Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మార్చి 28, 2016

హరి శతకము

నేను అయుత కవితా యజ్ఞమునఁ బ్రకటించిన 
హరి శతకము


ఓం నమో భగవతే వాసుదేవాయ



శ్రీకైవల్య పదముఁ గొన
నీకయి విరచించి నాదు ♦ నేరుపు మీఱన్
శ్రీకర శుభకర గురు కరు
ణాకర వర కంద శతము ♦ నర్పింతు హరీ! (01)


శ్రీలక్ష్మీశా! వినుమయ!
నీ లీలలు కనఁగ వినఁగ ♦ నెద పొంగునయా!
నాలోని మోహ మార్చియు;
నీలో ననుఁ గలుపుకొనియు ♦ నెమ్మి నిడు హరీ! (02)


నిరతము నీధ్యానమ్మే;
సరగున ననుఁ బ్రోచి, నేను ♦ సంబరపడఁగన్,
విరివిగ జ్ఞానము నీయుము!
హరియించుము మనములోని ♦ యజ్ఞతను హరీ! (03)


నిను ధ్యానించెడు పట్టునఁ
బెను యోచన లెపుడు ముసర, ♦ వెఱచు మనమునున్
గనియునుఁ, జిత్త స్థైర్య
మ్మునుఁ బెంచుము, దేవదేవ! ♦ ముదమునను హరీ! (04)


పూజలు సేయఁగ, పలువిధ
పూజాద్రవ్యమ్ములేవి ♦ పొనరించియు నే
నీఁ జాలనయ్య! మనమను
పూజాకుసుమమ్ముఁ గొనుము! ♦ పురుషవర! హరీ! (05)


దేవాధిదేవ! నిన్నును
నా వాఁడ వటంచు నమ్మి, ♦ నా మనమున నిన్
భావించి కొలుతునయ్యా!
దీవన లీయంగ రమ్ము! ♦ ద్విజశకట! హరీ! (06)


స్తోత్ర మ్మిడ మంత్రము లే
మాత్ర మ్మే నెఱుఁగనయ్య ♦ మాధవ! కరుణన్
బాత్రత నెఱిఁగియు, నన్నున్
బుత్రునిగా నెంచి, వేగఁ ♦ బ్రోవుమయ హరీ! (07)


సన్మాన్యము లే మిడుదునొ,
చిన్మూర్తీ! యెఱుఁగు దీవు ♦ సేవింపఁగ నిన్!
మన్మనమున నిలుపుకొనుటె
సన్మాన్యము కాదె! యీశ! ♦ చక్రధర! హరీ! (08)


చేతను గవ్వయు లేదయ!
చూత మనఁ, బవిత్ర ధనము ♦ చోద్యమ్మె, భువిన్
జూతుమె? పవిత్రమగు నా
చేతమ్మునుఁ గొనుము వేగ ♦ శ్రీనాథ హరీ! (09)


కుల గోత్ర వంశ ఘనతనుఁ
దెలుపఁగ నున్నతుఁడఁ గాను! ♦ దీనుఁడ నయ్యా!
విలువలఁ జూడఁగ నెందునఁ
గలవో నీ వెఱుఁగ లేవె? ♦ కమలాక్ష హరీ! (10)


చదువుల సారము నెఱుఁగను
గదయా! వేదమున నిన్నుఁ ♦ గను మంత్రములన్
జదువఁగ లేనయ! సార
మ్మిదె కొనుమయ నా పలుకుల ♦ నెంచుచును హరీ! (11)


నీ లీల లద్భుతమ్ములు!
బాలుఁడ నీ ముందు నేను! ♦ వరదుఁడ వీవే!
లీలా మానుష విగ్రహ!
నాలోఁ గల వెతల డుల్చి ♦ ననుఁ గావు హరీ! (12)


కరి మొఱ విని కాచితివఁట,
"పరమేశా! కావు" మంచుఁ ♦ బ్రార్థింపంగన్;
పరిపరి విధముల నుతు లిడఁ,
గరివరదా! వేగ నన్నుఁ ♦ గావు మయ హరీ! (13)


ఓపిక నే పుణ్యములను
గోపిక లటఁ జేసినారొ? ♦ గొబ్బున వారిన్
దాపముఁ దీరిచి యెదలో
దీపించుచు నర్తనములఁ ♦ దేల్చితివి హరీ! (14)


మాయలఁ దెలియని బేలయు
నా యమ్మ యశోద కట్టె ♦ నా ఱోట నినున్!
మాయలఁ దెలియని నా మది
నో యయ బంధితుఁడ వగుమ! ♦ యురగశయ! హరీ! (15)


యుక్తియె లేదయ; నినుఁ గన
శక్తియు లేదయ్య; చేరఁ ♦ జాలను రక్తిన్;
భక్తసులభ నినుఁ గొలిచెద
భక్తిని! ముక్తి నిడు మయ్య ♦ పరమేశ! హరీ! (16)


దైత్యాంతక! నిను నే సా
హిత్యాత్మక పద్యము లిడి ♦ హితమతిఁ గొలువన్;
సత్యాత్మ నిడియుఁ బ్రోచుచు
నిత్యము మద్దురిత కృతుల ♦ నిర్జించు హరీ! (17)


లోకమ్మునఁ బాపమ్ములు
చేకొని యొనరించుచుండ్రి ♦ శిక్షాభయమున్
లేకయె! వారల మనమున
నే కపటము దొరలకుండ ♦ నియమించు హరీ! (18)


కడలినిఁ గడఁచి, సురస మద
మడఁచియు, లంకిణినిఁ గూల్చి, ♦ మైథిలిఁ గనియున్
దొడ విడి, లంకనుఁ గాలిచి
యడరిన హనుమయ్య భక్తి ♦ నందించు హరీ! (19)


బాలునిఁ గని దయ లేకయె
కాలుండయె కనక కశిప ♦ కల్మాషుఁడు తాన్!
బాలునిఁ గాఁచెడి నృహరివె!
యేలయ ననుఁ గావ రావు ♦ హిత మిడియు హరీ! (20)


కమలేక్షణ! హృదయేశ్వరి
కమలను హృత్కమలమందు ♦ కాంక్ష నిడియు నీ
విమలాత్మనుఁ బ్రకటించితి!
రమేశ! నా హృదయమందు ♦ రంజిలుము హరీ! (21)


నినుఁ దలఁచిన శ్రమ తొలఁగును;
నినుఁ దలఁచిన పనులు జరుగు; ♦ నిధులును గలుగున్;
నినుఁ దలఁప ముదము; కావున,
నినుఁ దలఁచెడు మనము నిమ్ము ♦ నిత్యమును హరీ! (22)


రవి చంద్రులు నేత్రములై
యవిరళముగ వెలుఁగఁ జేయు♦నయ లోకములన్!
కవిలోక వంద్య! నా మది
నవిరళముగ వెలుఁగఁ జేయు♦మయ వరద! హరీ! (23)


గురు పదముల ధ్యానించినఁ
దొలఁగును నజ్ఞాన తిమిర ♦ దోషమ్ము వెసన్!
గురువులకే గురుఁడవయా!
సరగున జ్ఞానమ్ము నిమ్ము ♦ సత్కృపను హరీ! (24)


సురలనుఁ గాఁచి, యసురులనుఁ
బరిమార్చియు, వేగ లోక ♦ పరితోష మిడన్
బరికీర్తితుండ వీవే!
సురేశ వాణీశ వంద్య! ♦ శుభకారి హరీ! (25)


బల ముడిగి నృపులుఁ గన, హరు
విలు విఱిచియు, జనక సుతనుఁ ♦ బెండ్లాడ, వెసన్
బలవంతుఁడవని లోకము
పలుమఱుఁ బొగడెఁ గద! నాకు ♦ బలమీవె హరీ! (26)


వశ ముడిగి నిన్నుఁ దెగడిన
శిశుపాలుని దోష శతము ♦ సీమను దాఁటన్
భృశమే ఖండించితివయ
శిశుపాలుని శిరము! చక్రి! ♦ చిద్రూప! హరీ! (27)


పాపి దశాస్యుఁడు సీతను
పాపముఁ దలఁపక హరించి ♦ బంధించఁగ నా
పాపినిఁ ద్రుంచితి! లోకులఁ
బాపాత్ముల వశము నుండి ♦ పాలింపు హరీ! (28)


ధనమున్నవారలందఱు
ధనగర్వముచేత రేఁగి, ♦ ధనహీనులనున్
"దీనులు, హీను" లనుచు నవ
మాన మిడఁగ, వేగ వారి ♦ మద ముడుపు హరీ! (29)


నీ పాద ధూళి చేతనె
శాపావధిఁ గనె నహల్య! ♦ సరి యా పదముల్
కాపాడఁ గడిగె గుహుఁ! డా
నీ పదముఁ గడిగెద నేత్ర ♦ నీరమిడి హరీ! (30)


వచ్చితి వ్రేపల్లెకు; నటఁ
జొచ్చితి గోపకుల యింటఁ ♦ జుఱ్ఱఁగఁ బాలన్;
గ్రుచ్చితి దనుజుల నెల్లను;
మెచ్చితి పదునారు వేల ♦ మెలఁతుకల హరీ! (31)


శ్రుతులం గాఁచితి; గిరి మో
సితి; కనకాక్షుని కనక క♦శిపు నొంచి; బలిన్
క్షితి నడఁచి; నృపుల వంచి; ప
దితలల దొరఁ ద్రుంచి; గీతఁ ♦ దెల్పితివి హరీ! (32)


శూలి ధను ర్భేదక! వన
పాల దనుజ నాశక! నయ♦బాహ్య దశాస్యో
న్మూలక! సవిధ స్థిత భూ
పాలక! కృత రామరాజ్య! ♦ పద్మాక్ష! హరీ! (33)


పుట్టితివి దేవకికి; మఱి,
మెట్టితివి యశోద యింట ♦ మేలుం గూర్పన్;
గొట్టితివి రక్కసుల నిల;
మొట్టితివయ ఖలునిఁ గంసు ♦ మోదమున హరీ!(34)


తాపసులనుఁ దాపసివయి;
భూపతులను నృపుఁడవయి; ఋ♦భువుల ఋభుఁడవై;
గోపాలక! భూగోవును
నేపారఁగఁ గాఁచి తీవు! ♦ హేమాంగ! హరీ! (35)


దేవముని నారదుం డొక
దేవ విరిని నిడఁగ, నీవు ♦ దేవేరి కిడన్,
దేవా! సత్యయె యలుఁగన్,
దేవేంద్రు గెలిచి, కుజమునె ♦ తెచ్చితివి హరీ! (36)


సుర లసురు లమృతమునకయి
ధరాధరము పాలకడలిఁ ♦ ద్రచ్చఁగ మునుఁగన్
ద్వర కూర్మమవై నీవటఁ
గరుణను మంధరము మోసి, ♦ గతి నిడితి హరీ! (37)


భువి నసురుం డడవికిఁ జని,
భవునిఁ గూర్చి తపము సేసి, ♦ భస్మాసురుఁడై,
శివునే పరీక్ష సేయఁగ,
నువు మోహినివయ్యు వాని ♦ నొంచితివి హరీ! (38)


అమృతము సురాసురులు గొని,
తముఁ దామే పోరుచుండఁ, ♦ దగ మోహినివై
యమృతముఁ బంచితి సురలకు!
విమతుల మృతి కెఱఁగఁ జేయ ♦ వినయాన హరీ! (39)


నిరతము నిన్నును నందఱు
"సరసిజనయనా! ముకుంద! ♦ సర్వేశ! యతీ!
స్మరగురు! మధుసూదన! జిన!
మురహర!" యనుచును స్మరింత్రు ♦ మోక్ష మిడ హరీ! (40)


"వినఁ డితఁ" డని మాత యపుడు
నినుఁ ఱోటికిఁ గట్టివేయ, ♦ నీడ్చుచు, మద్దుల్
గని, నడుమన నునిచి, తిగువ
ను, ననిమిషులు శాపము విడ, ♦ నుతు లిడిరి హరీ! (41)


ఎంగిలి పండ్లను నీకిడి
వంగిన మనమునను నిన్ను ♦ భక్తి నుతింపన్
బొంగియుఁ గాఁచితి శబరిని
హంగుగ మోక్షమ్ము నిడియు ♦ యజ్ఞేశ హరీ! (42)


పిడికెడు నటుకుల రుచిఁ గొని,
యిడియును నైశ్వర్యములను; ♦ హితునిఁ గుచేలున్
విడిపోని బంధమునఁ బ్రే
ముడిచే సేవల నొనర్చి ♦ మురిసితివి హరీ! (43)


భువనేశ! దైత్యనాశా!
భవ నాశక! పద్మనాభ! వరద! పరేశా!
స్తవనీయ! హృషీకేశా!
త్రివిక్రమా! శ్రీశ! నాకు ♦ దిక్కీవె హరీ! (44)


అరమరిక లేలనయ్యా
కరుణాకర! నన్నుఁ గావ? ♦ కైమోడ్చితి; నా
పరదైవ మీవె యంటిని;
పరమాత్మా! వేగ రమ్ము ♦ వరమిడఁగ హరీ! (45)


త్రికరణ శుద్ధిగ నీ గుణ
నికర పదచ్ఛాయలోన ♦ నివసించినచో
నకళంక జీవనస్థితి
సుకరమ్మై చేరు సకల ♦ శుభములును హరీ! (46)


ఒకఁడుండు లేమిఁ గుములుచు;
నొకఁడుండును కలిమియందు ♦ నొందుచు సుఖముల్;
సుకరముగఁ దెలియ నీ స్థితి
ప్రకటితమగుఁ బూర్వజన్మ ♦ వాసనల హరీ! (47)


నీ లీలఁ దెలియలేకయె
కూలి వెతల; జతనములనుఁ ♦ గొనమయ నిచ్చల్;
గాలిని దీపము నిడెదము;
మేలు నిడెడి నిన్నుఁ దలఁప ♦ మిఁక నోమ హరీ! (48)


నినుఁ గొల్వ గుడినిఁ గట్టఁగ
ధనమునుఁ గూర్చుకొనియు, సర♦దారుని సుంక
మ్మునుఁ గొని, వెఱవక, భద్రా
ద్రిని గోపన్నయె సృజించెఁ ♦ దిరముగను హరీ! (49)


త్యాగయ్య హృదయమందున
రాగమ్మునఁ గీర్తనమున ♦ రాముని వయ్యున్
దాగి గెలిపించితయ్యా
త్యాగమునకు నిలయునిగను ♦ ధరలోన హరీ! (50)


ధరఁ బ్రహ్లాదునిఁ గావఁగ
వర కరుణా వీక్షణములఁ ♦ బ్రసరింపంగన్
గరము విలంబముఁ జేసియు;
నరసింహుఁడవయ్యుఁ గాచి♦నాఁడవయ హరీ! (51)


లక్షించి కౌరవులు ఘన
శిక్షను నిడఁ బాండవులనుఁ ♦ జేరంగనుఁ గో
పాక్షుని దుర్వాసుఁ బనుప
నక్షయపాత్ర మెతుకుఁ దిని ♦ యరసితివి హరీ! (52)


త్రిపురాసుర సంహార
మ్మపుడా శివునకును నీవు ♦ నస్త్రమ్ముగనై
త్రిపురములఁ గాల్చినాఁడవు
విపుల యుద్ధమందు నిలిచి ♦ వెలుఁగొంది హరీ! (53)


ముని కృతమున సిరి కోప
మ్మునుఁ గొని వెడలఁగను నీవు ♦ పుట్టం జొరఁగన్
గని, హర చతురానను లట
వనమున గో వత్సము లయి ♦ పాలిడిరి హరీ! (54)


నిను మనమున నిలుపుకొనియు
వినుతింతునుఁ బద్దెములను ♦ విశ్వేశ్వర నన్
గనుమయ కటాక్షముల వే
గను ననుఁ బ్రోవుమ రమేశ! ♦ కరుణాత్మ! హరీ! (55)


దండమయా జగదీశ్వర!
దండమయా నీరజాక్ష! ♦ దండము శౌరీ!
దండమయా దనుజాంతక!
దండమయా వేదవేద్య! ♦ దండ మిదె హరీ! (56)


నా కష్టములనుఁ బాపుచు
లోకేశా! శాంతి నిడుము! ♦ లోకము నందున్
నా కిష్టమైన దైవమ!
నా కిలఁ బరమార్థ మిమ్ము ♦ ననుఁ గనుచు హరీ! (57)


లోకమ్మును సృజియించుచు;
లోకముఁ బాలింప జనుల♦లో వెలుఁగుచు; నీ
లోకమును లయ మొనర్చుచు;
లోక మ్మీ వగుదు గాదె ♦ లోకేశ! హరీ! (58)


ఆ రంతిదేవుఁ డెప్పుడు
కోరిన యాచకుల కెపుడు ♦ కూరిమి నిడుచున్
ధీరుండై మోక్షముఁ గొనె!
నారాయణ! ధర్మబుద్ధి ♦ నా కిడుము హరీ! (59)


జనకుని యానతిఁ దాల్చియు
జననిం బరిమార్చి తండ్రి ♦ సంతోషపడన్
జననిం బ్రతికించితి వయ
ఘనకుఠార! పరశురామ! ♦ కావుమయ హరీ! (60)


నీ మహిమలఁ గనుఁగొనఁగను
బ్రేముడి మన మంత నిండు ♦ శ్రీలక్ష్మీశా!
నేమమున నిన్నుఁ గొల్చితి
నా మనమున నిలువు మయ్య ♦ ననుఁ గావ హరీ! (61)


భవ సాగరమున మునిఁగియు
నవయుచు మే ముంటి మయ్య ♦ నరక మ్మిదియే!
నవనీత హృదయ! నన్నిఁక
భువినిం దప్పించి దివికిఁ ♦ బో విడుము హరీ! (62)


చేసెడిది తామె యనుచును
జేసెడి కర్మముల గొప్పఁ ♦ జేఁజేతఁ బ్రజల్
వాసిగఁ జెప్పుచు నుందురు!
చేసెద వీ వంచుఁ దెలివిఁ ♦ జేకొనరు హరీ! (63)


శివునాజ్ఞ లేక చీమయె
భువిఁ గుట్ట దటంచు నెఱిఁగి ♦ ముఱియుదుము! కనన్
భువి నీ యానతి నన్ని, య
భవ! నడువఁగఁ, బాపపుణ్య♦పరు లెవరు హరీ? (64)


పుట్టించితి మనుజునిగను
మెట్టించితి మనుజులందు ♦ మిన్నగ నన్నున్
గిట్టించఁగానుఁ దృప్తిగఁ
గట్టెదుటనుఁ గానుపించి ♦ కావుమయ హరీ! (65)


జీవాంతర్హృదయమ్మునఁ
దావక ప్రేమామృత మిడఁ ♦ దరితీపేలా?
జీవాత్మనుఁ బరమాత్మయె
కావఁగ వలెఁ గాదె, చూపి ♦ కనికరము, హరీ! (66)


నా దైవమ! నా ప్రాణమ!
వేదాదుల యందు నీవె ♦ విదితుఁడ వనఁగన్;
వేదాంత వేద్య! నేనే
వేద మ్మెది యెఱుఁగ నయ్య ♦ ప్రియ వరద హరీ! (67)


నే నింతవాఁడ నంచును
దానయి చెప్పుకొనుచుండుఁ ♦ దఱచియు నరుఁడున్!
తానెట్లు గొప్పవాఁడో
తానెఱుఁగునె, నీ మహిమలఁ ♦ దలఁపకయె, హరీ? (68)


పలు మతములఁ; బలు కులములఁ;
బలు భాషల, దేశములనుఁ; ♦ బలు వ్యవహృతులన్;
బలు మనముల దీపించుచు
నిలిచియు దైవ మ్మొకండె ♦ నివసించు హరీ! (69)


గోవింద! నీదు నామము
భావింప మనమ్మునందు ♦ భాసిలుచు వెసన్
బావన మొనరించును రా
జీవము పరిమళముఁ జిమ్ము ♦ చెన్నుగను హరీ! (70)


పిలిచినఁ బలుకఁగ లేదని
కలవర మందుచును జనులు ♦ గడఁగియు నెంతే
నలిఁగియు దైవమె లేఁడని
పలు విధములఁ బలుకకుండ ♦ పలుకుమయ హరీ! (71)


నాలోని పద్య విద్యకు
నాలంబన మీవె దేవ! ♦ నా మనమున నీ
జాలము లలిత గతుల పద
జాలము నర్తింపఁ జేసె! ♦ సత్య మిది హరీ! (72)


సర్వముఁ గాంతువు నీవే;
సర్వలోక వినుత! నిన్ను ♦ శరణంటినయా!
సర్వాంతర్యామీ! నా
గర్వమ్మునుఁ బరిహరింపఁ ♦ గనుమయ్య హరీ! (73)


మోసముఁ జేసెడు వారల
దోసములను బయటపెట్టి ♦ దుర్జన కృతమున్
వేసమ్ము తోడఁ దెలిపియు
దాసోఽహమ్మనెడు నటులఁ ♦ దరువిడుము హరీ! (74)


పొత్తముల వెలుఁగు విద్యయుఁ
జిత్తమునను వెలుఁగు జ్ఞాన ♦ శేషము త్వద్వా
గ్దత్తము కాదే! యిఁక నే
నిత్తును నా హృదయ కుసుమ ♦ మిదె కొనుము హరీ! (75)


మనుజులలో మనుజుఁడవై;
దనుజుల నిల రూపుమాపి, ♦ దశరథ రాముం
డను పేరఁ బరఁగి, కపికుల
ఘనుఁ గాఁచితి వాలిఁ జంపి ♦ కరుణాఢ్య హరీ! (76)


ఖగపతిని వాహనముగ; భు
జగపతి నొక తల్పముగను ♦ సరగునఁ గొనియున్
జగముల నేలెడి పతివై
యుగయుగముల వెలుఁగుచుంటి♦వోయయ్య హరీ! (77)


దుష్టులఁ దునుమాడి ధరను
శిష్టుల రక్షించి శమము ♦ స్థిరపఱచి వెసన్
గష్టమ్ములఁ దొలఁగించియు
నిష్టమ్ములఁ గూర్తువయ్య ♦ నేమమున హరీ! (78)


ఉత్కృష్ట చరిత! నిన్నిఁక
సత్కృతులం దొనరఁజేయు ♦ సన్నుతి, గుణ సం
పత్కర వర కరుణాది ర
సోత్కరమై వెలుఁగఁ జేయు ♦ సుగుణుఁడవు హరీ! (79)


నారదునకు సంసారపుఁ
గోరిక నిడఁ దానె తెలిసి♦కొనియునుఁ దా సం
సారము వ్యర్థమ్మను వ్యా
హారమ్మును మాను మహిమ ♦ యది నీదె హరీ! (80)


పదునాఱువేల గోపిక
లొదవిరి శృంగార భక్తి♦లోన మునిఁగియున్
సదయన్ నీ సహచరులుగ
మెదలుట నీ మహిమ కాదె ♦ మితముగను హరీ! (81)


నీరేజ పత్రములపై
నీరపుఁ గణ మెవ్విధమున ♦ నిలువదొ, ఘన సం
సారపు సాగరమున న
న్నారీతిని నంటకుండ ♦ నడిపించు హరీ! (82)


బాల్యమున మహిమఁ జూపియు
మాల్యమ్మునుఁ గొంటివయ్య ♦ మాన్య హితుల సౌ
శీల్యపు టటుకులఁ గొని కై
వల్య మిడితి నన్ను నటులె ♦ పాలింపు హరీ! (83)


అజ్ఞానము కనుఁ గప్పఁగ
విజ్ఞతతో నిన్నుఁ జూచు ♦ వెరవుఁ గనక నా
ప్రజ్ఞయె యడుగంటెను నీ
యాజ్ఞ నిడియుఁ బ్రోవుమయ్య ♦ హర్షమున హరీ! (84)


ఈ మనుజుల యాచింపఁగ
నీమము విడి చులకనఁ గని ♦ నిరసింతురనన్;
వామన! యా బలి నడిగితి
వేమయ్యా చులకనైతి♦వే యచట హరీ? (85)


హరి నామ స్మరణముచే
హరియింతువు దురితములను ♦ నర్థిఁ దలంపన్
సిరులనుఁ గోరను; మోక్షపు
సిరుల నిడియుఁ బ్రోవుమయ్య ♦ శీఘ్రముగ హరీ! (86)


అండజ వాహన! పాపపుఁ
గొండల గూల్చియును మాకుఁ ♦ గూరిమితో నా
ఖండల వైభవ మిడఁగను
దండ మిడెద నయ్య నీకు ♦ దయఁ గనఁగ హరీ! (87)


మత్స్యావతారము:
సోమకుఁడు వేదములఁ గొని
తామసియై సంద్రమందు ♦ దాచఁగ ఝషమై
సోమకునిఁ ద్రుంచి వేదము
లోమియు నబ్జజున కిడిన ♦ ప్రోడవయ హరీ! (88)


కూర్మావతారము:
అమృతముఁ గొనఁగను రాక్షసు
లమరులుఁ ద్రచ్చంగ మంధ♦రము మునుఁగఁగఁ గూ
ర్మమవై గిరిని ధరించియు
నమృతము నిడితివయ నీవు ♦ నమరులకు హరీ! (89)


వరాహావతారము:
భూమినిఁ గనకాక్షుండే
తామసమునఁ జాపఁ జుట్టి ♦ దభ్రమున నిడన్
నేమమున ఘృష్టివై యా
హేమాక్షుం జంపి కాఁచి ♦ తీ భువిని హరీ! (90)


నృసింహావతారము:
బాల ప్రహ్లాదుం డటఁ
గ్రాలుచు నిను భక్తిఁ జూపఁ♦గాను కశిపుఁడే
తాళక కంబముఁ గొట్టఁగ
లీల నృహరివయ్యుఁ గశిపుఁ ♦ ద్రెంచితివి హరీ! (91)


వామనావతారము:
పదములు రెంటిని భువి దివిఁ
బదరి కొనియు బలిని మఱొక ♦ పాదమ్ము నెటన్
గదియింతన; బలి యిడఁ దల;
సదయ నిడితి నిమ్నలోక ♦ స్వామ్యమును హరీ! (92)


పరశురామావతారము:
ధర నిరువదియొక మాఱును
బఱఁగ నృప తతిఁ బరిమార్చి ♦ వసుధ ననృపగాన్
వర పితృతర్పణ మిడితివి
పరశుధరా పరశురామ ♦ పరమేశ హరీ! (93)


శ్రీరామావతారము:
యతిఁ గావఁగఁ దాటకఁ జం
పితి; ఱాతిని నాతిఁ జేసి, ♦ వే హరువిలుఁ ద్రుం
చితి; కీశుఁ బ్రోచి, రావణు
హతమార్చియు సీతఁ గొంటి♦వయ రామ! హరీ! (94)


శ్రీకృష్ణావతారము:
చెఱసాలఁ బుట్టి, గోకుల
మురుగతిఁ జని, రక్కసులనుఁ ♦ బొరిగొని, గిరినిన్
ధరియించి, కంసుఁ జంపియు,
దరుణులఁ బదునాఱువేలఁ ♦ దగఁ గొంటి హరీ! (95)


(పౌరాణిక) బుద్ధావతారము:
బుద్ధుఁడవయి త్రిపురాసుర
శుద్ధ సతుల గురుఁడవయ్యుఁ ♦ జూడఁగ మాయా
బద్ధ రతికేళిఁ దేల్చిన
తద్ధర్మోజ్ఝితులఁ గాల్చు ♦ దహనాస్త్ర హరీ! (96)


(లౌకిక) బుద్ధావతారము:
క్షితి సుఖములు నరుల కశా
శ్వతము లటం చెఱిఁగి లోక ♦ పరమార్థద శా
శ్వత వర సత్య జ్ఞానో
ర్జిత బుద్ధుఁడవై సుబోధ ♦ లిడితివయ హరీ! (97)


కల్క్యవతారము:
నరజాతి సంకరమ్మును
బరిమార్పఁగ గుఱ్ఱ మెక్కి ♦ పాపము డుల్పన్
ద్వర దుష్టుల శిక్షించుచుఁ
బఱఁగను శిష్టులనుఁ బ్రోతు♦వయ కల్కి! హరీ! (98)


తొడఁగియు వారధిఁ గట్టఁగ
సడిచేఁ గపివరులుఁ గొండ♦చఱియలు వేయన్
వడి భక్తి నుడుత సాయ
మ్మిడి రామాంగుళిఁ ద్రిరేఖ ♦ నిలఁ గొనెను హరీ! (99)


లక్ష్మీశ! కరుణచే నిట
సూక్ష్మమ్మగు మోక్ష మెంచి ♦ చూడుము మము నీ
లక్ష్మకృత వీక్షచేతను
నీ క్ష్మాతలి కన్న మిన్న ♦ నిడఁగాను హరీ! (100)


దగ్గఱి చుట్టమె శబరియు
నిగ్గగు నెంగిలి ఫలముల ♦ నిడె భుజియింపన్?
దగ్గఱి బంధువె గుహుఁడును
డగ్గఱి నీ పాదములనుఁ ♦ దగఁ గడిగె హరీ? (101)

ఓం నమో భగవతే వాసుదేవాయ
స్వస్తి

సోమవారం, మార్చి 07, 2016

502 - శివస్తుతి!!! తేటగీతి (మాలిక)


ఓం నమః శివాయ! ఓం నమః శివాయ! ఓం నమః శివాయ! ఓం నమః శివాయ!ఓం నమః శివాయ!


అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 07-03-2016

శీర్షిక:- శివస్తుతి!!!

కవిత సంఖ్య: 502
తేటగీతి (మాలిక):
శ్రీమహాదేవ! గౌరీశ! శివ! మహేశ!
ప్రణవ రూప! సదానంద! భవ విదూర!
భూత నాథ! సనాతన! బుద్ధ! శుద్ధ!
పార్వతీ వల్లభ! వరద! భర్గ! శంభు!
చంద్ర శేఖర! పరమేశ! శాశ్వత! హర!
దీక్షిత! త్రిణయన! దివ్య! దివిజ వంద్య!
కామిత ఫలద! కామేశ! కామ నాశ!
దుష్ట శిక్షక! శ్రితపక్ష! శిష్ట రక్ష!
దక్షజా వర! దీక్షిత! దక్ష హంత!
త్రిపుర హంత! పరాత్పర! త్రిభువన నుత!
మౌని సంభావ్య! సుర హిత! మాధవ సఖ!
వేద వేద్య! శుభంకర! విశ్వరూప!
శార్ఙ్గ హస్త! సద్గురువర! శర్వ! సాంబ!
త్ర్యక్ష! మృత్యుంజయ! దిగంబర! సుర సేవ్య!
సింధురాస్య షడాస్యాధిసేవిత పద!
పూర్ణ! నటరాజ! శంకర! బుధ్న! రుద్ర!
నాగభూషణ! భూరి! పినాకపాణి!
తాండవ విలోల! దేవేశ! దహన నయన!
పాపనాశక! శాస్త! తాపత్రయఘ్న!
దక్షిణామూర్తి! సాంఖ్య! నృత్యప్రియ! భవ!
నీలకంఠ! భస్మాంగ! త్రిశూలధారి!
వ్యోమకేశ! ఋతధ్వజ! యోగివంద్య!
శైలకార్ముక! లయకారి! శక్రవినుత!
నందివాహన! హింస్ర! పినాకపాణి!
రుద్ర! జగదేక భద్ర! విరూప నయన!
జలధి తూణీర! హీర! శ్మశాన వేశ్మ!
దక్షయజ్ఞ విధ్వంసక! త్ర్యంగట! భగ!
ధూర్జటి! హిరణ్యరేతస! ద్రుహిణ! సోమ!
వామదేవ! స్వయంభూత! ఫాలనేత్ర!
విషమ నేత్ర! విశ్వాత్మక! విశ్వనాథ!
మంగళప్రద! భీషణ! మందర మణి!
శేష కటక! గంగాధర! చేకితాన!
మృగధర! క్ష్వేళగళ! సర్గ!  మృడ! కపర్ది!
మేరు ధామ! వృషాకపి! మేరు ధన్వ!
కృత్తివాస! కాలాంతక! లింగమూర్తి!
ప్రమథనాథ! పింగళ! హీర! శమన వైరి!
మలహర! భువనేశ! కరిచర్మాంబరధర!
ధ్రువ! జటాజూటధర! కపాలి! విధు! సూక్ష్మ!
మేచకగ్రీవ! వృషపర్వ! మృత్యునాశ!
దేవదేవ! మహానట! తే నమోఽస్తు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

శనివారం, మార్చి 05, 2016

501 - శ్రీకృష్ణావతార వర్ణనము! [పంచాశత్పాద మత్తేభవిక్రీడిత మాలిక]

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 05-03-2016
కవిత సంఖ్య: 501

శీర్షిక:- శ్రీకృష్ణావతార వర్ణనము!

పంచాశత్పాద మత్తేభవిక్రీడిత మాలిక:

ధరణీ భారము నుజ్జగింపఁగను స్వ♦త్వాంశాస్థ సంభూతుఁడై
చెఱసాలన్ జనియింప నా యమున గూ♦ర్చెన్ దారి వ్రేపల్లెకై
పరఁగన్ నందయశోద లింట నడుగుం ♦ బద్మమ్ములన్ మోపియున్
సరవిన్ బూతన పాలుఁ ద్రావి యుసురుల్ ♦ సర్వమ్ముఁ దాఁ బీల్చి, యెం
దఱు దుష్టాత్ములు నేఁగుదెంచి యతనిన్ ♦ దర్పోద్ధతిం జంపఁగా
విరచింపన్ బలు మాయలన్; విఱిచియున్, ♦ వేగమ్ముగన్ జంపి, సో
దర యుక్తుండయి వ్రేఁత లిండ్లఁ జని దు♦గ్ధమ్మంతయుం ద్రావ, స
త్వర మా బాలుని చేష్టలన్ని తెలుపన్, ♦ దన్మాత యా బాలునిన్
బరమాత్మున్ బసిబాలుఁ డంచుఁ దెలుపన్ ♦ వారందఱుం బోవ, నా
దరమెంతేఁ గనిపింప గోపిక లటన్ ♦ స్త్నానమ్ముఁ జేయంగ, ప
ల్వుర వల్వల్ దగ దొంగిలించియు వెసన్ ♦ భూజమ్ముపై దాఁచఁగన్
బరమాత్ముండని వారలంత కరముల్ ♦ పైకెత్తి దండమ్మిడన్
గరుణాత్ముండయి వారి కిచ్చె వలువల్, ♦ కైమోడ్పులం గొంచుఁ, దా
నరుదెంచెన్ బశుపాలనమ్మునకు స♦ఖ్యాళిం దగం గూడియున్
జిరకాలమ్మట బంతులాఁడు కలనన్, ♦ జిత్రమ్ముగా బంతి యా
సరసిన్ మున్గఁగఁ గృష్ణుఁ డప్డు మడువున్ ♦ జక్కంగఁ దా దూఁకఁగన్
సరసిం గాళియ సర్ప మప్పుడు హరిన్ ♦ జంపంగ నుంకించఁ, దా
నురుహస్తమ్మున ముష్టిఘాత మిడఁగా ♦ నుద్వేగ మెంతేని రా
నురగ మ్మప్పుడు కృష్ణుపైఁ దనదు దం♦ష్ట్రోత్సేక హాలాహలో
త్కరముల్ చిమ్మ యశోద సూనుఁ డపుడున్ ♦ దా వేగ సర్పమ్ముపై
నుఱికెన్ భోగము పైన నెక్కి నటరా♦జోత్తంస విద్వాంస రా
డ్వర నాట్యాంబుధి మున్గి ధింతకిట ధిం ♦ తద్ధింత తద్ధింత ధిం
ధిర ధిమ్మంచును నాట్యమాడ నపుడున్ ♦ దీనుండు కాళీయుఁ డా
దరమొప్పంగను "గావు" మంచుఁ బలికెన్ ♦ దర్పమ్ము సర్పమ్మునన్
దరలెన్; గర్వము ఖర్వమయ్యె, సతులున్ ♦ దర్జించి రా కాళియున్;
గరుణన్ వీడు మటంచుఁ బల్క నపు డా ♦ కాళీయ దర్పోర్జితుం
డురగమ్మున్ విడనాడి దూఁకె భువిపై ♦ దూరీకృతావేశుఁడై;
వరమిచ్చెన్ ’దన పాదముద్రఁ గని వే ♦ పక్షుల్ దొలంగున్ సదా
త్వరఁ బొ’మ్మంచును బల్కి, చేరె సఖులన్ ♦ వర్ణింప నా గాథనున్;
సరసీజాత సునేత్రుఁ డప్డు మఱలెన్ ♦ సభ్రాతృమిత్రాదుఁడై;
కరియానల్ మురళీరవమ్ము వినియున్ ♦ గానామృతమ్మానఁగన్
దరహాసాంబుధి ముంచి తేల్చి, దయతోఁ ♦ దన్వంగులం గూడి, వే
గిరమే కంసుని ప్రోలికిం జనియుఁ గ♦ల్కిం గుబ్జనున్ వేగ సుం
దరిగన్ జేసియు, హస్తిఁ దున్మి, జనుల♦త్యాదృత్యుదారాత్ములై
వఱలన్ జాణుర ముష్టికాఖ్యుల వధిం♦పన్ యుద్ధముం జేసి కూ
ల్చి రణౌత్సుక్యునిఁ గంసుఁ జంపియును ద♦ల్లిందండ్రినిన్ జేరి వే
చెఱసాలన్ వెడలించి, కొల్చి, మురిపిం♦చెన్ సేవ లందించియున్;
సరసీజాక్షిని రుక్మిణీ మణిని హృ♦త్స్థానమ్మునందున్ దగన్
బరిగృహ్యాంచితగా నొనర్చి వరుసన్ ♦ భార్యాష్టకుండయ్యు, స
ద్వరదుండయ్యెను పాండుభూపు తనయుల్ ♦ ధర్మాత్ములై కొల్వఁగన్
నరు సారథ్యముఁ జేసి కూర్మి సలహా ♦ నందించి గెల్పొందఁగన్
కురువీరుల్ తమయంతఁ దాము తొలఁగన్ ♦ గోపాలుఁడే పూని యు
ర్వరనున్ గెల్వఁగఁ జేసెఁ; బుట్టి ముసలం♦బా యాదవామ్నాయమున్
బరిమార్పన్ సమకట్ట, నప్డు, మునిశా♦పమ్మున్ మదిం గాంచియున్
జరియింపంగను లేక తాను వనిలో ♦ శయ్యావిలోలుండయెన్;
శరమున్ వేయఁ గిరాతుఁ డొక్కఁ డట, వి♦శ్వాకారుఁ డా వెంటనే
సరవిన్ జన్మ సమాప్త మౌట, వెడలెన్ ♦ సర్వేశుఁ డా చక్రియున్
వర వైకుంఠముఁ జేరె! నట్టి ఘనుఁడౌ ♦ పక్షీంద్ర యానుండు శ్రీ
హరి విశ్వాత్ముఁడు పద్మనాభుఁడు నిలిం♦పారాతివైరుండు శా
ర్ఙ్గి రమానాథుఁడు పాంశుజాలికుఁడు పుం♦డ్రేక్షుండు మమ్మోమెడున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

అయుత కవితా యజ్ఞము (457 నుండి 500 వరకు)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016
కవిత సంఖ్య: 457

శీర్షిక:- పరసతి....మాతృ సమము!

సమస్య:-
కౌఁగిలి మరణమ్ము నొసఁగుఁ గద సరసులకున్

కం.
భోగింపఁ గోరి రంభనుఁ
గౌఁగిలిలోఁ జేర్చి, పంక్తి♦కంఠుఁడు శప్తుం
డై గతియించెన్! బరసతి
కౌఁగిలి, మరణమ్ము నొసఁగుఁ ♦ గద సరసులకున్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016

శీర్షిక:- పోఁగాలము...!

సమస్య:-
యమ మహిష ఘంటికానాద మతి హితమ్ము

కవిత సంఖ్య: 458

తే.గీ.
మరణ కాల మాసన్నమౌ ♦ నరుల కపుడు
కర్ణపేయ మ్మగును గాదె ♦ కాంచఁ గాల
యమ మహిష ఘంటికానాద! ♦ మతి హితమ్ము!
శుభము! భవ సాగర తరణ ♦ సూచితమ్ము!
*********************************

కవిత సంఖ్య: 459

ఉత్సాహవృత్తము:
మోదమంది యాదిశక్తి ♦ పోరునందు రాక్షసుల్
రోదనమెయిఁ బాఱిపోవ ♦ ద్రుత విధమున గదలతో
మోదె! మహిషు నెదను శూల♦ము  యమ మహిష ఘంటికా
నాద మతి హితమ్ము కాఁగ ♦ నాటె రౌద్రమూర్తియై!

[తేటగీతి పద్యపాదము నుత్సాహ వృత్తమున నిమిడించితిని]

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016

శీర్షిక:- వద్దనుకొనిన...రాక మానునా?

సమస్య:-
వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

కవిత సంఖ్య: 460

తే.గీ.
కోరికలు గణియింప న♦పారములయ;
వనరులో మఱి గణియింపఁ ♦ బరిమితమయ!
కోరికయె తీఱ, మఱియొక్క ♦ కోర్కిబాము
వలదు వలదనుకొన్న సం♦ప్రాప్తమగును!!
********************************

కవిత సంఖ్య: 461

తే.గీ.
కాల మహిమచేఁ బనిఁ గొని ♦ కష్టము లవి
వలదు వలదనుకొన్న సం♦ప్రాప్తమగును!
చంద్రమతి, సీత, ద్రౌపది ♦ సరసఁ జేరి,
కష్టములు కాల మహిమచేఁ ♦ గాల్ప లేదె?

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016

శీర్షిక:- వాయుసుతుఁడు - వసుదేవసుతుఁడు!

సమస్య:-
భీమసేనుండు దేవకీ ప్రియ సుతుండు

కవిత సంఖ్య: 462

తే.గీ.
అని సమాప్తినిఁ బాండవు ♦ లాంబికేయుఁ
జేర, నాలింగనముఁ గోరెఁ! ♦ జేరఁ బోయె
భీమసేనుండు! దేవకీ ♦ ప్రియ సుతుండు
లోహ మూర్తిఁ గౌఁగిలిఁ జేర్చి, ♦ ప్రోచె నపుడు!
*******************************

కవిత సంఖ్య: 463

తే.గీ.
హ్రదము దాఁగిన రారాజు ♦ ననికిఁ బిలిచి
భీమసేనుండు, దేవకీ ♦ ప్రియ సుతుండు
నూరువునుఁ జూప, విఱిచి, మ♦నోగతార్థ
ముం గనన్; బొందె సంతోష♦మున్ ద్రుపదజ!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016
కవిత సంఖ్య: 464

శీర్షిక:- నటన..!!

సమస్య:-
పుస్తకమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము

ఉత్సాహవృత్తము:
మోహియు న్నిరక్షరాస్య ♦ మూఢుఁ డైనవాని, దు
స్సాహసిని, "గరుడ పురాణ ♦ సార మెఱుఁగు"మనఁగ; ను
త్సాహ ముడిగి, నటనతోడఁ ♦ జదువునట్టి, యా విరా
డ్వాహు పుస్తకమ్ముఁ జదువు♦వాఁడు ఖలుఁడు సుమ్మిలన్!

[తేటగీతి సమస్యపాదము నుత్సాహ పద్యమం దిమిడ్చి వ్రాయుట జరిగినది]

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016

శీర్షిక:- కవిత్వము!

సమస్య:-
కవిత్వ మధములకుఁ గదా (ఛందోగోపనము)

కవిత సంఖ్య: 465

కం.
మదిలో జ్ఞానముఁ బెంచియు
ముద మొనఁగూర్చు సుకవిత్వ♦ము సుజనులకుఁ; దా
నదియే జ్ఞానముఁ ద్రుంచియు
మద మొనఁగూర్చుఁ గుకవిత్వ ♦ మధములకుఁ గదా!!
******************

కవిత సంఖ్య: 466

ఆ.వె.
పొట్ట నింపు కొఱకుఁ ♦ బుట్టించెడు కవిత్వ
మధములకుఁ గదా స♦మాశ్రయమ్ము!
భక్తి భావ విలసి♦తోక్తుల విలసిల్లు
సత్కవిత్వ మెసఁగు ♦ సత్కవులకు!!
******************

కవిత సంఖ్య: 467

తే.గీ.
అరసికుని జేరియు ధనమ్ము ♦ లడుగు సత్క
విత్వ మధములకుఁ గదా ని♦వేశనమ్ము!
బ్రహ్మ కైనను వర్ణింప ♦ వలనుగా ద
రసిక కావ్య నైవేద్య దౌ♦ర్భాగ్య మిలను!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016

శీర్షిక:- ప్రత్యర్థి...!!

సమస్య:-
ప్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్

కవిత సంఖ్య: 468

[గయోపాఖ్యాన వృత్తాంతము]

కం.
సత్య వచనుఁ డన్న పనుప
గత్యంతర మేమిలేక, ♦ గయుఁ గావ, క్షణం
బత్యం తాప్తునిఁ గృష్ణునిఁ
బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ ♦ బార్థుం డనిలోన్!
*****************

కవిత సంఖ్య: 469

[పాశుపతమునకై యర్జునుఁడు చేయు తపముం బరీక్షింపఁ గిరాతుఁడై బలప్రదర్శనము చేసిన శివు నెదుర్కొను శక్తిఁ గోల్పోయిన యర్జునుని దుఃస్థితి వర్ణనము]

కం.
అత్యంత బలుఁ, గిరాతునిఁ,
బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ ♦ బార్థుం డనిలోన్;
బ్రత్యక్షమయ్యు శివుఁడును
నిత్య విజయ పాశుపతము ♦ నిచ్చె నరునకున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016

శీర్షిక:- అప్పిచ్చువాఁడు...!!!

సమస్య:-
అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగుననిరి బుధుల్

కవిత సంఖ్య: 470
కం.
ఒప్పు గ్రహించక పొరపడి
యప్పిచ్చెడువాఁడు వైద్యుఁ ♦ డను పద్యమునన్
దప్పును గొనియుం జనులకు
నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ ♦ డగుననిరి బుధుల్!
*****************

కవిత సంఖ్య: 471
కం.
అప్పనఁగను నీరముగద!
తప్పక వైద్యుండు హరియ ♦ తానై యెపుడా
యప్పులనిటఁ గురిపించఁగ
"నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ" ♦ డగుననిరి బుధుల్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016
కవిత సంఖ్య: 472

శీర్షిక:- గ్రామదేవతలు!

తే.గీ.
గ్రామ గ్రామాన నిలిపిన ♦ గ్రామ దేవ
తలు, జనులఁ గష్ట సుఖములఁ ♦ దయనుఁ బూని,
యెల్ల వేళలఁ గరుణించి, ♦ యేలుచుండ్రు;
దుష్టతనుఁ ద్రుంచి, కాతురు ♦ శిష్టత నిడి!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 02-03-2016

శీర్షిక:- జారుల కృత్యములు...!

సమస్య:-
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

కవిత సంఖ్య: 473

కం.
కోరియుఁ బ్రహ్లాదాదులు
మీరిన భక్తిని భజించి, ♦ మేల్గాంచి, హరిన్
జేరిరి! యాహా! కన, దివి
జారుల కృత్యములు మనకు ♦ సంతోష మిడున్!
********************

కవిత సంఖ్య: 474

కం.
పోరాని పోకఁ బోయిరి
కారే! కాముని భజించి, ♦ కని, శాపములన్
గూరి! రహల్యా తారా
జారుల కృత్యములు మనకు ♦ సంతోషమిడున్!?
*************************

కవిత సంఖ్య: 475

కం.
చారులె రాజుల కన్నులు;
చారులు లేకున్న రాజు ♦ ససిఁ గనఁడు భువిన్;
జారులె ముఖ్యులు! కన, భువిఁ
జారుల కృత్యములు మనకు ♦ సంతోష మిడున్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 476

శీర్షిక:- సుగతుఁడు!

సమస్య:-
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్

కం.
మతి మెచ్చఁ ద్రిపిటక, సుసం
హిత, సమ్య ఙ్మార్గము లిడి, ♦ మిక్కిలి కరుణన్
హిత మొనఁగూర్చిన శరణా
గతి లేని మనుష్యుఁడే సు♦గతుఁ డనఁగఁ దగున్!

(సుగతుఁడు=బుద్ధుఁడు)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 477

శీర్షిక:- చావు కబురు!

సమస్య:-
సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు

[ద్వారకలో నిద్దఱు గోపాలకులు సంభాషించుకొనుచున్న సందర్భము]

తే.గీ.
"వెడలి రయ్య సత్యాకృష్ణు ♦ లెడఁదఁ బూని,
దుష్ట నరకాసురుని, లోక ♦ దురిత కరుని
నడఁచఁగను, లోక కళ్యాణ ♦ మిడఁగ! నపుడు
సంతస మొసంగు మనకెల్లఁ ♦ జావు కబురు!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 478

శీర్షిక:- పనిముట్లు!

సమస్య:-
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్!

కం.
కుట్లిడి రమణీయమ్మౌ
చెట్లు పువులు పిట్టలు విల♦సిల్లెడు చీరల్
పుట్లుగ నమ్మి, పిదప, పని
ముట్లుడిగిన సతికి నొక్క ♦ పుత్రుఁడు పుట్టెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 479

శీర్షిక:- అనుజులు!

సమస్య:-
దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు, సుమతుల్

[నారదుఁడు ధర్మజునితోఁ బలికిన సందర్భము]

కం.
విను, ధర్మరాజ! కన, భవ
దనుజులు హరి భజనఁ జేయు ♦ ధన్యులు, సుమతుల్,
ఘనతర ధీగుణ యుతులును,
వనజాక్ష విశిష్ట చరణ ♦ వందన నిరతుల్!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 480

శీర్షిక:- మూఢమతులు!

సమస్య:-
మూఢమతు లాదరింత్రు ముముక్షువులను

తే.గీ.
"మూఢులై మేము చెడితిమి; ♦ మోక్ష మందఁ
జేయు బోధల ననుసరిం ♦ చెద"మటంచు,
మూఢమతు లాదరింత్రు ము♦ముక్షువులను;
జ్ఞానులై తరియించఁగ ♦ నాస్థ తోడ!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 481

శీర్షిక:- ధీబలరాముఁడు!

సమస్య:-
బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్!

కం.
తులలేని వర విరాజితు
బలగర్వితుఁ బంక్తికంఠుఁ ♦ బరిమార్చంగన్
దలఁచిన వానరయుత ధీ
బల రాముఁడు లంకఁ జేర ♦ వారధిఁ గట్టెన్!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 482

శీర్షిక:- వానర యుత బలరాముఁడు!

సమస్య:-
బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్!

కం.
ఖలు, విధి వరబల గర్వితు,
నిలా తనయఁ జెఱను నిడిన ♦ నీచు, దశాస్యున్,
బొలియింపఁగ, వానర యుత
బల రాముఁడు లంకఁ జేర ♦ వారధిఁ గట్టెన్!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 483

శీర్షిక:- కాకాకృతులు!

సమస్య:-
అమృతము సేవించి సురలు హతులైరి గదా

[దేవతలు రాక్షస భయ కారణమునఁ గొంత కాలము కాకాకృతులై యుండిరి. భయము మరణ సదృశము కదా! అమృతము సేవించియు మృతతుల్యు రైరని నా పూరణము]

కం.
తమిఁ గాకాకృతి భయజ,
మ్మమృతము సేవించి సురలు ♦ హతులైరి గదా!
యమిత దనుజభయ కారణ
మమరఁగ మృతియే తలఁపఁగ ♦ నమరులకు నటన్!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 484

శీర్షిక:- గంటలు!

కం.
గుడి గంటలు, బడి గంటలు
నెడఁదను వికసింపఁ జేసి, ♦ హిత మందించున్!
గుడి గంట దైవ మననము;
బడిగంటయ జ్ఞాన యజ్ఞ ♦ భాస్వ ద్వరమే!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 485

శీర్షిక:- చిలుక నవ్వు!

సమస్య:-
పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్!

కం.
కంజాత పత్ర నేత్ర, స
మంజస విధిఁ జనక, జాఱి, ♦ మఱఁదలి పైనన్
శింజినులు మ్రోయఁ, బడఁగను,
బంజరమున నున్న చిలుక ♦ పక్కున నవ్వెన్!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 486

శీర్షిక:- అభయహస్తము!

సమస్య:-
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ

[బానిస బ్రతుకు కన్న మరణమే మేలని నిరాశతోఁ జావఁ గోరు నొక భారతీయునకు ధైర్యముఁ గూర్చుచు గాంధీ పలికిన సందర్భము]

కం.
“నేనుంటి, స్వేచ్ఛఁ గొను, మో
బానిస! బ్రతుకే నయ”మని ♦ పలికెను గాంధీ
తేనియ లూరెడి స్వేచ్ఛా
గానము వినిపించి, ప్రజకు ♦ జ్ఞానముఁ బెంచన్!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 487

శీర్షిక:- హాస్యోక్తులు!

సమస్య:-
పాయసమ్మునఁ గారమ్ము వేయవలెను

[పెండ్లివారింటికి వేంచేసిన వియ్యాలవా రాఁడు పెండ్లివారితో మేలమాడు సందర్భము]

తే.గీ.
"పాయసమ్మునఁ గారమ్ము ♦ వేయవలెను;
కూరలోఁ జక్కెరను వేయ♦గా రుచియగు;
మజ్జిగా యిది? నీ" రని ♦ మఱి మఱి నగి,
మేల మాడిరి యచట వి♦య్యాలవారు!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 488

శీర్షిక:- ఆఁకలి!

సమస్య:-
కలి కలిగినవాని యింటఁ గలవే సుఖముల్

కం.
కలుములు లేకయు, లేమిని
నిలుగడువక దినదినమ్ము ♦ నీల్గుచు, మదిలో
పల పలు బాధ లనెడు నాఁ
కలి కలిగినవాని యింటఁ ♦ గలవే సుఖముల్?

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 489

శీర్షిక:- వావి వరుసలు!

సమస్య:-
అత్రిమునికి నహల్యయే పుత్రికయగు

తే.గీ.
ఏ మునికి ననసూయ పెం♦డ్లా మగునయ?
ఱాయి నాతిగ మాఱిన ♦ రమణి యెవతె?
భూమిజయె జనకునకును ♦ నేమగునయ?
యత్రిమునికి, నహల్యయే, ♦ పుత్రికయగు!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 03-03-2016
కవిత సంఖ్య: 490

శీర్షిక:- నెపము!

సమస్య:-
మామా యని బావమఱఁది మాటలు గలిపెన్

["మా బావమఱఁది ప్రేమలో పడి, యామె తండ్రితో మాటలు గలిపె"నని యొకఁడు పలికిన సందర్భము]

కం.
ఏమో? పేరుం దెలియదు!
నీమము విడి యతని కూఁతు ♦ నెమ్మిఁ దలఁచుచున్
క్షేమ మరసికొను వంకను
"మామా!"యని బావమఱఁది ♦ మాటలు గలిపెన్!

-:శుభం భూయాత్:-
*********************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 491

శీర్షిక:- హరిహరాభేదము!

సమస్య:-
క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా!

కం.
ధారుణిలో శివుఁ డనఁగన్
గోరిన శుభముల నొసంగు ♦ కూరిమి వేల్పౌ!
గోర శుభమిడు హరి! కనుక,
క్షీరాబ్ధిశయనుఁ డనంగ ♦ శివుఁడే గదరా!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 492

శీర్షిక:- గృహిణి కన్నీరు!

సమస్య:-
కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్

కం.
ఇల గృహిణి సంతసించిన
కలిమి గలుఁగు; గృహిణి కంటఁ ♦ గన్నీ రొలుకన్
కలిమి తొలఁగు, కాన నెపుడు
మెలఁగుఁడు సతి సంతసించి ♦ మేలుఁ దలిర్పన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 493

శీర్షిక:- తారుమారు!

సమస్య:-
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

[బడిలో ’ఫ్ల కార్డు’లఁ దారుమారు చేయఁగ జరిగిన తికమకను దెలుపు సందర్భము]

కం.
నెమ్మదిగఁ "దీయ" "వేయ"ల
నమ్మాయియె తారుమారు ♦ నప్పుడు చేయన్;
దమ్ముండది చూడక యనె
"దొమ్మిదిలో నొకటిఁ దీయఁ ♦ దొయ్యలి! పదియౌ!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 494

శీర్షిక:- చెడునడతలు!

సమస్య:-
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్

కం.
వలచియు సత్యము ధర్మము
నిలుపఁగఁ దలఁచియు మనమ్ము ♦  నిలిపి చెడు తలం
పులఁ జెడు పలుకులఁ జెడు నడ
తలఁ దొలఁగించిన నిడుములు ♦ దప్పు జనులకున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 495

శీర్షిక:- వాలి గెలుపు!

సమస్య:-
రాము నోడించె వాలి సంగ్రామ మందు

తే.గీ.
వరబలము ఛేత గర్వించి, ♦ సురల గెల్చి,
యష్టదిక్పాలకుల నోర్చి, ♦ యైంద్రి నపుడుఁ
గ్రేణి సేయరాన్; మండోద♦రీ మనోఽభి
రాము నోడించె వాలి సం♦గ్రామ మందు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 496

శీర్షిక:- ఆదిశక్తి అవతరణము!

చంపకమాల:
బలమున దున్నరక్కసుని ♦ బల్లెపుఁ బోటునఁ జంపఁగానుఁ బ్రాఁ
బలుకుల కల్కి నల్వయును, ♦ బన్నుగఁ జేరిన బేసి తాపసుల్
గలసియు జన్నముం దనరఁ♦గా నటఁ జేయఁగ, నంత మెచ్చి, య
మ్మలకును బెద్దయమ్మ కడు ♦ మన్ననతో దిగి వచ్చెఁ గావఁగన్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 497

శీర్షిక:- మేఁత!

సమస్య:-
గడ్డి మేయు జనుల కెల్లఁ గలుగు సుఖము

[పశువులకు గడ్డి దొరకుట లేదని వాపోవుట]

తే.గీ.
"పాల నిడఁగనుఁ బశువులు ♦ పఱఁగఁ బచ్చి
గడ్డి మేయు! జనుల కెల్లఁ ♦ గలుగు సుఖము
పాలుఁ ద్రావి దేహమునకు ♦ స్వాస్థ్యమిడఁగ!
గడ్డి లేక పాలేవి? సు♦ఖమ్ము లేవి?"


-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 498

శీర్షిక:- శీతబాధ!

సమస్య:-
మడిఁగట్టిన పండితుండు మద్యముఁ గ్రోలెన్

కం.
వెడలెను పశ్చిమదేశ
మ్మిడఁగను నుద్యోగ మెలమి ♦ మేలయెఁ; జలిచే
వడ వడ వణఁకుచుఁ దాళక
మడిఁగట్టిన పండితుండు ♦ మద్యముఁ గ్రోలెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 499

శీర్షిక:- కీచకుని యకృత్యము!

దత్తపది:-
ఆది-సోమ-మంగళ-బుధ...పదములనుపయోగించి...భారతార్థమున వ్రాసిన పద్యము

తే.గీ.
ఆ దినమ్మునఁ గీచకుం ♦ డంతిపురిని
సోమమునుఁ దెచ్చు సైరంధ్రిఁ ♦ జూచి మిగులఁ
గాముకతతో నమంగళ♦కర కృతములఁ
జేసె బుధులునుఁ జూడంగఁ ♦ జేఁత లుడిగి!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 04-03-2016
కవిత సంఖ్య: 500

శీర్షిక:- సూర్య నమస్కారము!

దత్తపది:-
అసి - కసి - నుసి - మసి...పదముల నుపయోగించి...సూర్యోదయమును వర్ణించిన పద్యము

సీ.
అసితోత్పలములను ♦ వసివాడఁ జేయుచు
.....బిసరుహమ్ములను వి♦కసితులనుగఁ
జేయుచు నుదయాద్రి ♦ చేతనమ్మిడఁగాను
.....జవరాలి నునుసిగ్గు ♦ సరణి వెలిఁగి
నమసిత లోకబాం♦ధవుఁ డవై యెల్లఱ
.....భక్తిప్రపత్తులఁ ♦ బఱఁగఁ గొనుచు
ముల్లోకములకును ♦ త్వల్లాస్యపుంగాంతి
.....దినదినమ్మును నిచ్చి ♦ దీవన లిడి
గీ.
వెలిఁగిపోయెడి ఖద్యోత! ♦ వీతిహోత్ర!
తిగ్మఘృణి! రవి! భాస్కర! ♦ తిమిరవైరి!
మిహిర! దినకర! ఖగ! వేధ! ♦ మిత్ర! సూర్య!
పద్మబాంధవ! స్వర్మణి! ♦ ప్రణతు లివియె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************

బుధవారం, మార్చి 02, 2016

అయుత కవితా యజ్ఞము (432 నుండి 456 వరకు)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 432

శీర్షిక:- కాకి-కోకిల!

ఆ.వె.
కాకియుండు నలుపు ♦ కోకిలుండు నలుపు
వేషమొకటె వాని ♦ భేదమేమి?
ఋజువగును వసంత♦ఋతు వేగుఁదెంచఁగఁ
గాకి కాకి గాక ♦ కోకిలగునె?

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 433

శీర్షిక:- శిబి ఘనత!

సమస్య:-
శరణు కోరెఁ గపోతము, చంపెను శిబి

తేటగీతి(షట్పాది):
శిబిఁ బరీక్షింప, హరి "డేగ", ♦ చిచ్చు "కూకి"
యయ్యె; గ్రద్ద తఱుమఁగను ♦ నఱచుచు శిబి
శరణు కోరెఁ గపోతము; ♦ చంపెను శిబి
దేహ మోహమ్ము; తులతూచి ♦ దేహమిడెను!
ఘనత నెఱిఁగిన దేవతల్ ♦ కరుణఁ జూపి,
మోక్ష మిచ్చిరి; శిబియంత ♦ మోదమందె!!

(హరి=ఇంద్రుఁడు; చిచ్చు=అగ్ని; కూకి=పావురము)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 434

శీర్షిక:- అందము!

సమస్య:-
మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్

కం.
"మా సము లెవ" రని పతి తన
మీసమ్ములఁ ద్రిప్పి, సతియు ♦ మెచ్చ, ముఖమునన్
మీసమును జేర్చి, కనఁ; బతి
మీసము లందమ్ము సతికి ♦ మెట్టెలకంటెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 435

శీర్షిక:- జ్ఞాని!

సమస్య:-
కవికులమెల్లఁ బల్కెను శకారుని కంటెను బుద్ధిహీనతన్

చంపకమాల:
"భవుఁ డిల దీనులందఱకుఁ ♦ బ్రాపును, జ్ఞానము నిచ్చు" నంచు స
త్కవికులమెల్లఁ బల్కెను! "శ♦కారుని కంటెను జ్ఞాని లేఁడిలన్;
దివిజులకన్న రాక్షసులె ♦ దీనశరణ్యులు గాదె!"యంచు దు
ష్కవికులమెల్లఁ బల్కెను శ♦కారుని కంటెను బుద్ధిహీనతన్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 436

శీర్షిక:- అభినవ భీష్ముఁడు!

సమస్య:-
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె

తే.గీ.
అతఁడు గాంగేయ సన్నిభుఁ, ♦ డతని నంబ
వలచి, పెండిలి యాడంగఁ ♦ దలఁచి, చేరి,
జాయ కాఁ గోర్కిఁ జెప్పంగ, ♦ నా యభినవ
భీష్ముఁ డంబను బెండ్లాడి, ♦ బిడ్డలఁ గనె!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016

శీర్షిక:- భజనలు!
సమస్య:-
మానవులారా భజనలు మానుట శుభమౌ

కవిత సంఖ్య: 437

కందము:
మానుఁ డనర్హులఁ బొగడుటఁ ;
దానను స్వీయాభిమాన ♦ దర్పము నిలుచున్!
మానాభిమానములు గల
మానవులారా! భజనలు ♦ మానుట శుభమౌ!!
******************

కవిత సంఖ్య: 438

కందము (ద్విప్రాసము):
మానవు కుజనుఁ బొగడ; వర
మా? నవుబా టవును గాదె ♦ మన యందఱకున్?
మా నవహృ న్మందిర ఘన
మానవులా? రా! భజనలు ♦ మానుట శుభమౌ!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 439

శీర్షిక:- దాహోపశమము!
సమస్య:-
పుక్కిటం బట్టి యుమిసె సముద్ర జలము

తే.గీ.
బాలుఁ డొక్కఁడు సాగర ♦ పారమునను
గాంక్షమెయిఁ దిరుగాడుచు, ♦ ఘనతరమగు
దాహ బాధను బొంది, తాఁ ♦ దాళ లేక,
పుక్కిటం బట్టి, యుమిసె స♦ముద్ర జలము!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 440

శీర్షిక:- అదృష్టము!

సమస్య:-
దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్

కం.
దురదృష్టము రాకుంటకు
వరమందిరి పురజనములు ♦ వరలక్ష్మి కడన్!
వరము కతన, కలుగని యా
దురదృష్టము వలన, సిరులు ♦ దొరకు జనులకున్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 441

శీర్షిక:- ఉంగరము-ఒడ్డాణము!

సమస్య:-
ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

కం.
జవరాలి ముద్రికను నొక
నవసాలియె మార్చె నొడ్డి♦యానము గాఁగన్!
రవణించు నగ ధరించిన
యువిదకు నుంగరమె మేటి ♦ యొడ్డాణ మయెన్!!

(అవసాలి=స్వర్ణకారుఁడు; ఒడ్డాణము>ఒడ్డియానము...రూపాంతరము.)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016
కవిత సంఖ్య: 442

శీర్షిక:- సంసారి - సన్యాసి!

సమస్య:-
కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను

తే.గీ.
సఖులు సంసారి, సన్యాసి ♦ శైశవమునఁ!
బెండ్లి యాయెను సంసారి! ♦ పిదప యేఁటఁ
గొడుకు పుట్టె! సన్యాసికి ♦ గురువు కృపను
జేరె మదిని బ్రహ్మజ్ఞాన ♦ సార మెల్ల!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016
కవిత సంఖ్య: 443

శీర్షిక:- తారుమారు!

సమస్య:-
సతి సతిఁ గవయంగ సంతు గలిగె

"కళాపూర్ణోదయము"నందలి కథ ననుసరించి నా పూరణము...

ఆ.వె.
పేర్మిఁ గథల రాజు ♦ "పింగళి" కావ్యాన
భార్య భర్త గాను, ♦ భర్త భార్య
గాఁగఁ, కాంక్ష హెచ్చఁ ♦ గాంతుఁడై వఱలెడు
సతి, సతిఁ గవయంగ ♦ సంతు గలిగె!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016
కవిత సంఖ్య: 444

శీర్షిక:- భాగ్యనగరము!

సమస్య:-
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు

తే.గీ.
భిన్న సంస్కృతి ప్రాశస్త్య ♦ విలసనమ్ము;
నురుదు తెలుఁగు భాషల బాణి ♦ నొప్పు వాణి;
నిత్య నూతన మగు వెల్గు! ♦ నిజముఁ గన, న
భాగ్య నగరమ్ము హైదరా♦బాదు కాదు!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016

శీర్షిక:- ఉల్లిగడ్డలు!

సమస్య:-
ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు
కవిత సంఖ్య: 445

"తామ సాహారముం గొనఁ ♦ దగదు; వెల్లి
యుల్లిగడ్డలఁ దినువార ♦ లెల్ల ఖలులు
గాను మారుదు" రంచుఁ బ♦ల్కంగ వింటి
నాదు బాల్యమ్మునందు మా ♦ నాయనమ్మ!
******************
కవిత సంఖ్య: 446

ఉల్లిగడ్డల ధరఁ జూడ ♦ నుప్పరమున
విహరణము సేయుచుండంగఁ ♦ బేద లిపుడు
"నుల్లిగడ్డలఁ దినువార ♦ లెల్ల ఖలులు!
వలదు తినఁగా" నటంచును ♦ బల్కుచుండ్రి!!
******************
కవిత సంఖ్య: 447

ఉల్లి చేసిన మేలును ♦ తల్లియైనఁ
జేయ దందురు పెద్దలు! ♦ శ్రేష్ఠత నిడు
నుల్లిగడ్డలఁ దినువార ♦ లెల్ల ఖలులు
కారు కారయ్య మిత్రమా! ♦ కారు ఖలులు!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016
కవిత సంఖ్య: 448

శీర్షిక:- మశక శాబకము!

సమస్య:-
బకమున్ వడి మ్రింగుచున్న బల్లిన్ గనుమా

కం.
సుకరముగఁ గీటకముల శ
లక మొక్కటి పట్టఁగను వ♦ల నునుప; నా జా
లిక తెరఁ జిక్కు మశక శా
బకమున్ వడి మ్రింగుచున్న ♦ బల్లిన్ గనుమా!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016

శీర్షిక:- హార విక్రయము!

సమస్య:-
హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్!

కవిత సంఖ్య: 449

[ఒక భార్య తన భర్తతో వ్యాపారమునకై దారిని జూపుచుఁ బలికిన మాటలు]

కం.
"ఓరిమి తోడుతఁ గష్టము
లే రీతినిఁ బడినఁ గాని ♦ యే లాభ మిడెన్?
దారిఁ గనుఁ డిటుల" నని, బే
హారము కొఱకై యొక సతి ♦ హారము నమ్మెన్!
*********************
కవిత సంఖ్య: 450
కం.
కోరని దారిద్ర్యము దరిఁ
జేరఁగఁ దా మిగుల వగచి ♦ చివరకుఁ దానై
దారిని వెదకుచు నిఁక నా
హారము కొఱకై యొక సతి ♦ హారము నమ్మెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016
కవిత సంఖ్య: 451

శీర్షిక:- ఆయుధము!

సమస్య:-
లచ్చి మగని కైదువు! త్రిశూలమ్ము గాదె

తే.గీ.
తపసి దుర్వాసుఁ దఱిమె సు♦దర్శనమ్ము;
దనియ గజరాజుఁ గాచె సు♦దర్శన, మదె
లచ్చి మగని కైదువు! త్రిశూ♦లమ్ము గాదె
త్రిపుర వైరికిఁ గైదువు ♦ త్రినయనునకు!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016
కవిత సంఖ్య: 452

శీర్షిక:- రథోత్సవములు!

సమస్య:-
నెల కేడు దినమ్ము’లని గణింతురు విజ్ఞుల్

[ప్రతి శ్రావణమాసమునఁ దమ యూరియం దేడు దినములు జరుగు రథోత్సవములఁ గూర్చి ముచ్చటించుకొనుచున్న జనుల సంభాషణము]

కం.
"ఇల దైవారాధనమునఁ
దులలే నట్టుల జరుగు ర♦థోత్సవమందున్
’బులకింతు రిటులె జనములు
నెల కేడు దినమ్ము’లని గ♦ణింతురు విజ్ఞుల్!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016

శీర్షిక:- రామజోగి మందు...!!!

సమస్య:-
రామజోగి మందు ప్రాణహరము!!

కవిత సంఖ్య: 453

ఆ.వె.
మాన్య రామజోగి ♦ సవ్యాసి రాయలు
కవి భిషగ్వరుండు! ♦ ఘనయశుండు!
రామజోగి మందు ♦ ప్రాణహరము గాదు;
రామజోగి మందు ♦ ప్రాణదమ్ము!!

[సుకవి పండితులు, అష్టావధాని, ఆంధ్రాధ్యాత్మ రామాయణ కర్త కీ.శే. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి కవితా ప్రాశస్త్యముం గూర్చి నేను చేసిన పూరణము]
******************
కవిత సంఖ్య: 454

ఆ.వె.
రామజోగి మందు ♦ రసరమ్య గీతమ్ము;
రామదాస వినుత ♦ రాగ యశము!
రామజోగి మందు ♦ ప్రాణహరము గాదు;
ప్రాణములను నిలుపు ♦ బ్రహ్మరసము!!
*****************
కవిత సంఖ్య: 455

ఆ.వె.
రామజోగి మందు ♦ బ్రహ్మేంద్రదివిజుల
కర్ణపేయకార ♦ కామృతమ్ము!
రావణాది దుష్ట ♦ రాక్షసాధములకు
రామజోగి మందు ♦ ప్రాణహరము!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 01-03-2016
కవిత సంఖ్య: 456

శీర్షిక:- త్రాగి పాడిన త్యాగయ్య!

సమస్య:-
త్రాగి పాడెనంట త్యాగరాజు

రామ నామ మధుర ♦ రమ్య సత్కృతులను
వ్రాసి, జనుల కిడియు ♦ భక్తి తోడ
నీమముగను రామ ♦ నామామృతమ్మును
ద్రాగి పాడెనంట ♦ త్యాగరాజు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************************

అయుత కవితా యజ్ఞము (401 నుండి 431 వరకు)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 401

శీర్షిక:- మయసభలో దుర్యోధనుఁడు...!!!

[మయసభలోఁ బరాభవమునుం బొందిన దుర్యోధనుని యాత్మగతము]

చంపకమాలిక:
"విసమును మ్రింగినట్లు కడు ♦ వేదన నాకునుఁ గల్గెఁ! బాండవుల్
పొసఁగఁగ రాజసూయమునుఁ ♦ బొందికఁ జేయఁగ నేల? రాజులన్
గసిమసఁగంగ గెల్చి, ధన♦గర్వము నందఁగ నేల? యిట్టి మా
య సభ మయాభిదత్త మయ♦మై సననేల? మహౌత్సుకుండనై
వెస సభ కేఁగ నేల? సని, ♦ వేగమె కల్ల సరస్సునందు సా
రసమునుఁ గాలితో భ్రమను ♦ రాయఁగ నేల? పడంగ నేల? మా
నస మది వ్రక్కలై చనెడు ♦ నట్టుల ద్రౌపది నవ్వనేల? నే
విసమును మ్రింగి జీవితము ♦ వీడెద నిప్డు! సహింపలే నిఁకన్!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 402

శీర్షిక:- మోక్ష సాధనము!

సమస్య:-
ధనమే మోక్షము గడింౘు దారినిఁ ౙూపున్

కం.
తన వారలు తన యాస్తులు
తన సంసారమ్ము తనదు ♦ ధనమను తలఁపుల్
మనమును విడిచెడి ఘన బం
ధనమే, మోక్షము గడింౘు ♦ దారినిఁ ౙూపున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 403

శీర్షిక:- త్రాగుఁబోతు!

సమస్య:-
లింగని ఈడ్చి ఈడ్చి వెడలించె గృహంబు కఠోర చిత్తుడై
(మిత్రులు అంజన్న గారిచ్చిన సమస్య)

[ఏ పనియుం జేయక, భార్య సంపాదనపై యాధారపడి, యామె తెచ్చిన కూలీ డబ్బునుం గుంజుకొని, ప్రతిదినమును మద్యముం ద్రావు మగని యకృత్యమును సహింపక యొక దినమున ధనము నీయ ననఁగ, నాతఁ డొనర్చిన దౌర్జన్యమునుం జూడుఁడు!]

ఉత్పలమాల:
అంగన తెచ్చు కూలిఁ గొని ♦ యంతట మద్యముఁ ద్రావు నీచుఁనిన్
గ్రుంగుచు వాని మాన్ప నొక ♦ రూకయు నీయ నటంచుఁ బల్కఁగన్
జెంగున దూఁకి, కోపమున ♦ సిగ్గును వీడియు జాలి వీడి, యా
లిం గని, యీడ్చి యీడ్చి, వెడ♦లించె గృహంబుఁ గఠోర చిత్తుఁడై!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 404

శీర్షిక:- ప్రవరుఁడు కనిన హిమనగము!

కం.
అటఁజని కాంచెను ప్రవరుఁడు
నిటలేక్షణ సద్మ బహుళ ♦ నిర్మలతుహినో
త్కట సలిల పతితనిర్ఝ
ర్యుటంకి తస్ఫుట నటిత మ♦యూర హిమాద్రిన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 405

శీర్షిక:- భీముని యలుక!

సమస్య:-
శివునిఁ జంపె భీమసేనుఁ డలిగి

(జరాసంధుని పరాక్రమమును నిరోధింప నుంకించు భీముని నాపి యర్జునుఁడు శివుని జయమునీయుమని వేడుచుండఁగనే, యలిగిన భీముఁ డా జరాసంధునిం జంపినాఁడనుట)

ఆ.వె.
మగధరా ట్పరాక్ర♦మ నిరుద్ధుఁ డా జరా
సంధుఁ జంపఁ బోయె! ♦ సవ్యసాచి
యాపి, "జయము నీయు" ♦ మని నెమ్మదిగ వేడె
శివునిఁ! జంపె భీమ♦సేనుఁ డలిగి!!

(మగధరా ట్పరాక్రమ నిరుద్ధుఁడు=భీముఁడు)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 406

శీర్షిక:- తార చేసిన యకృత్యము!

సమస్య:-
సీతా రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై


[తార చేసిన యకృత్యముం గని దేవతలు నిందించుచుఁ బలికిన సందర్భము]

శార్దూలవిక్రీడితము:
శీతాంశుం దగఁ జేరి కాముకతతోఁ ♦ జిత్రాంగివై, ధూర్తవై
చేతోమోదముఁ గల్గఁ గూడితివి సౌ♦శీల్యమ్ముఁ బోఁద్రోలి, దు
ష్ఖ్యాతిం బొంది, పతిన్ బృహస్పతిని దుః♦ఖాంభోధినిన్ ముంచి, యో
సీ! తారా! ముని గుండెఁ జీల్చితివి! రా♦శీభూతపాపాగ్నివై!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016

శీర్షిక:- ఆజానుబాహువు!

సమస్య:-
పట్టు నాజాను బాహువే ప్రభువు నాకు!

కవిత సంఖ్య: 407

తే.గీ.
కమల పత్రాక్షుఁడు, శుభ ల♦క్షణుఁడు, ధర్మ
రక్షకుఁడు, నీల వర్ణుండు, ♦ రఘు కులుండు,
పతిత పావనుం, డసురారి, ♦ బలునిగఁ గను
పట్టు నాజాను బాహువే ♦ ప్రభువు నాకు!
*****************
కవిత సంఖ్య: 408
కం.
అబలఁ జెఱ నిడిన దశకం
ఠుఁ బిండి సేయుటకుఁ , దా ధ♦నుర్బాణములన్
సబలుఁడయి పట్టు, నాజా
ను బాహువే ప్రభువు నాకు! ♦ నుతియింతు వెసన్!!

[తేటగీతి పాదమునుం గందమున నిమిడ్చి వ్రాసితిని]
*****************
కవిత సంఖ్య: 409
తే.గీ.
మాయ సన్యాసియై భిక్ష ♦ వేయు మనియు,
మోసమున సీతఁ జెఱపట్టు ♦ మూర్ఖుఁ డైన
రావణుని వధించఁగ ధను♦ర్బాణములను
పట్టు నాజాను బాహువే ♦ ప్రభువు నాకు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 410

శీర్షిక:- స్వయంవరము!

సమస్య:-
వదిననుఁ బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

[అర్జునుఁడు కుంతీదేవితోఁ బలికిన సందర్భము]

కం.
"యదుకులుఁడు ప్రోత్సహింపఁగ
ముదమున నే మత్స్యయంత్ర♦మును భేదింపన్
మదిఁ బొంగుచు వేగమె ద్రో
వది ననుఁ బెండ్లాడెను బుధ♦వర్యులు మెచ్చన్!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 411

శీర్షిక:-  అనుమానము!

సమస్య:-
మానము పోవలె నటంచు మానిని తలఁచెన్

కం.
"ఏనాఁడునుఁ గలహింపని
యీ నా మగఁ డీ విధిఁ గల♦హించెను ననుమా
నాననె! కావున, నీ యను
మానము పోవలె" నటంచు ♦ మానిని తలఁచెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 412

శీర్షిక:-  స్వీయోద్ధరణము...!!!

తే.గీ.
“ఎవ్వఁడో వచ్చి ని న్నుద్ధ♦రింౘు ననుౘు
నెదురు తెన్నులు ౘూడక ♦ నీవె నిన్ను
వృద్ధి నొందింౘు కొనవలెఁ ♦ కృషినిఁ ౙలిపి!
లేనిౘో నీదు పతనమ్మె ♦ యౌను సుమ్ము!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 413

శీర్షిక:-  వాణీ స్తుతి!

కం.
వరవీణా మృదుపాణీ!
సురుచిర మధురోక్త వాణి! ♦ సుందర వేణీ!
ధర వేదాగ్రణి! తరుణీ
వర రమణీ! గుణి! కవీశ ♦ వరనిశ్శ్రేణీ!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 414

శీర్షిక:-  నిర్దయుఁడు!

సమస్య:-
ముద్దు మగని ప్రాణముల హరించె!

[వాల్మీకి చూచుచుండఁగఁ గ్రౌంచమిథునైకమును బోయవాఁడు చంపిన ఘట్టము]

ఆ.వె.
క్రౌంచ మిథునముఁ గని ♦ క్రౌర్యాన బోయఁడు
తనదు తిండి కొఱకుఁ ♦ దలఁచి మదిని
జంట పక్షిఁ బాప ♦ సరసత వీడియు
ముద్దు మగని ప్రాణ♦ముల హరించె!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 416

శీర్షిక:- ప్రకృతి ధర్మము!

సమస్య:-
చల్లఁగనయ్యె నీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే

ఉత్పలమాల:
ఉల్లమెలర్ప మేఘములు ♦ హోరున వర్షము నిచ్చినంతనే
జిల్లనెఁ గాలమేఘ పరి♦శీలిత చేతము, శైశిరమ్మునన్
జల్లఁగనయ్యె నీ ప్రకృతి ♦ సర్వము; గ్రీష్మము వచ్చినంతనే
చిల్లులువడ్డరీతి మెయిఁ ♦ జెమ్మట లుప్పతిలెన్ ఘనమ్ముగన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016

శీర్షిక:- కుపతి...!!!

సమస్య:-
కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్

కవిత సంఖ్య: 417

కం.
తపనను శచియటఁ జనియున్
విపక్షు వృత్రుని వధించి ♦ విజయుండై రాన్
ద్యుపతిని, జంభారి, నులూ
కు, పతిని గని మెచ్చె సాధ్వి ♦ కోర్కులు మించన్!
*********************************
కవిత సంఖ్య: 418

కం.
చపలాక్షి యిందుమతియే
రిపుల గెలిచి తిరిగి రాఁగఁ ♦ బ్రేమ పెనుపునన్
నృపతి కెదురేగి యిక్ష్వా
కు పతిని గని మెచ్చె సాధ్వి ♦ కోర్కులు మించన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 419

శీర్షిక:- గంగానది!

సమస్య:-
పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె

తే.గీ.
ఘను భగీరథు యత్నాన ♦ గంగ భువికి
నేగి, గర్వాన జహ్నుని ♦ యాగభూమి
ముంచ, జహ్నువు గంగఁ గో♦పించి మ్రింగె!
పాపములఁ ద్రోయు గంగ పా♦పమ్ముఁ జేసె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 420

శీర్షిక:- గొడ్రాలి ప్రసవము!

సమస్య:-
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్

శార్దూలవిక్రీడితము:
ఓ డ్రామా నట వేయ నందు నటులై ♦ యున్నట్టి పాత్రల్ భళా
షాడ్రుచ్యంబులు తిన్నయట్లు నటియిం♦చంగన్ సమర్థంబుగన్
గొడ్రా లొక్కతె దేవకీసతి యయెన్; ♦ గూడెన్ మహాశ్చర్యముల్
గొడ్రాలిన్ బ్రభవించె బాలుఁ డయి తా ♦ గోపాల కృష్ణుం డిలన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016

శీర్షిక:- లోక వృత్తము!

సమస్య:-
తుని లోపల లోకమెల్లఁ దూఁగుచునుండున్

కవిత సంఖ్య: 421
కం.
ధనమున్న లేకయున్నను,
మనమునఁ గరుణాంతరంగ ♦ మండనుఁ డతఁడై,
యనయము దానమ్మిడు దాం
తుని లోపల లోకమెల్లఁ ♦ దూఁగుచునుండున్!
****************************
కవిత సంఖ్య: 422
కం.
మనమునను నిగ్రహమ్మును,
ధనమందున నాశ లేమి, ♦ దౌష్ట్య రహితుఁడై,
కను దైవమెదను, నిల శాం
తుని లోపల లోకమెల్లఁ ♦ దూఁగుచునుండున్!
***************************
కవిత సంఖ్య: 423
కం.
ధనమందె దైవముండును,
ధనముండిన సకల వస్తు ♦ తతియుం గలుగున్,
గనఁగా నిలలో ధనవం
తుని లోపల లోకమెల్లఁ ♦ దూఁగుచునుండున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 424

శీర్షిక:- రిక్కల మగఁడా...చందమామా!

సమస్య:-
పండుగనాఁ డేల నాకుఁ బాఁత మగఁ డనెన్

[పేదఱికములో మ్రగ్గి మ్రగ్గి, చివరకు ధనవంతుఁడైనను, నగలు చేయించని భర్తతో భార్య...]

కం.
"మెండుగ సంపద లబ్బెను;
దండిగ నగ లెన్నియైన ♦ ధరియింపఁ దగున్!
దండుగసొ మ్మనఁగఁ దగదు;
పండుగనాఁ డేల నాకుఁ ♦ బాఁత మగఁ?" డనెన్

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 425

శీర్షిక:- రాగబంధము!

సమస్య:-
కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్

ఉత్పలమాల:
కూఁతురు పుట్టె నా జనకుఁ ♦ గూర్మి యెసంగఁగ, నా కొమారితన్
మాతగ నెంచి యాతఁడు స♦మంచిత రీతినిఁ బెంచెఁ; గూఁతు రా
తాతనుఁ బుత్రుఁగాఁ దలఁచెఁ; ♦ దండ్రియుఁ జచ్చి సుతుండుఁ గాఁగ, నా
కూఁతురె తల్లియై జనకుఁ ♦గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్!

[తాత=తండ్రి]


-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016
కవిత సంఖ్య: 426

శీర్షిక:- వృద్ధ నారి...!!!

సమస్య:-
వృద్ధనారిని యువకుఁడు పెండ్లి యాడె

తే.గీ.
అభవుఁ డాతఁడు, సంతత ♦ యౌవనుండు,
సకల భువన శివంకర ♦ శంకరుండు,
వినతి సేయ సురలు, దక్ష ♦ తనయలందు
వృద్ధనారిని, యువకుఁడు ♦ పెండ్లి యాడె!

(వృద్ధ [ప్ర] - పెద్ద [వి];
దక్ష తనయలందు వృద్ధనారి=దక్షుని జ్యేష్ఠపుత్రిక[పెద్ద కొమరిత]=సతీదేవి)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016

శీర్షిక:- పాడు మనుజుఁడు!

సమస్య:-
పాడు మనుజుఁ జూడ వేడుక గద

కవిత సంఖ్య: 427
ఆ.వె.
కలిమి లేము లందు ♦ ఘన మనః స్థిరతతోఁ
దా నుదారుఁ డయ్యుఁ ♦ దనరుచుండి,
లోక మందు జనుల శోకమ్ముఁ దీర్చి, కా
పాడు మనుజుఁ జూడ ♦ వేడుక గద!
*****************************

కవిత సంఖ్య: 428
ఆ.వె.
గాన మదియె పన్న♦గమ్ముల నాడించు;
గానము విని నరుఁడు ♦ మేను మఱచు!
గాయకాళిలోనఁ ♦ గర్ణ పేయముగనుఁ
బాడు మనుజుఁ జూడ ♦ వేడుక గద!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 29-02-2016

శీర్షిక:- కారు నలుపు!

సమస్య:-
కారునలుపుపైనఁ గలిగెఁ బ్రేమ

కవిత సంఖ్య: 429

ఆ.వె.
"రూప గుణము లందు ♦ రూప మే మైనను
గుణముఁ గలిగి యున్న ♦ గొప్పవారె"
యనుచు నొకఁడు గుణి న♦నాకారిఁ గోరఁగఁ
గారునలుపుపైనఁ ♦ గలిగెఁ బ్రేమ!
****************************

కవిత సంఖ్య: 430

ఆ.వె.
"కారు మబ్బు వన్నె ♦ కలవాఁడు మనసును
దోచినట్టి వెన్న♦దొంగ వాఁడు
వ్రజకిశోరుఁ"డంచు ♦ వల్లవాంగనలకుఁ
గారునలుపుపైనఁ ♦ గలిగెఁ బ్రేమ!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 28-02-2016
కవిత సంఖ్య: 431

శీర్షిక:- కరి యానలు!

కం.
కరియానలు కరివరదునిఁ
గర మనురాగమ్ముతోడఁ ♦ గనుచున్ బ్రణుతిం
పరె నాట్య విలసనమ్ముల
దరహాస విభాసమాన ♦ తరళేక్షణలై!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************************

అయుత కవితా యజ్ఞము (365 నుండి 400 వరకు)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 365

శీర్షిక:- నమో వేంకటేశా!

సమస్య:-
మణితో మాధవుఁడు గూడి మారెను శిలగా!
(అంజన్న గారిచ్చిన సమస్య)

నా పూరణము:

కం.
ప్రణయిని పద్మావతినిఁ బ
రిణయమ్మయి భక్తకోటిఁ ♦ గృపఁ జూడ రమా
మణితోఁ జెలితోఁ గౌస్తుభ
మణితో మాధవుఁడు గూడి ♦ మారెను శిలగా!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 366

శీర్షిక:- తెలంగాణమున బతుకమ్మ పండుగ!

(తెలంగాణమునం బడతు లందఱు బ్రతుకమ్మ పండుగ నాఁ డెట్టుల బ్రతుకమ్మ నలంకరించి, పూజింతు రనఁగా...)

సీ.
తంగేడు పూవులఁ ♦ దాంబాలమునఁ గుండ్ర
.....ముగ నందముగఁ బేర్చి, ♦ మురువు సూపు
వివిధమ్ములగు రంగు ♦ లవి గునుగులఁ జేర్చి,
.....మందార, కట్ల, చే ♦ మంతుల నిడి,
బంతిపూవులు పోఁక ♦ బంతిపూవులు వింత
.....సొబగుల నీనఁగాఁ ♦ జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ ♦ బండువు సేయంగ
.....బ్రతుకమ్మ నడుమ గౌ ♦ రమ్మనుంచి,

గీ.
ధగధగలతోడి పట్టుపీ ♦ తాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు ♦ ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ ♦ గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు ♦ పడతులంత!

కం.
బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరి చివర ♦ నిక్కపు భక్త్యు
న్నతి నాడి పాడియును స
న్మతి బ్రతుకమ్మను నిమజ్జ ♦ నము సేతురయా!

ఆ.వె.
ముత్తయిదువ లపుడు ♦ పూతురు పసుపును
పుస్తెలకును గౌరి ♦ పూజసేసి!
సన్నిహితులు హితులు ♦ సఖులంత కష్టసు
ఖములఁ జెప్పుకొండ్రు ♦ కలిసిన కడ!

తే.గీ.
ఇంటినుండియుఁ దెచ్చిన ♦ హితకరమగు
తీపి వస్తువులనుఁ బంచి, ♦ తినియు, మఱల
సద్దులను మూటఁగట్టియు ♦ సంబరమున
నిండ్లకుం జేరఁ బోదురా ♦ యింతులంత!

కం.
బ్రతుకమ్మ పర్వదినమున
నతి సంతోషమున దుర్గ ♦ నవ్యానందాల్
సతులందఱ కిడి, వారలఁ
బతులకుఁ బిల్లలకు స్థిరత ♦ బ్రతు కిడుఁ గాతన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 367

శీర్షిక:- అహో...మోహినీ...!!!

సమస్య:-
పురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె!

(మోహినీ భస్మాసుర వృత్తాంతము)

తే.గీ.
వర విగర్వోన్నతుండయి ♦ భస్మదైత్యుఁ
డా వర పరీక్షకై నిట♦లాక్షుఁ గోరి
వెంటఁ బడె! వచ్చె మోహిని! ♦ ప్రేంఖణమునఁ
బురుషపుంగవు నోడించి ♦ పొలఁతి నెగడె!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 368

శీర్షిక:- కుచేలుని శ్రీకృష్ణ స్తుతి!

(పౌండ్రకవాసుదేవుని చెఱలో మ్రగ్గెడి తనను విడిపించుటకై యేతెంచిన శ్రీకృష్ణునిం జూచిన కుచేలుని యానందాతిరేక పూర్వక స్తుతి)

మత్తేభవిక్రీడితము(పంచపాది):

"కలయో? వైష్ణవ మాయయో? పర మనః ♦ కాంక్షార్థమో? తథ్యమో?
కలఁతం గుర్తిడ లేక యుంటినొ? శుభై♦కాత్ముండనో? సన్మహో
జ్జ్వలుఁడై కృష్ణుఁడు స్నిగ్థ రూపసిగ, మ♦త్సంకల్ప సంధాయియై,
చలితోద్వర్తిత నర్తితుండు నగుచున్ ♦ సాక్షాత్కరించెన్, ఘనా
కులితవ్యాపిత మానసుండనగు నా♦కున్ బంధముల్ ద్రెంపఁగన్!!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016

శీర్షిక:- శ్రీకృష్ణుఁడాడిన క్రికెట్టు!

సమస్య:-
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టుక్రీడ!

కవిత సంఖ్య: 369

ఆ.వె.
వెన్నదొంగ యెవఁడు? ♦ చిన్ని బాలకులతో
నేమి సేసెనంట? ♦ నియమమునను
సచినుఁ డేమి నెగ్గె? ♦ సరి యుత్తరా లివె
కృష్ణుఁ, డాడెనఁట, ♦ క్రికెట్టుక్రీడ!

(క్రమాలంకార పూరణము)
*****************************
కవిత సంఖ్య: 370

ఆ.వె.
చిన్నపిల్లలాడు ♦ చిఱ్ఱగోనెయె నేఁడు
క్రికెటు పేరఁ బఱఁగెఁ! ♦ గ్రీడ యదియె!
ద్వాపరమ్మునందుఁ ♦ బడుచు గోపకులతోఁ
గృష్ణుఁ డాడెనఁట ♦ క్రికెట్టుక్రీడ!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016


శీర్షిక:- పద్యకవిత్వము!

కవిత సంఖ్య: 371
చంపకమాల:
సలలిత భావముల్ గలుగు ♦ ఛందము నందున వెల్గు పద్దెముల్
నలిఁగి కృశించుచుండె వచ♦నమ్మగు కైతల ధాటి కీ యెడన్!
పలుమఱు వేది పైన విను♦వారలు లేకయె పద్యమందునన్
లలిత మృదూక్తులన్ కవిత♦లన్ రచియించిన మెచ్చ రెవ్వరున్!!

కవిత సంఖ్య: 372
చంపకమాల:
పలుకులుఁ జప్పనై మిగుల ♦ బావురుమన్ వచనంపు కైతలన్
బలుమఱు వ్రాయు వాడుకయ ♦ వాంఛితమై యెసలాఱుచుండ, ని
స్తుల కలకంఠ కూజిత య♦శో విలస న్మధురార్థ పద్య స
ల్లలిత మృదూక్తులన్, గవిత♦లన్ రచియించిన మెచ్చ రేలకో?

కవిత సంఖ్య: 373
చంపకమాల:
పలుకులుఁ జప్పనై మిగుల ♦ బావురుమన్ వచనంపు కైతలన్
బలుమఱు వ్రాయు వాడుకయ ♦ బాగని మెచ్చెడు వేడ్క నుండ, నే
ర్పులుఁ దొలుకాడు ఛందమునఁ, ♦ బొల్పగు భావన లింపుఁ గూర్చు స
ల్లలిత మృదూక్తులన్, కవిత♦లన్ రచియించిన, మెచ్చ రేలకో?

కవిత సంఖ్య: 374
చంపకమాల:
పలుకులుఁ జప్పనై మిగుల ♦ బావురుమన్ వచనంపు కైతలన్
బలుమఱు మెచ్చి బాగనెడి ♦ వాండ్రె సభాస్థలి నుండఁగాను, నే
ర్పులుఁ దొలుకాడు ఛందమునఁ ♦ బొల్పగు భావన లింపుఁ గూర్చు స
ల్లలిత మృదూక్తులన్, కవిత♦లన్ రచియించిన మెచ్చ రేలకో?

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 375

శీర్షిక:- రుక్మిణీ పాణిగ్రహణము!

కం.
వికసించెను ముఖపద్మము
సకుఁడట కేతెంచఁ! బ్రియుని ♦ సరసనఁ జేరన్,
సకియను గరమునఁ గొని, యరి
నికరము గెలిచి, హరి రుక్మి♦ణినిఁ బెండ్లాడెన్!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 376

శీర్షిక:- ముదిత ముని!

అంజయ్యగారిచ్చిన...
దత్తపది:
నకులుడు, శకుని, ఉత్తర, సుభద్ర... పదముల నుపయోగించి రామాయణార్థమున పద్యము వ్రాయుమనఁగా నేను వ్రాసిన పద్యము...

తే.గీ.
ఇనకులుఁ డనుజు సహితుఁడ♦యి త్వరితుఁడయి
ముని యనుమతిన్  దనుజ నాశ♦కునిగ నయ్యుఁ
దాటకను దున్మఁగా దదు♦త్తర నిమిషమె
ముని మనసుభద్ర మయ్యియు ♦ ముదితుఁడయ్యె!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 377

శీర్షిక:- వినయ వినమిత నమస్సు!

అంజయ్యగారిచ్చిన...
సమస్య:
కారంబున్ గని పండితావళి నమస్కారంబులన్ జేయదే

శార్దూలవిక్రీడితము:
శ్రీరంజిల్లెడు పద్యధార వినుత♦శ్రేష్ఠాంచితోద్భావనన్
ధీరోదాత్త విశాల రీతి కదురన్ ♦ దివ్యాదరానన్ వెసన్
సారోదారత వందనమ్ము లిడఁగా ♦ సన్మాన్యమౌ తన్నమ
స్కారంబున్ గని పండితావళి నమ♦స్కారంబులన్ జేయదే?

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 378

శీర్షిక:- ద్రవించిన శిల...విరచించెను భళా!

సమస్య:
రాక్షసుఁడు రచించె రామకథను

>>ఆటవెలఁది పాదమునుం గందమున నొదిగించి నేఁ జేసిన పూరణము...

(రాక్షస ప్రవృత్తిగల బోయయై, దారి దోపిడులతో జీవించు వాల్మీకి, క్రౌంచ మిథునైక పక్షినిం బరిమార్చి, పరివర్తిత మానసుఁడై, తాపసిగా మాఱి, రామాయణమును రచించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

కం.
సరవిం దప్పక దోపిడిఁ
బరుగునఁ జేయుచునుఁ, గొంచ ♦ పక్కినిఁ గొట్టన్,
సురిగిన రాక్షసుఁడు, రచిం
చె రామకథనుఁ, గమనీయ ♦ సీతాచరితన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016

శీర్షిక:- దయామయి...సింహవాహన!

కవిత సంఖ్య: 379

ఉ.
చండి! భవాని! శైలసుత! ♦ శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! ♦ మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! వర♦దాయి! శుభప్రద! భద్రకాళి! పా
షండ శిఖండి! శక్తి! మహి♦షాసుర మర్దిని! సింహవాహనా!
******************
కవిత సంఖ్య: 380

ఉ.
నేతల నీతిమంతులుగ ♦ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు ♦ పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌ నటుల ♦ శీఘ్రమె కాంక్షలఁ దీర్చి, మాకు నీ
యాతన డుల్చి, ప్రీతిఁ గను♦మమ్మ! దయామయి! సింహవాహనా!
******************
కవిత సంఖ్య: 381

చం.
నిరతము నిన్ను గొల్చెదము; ♦ నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిర నవ రాష్ట్ర మిచ్చితివి ♦ దీక్షలు సేసి, తపించి పోవ, మా
చిరమగు వాంఛఁ దీరిచి, వి♦శేష తమాంచిత హేమ రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ ♦ గాంచుచు నీఁగదె సింహవాహనా!
******************
కవిత సంఖ్య: 382

ఉ.
ఆత్రముతోడ వేచితిని, ♦ హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ ♦ జక్క నొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరు♦ణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, స్వర్ణ తెల♦గాణము నీఁగదె సింహవాహనా!
******************
కవిత సంఖ్య: 383

చం.
ప్రజలను నిత్య సత్య యుత ♦ వర్తన శీలురఁ జేసి, వారలన్
గుజనులు కాక యుంటకయి ♦ కూర్మినిఁ బంచి, మహోత్తమాశయాం
బుజ ఘన శోభి తాత్మ నిడి, ♦ ప్రోచి, ప్రశస్త సువృత్తతోన్మహా
యజనముఁ జేయు శక్తి సద♦యన్నిడు మో శివ! సింహవాహనా!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
************************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 384

శీర్షిక:- విజయంకరి!

సమస్య:-
కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్

కం.
దురమున దుర్గ శివ మహే
శ్వరి కాత్యాయని మృడాని ♦ శర్వాణి భ్రా
మరి సుర వితాన విజయం
కరి మహిషాసురునిఁ జంపి ♦ కాచెన్ జగతిన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 385

శీర్షిక:- అబల...కాదు...సబల!

"బలము గలదేని నాతోఁ
గలహింపుమ యబల!" యనుచు ♦ గర్విత మతియై
పలికిన మహిషునిఁ గూల్చియు
వెలిఁగెను హరివాహన ఘన♦విజయోత్సుకయై!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 386

శీర్షిక:- ఇంద్రుఁడు...చంద్రుఁడే!

సమస్య:-
అమరావతిరాజు చంద్రుఁడై శోభిల్లెన్

కం.
రమణులు రంభోర్వశ్యా
ద్యమర గణికలనెడు తార♦కావృత యుతుఁడై
యమర సుఖమ్ములఁ దేలుౘు
నమరావతిరాౙు, "చంద్రుఁ♦డై" శోభిల్లెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*********************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 387

శీర్షిక:- కికురించిన...కినిసెఁ గదా!

(అల్లసానివారి మనుచరిత్రలో.... వంచనతో నాయుర్వేదవిద్యను నేర్చుకొనుటయే కాక, గురువునుం బరిహసించిన యిందీవరాక్షుని, గురువగు బ్రహ్మమిత్రుం డుగ్రుండై శపించిన ఘట్టము)

చంపకమాల:
"కటకట యిట్టి మాట లనఁ♦గాఁ దగునే? కుటిలాత్మ! యిప్పుడీ
వటమట మి ట్లొనర్చి, యిట ♦ వైద్యము నేర్చుటె కాక, గాటమౌ
గుటగుట గుర్వులన్ గురువు ♦ గోసుదె? నీ విఁక రక్కసుండవై
యటనట చియ్య నల్ల వస ♦ లన్నముగాఁ గొని కుందు మిద్ధరన్!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 388

శీర్షిక:- వాలములు...!

సమస్య:-
వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్

కం.
తూలు నవ యౌవనముతో
లాలితముగ భార్య లిద్ద ♦ ఱతనిం గొలువన్
బేలల గృహముల కటనా
వాలమ్ములు గలవు రెండు ♦ బంట్రోతునకున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016

శీర్షిక:- వినుమిదె నా హితవాక్యము...!!!

కవిత సంఖ్య: 389

(తనను వలచి వచ్చిన శూర్పణఖతో శ్రీరాముఁడు పలికిన మాటలు)

మధ్యాక్కర:
"వినుమిదె నా హిత వాక్యమును నీవు ♦ విధిగఁ దలంచి!
జనకాత్మజయ నాదు పత్ని! నినుఁ గొన!♦ సైకపత్నీ వ్ర
తుని ననుఁ గోరక, నాదు ననుజుతోఁ ♦ దుష్టినిఁ బొంది,
కనుము సౌఖ్యములు లక్ష్మణునిఁ గలసి! నీ ♦ కాంక్షయే తీరు!!"
*****************************************
కవిత సంఖ్య: 390

(రావణునితో నంగదుఁడు పలికిన హితోక్తులు)

కం.
"విను మిదె నా హిత వాక్యము
లనుఁ బది తలలఁ బది తలఁపు♦లనుఁ గలిగెడి నీ
కునుఁ గాలము మూఁడెఁ! గనవు
జననిని సీతఁ జెఱనుంప ♦ ౙరుగు నశుభముల్!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016

శీర్షిక:- హింసయే హితమా?

సమస్య:-
బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్


కవిత సంఖ్య: 391

కం.
సిద్ధమగుచు యుద్ధములకు
నిద్ధాత్రిని నేలెడి ధర♦ణీశులతోడన్,
శుద్ధి రహిత, పాప విహిత
బుద్ధుఁడు, "హింసయె హిత"మని ♦ బోధించె నిలన్!
*****************
కవిత సంఖ్య: 392

కం.
ఇద్ధర పాపవ్యపగత
బద్ధతతో శుద్ధమైన ♦ పద్ధతి యుతుఁడౌ
బుద్ధునకుఁ గ్రుద్ధతను దు
ర్బుద్ధుఁడు "హింసయె హిత"మని ♦ బోధించె నిలన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 393

శీర్షిక:- కలయో...నిజమో...?

(శ్రీకృష్ణుని నోట బ్రహ్మాండమ్మునుం గనిన యశోద మనోగతము)

"ఔరా! కలయా, నిజమా?
శౌరి కలిత మాయొ? యేమొ? ♦ సంశోధింపన్
దీరగు బాలుం డింతయె!
నోరన్ బ్రహ్మాండ ముంట♦నో? యచ్చెరువౌ!"

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
**************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 394

శీర్షిక:- శివ మన్మథుల వావివరుసలు!

సమస్య:-
మన్మథుండు ముక్కంటికి మాతులుండు!

తే.గీ.
సతిని నెడఁబాసి విరహ మ♦గ్న తపసి యగు
శివుని హృదయాన ననురాగ ♦ సృష్టి చేసి
నట్టి వాఁడు మాతృ తులుఁడు ♦ నగును గాన,
మన్మథుండు ముక్కంటికి ♦ మాతులుండు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 395

శీర్షిక:- హీనత్వము!

తే.గీ.
ఎన్ని చదువఁ బ్రయోజన ♦ మేమి గలదు,
హీనుఁ డవగుణమ్మును వీడు ♦ టెఱుఁగ కున్న?
బొగ్గుఁ బాలను కడుగంగఁ ♦ బోవునె మలి
నమ్ము? ప్రకృతి సిద్ధావగు♦ణమ్ము సనునె?

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 396

శీర్షిక:- విజయుని విజయము!

సమస్య:-
మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను మాద్రి సుతుఁడు

తే.గీ.
విప్రవేషాన నున్నట్టి ♦ విజయుఁ డపుడు
మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను, ♦ మాద్రి సుతుఁడు
ధర్మజుఁడు భీముఁడు హరి మో♦దమ్మునంద!
సభ జయ ధ్వానములు సేసె ♦ సంతసమున!!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 397

శీర్షిక:- విజయుని మత్స్యయంత్ర భేదనము!

కం.
సామాన్యుఁడు వీఁడనుకొని
యేమాత్రము లెక్క నిడక ♦ యేమఱి యుండన్
భీమానుజుఁ డా హరికి "న
మామి" యనియు, మత్స్యయంత్ర ♦ మనువునఁ గొట్టెన్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
******************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 398

శీర్షిక:- జింక...చిఱుతపులి!

సమస్య:-
జింక చంపి తినును చిఱుతపులిని

ఆ.వె.
చిఱుత యాఁకఁటికినిఁ ♦ జిక్కి బాధనుఁ జెందు;
నచటి నుండి యెటకొ ♦ యరుగుచుండు
జింక; చంపి తినును ♦ చిఱుతపులి; నిజ జ
ఠరము శాంతిఁ బొంద, ♦ సరగునఁ జను!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
***********************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 26-02-2016
కవిత సంఖ్య: 399

శీర్షిక:- యోగము...సంయోగము...!!!

సమస్య:-
యోగము భోగేచ్ఛఁ బెంౘు నుర్వి జనులకున్

కం.
భోగములు వీడి చేసెడి
యోగము మోక్షేచ్ఛఁ బెంౘు! ♦ యువతులతోడన్
గ్రాఁగుౘు నిౘ్చలు గొను సం
యోగము భోగేచ్ఛఁ బెంౘు ♦ నుర్వి జనులకున్!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
****************************************************************************
అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 27-02-2016
కవిత సంఖ్య: 400

శీర్షిక:- మాంసభక్షకుఁడు!

సమస్య:-
బ్రాహ్మణుండు మాంసభక్షకుండు!

భువిని జనుల యంద♦ములనుఁ బెంచఁగ నెప్డు
తనదు జీవితమునుఁ ♦ దలలఁ గలుగు
కేశసంస్కరణల♦కే వ్యయించెడు నాయి
బ్రాహ్మణుండు మాంస♦భక్షకుండు!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
*****************************************************************************

364 - విష్ణుస్తుతి! (గర్భకవిత్వము)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 25-02-2016
కవిత సంఖ్య: 364

శీర్షిక:- విష్ణుస్తుతి! (గర్భకవిత్వము)

కందగర్భిత గీత్యుత్తర మత్తేభవిక్రీడిత గర్భిత సీసము:

సీ.
సుగగనశ్యామ! వి♦శుద్ధ మానస! జినా!
…..కంజాక్ష! సద్రక్ష♦కా! విలాసి!
సునిగమోద్గమ్య! సు♦శోభితాక్షర! భవా
…..నీ నాథ మిత్రా! హ♦రీ! నితాంత!
సఖగరాడ్వాహన! ♦ శంఖచక్రధర! స
…..త్కైవల్య సంధాయ♦కా! పరేశ!
త్రిజగదీశా! కపి! ♦ దేవదేవ! వరదా!
…..శౌరీ! సురేంద్రాను♦జా! వరాంగ!
గీ.
విబుధ ముని దేవ సన్నుత! ♦ సుబల! శివస
ఖా! రమేశ! సోమజఠర! ♦ సౌరి! బలివి
ఘాతి! మధురిపు! నర! బహు ♦ కలిత శిర! పు
రుషవర! విరజ! శార్ఙ్గీ! గు♦రుజన సేవ్య!

పై సీసమందు మత్తేభవిక్రీడిత వృత్తము గర్భితమై యున్నది. అటులనే తేటగీతి యందు కందము గర్భితమై యున్నది.

గర్భిత
మత్తేభవిక్రీడితము:
గగనశ్యామ! విశుద్ధ మానస! జినా! ♦ కంజాక్ష! సద్రక్షకా!
నిగమోద్గమ్య! సుశోభి!తాక్షర! భవా♦నీ నాథ మిత్రా! హరీ!
ఖగరాడ్వాహన! శంఖచక్రధర! స♦త్కైవల్య సంధాయకా!
జగదీశా! కపి! దేవదేవ! వరదా! ♦ శౌరీ! సురేంద్రానుజా!

గర్భిత
కందము:
విబుధ ముని దేవ సన్నుత!
సుబల! శివసఖా! రమేశ! ♦ సోమజఠర! సౌ
రి! బలివిఘాతి! మధురిపు! న
ర! బహు కలిత శిర! పురుషవ♦ర! విరజ! శార్ఙ్గీ!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్