయోగించి...భారతార్థమున నేను వ్రాసిన పద్యము

[దూతగ వెడలిన శ్రీకృష్ణుఁడు దుర్యోధనునకు రాఁగల యపాయమునుం గూర్చి
యుపదేశించు సందర్భము నిట ననుసంధానించుకొనునది]

ఉత్పలమాల:
ఈఁగల యైదు నూళ్ళనిడి ♦ యిప్పుడు సఖ్యతఁ జూపకున్నచోఁ
గాఁగల కార్య మెట్టులునుఁ ♦ గాఁకయు మాన దెదో! మహాత్మతన్
దూఁగరు మీరు! కిన్క తగ♦దోయి! యనిన్ గెలు పేను కూర్చి, స
ద్యోగము నల్లి, పాండవుల ♦ యోగ్య మహీశులఁ జేతు నత్తఱిన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016

శీర్షిక:- చనుఁబాలు ద్రావు బిడ్డఁడే!...ఐనను....!!!

కవిత సంఖ్య: 326

కం.
చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
తన కటినిం గట్టు ఱోటి ♦ త్రాటిం దిగువన్
బెను మ్రాఁకులుఁ గూల నపుడు
ఘన విస్మితులయి నిలిచిరి ♦ గంధర్వులటన్!
********************

కవిత సంఖ్య: 327

కం.
"చనుఁబాలు ద్రావు బిడ్డఁడె?
ఘన దైవమ్మగును కాని, ♦ కాఁడయ శిశువే"
యని వల్లవు లత్తఱిఁ దమ
మనవినిఁ దెల్పంగఁ జనిరి ♦ మాతఁ బిలువఁగన్!!
*********************

కవిత సంఖ్య: 328

కం.
చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
ఘనులౌ వేల్పులకు ముక్తిఁ ♦ గల్పింపంగన్
మనమునఁ బొంగి యశోదయె
తన యెదకును హత్తుకొనియె ♦ దబ్బున శిశువున్!!
**********************

కవిత సంఖ్య: 329

కం.
"చనుఁబాలు ద్రావు బిడ్డఁడె
కనఁగను విష్ణుండు నృహరి ♦ ఘనుఁడౌ మధుసూ
దనుఁ" డని రట గంధర్వులు
చనఁ బురికిని గృష్ణు నెదుటఁ ♦ జాఁగిలఁబడుచున్!!
***********************

కవిత సంఖ్య: 330

కం.
చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
జన మనముల దోచి వెల్గె ♦ శాశ్వతుఁ డనఁగన్
విన వేడుకయ్యెఁ దల్లికిఁ
దనువే పులకించి జన్మ ♦ తరియించె వెసన్!!
********************

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 331

శీర్షిక:- త్రైలోక్య గర్భుఁడు!

సమస్య:-
ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!


కం.
నటనల సూత్రముఁ దాల్చితి
వఁట యో త్రైలోక్య జఠర! ♦ పదపడి చూడన్
దిటవుగ నీ జఠర మ్మను
ఘటమున నేనుఁగుల గుంపు ♦ గలదు ముకుందా!!


-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 332

శీర్షిక:- ప్రహ్లాద ఉవాచ!

(హరినామస్మరణమ్ము మానుమని బోధించు తండ్రితోఁ బ్రహ్లాదుఁడు పలికిన సందర్భము)

తే.గీ.
"ఇనుము సూదంటురాయికై ♦ యెగయు నట్లు;
చంచరీకమ్ము తేనెకై ♦ సమకొను విధి;
ముక్తసంగుఁడు ముక్తికై ♦ పూను పగిది;
నాదు మదికోరెఁ దండ్రి శ్రీ♦నాథుఁ జేర!"


-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 22-02-2016
కవిత సంఖ్య: 333

శీర్షిక:- చుక్కల లెక్కలు!

సమస్య:-
తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్

(ఆవాల మూటతో సభకు వచ్చి, చుక్కల లెక్క నెఱుంగఁ గోరిన యక్బరుతో బీర్బల్
పలికిన సందర్భము)

"కోరిక తోడుతఁ జుక్కల
నీ రీతిగ గణన సేయ ♦ నెప్పటికైనన్
దీరదు! సర్షపములతోఁ
దారల గణనమ్ము సులభ♦తరమౌఁ జూడన్!!"

(సర్షపములు = ఆవాలు)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

ఆదివారం, ఫిబ్రవరి 21, 2016

324 - మాతృభాష [తెలుఁగు] వెలుఁగు (గర్భకవిత్వము)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 324

శీర్షిక:- మాతృభాష [తెలుఁగు] వెలుఁగు (గర్భకవిత్వము)

ద్విపద, మత్తకోకిల, కంద గర్భిత సీసము:

సీసము:
చేతు జోతలు, చేర్చి శ్రేష్ఠద చిత్తమున్
…..మహి భారతీ! చనె  మాతృభాష
మాత! యాంగ్లమె నేఁడు  మాధ్యమ  మంచు దా
,,,,,నినె నేర్చుచున్ దెలుఁ  గని యనఁగను
రోఁత యంచును దెల్గు  రీతుల రోయుచుం
…..డ్రిట హెచ్చుగా నదె  మృతిఁ గొనెనని
చేత మందున నుల్లసిల్లుట సిగ్గు సి
…..గ్గయ సోదరా యనకయ పలువలు

తే.గీ.
తెనుఁగు తొలగగ విడచి; రిదె వినసొంపు
గఁ జనెడి తెనుఁగు విడుతురె  కట్ట! యింక
మారుఁడోయయ్య! మనదైన  మాతృభాష
తెలుఁగు వెలుఁగులు లోకాన  నిలుపుఁడయ్య!


ఈ పైన రచించిన సీసమందును…తేటగీతియందును గర్భితమైన పద్యములు ఇవి:

1. ద్విపద
2. మత్తకోకిల
3. కందము

వాటిని వరుసగఁ గ్రింద నిచ్చుచున్నాఁడను. చూడుఁడు:

1. గర్భిత ద్విపద

చేతు జోతలు చేర్చి  శ్రేష్ఠద చిత్త
మాత! యాంగ్లమె నేఁడు  మాధ్యమ మంచు
రోఁత యంచును దెల్గు  రీతుల రోయు
చేత మందున నుల్లసిల్లుట సిగ్గు


2. గర్భిత మత్తకోకిల

చేతు జోతలు చేర్చి శ్రేష్ఠద  చిత్తమున్ మహి భారతీ
మాత! యాంగ్లమె నేఁడు మాధ్యమ  మంచు దానినె నేర్చుచున్
రోఁత యంచును దెల్గు రీతుల  రోయుచుం డ్రిట హెచ్చుగా
చేత మందున నుల్లసిల్లుట  సిగ్గు సిగ్గయ సోదరా


3. గర్భిత కందము

చనె మాతృభాష తెలుఁగని
యనఁగను నదె మృతిఁ గొనె నని  యనకయ పలువల్
తెనుఁగుఁ దొలగగ విడచి; రిదె
వినసొంపుగఁ జనెడి తెనుఁగు  విడుతురె కట్టా!

(మిత్రులందఱకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్శనివారం, ఫిబ్రవరి 20, 2016

323 - విష్ణుస్తుతి (గర్భకవిత్వము)అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-02-2016
కవిత సంఖ్య: 323

శీర్షిక:- విష్ణుస్తుతి (గర్భకవిత్వము)

*

నవాక్షర సమవృత్త, కంద త్రయ, మణిగణనికర(శశికళా)వృత్త గర్భిత సరసిజ వృత్తము:

*

సరసిజ వృత్తము:

శ్రీవత్సాంకా! చేతును సేవల్! శివసఖ! మమతల  సిరు లిడితి వయా
దేవాధీశా! దివ్య గతీవే!  దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
దైవమ్మీవే! ధర్మువు తావై  ధవళిత యశ మిడి  దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ రావా!  ప్రవిమల చరితను  రయముగ నిడుమా!

[లక్షణము: మ-త-య-న-న-న-న-స...గణములుండును...
యతిమైత్రి:1-10-18 యక్షరములకు...
ప్రాసపాటింపఁబడును]


పై సరసిజ వృత్తమునందు....

ఒక నవాక్షర వృత్తము
మూఁడు కందపద్యములు
ఒక మణిగణనికర (శశికళా) వృత్తము

మొత్తము ఐదు పద్యములు ఇమిడియున్నవి....

అవి వరుసగా....


గర్భిత
నవాక్షర వృత్తము:

శ్రీవత్సాంకా! చేతును సేవల్! 
దేవాధీశా! దివ్య గతీవే! 
దైవమ్మీవే! ధర్మువు తావై
రావే యీశా! రక్షగ రావా!
*

గర్భిత
కందము(1)

శ్రీవత్సాంకా! చేతును
సేవల్! శివసఖ! మమతల  సిరు లిడితి వయా!
దేవాధీశా! దివ్య గ
తీవే! దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
*

గర్భిత
కందము(2)

దైవమ్మీవే! ధర్మువు
తావై ధవళిత యశ మిడి  దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ
రావా! ప్రవిమల చరితను  రయమున నిడుమా!
*

గర్భిత
కందము(3)

శివసఖ! మమతల సిరు లిడి
తివయా! దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
ధవళిత యశ మిడి దయను సు
రవరా! ప్రవిమల చరితను  రయమున నిడుమా!
*

గర్భిత
మణిగణనికర (శశికళా) వృత్తము:

శివసఖ! మమతల  సిరు లిడితి వయా
దివికినిఁ జనఁగను  దెసనిడితివయా!
ధవళిత యశ మిడి  దయను సురవరా!
ప్రవిమల చరితను  రయమున నిడుమా!

[లక్షణము: న-న-న-న-స...గణములుండును.
యతిమైత్రి:1-9 అక్షరములకు.
ప్రాసపాటింపఁబడును]

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్